జగన్ ఐడియా మళ్ళీ బెడిసి కొట్టిందా?
posted on Jan 9, 2014 @ 9:15PM
జగన్మోహన్ రెడ్డి తీసుకొన్నదుందుడుకు నిర్ణయాల వలన వైకాపాకు చాలాసార్లు భంగపాటు ఎదురయింది. అయినా కూడా అతని ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదు. శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం చేయనిదే బిల్లుపై చర్చ జరగనీయకూడదని జగన్ తీసుకొన్ననిర్ణయం కూడా ఇప్పుడు బెడిసి కొట్టినట్లు కనబడుతోంది. బిల్లుపై చర్చలో పాల్గొంటే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లేనని వైకాపా కనిపెట్టిన సిద్ధాంతాన్నిఖండిస్తూ చర్చలో పాల్గొనని వారే విభజన కోరుకొంటున్నట్లేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త సిద్దాంతం ప్రతిపాదించారు. దానిని తన మరో అనుచరుడు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు చేత ద్రువీకరింపజేయడమే కాకుండా, ఆయన ద్వారా బిల్లుపై చర్చకు అడ్డుతగిలేవారికి ఉద్యోగులు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరికలు కూడా జారీ చేయించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలనీ బిల్లుపై చర్చజరగాలని కోరుకొంటుంటే, ఒక్క వైకాపా మాత్రం చర్చకు సిద్దపడకపోవడంతో రాజకీయంగా ఒంటరయిపోయింది.
నిజానికి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్నవైకాపా, బిల్లుపై చర్చలో పాల్గొని, బిల్లుపై లోపాలను ఎత్తి చూపి, రాష్ట్ర విభజనను తమ పార్టీ ఎందువల్ల వ్యతిరేఖిస్తోందో తెలియజేసి ఉంటే అది సహజంగా ఉండేది. కానీ, సమైక్య తీర్మానం చేయాలనే ఒక వెర్రివాదనతో సభలో బిల్లుపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా త్రిప్పి పంపేందుకు సహకరిస్తూ, సమైక్యవాదం ముసుగులో విభజన కోసం కృషి చేస్తున్నట్లు బట్టబయలయింది.
ఇంతకాలం చల్లగా కూర్చొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు అందరూ కలిసి సభను తమ అధీనంలోకి తెచ్చుకొని, ఉభయసభలలో వైకాపాను దోషిగా నిలబెట్టి బహిష్కరించడం, ఆ వెంటనే సభలో బిల్లుపై చర్చ మొదలుపెట్టి దానికి వ్యతిరేఖంగా వాదనలు వినిపించడం ద్వారా కేవలం తాము మాత్రమే రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లు ఒక భావనను ప్రజలలో కలిగించగలిగారు. ఉభయసభలలో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ వాదనలు జరుగుతున్నసమయంలో వైకాపా సభలో లేకుండా చేసి, వైకాపా చర్చలో పాల్గొనకుండా తప్పించుకొని బయటపడిందనే భావన కలిగించగలిగారు. ఊహించని ఈ ఎత్తుకి కంగు తిన్న వైకాపా, సభలోనే ఉన్న తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ద్వారా తాము బిల్లుపై చర్చకు వ్యతిరేఖం కాదని సంజాయిషీ ఇప్పించుకోవలసి వచ్చింది. బహుశః వైకాపా సభ్యులు ఇక సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టకుండా, రేపటి నుండి వారు కూడా బిల్లుపై చర్చలో పాల్గొని, టీ-కాంగ్రెస్, తెరాసలను బలంగా డ్డీ కొంటూ తద్వారా సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపాల కంటే తామే గట్టిగా పోరాడుతున్నామనే భావన కలిగించేందుకు తిప్పలు పడవచ్చును.
ఇప్పటికయినా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నసీనియర్ రాజకీయ నాయకులను సంప్రదించుతూ వారి సలహాల ప్రకారం నడుచుకొంటే, ఇక ముందయినా ఇటువంటి భంగపాటు ఎదురు కాకుండా తప్పించుకోవచ్చును. లేకుంటే వైకాపా నేతలకు ఇటువంటి పరాభావాలు పునరావృతం అవుతూనే ఉంటాయి.