నవరాత్రులలో ఐదవ రోజు.. మహాలక్ష్మి ఆవిర్భావం..!
నవరాత్రులలో ఐదవ రోజు.. మహాలక్ష్మి ఆవిర్భావం..!
మహాలక్ష్మి అనగానే పాల సముద్రంలో శేష తల్పం మీద శ్రీమహావిష్ణువు హాయిగా నిద్రపోతూ ఉంటే..ఆయన కాళ్లు ఒత్తుతున్న లక్ష్మిదేవి గుర్తు వస్తుంది. ఆ తరువాత ధనం, ఐశ్వర్యం, సకల సంపదలు ఇస్తుందని కూడా గుర్తు చేసుకుంటాం. అయితే నవరాత్రులలో ఐదవ రోజున అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ సందర్బంగా మహాలక్ష్మి దేవికి సంబంధించిన ఒక కథనం చెప్పుకుంటే..
ఒక సారి దుర్వాస మహర్షి ఇంద్రుడికి ప్రసాదాన్ని ఇస్తాడు. అయితే ఇంద్రుడు మాత్రం తన ఐశ్వర్య మదంతో ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా పక్కన పడేశాడు. దీంతో దుర్వాసుడికి కోపం వచ్చింది. ఏ ఐశ్వర్యం చూసుకుని నువ్వు ఇంత అహంకారంతో ఉన్నావో ఆ ఐశ్వర్యం, దేవతలకున్న శక్తులు పోతాయి అని శపించాడు. ఇలా దుర్వాసుడు శపించగానే దేవతల శక్తులు అన్నీ పోయాయి. మరొకవైపు ఇంద్రుడి వైభోగం కూడా మాయమైపోయింది. ధనానికి, ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి కూడా మాయమైపోయిందట. దీంతో అమ్మవారు మాయమై కేవలం నారాయణుడు మాత్రమే మిగిలాడట. దీంతో దేవతలకు అందరికీ దుఃఖం కలిగింది.
మహాలక్ష్మి మాయమవడం, దేవతల శక్తులు పోవడం వంటివి జరగగానే దేవదానవులు అందరూ కలిసి పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు. అందులో నుండి మొదట హలాహలం వచ్చింది. ఆ తరువాత ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు ఇట్లా అన్ని వస్తూ ఉన్నా సరే.. పాల సముద్రాన్ని చిలకడం మాత్రం ఆపలేదు. వారి శ్రమ ఫలించి ఆఖరులో మహాలక్ష్మీ దేవి బయటకు వచ్చింది. అప్పుడు దేవతలందరూ పొంగిపోయారు.
ఇంద్రుడేమో అమ్మవారు కూర్చోవడానికి సింహాసనం ఇచ్చాడట. దేవతలేమో మంగళస్నానాల కోసం నదీ జలాలన్నీ తీసుకుని వచ్చారట. ఋుతువులు ఏమో తమ తమ కాలంలో పూసే పువ్వులన్నిటినీ అమ్మవారికి సమర్పించాయట. కామధేనువు పంచగవ్యాలను, పృథివి ఓషదులను ఇచ్చాయట. ఇవన్నీ కలిపి అమ్మవారికి అభిషేకం చేశారట. ఇంకెప్పుడు మిమ్మల్ని వదలి వెళ్ళిపోవద్దని అమ్మవారిని వేడుకున్నారట.
సముద్రుడు అమ్మవారికి వస్త్రాలను సమర్పించాడట, వరుణుడు ఏమో వైజయంతి మాలను సమర్పించాడట. విశ్వకర్మ ఆభరణాలను ఇస్తే.. సరస్వతి దేవి ముత్యాల హారాన్ని ఇచ్చిందట. బ్రహ్మదేవుడు కమలాలు ఇస్తే.. నాగదేవతలు కుండలాల్ని ఇచ్చారట. దేవతలు అందరూ ఇచ్చిన ఆభరణాలు ధరించి, అమ్మవారు ఎంతో అందంగా ముస్తాబయ్యారట. ఆ తరువాత తామర పువ్వుల మాలను పట్టుకుని దాన్ని మహావిష్ణువు మెడలో వేసి ఆ తరువాత ఆయన హృదయంలో చేరిపోయిందట. ఇదీ మహాలక్ష్మి అమ్మవారి గురించి కథ.
*రూపశ్రీ.