తెలంగాణా బిల్లులో అంతిమ ఘట్టమే కీలకం
posted on Jan 11, 2014 @ 10:24AM
ఎట్టకేలకు శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లుపై కొంత అర్ధవంతమయిన చర్చమొదలయ్యే సమయానికి, పండగ సందర్భంగా సభ జనవరి17కి వాయిదాపడింది. వచ్చే సమావేశాల తరువాత బిల్లుని రాష్ట్రపతికి త్రిప్పి పంపవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బిల్లుని అడ్డుకొని తీరుతానని పదేపదే చెపుతునందున, ఆయన తన సహచర మంత్రులతో కలిసి బిల్లుపై తీవ్రంగా వాదించినపుడు, ప్రతిపక్షాలు కూడా అంతే ధీటుగా వారందరినీ ఎదుర్కోవచ్చును. గనుక ఈసారి సమావేశాలు మరింత ఉద్రిక్త వాతావరణంలో సాగవచ్చును. అందువల్ల బిల్లుపై అర్ధవంతమయిన చర్చకంటే సభలో వాయిదాలపర్వమే ఎక్కువ కొనసాగవచ్చును.
సభలో బిల్లుపై ఎంత లోతుగా చర్చ జరిగితే అన్ని అభ్యంతరాలు, లోపాలు బయటపడే అవకాశం ఉంది. అదే జరిగితే, బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళినప్పుడు వాటిపై ఆయన వివరణ, సవరణలు కోరినట్లయితే బిల్లుని పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ప్రవేశ పెట్టడం కూడా సాధ్యం కాకపోవచ్చుగనుక ఈసారి తెలంగాణావాదులు కూడా చర్చకు అడ్డుతగులుతూ, సభను స్తంభింపజేయవచ్చు. ఇంతకాలం బిల్లుపై చర్చలో పాల్గొనకుండా తప్పించుకొని తిరుగుతున్న వైకాపా వచ్చే సమావేశాలలో కూడా పాల్గొనకపోయినట్లయితే, ఆ పార్టీ చేస్తున్నసమైక్యవాదం భూటకమని స్పష్టం అవుతుంది. బహుశః అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి “తాను కేవలం సమైక్యనినాదం చేయదలచుకోలేదని, తన విధానమే సమైక్యవాదమని” పరోక్షంగా వైకాపాను దెప్పి పొడుస్తున్నారు.
అయితే, బిల్లుపై సభలో అర్ధవంతమయిన చర్చ జరిగినా జరగకున్నాదానిని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకొనే అవకాశం లేదు గనుక, బిల్లుపై శాసనసభ సభ్యులందరూ లికిత పూర్వకంగా ప్రతిపాదిస్తున్నవివిధ సవరణలే కీలకం కానున్నాయి. సవరణలు ప్రతిపాదించడానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ మొదట జనవరి10 గడువు విదించినప్పటికీ, అదనంగా మరో రెండు రోజులు సమయం ఇచ్చారు. ఇంతవరకు టీ-కాంగ్రెస్, తెరాస, ఇతర తెలంగాణా సభ్యులు అందరూ కలిసి స్పీకర్ కు సవరణ ప్రతిపాదనలు అందజేశారు. మజ్లిస్ సభ్యులు 31సవరణలు అందజేయగా, సీమాంధ్రకు చెందిన 44మంది తెలుగుదేశం సభ్యులు అత్యధికంగా 492 సవరణలు ప్రతిపాదిస్తూ, అంతిమంగా తాము ఈ బిల్లుని పూర్తిగా వ్యతిరేఖిస్తున్నామని తెలియజేసారు. రాష్ట్ర విభజనను సమర్ధిస్తున్న బీజేపీ మరియు సీపీఐ పార్టీలు కూడా కొన్ని సవరణలను సమర్పించాయి. లోక్‌సత్తా కూడా కొన్ని సవరణలను ప్రతిపాదించింది.
రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్న వైకాపా బిల్లుపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, తాము బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు స్పీకర్‌కు ఒక లేఖ వ్రాసింది. సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత బిల్లులో ప్రతీ క్లాజుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బిల్లును పూర్తిగా తాము తిరస్కరిస్తున్నట్లు ప్రతిపాదించవచ్చును. సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు చేయబోయే సవరణలకు అధనంగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున లేదా ముఖ్యమంత్రి హోదాలో బిల్లులో లోపాలను ఎత్తి చూపుతూ లోప భూయిష్టమయిన ఆ బిల్లును మొత్తంగా తిరస్కరిస్తున్నట్లు లేఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తే బిల్లుపై తనకు వచ్చిన అన్నిసవరణలు, అభిప్రాయాలపై కేంద్రం నుండి సంజాయిషీ కోరవచ్చును. అందువల్ల ఆయన వద్ద కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇప్పటిదాకా, కేంద్రం రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేస్తానని చాలా గట్టిగా చెపుతున్నపటికీ, పార్లమెంటులో బిల్లుకి బీజేపీ మద్దతు పొందడం అనుమానాస్పదంగా ఉన్నందున, తెలంగాణాలో తను తక్కువ నష్టంతో బయటపడేందుకు సిద్దపడితే, ఈవంకతో బిల్లుని రాష్ట్రపతి వద్ద త్రొక్కి పెట్టించి, ఈ సమస్య నుండి బయటపడే ప్రయత్నం చేయవచ్చును. లేకుంటే, ఆయన మాట ప్రకారం మోక్కుబడిగా కొన్ని సవరణలు, హామీలు ఇచ్చి బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చును. అందువల్ల బిల్లు డిల్లీకి చేరుకోగానే మరో సరికొత్త అధ్యాయం, జాతీయ పార్టీల మధ్య డ్రామా మొదలవనుంది.