ప్రియాంక గాంధీ చేతికి కాంగ్రెస్ పగ్గాలు!
posted on Jan 7, 2014 @ 6:47PM
రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ మానసికంగా ఎన్నడో సిద్దమయింది. ఇటీవల ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటనను రాహుల్ గాంధీ పట్టాభిషేక ప్రకటనగా భావించవచ్చును. ఈ నెల 17 నుండి మొదలయ్యే ఏఐసీసీ సమావేశాలలో శాస్త్రోక్తంగా రాహుల్ యువరాజవారి పట్టాభిషేకం కూడా జరిగిపోవచ్చును.
కానీ, ఇంతవరకు కూడా రాహుల్ గాంధీ ఆ పదవి చెప్పటేందుకు తాను అన్నివిధాల సమర్దుడనని నిరూపించుకోలేకపోయారు. నరేంద్ర మోడీ వరుసగా మూడుసార్లు గుజరాత్ రాష్ట్రంలో ఘన విజయం సాధించి, ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడితే, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా నాలుగు రాష్ట్రాలలో ఘోర పరాజయం పాలయిన తరువాత కూడా ఆయనే పార్టీలో అందరి కంటే అత్యత్తమ ప్రధాని అభ్యర్ధిగా కనబడటం ఆ పార్టీ దురదృష్టమేనని చెప్పకతప్పదు. అదే అయన స్థానంలో వేరేవరయినా ఉండి, పార్టీకి ఇంత ఘోరపరాజయం కలిగించి ఉంటే, ఆ వ్యక్తికి వెంటనే ఉద్వాసన అయిపోయేది. కానీ, పార్టీలో వేరేవరికే లేని ప్రత్యేక అర్హత కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే ఉంది గనుక, ఆ ప్రత్యేక అర్హతతోనే ఆయన తను ప్రధాని పదవికి అన్ని విధాల అర్హుడనని భావిస్తున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఎంత దైర్యం చేసి ఆయన శల్యసారధ్యానికి అంగీకరిస్తున్నప్పటికీ, ఆయన సారధ్యంలో వచ్చే ఎన్నికలలో గెలవగమనే భ్రమలలో మాత్రం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చును. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీలా తన స్వశక్తితో ప్రధానమంత్రి అవగలరని ఎవరికీ నమ్మకం లేదు. అటువంటప్పుడు ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేప్పట్టి వచ్చే ఎన్నికలలో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టగలడని ఎవరూ ఆశించరు. అందువల్ల ఆయనను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆయన సోదరి ప్రియాంకా వాద్రను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావచ్చని ఊహించినట్లుగానే ఆమె ఈ రోజు రంగప్రవేశం చేసారు.
ఆమె పార్టీలో ఎటువంటి ప్రత్యేక పదవి నిర్వహించకపోయినప్పటికీ, ఆమె ఈరోజు తన సోదరుడు రాహుల్ గాంధీ నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవడం విశేషం. కేవలం రాహుల్ గాంధీ పట్టాభిషేక మహోత్సవానికి అవసరమయిన ఏర్పాట్ల కోసమే అయితే, ఆమె కలుగజేసుకోనవసరం లేదు. కానీ, పార్టీ ముఖ్యనేతలతో సమావేశంవడం గమనిస్తే, త్వరలో ఆమె కూడా తన తల్లి సోనియాగాంధీ స్థానంలో పార్టీ అధ్యక్షురాలిగా పట్టాభిషేకం చేసుకొనేందుకు సిద్దం అవుతున్నారేమోనని భావించక తప్పదు.
జేసి దివాకర్ రెడ్డో మరొకరో సోనియాగాంధీ ఆరోగ్యం బాగోనందున పదవి నుండి తప్పుకొని వేరొకరికి బాధ్యతలు అప్పగించమని సూచిస్తే అది క్రమశిక్షణ ఉల్లంఘన క్రిందకు వస్తుంది. కానీ, ఇప్పుడు అవే కారణాలతో ప్రియాంకా గాంధీకి పార్టీ బాధ్యతలు స్వీకరించినట్లయితే, పార్టీలో ఎవరికీ ఎవరూ సంజాయిషీలు ఇవ్వనవసరం లేదు, ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కూడా.
ఇక రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో సోనియాగాంధీ బాధ్యతా తీరిపోదు. ఆ కుర్చీలో ఆయనను కూర్చోబెట్టవలసిన బాధ్యతా కూడా ఆమెదే. నరేంద్ర మోడీ ప్రవేశంతో దేశ రాజకీయాలలో వచ్చిన మార్పులతో, కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నతరుణంలో రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుని శాసించబోయే వచ్చేఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ పోరాటం వంటివేనని చెప్పక తప్పదు. వాటిని ఎదుర్కోవాలంటే పార్టీకి మరింత సమర్ధమయిన నాయకత్వం చాలా అవసరం. అందువల్ల త్వరలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించక మునుపే, ప్రియంకా వాద్రను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకొంటున్నట్లు ప్రకటించినా ఆశ్చర్యం లేదు. నిజానికి రాహుల్ గాంధీ ప్రధాని కుర్చీలో కూర్చో బెట్టాలంటే ఇంతకంటే మంచి ఉపాయం ఉండదు కూడా.