సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఓడించతరమా
posted on Jan 7, 2014 6:11AM
రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు అడ్డుకొంటానని చెపుతూ, ఇంత కాలం కాలక్షేపం చేసేసిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ‘ఆ బిల్లు శాసనసభ గడపదాటేవరకు ఆగండి, రాష్ట్ర విభజనను వ్యతికిస్తూ అందరం కలిసి పోరాటం చేద్దామని’ చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే కేంద్రం ఇన్నినెలలుగా రాష్ట్ర విభజన ప్రక్రియ చేసుకుపోతునప్పుడు, ఆయన ఏవిధంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను కట్టడి చేసేరో, ఇప్పుడు కూడా సభకు వచ్చిన బిల్లుకి ఎటువంటి ఆటంకమూ కలగకుండా కట్టడి చేస్తున్నటు స్పష్టమవుతోంది. అదేవిధంగా ఆయన మాట మీద భారం వేసి, ఆయన పెట్టబోయే కొత్త పార్టీ గురించి మాట్లాడుతున్నసీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్ర విభజన బిల్లు శాసనసభ గుమ్మం దాటేందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని స్పష్టమవుతోంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, యంపీలు రాష్ట్ర విభజన జరగబోతున్నసంగతి చాలా ముందుగా తెలిసి ఉన్నపటికీ, అందరూ కలిసి రాజీనామాల డ్రామాలతో ఏవిధంగా ప్రజలను మభ్యపెడుతూ తమ అధిష్టానానికి సహకరించారో, అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన అనుచరులు కూడా సహకరిస్తున్నారని అర్ధం అవుతోంది.
సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీజీవోలు రెండున్నర నెలలపాటు విజయవంతంగా సమ్మె, ఉద్యమాలు చేసినప్పుడు, రాజకీయ నాయకులను నమ్ముకోవడంకంటే, వారికి నేతృత్వం వహించిన అశోక్ బాబే మేలనే భావన సీమాంధ్ర ప్రజలందరిలో ఏర్పడింది. అయితే రెండున్నర నెలల రాజకీయ నేతల సహవాసంతో, అశోక్ బాబు, అతని అనుచరులలో కూడా చాలా మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశంతో కావచ్చు లేదా ఉద్యోగుల ఒత్తిడి వల్లకావచ్చు, కారణాలు ఎవయితేనేమి రెండున్నర నెలలపాటు చాలా ఉదృతంగా సాగిన ఉద్యమాలు, సమ్మెలు అన్నీకూడా స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆరిపోయినట్లు హటాత్తుగా ఆగిపోయాయి. అప్పుడు అశోక్ బాబు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే విభజన బిల్లు శాసనసభకు వస్తే మెరుపు సమ్మెకు దిగుతామని ప్రకటించేసి విభజన ప్రక్రియకు ఉడతా భక్తిగా తోడ్పడ్డారు. నేటికీ ముఖ్యమంత్రి దర్శకత్వంలోనే నడుస్తూ, ఏవో మొక్కుబడిగా కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తూ ఆయన కూడా జనవరి 23కొరకు ఎదురు చూస్తున్నారు.
వీరందరూ కలిసి విభజన బిల్లుని శాసనసభ గుమ్మం వరకు సాగనంపిన తరువాత, అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేదా వేరొకరి నేతృత్వంలో కొత్త పార్టీ పెట్టుకొని ప్రజల ముందుకు వస్తారు. ఇంతకాలం ముఖ్యమంత్రి కనుసన్నలలో నడుచుకొంటూ, ఆయన సహకారంతో విజయవంతంగా సమ్మెలు, ఉద్యమాలు, సభలు నిర్వహించి తిరుగులేని నాయకుడిగా ఎదిగిన అశోక్ బాబు, మొన్న జరిగిన ఏపీఎన్జీజీవోల ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచారు గనుక, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీకి తగిన సహకారం అందించవలసి ఉంటుంది. తనకు రాజకీయాలలోకి రావాలనే ఆసక్తి ఉందని కూడా అశోక్ బాబు ఇదివరకే ప్రకటించారు గనుక ఆయన ఆ పార్టీలో చేరినా చేరవచ్చు. లేదా అవ్వ పేరే ముసలమ్మన్నట్లు తనే ఒక పార్టీని స్థాపించి రాష్ట్ర విభజనను వ్యతిరేఖించే వారు (సీమాంధ్ర కాంగ్రెస్)వారిని ఆహ్వానించవచ్చును. ఈ రెంటిలో ఏది గ్యారంటీ హిట్ అవుతుందో లెక్కలు చూసుకొన్న తరువాత కార్యాచరణకు దిగవచ్చును. రాష్ట్ర విభజనకు తెలంగాణా నేతలకంటే ఎక్కువ సహకారం అందిస్తున్న వీరందరూ, ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకొని వచ్చేఎన్నికలలో రాజకీయ లబ్ది పొందేందుకు సమైక్య(అ)జెండాతో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాటాలు మొదలుపెట్టబోతున్నారు.
ఇదంతా కలిపిచూసినట్లయితే, రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖతను ఎదుర్కొంటూ రాష్ట్రంలో పార్టీని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎంత పకడ్బందీ వ్యూహం పన్నిందో అర్ధమవుతోంది. దాని అంతిమ లక్ష్యం రాష్ట్రంలో పార్టీని కాపాడుకొంటూ తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకొని తిరిగి అధికారంలోకి రావడం. అందుకు అవసరమయితే ఎన్ని కొత్త(పార్టీలు) వేషాలయినా వేస్తుంది.