సౌందర్య ప్రపంచంలో ఓ కొత్త మెరుపు ఇదిగో….
సౌందర్య ప్రపంచంలో ఓ కొత్త మెరుపు ఇదిగో….
మీ పేస్ట్ లో ఉప్పుందా... మీ పేస్ట్ లో వేప ఉందా…. వంటి యాడ్స్ చూసినప్పుడు ఓరిని ఒకప్పుడు మనం వాడుకున్న వాటికి అజ్ఞానం అనే పేరు పెట్టి ఇప్పుడు మళ్ళీ వాటితోనే వ్యాపారం చేస్తున్నారా అనిపిస్తుంది. ఇదంతా వ్యాపార దృక్కోణంగా చెప్పుకోవచ్చు. అయితే సౌందర్య ప్రపంచానికి లభించిన బోలెడు బహుమతులలో మనకు పెద్దలు, ఒకప్పటి తరం వారు అందించినవి చాలా ఉన్నాయి. వాటిలో బొగ్గు కూడా ఒకటి. చార్ కోల్ గా పిలవబడుతూ దంత సంరక్షణలో గొప్ప పాత్ర పోషించే ఈ బొగ్గు సౌందర్య సాధనంగా ప్రముఖపాత్ర పోషిస్తుందట.
ఇదెక్కడా వినలేదే ఇంతకూ ఇదెక్కడ ఫాలో అయ్యారో అనే సందేహం అందరికీ రావచ్చు.
ఈజిప్టియన్లు ఒకప్పుడు తమ సౌందర్య సాధనాల్లో భాగంగా బొగ్గును వాడారు అంట. ఈ విషయం కాస్త ఆశ్చర్యపరిచినా ఇది నిజంగానే మంచి బ్యూటీ ప్రోడక్ట్ అంటూ దీని విశిష్టతను తెలుపుతున్నారు చర్మసౌందర్య నిపుణులు. అసలు విషయం ఏమిటంటే...
బొగ్గు సౌందర్య ఉత్పత్తిగా ఏఏ పనులు చేస్తుందో ఇక్కడ వివరింగా తెలుసుకొండి మరి..
బొగ్గులో ఉన్న క్రియాశీలత కారణంగా ఇది చర్మ సంరక్షణకు మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఇది చర్మరంధ్రాలలోకి లోతుగా చొచ్చుకునిపోయి చర్మాన్ని లోపలి వరకు శుభ్రపరుస్తుంది. చర్మ రంధ్రాలలో పేరుకున్న ధూళి, మలినాలు, టాక్సిన్ లు మొదలైన వాటిని సులభంగా తొలగిస్తుంది. కాలుష్యానికి గురైన చర్మాన్ని రిపేర్ చేస్తుంది.
మొటిమలు వచ్చినప్పుడు సాధారణంగానే అందులో ఉన్న ద్రవపదార్థం చర్మాన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఇంకా మొటిమలకు పేరుకుపోయిన నూనెలు కూడా కారణం. వీటి వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏర్పడతాయి. ఈ చార్ కోల్ వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ నుండి చర్మం శుద్ధి అవుతుంది.
దీనిలో ఉండే లక్షణాలు అలర్జీ, దద్దుర్లు, ఇన్ఫెక్షన్ ల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మానికి గొప్ప క్లెన్సర్ గా ఇది పనిచేస్తుంది. చర్మం మంట, చికాకులను తొలగించడంతో ఇది మంచి పరిష్కారం.
దీన్ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే చాలా పొడి చర్మాలకి ఇది సరైన ఎంపిక కాదు. కాబట్టి పొడి చర్మం, సున్నితమైన చర్మం కలవారు దీనికి దూరంగా ఉండటం ఉత్తమం.
వెదురు ఆధారిత ఉత్పత్తిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ కారణంగా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాదు కాన్సర్ కారక యువి కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
చర్మపు పొరను బలపరిచి చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తుంది. వెదురు ఆధారిత చార్ కోల్ క్లెన్సర్ చర్మానికి తేమను అందించడంలో సహాయపడుతుంది. చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికి, మలినాలు మొదలైన వాటిని శుద్ధి చేస్తుంది.
ఈ రకమైన క్లెన్సర్ ను ఉపయోగించడం వల్ల చర్మపు ముడుతలు తగ్గించవచ్చు. దీనివల్ల చర్మం యవ్వనంగా, అందంగా తయారువుతుంది. వయసు తగ్గినట్టు కనబడుతుంది. ఇది బెస్ట్ యాంటీ ఏజింగ్ సాధనంగా పనిచేస్తుంది.
ఇలా వెదురు ఆధారిత చార్ కోల్ ఉత్పత్తులు ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్నాయి.
◆నిశ్శబ్ద.