సవాళ్ళను ఎదుర్కోలేని వ్యక్తి ప్రధానిగానా?
posted on Jan 16, 2014 @ 8:50PM
ఈ రోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నకాంగ్రెస్ నేతలందరూ రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని సోనియాగాంధీని గట్టిగా కోరినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధిని ప్రకటించే ఆనవాయితీ లేనందున ఆమె తిరస్కరించినట్లు, ఆ పార్టీ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది మీడియాకు తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆయన సారధ్యంలోనే వచ్చేఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల రేపు జరుగబోయే ఏఐసిసి సమావేశంలో అందరూ ఊహించినట్లుగా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించబోవడం లేదని స్పష్టమయింది.
దేశమంతా మోడీ గాలులు బలంగా వీస్తున్నఈ తరుణంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి, ఎన్నికలలో ఓడి అప్రదిష్ట మూటకట్టుకోవడం కంటే, ఒకవేళ ఎన్నికలలో గెలిస్తే అప్పుడే రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవచ్చుననే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గినట్లు కనబడుతోంది. అంతే గాక ఆయనని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే, వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవలసిన భారం కూడా ఆయనపైనే పడుతుంది. అది ఆయన నాయకత్వ లక్షణాలకి అగ్నిపరీక్షగా కూడా మారుతుంది. అటువంటి అగ్నిపరీక్షకు నరేంద్ర మోడీ స్వయంగా సంతోషంగా సిద్దపడితే, కాంగ్రెస్ మాత్రం తమ యువరాజు అంత పెద్ద పరీక్ష తట్టుకోలేడని భావించడమే, ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని అంగీకరించినట్లయింది.
ఇంతవరకు రాహుల్ గాంధీ నేతృత్వం వహించిన ఏ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అందువల్ల రాహుల్ గాంధీ పార్టీకి సారధ్యం వహిస్తారని చెపుతున్నపటికీ, ఆయనపైనే పూర్తి భారం వేయకుండా, ఒక ఎన్నికల కమిటీని నియమించి దానికి ఆయన నేతృత్వం వహించే ఏర్పాటు చేయవచ్చును. తద్వారా ఒకవేళ వచ్చేఎన్నికలలో పార్టీ ఓడిపోయినా అందుకు ఆయన పూర్తి బాధ్యత వహించనవసరం లేకుండా ఎటువంటి అపఖ్యాతి కలగకుండా తప్పుకోవచ్చును. ఒకవేళ గెలిస్తే మాత్రం ఆ ఖ్యాతి యావత్తు ఆయన ఖాతాలోనే జమా చేయబడుతుంది గనుక, అప్పుడు ఆయనను ప్రధానిగా ప్రతిపాదించడం, ప్రధాని కుర్చీలో ప్రతిష్టించడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద కష్టమేమీ కాబోదు.
ఇక కాంగ్రెస్ వెనుకంజ వేయడానికి మరో కారణం ఏమిటంటే, ఒకవేళ అతనిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే, రేపటి నుండే నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు మూకుమ్మడిగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని దాడి తీవ్రతరం చేస్తే, అప్పుడు యావత్ దేశ ప్రజలంరూ కూడా రాహుల్ గాంధీ వారినందరినీ ఏవిధంగా ఎదుర్కొని నెగ్గుకొస్తారని చూస్తారు. అంతేగాక మొట్ట మొదటిసారిగా ఇద్దరు ప్రధాని అభ్యర్ధులు ఒకరితో మరొకరు డ్డీకొంటునప్పుడు ప్రజలు వారిద్దరి బలాబలాలను, శక్తి సామర్ధ్యాలను, తెలివితేటలను, వివిధ అంశాలపై వారికున్న అవగాహనను బేరీజు వేసుకొని చూడటం మొదలుపెడతారు. అదే జరిగితే, ప్రజల తూకంలో రాహుల్ గాంధీ తేలిపోవడం ఖాయం. అది నేరుగా కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపితే విజయావకాశాలు మరింత సన్నగిల్లుతాయి. ఇప్పటికే వరుస ఓటములతో తీరని అపఖ్యాతి మూటగట్టుకొన్న రాహుల్ గాంధీపై మరింత ఒత్తిడి పెరిగితే, ఎన్నికలకు ముందే ఓటమి ఖాయమయిపోతుంది. అందుకే రాహుల్ గాంధీకి పూర్తి బాధ్యత అప్పగిస్తూనే, ఆయనపై ఈగ కూడా వాలకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతోంది.
సర్వోనతమయిన ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నరాహుల్ గాంధీ అందుకు తాను అన్నివిధాల సమర్దుడనని నిరూపించుకొనే ప్రయత్నంలో పోరాడి ఓడిపోయినా గౌరవంగా ఉండేది. ఆయన తన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించుకొని, పార్టీని గెలిపించుకొని ప్రధాని పదవి చెప్పటినా హుందాగా ఉండేది. కానీ ఈవిధంగా కర్ర విరగకుండా, పాము చావకుండా లోపాయికారిగా ప్రధాని పదవి చేపడితే దానివల్ల ఆయనకు పదవి వస్తుందేమో కానీ గౌరవం మాత్రం రాదు.