రాహుల్ పట్టాభిషేకంతో కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తునట్లేనా
posted on Jan 13, 2014 8:52AM
ఈనెల 17న ఢిల్లీలోని తోల్‌కతోరా స్టేడియంలో ఏఐసిసి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశ ప్రధాన అజెండా బహుశః రాహుల్ గాంధీకి పట్టాభిషేకం, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ఆయన పేరును ప్రకటించడమే కావచ్చును. అదే జరిగినట్లయితే, కాంగ్రెస్ పార్టీ తన 125సం.ల చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఎన్నికలకు ముందు తన ప్రధాని అభ్యర్ధిని ప్రకటిస్తున్నట్లవుతుంది. కాంగ్రెస్ తన సాంప్రదాయాన్ని పక్కనబెట్టి రాహుల్ గాంధీ పేరు ప్రకటించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీని చూసి ఎంతగా భయపడుతోందో స్వయంగా చాటి చెప్పినట్లవుతుంది. అంతేగాక ఇంకా ఎన్నికల గంట కూడా మ్రోగక మునుపే, మోడీ చేతిలో సగం ఓటమిని అంగీకరించినట్లేనని భావించవచ్చును.
కానీ, ఇటువంటి ఆరోపణల నుండి బయటపడేందుకు కాంగ్రెస్ వద్ద చాలా ఉపాయాలున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సోనియా, రాహుల్ భజన సంఘాలు తమ అమ్మగారి మనసులో ఆలోచనలు కనిపెట్టేయో లేక అమ్మని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలోనో రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించమని కోరుతూ ఇప్పటికే అధిష్టానానికి కోకొల్లలుగా ఉత్తరాలు, ఈ-మెయిల్స్ గుప్పిస్తున్నారు. అందువల్ల తాము మోడీని చూసి భయపడుతున్నట్లు కాక తమ కార్యకర్తల కోరిక, ఒత్తిడి మేరకే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తున్నామని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ, రాహుల్ మోడీకి సమ ఉజ్జీయేనా కాదా అనేది కాంగ్రెస్ నేతలే చెప్పాలి. గాంధీ-నెహ్రూ వారసత్వం తప్ప వేరే ఏ ప్రత్యేకత లేని రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ, తన మంద బలంతో దేశ ప్రజల మీద రుద్దాలని ప్రయత్నిస్తే, బహుశః అది కూడా మోడీకి లబ్ది చేకూర్చే అంశంగా మారవచ్చును.
ఈ సమావేశంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో బాటు, ఆయన సోదరి ప్రియాంక వాద్రాకు కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టాభిషేకం జరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టిన తరువాత రాజకీయాల నుండి తప్పుకోవాలని ఎలాగు భావిస్తున్నారు గనుక, తన స్థానంలో తన కూతురినే కూర్చోబెడితే రాహుల్ గాంధీకి ఆమె అన్ని విధాల అండగా నిలబడతారు. రాహుల్ గాంధీ తను నేతృత్వం వహించిన ప్రతీ ఎన్నికలలో పరాజయమే తప్ప పార్టీకి పట్టం కట్టిన సందర్భం ఒక్కటీ లేనందున, కీలకమయిన వచ్చేసార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై భారం వేసి రిస్క్ తీసుకోలేదు. గనుక ప్రియాంకాకు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టం కట్టి, రానున్నఎన్నికలలో యువరాజవారికి తోడుగా పంపినా ఆశ్చర్యం లేదు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపోటముల సంగతి ఎలా ఉన్నపటికీ, ఈ సమావేశంలో రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేసినట్లయితే, అది కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తూ ఇస్తున్న ప్రధమ సంకేతంగా భావించవచ్చును.