తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం ముగిసింది
posted on Jan 23, 2014 7:41AM
దాదాపు ఏడు దశాబ్దాలపాటు తెలుగు సినిమాలో రారాజుగా వెలిగిన ఎవ్వర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వర రావు ఇక శలవంటూ వెళ్ళిపోయారు. ఆయన వెళ్లిపోవడంతో తెలుగు సినిమా ఒక పెద్ద దిక్కుని కోల్పోయింది. ఆయన నిష్క్రమణతో తెలుగు సినిమా చరిత్రలో ఏయన్ఆర్-యన్టీఆర్ శకం సమాప్తమయిపోయింది.
ప్రతీ తెలుగింట తరచూ వినబడుతుండే ‘ఏయన్ఆర్’ పేరు, ఆయనతో తెలుగు ప్రజలు ఎంతగా ఆత్మీయబందం పెనవేసుకొన్నారో తెలియజేస్తోంది. అందుకు కారణాలు అనేకం. కోట్లాది తెలుగు ప్రజలు ఆయన నటించిన ఆణిముత్యాలవంటి సినిమాలు చూస్తూనే పెరిగారు. నేటి తరంవారు ఆయన నటించిన పాత సినిమాలను చూడలేకపోయినా, గత రెండు దశాబ్దాలలో విడుదలయిన అనేక సినిమాలలో ఆయన నటనను చూసి ఆనందించారు.
అక్కినేని నట జీవితం ఒక ఎత్తయితే, ఆయన చూపిన ఆత్మవిశ్వాసం, తెలుగు ప్రజలతో ఆయనకున్న అనుబంధం మరొక ఎత్తని చెప్పవచ్చును. ఆయన తన నట జీవితంలో అనితరసాధ్యమయిన కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. ఆయన నటించిన వందల కొద్దీ ఆణిముత్యాలవంటి సినిమాల గురించి, ఆయన అందుకొన్న అవార్డుల గురించి తెలుగు ప్రజలందరికీ సుపరిచితం. వాటి గురించి ఎంత చెప్పినా అది కొండను అద్దంలో చూపడమే అవుతుంది. ఆయన గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఆయనొక తెలుగు సినిమా సజీవ చిత్రం.
తెలుగు సినిమా అంటే ఏయన్ఆర్. ఏయన్ఆర్ అంటే తెలుగు సినిమా. అలాగని తెలుగు సినిమాలో యన్టీఆర్, యస్వీఆర్, శోభన్ బాబు, గుమ్మడి, సత్యనారాయణ, అంజలీదేవి, సావిత్రి, కృష్ణ, జమున వంటి అనేక మహా నటులను విస్మరించలేము. కానీ, తెలుగు సినిమాకు ఏయన్ఆర్-యన్టీఆర్ మూల స్తంభాల వంటివారని చెప్పకతప్పదు. నేడు ఏయన్ఆర్ మృతితో తెలుగు సినిమాలో ఒక శకం ముగిసిపోయింది.
నేటి సమాజంలో చాల మంది ఆత్మవిశ్వాసంతో సవాళ్ళను ఎదుర్కోలేక, సంతోషంగా జీవించలేక చాల చిన్న వయసులోనే జీవితం పట్ల ఒక వైరాగ్యం పెంచుకొంటున్నారు. కానీ, ఏయన్ఆర్ 90ఏళ్ల వయసులో కూడా అచంచలమయిన ఆత్మవిశ్వాసం, జీవితంపట్ల ఆశావాహక దృక్పధం కనబరిచారు. తనకు భయంకరమయిన క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలిసినప్పుడు, ఆయన ఏ మాత్రం కుమిలిపోలేదు. పైగా తనకు అనేక పరీక్షలు పెట్టి గెలిచే అవకాశం కల్పించిన భగవంతుడు ఈ 90 ఏళ్ల వయసులో మరొక పరీక్ష పెట్టాడు. ఇందులో కూడా నేనే విజయం సాదించి నిండు నూరేళ్ళు బ్రతికి నా చివరి శ్వాస వరకు సినిమాలలో నటిస్తానని నిబ్బరంగా చెప్పడం చూస్తే, జీవితాన్నిఎలా జీవించాలో ఆయన నుండి మనం తెలుసుకోవచ్చును.
ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన కేవలం తన స్వయం కృషి, పట్టుదల, అచంచలమయిన ఆత్మవిశ్వాసంతోనే సమున్నత స్థాయికి ఎదిగి, ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు, అంతకు మించి ప్రజల అభిమానం సంపాదించుకొన్నారు. ఆయన సినీపరిశ్రమలో వారికి ఒక ఎన్ సైక్లోపీడియాగా నిలిస్తే, వారితో బాటు యావత్ తెలుగు ప్రజలందరికీ జీవితం యొక్క విలువ, దానిపట్ల కలిగి ఉండాల్సిన ఆశావాహక దృక్పధం, సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొనే పద్దతులను నేర్పిన ఒక గొప్ప కౌన్సిలర్ గా నిలుస్తారు.
ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ, ఆయన తెలుగు ప్రజలందరి మనసులలో శాశ్వితంగా నిలిచి ఉంటారు. తెలుగు జాతి, తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన కూడా మనతోనే ఉంటారు. మనలోనే ఉంటారు. ఆ మహా నటుడికి తెలుగు ప్రజలందరి తరపున తెలుగువన్ హృదయపూర్వక నివాళులు అర్పిస్తోంది.