అమాద్మీ అత్యుత్సాహం
posted on Jan 4, 2014 @ 8:17PM
డిల్లీలో ఆమాద్మీ పార్టీ అపూర్వ ప్రజాదారణతో ఘన విజయం సాధించి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో డిల్లీ ప్రభుత్వ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ఏర్పాటు జరిగిన వారం రోజులలోనే ఆమాద్మీపార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రెండు ప్రధాన హామీలయిన ఉచిత నీరు సరఫరా మరియు విద్యుత్ ధరలు సగానికి తగ్గించడంతో చేయడంతో దేశవ్యాప్తంగా ఆమాద్మీ పార్టీ గురించి చర్చజరుగుతోంది. ఈ వేడిలోనే దేశంలో అన్ని రాష్ట్రాలకు పార్టీని విస్తరించి, వచ్చే ఎన్నికలలో వీలయినన్ని ఎక్కువ స్థానాలకు పోటీ చేయాలని పార్టీ నిర్ణయించుకొంది. రాష్ట్రంలో తెలంగాణాలో కొన్నిజిల్లాలలో, విజయవాడ, వైజాగ్ వంటి నగరాలలో కూడా అమాద్మీ శాఖలు తెరుచుకొంటున్నాయి.
కానీ, డిల్లీ వంటి మెట్రోనగరంలో ఉండే పరిస్థితులకి, రాష్ట్రంలో రాజకీయ, సామాజిక పరిస్థితులకీ చాలా తేడా ఉంది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్, వైకాపా, తెరాస పార్టీలు ఆర్ధికంగా, రాజకీయంగా, క్యాడర్ పరంగా కూడా చాలా బలంగా ఉన్నాయి. వాటిని జాతీయ పార్టీలయిన బీజేపీ, లెఫ్ట్ పార్టీలే డీకొనలేక వాటితో పొత్తులు పెట్టుకోక తప్పనిసరి పరిస్థితులున్నప్పుడు, ఎన్నికలకి ఇంకా కేవలం మూడు నాలుగు నెలలే మిగిలి ఉన్నఈ సమయంలో ఆమాద్మీ వచ్చి నిలద్రోక్కుకొని, ఈ రాజకీయ దిగ్గజాలను డ్డీకొని గెలవగలదా? అంటే అనుమానమే.
డబ్బు, మద్యం, కుల సమీకరణల నేపధ్యంలోసాగే ఎన్నికలలో కేవలం నీతి, నిజాయితీలనే తన ఆయుధాలుగా చేసుకొని అమాద్మీ గెలవగలదా? అని తెలుగు ఆమాద్మీ (సామన్యుడు) కూడా సందేహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక తెదేపా, తెరాస, వైకాపాలకు జీవన్మరణ పోరాటంగా సాగనున్న ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఆమాద్మీ పార్టీ లేగదూడ వంటిదని చెప్పక తప్పదు.
గత ఎన్నికలలో లోక్ సత్తాపార్టీ కూడా ఇంచుమించు అమాద్మీ సిద్ధాంతాలతోనే పోటీ చేస్తే, ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తప్ప మరెవరూ గెలవలేకపోయారు. ఇక భారీ అంచనాలతో, భారీ స్థాయిలో, భారీ ప్రజామద్దతుతో రంగ ప్రవేశం చేసిన చిరంజీవి కూడా నిరుడు ఎన్నికలలో బోర్లా పడ్డారు. లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలు రెండూ కలిసి తెలుగుదేశం పార్టీ ఓట్లను చీల్చి దాని విజయానికి గండి కొట్టగలిగాయి. ఇప్పుడు అమాద్మీ కూడా తెదేపా, వైకాపా ఓట్లకు గండి కొట్టడం తప్ప పెద్దగా ఏమీ సాధించలేకపోవచ్చును.
రాజకీయాలలో ఒక నూతన ఒరవడిని, జవాబుదారీ విధానాన్ని తీసుకు వచ్చి దేశంలో అవినీతిని రూపుమాపాలని అమాద్మీ భావించడంలో తప్పులేదు. కానీ, వివిధ రాష్ట్రాలలో, ప్రాంతాలలో ఉన్న వైవిధ్యతను అర్ధం చేసుకోకుండా, తన శక్తిని అతిగా ఊహించుకొని భంగపడే కంటే, ముందుగా డిల్లీలో తన సామర్ద్యం నిరూపించుకొంటే ప్రజలే పిలిచి పట్టం కడతారు. "ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూపడానికే తాము రంగ ప్రవేశం చేసాము తప్ప పదవులు, అధికారం పొందడమో, డబ్బు సంపాదించడమో ఆమాద్మీ ఉద్దేశ్యం కాదని" ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. అందువల్ల అమాద్మీ అసలు సిసలయిన ప్రభుత్వం ఏవిధంగా ఉండాలనే విషయాన్ని తన డిల్లీ ప్రభుత్వం ద్వారా ఆచరణలో చేసి చూపితే, దానికి వస్తున్నవిశేష ప్రజా స్పందన చూసి, కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ తీరు మార్చుకొనేలా చేయగలిగితే అదే నిజమయిన విజయమవుతుంది తప్ప ఎన్ని యంపీ సీట్లకు పోటీ చేసామనేది ముఖ్యం కాదు.
రాత్రికి రాత్రి సమాజంలో, ప్రభుత్వంలో, రాజకీయ పార్టీలలో, ఇతర వ్యవస్థలలో మార్పు తీసుకు రావడం సాధ్యం కాదు. సమాజంలో చెడు అగ్నిలా విస్తరిస్తే, మంచి అనేది నీళ్ళలా మెల్లగా విస్తరించగలదు. కానీ, అగ్ని ప్రభావం ఎంత ఎక్కువో అంత త్వరగానే చల్లారిపోతుంది. కానీ నీరు తనకి దారి దొరుకుతున్నంత సేపు ఆ దిశలో ప్రవహిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఆమాద్మీ కూడా ముందు డిల్లీలో నిలద్రోక్కుకొని, క్రమంగా దేశమంతా విస్తరించే ప్రయత్నం చేస్తే సత్ఫలితం పొందగలదు. వచ్చేఎన్నికలలో అమాద్మీ దేశమంతటా పోటీ చేసినా ఏవో కొన్ని సీట్లు గెలుచుకోగలదు తప్ప, డిల్లీలోలాగ తొలి ప్రయత్నంలోనే విజయడంకా మొగించలేదు.