ఇంతకీ సమైక్య పార్టీ ఎందుకు స్థాపిస్తునట్లు?
posted on Jan 18, 2014 4:54AM
కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అదేమి పట్టనట్లు, రాష్ట్ర విభజన వ్యవహారంలో తలమునకలవడం గమనిస్తే, బహుశః ఈ కొత్త పార్టీ స్థాపన కూడా దాని వ్యూహంలో భాగమేనని అనుమానం కలుగుతుంది. అదేవిధంగా వచ్చేఎన్నికలలోగా ఎలాగయినా రాష్ట్ర విభజన జరిపితీరుతామని కాంగ్రెస్ అధిష్టానం దృడంగా చెపుతుంటే, ముఖ్యమంత్రి తదితరులు సమైక్యపార్టీ స్థాపనకు పూనుకోవడం రాష్ట్ర విభజనను అడ్డుకోవడం కోసం కాక, కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఎన్నికలలో పోటీ చేయడానికే బయటకి వచ్చినట్లుంది. కాంగ్రెస్ చెపుతున్నట్లు ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగినా, జరగకున్నా ఈ కొత్త సమైక్యపార్టీ ఆవిర్భావం తధ్యమని తెలుస్తోంది గనుక, దాని ప్రదానోదేశ్యం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమో లేక రాష్ట్ర విభజనను అడ్డుకోవడమో ఎంతమాత్రం కాదని స్పష్టమవుతోంది.
ఒకవేళ కొత్త పార్టీ పెట్టకుండా అందరూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఎన్నికలకు వెళ్ళినట్లయితే, కాంగ్రెస్ పట్ల సీమాంధ్ర ప్రజలలో ఉన్న వ్యతిరేఖత కారణంగా అందరూ ఘోరంగా ఓడిపోయే ప్రమాదం ఉంది. గనుకనే కాంగ్రెస్ తాత్కాలికంగా రెండుగా చీలిపోయి, ఒకదానితో మరొకటి విభేధిస్తున్నట్లు నటిస్తూ, ప్రజలలో ఉన్నకాంగ్రెస్ వ్యతిరేఖతను, సమైక్యాంధ్ర సెంటిమెంటుని ఉపయోగించుకొని కాంగ్రెస్ నేతలందరూ వచ్చేఎన్నికలలో గెలవాలని భారీ వ్యూహమే రచించినట్లు కనబడుతోంది. తద్వారా కాంగ్రెస్ ను వ్యతిరేఖిస్తున్న ప్రజలు మళ్ళీ అదే కాంగ్రెస్ నేతలకు ఓటువేసి గెలిపించేలా చేయాలనే ఆలోచన చాలా గొప్పగా ఉంది. అదేదో సినిమాలో హీరో, విలన్ వెతుకుతున్నమనుషులను విలన్ కి అనుమానం కలగని విధంగా అతని ఇంట్లోనే సురక్షితంగా దాచిపెట్టినట్లుగా, కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర ప్రజల భారి నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి, వారి కంటి ముందే రెండుగా చీల్చి ఒక సరికొత్త పార్టీగా వారి ముందుకు తీసుకు వచ్చిగండం గట్టెక్కాలనుకోవడం నిజంగా గొప్ప విషయమే. కానీ, సీమాంధ్ర ప్రజలు ఇది అర్ధం చేసుకోలేని తెలివి తక్కువవారని భావించడమే కూడా చాలా అవివేకమే.
కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైకాపా పెడితే, ఆయనదీ కాంగ్రెస్ డీ.యన్.ఏ.అని బల్లగుద్ది చెపుతున్నపుడు, కిరణ్ కుమార్ రెడ్డో మరో కాంగ్రెస్ నాయకుడో పార్టీ నుండి బయటకి వచ్చి సమైక్య పార్టీ పెడితే అది కాంగ్రెస్ డీ.యన్.ఏ. కాకుండా పోతుందా? ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో కలిసిపోకుండా ఉంటుందా?
రాష్ట్ర విభజన జరగకుండా ఆపేందుకయితే కొత్త పార్టీ స్థాపించనవసరం లేదు. ఆ పని కాంగ్రెస్ లో ఉంటూనే కూడా చేయవచ్చును. కానీ రాష్ట్ర విభజన జరుగబోతోందనే సంగతి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరికీ చాలా ముందే తెలిసి ఉన్నపటికీ అధికారం కోసం, మంత్రి పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం కాంగ్రెస్ అధిష్టానానికి అమ్ముడుబోయి, ఇంతవరకూ ప్రజలను మభ్య పెడుతూ వచ్చారు. ఇప్పుడు కొత్త పార్టీతో ఇంకా మభ్యపెట్టాలని ప్రయత్నించబోతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరి లక్ష్యం తిరిగి అధికారం సంపాదించడమే తప్ప, రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచడం మాత్రం కాదు. అందుకే రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ఏర్పడిన తరువాత కూడా ప్రజల మనోభావాలను బలహీనతలుగా భావించి సమైక్యమంటూ ఓట్లు నొల్లుకోవాలని వస్తున్నారు.
కాంగ్రెస్ వ్యతిరేఖతను తట్టుకొని స్వంత బలంతో గెలవగలమనే ధీమా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే, మరి కొందరు ఈ కొత్త సమైక్యపార్టీలోకి, మరి కొందరు వైకాపాలోకి దూకి ఎన్నికల గండం గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తను గెలవలేనప్పుడు ప్రధాన ప్రతిపక్షం గెలవకుండా ఉండేందుకు ఎన్నికల సమయానికి ఇటువంటి కొత్త డమ్మీ పార్టీలను సృష్టించి ఓట్లు చీల్చడం అలవాటు. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. మంద కృష్ణ మాదిగ ఇటీవలే కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు. అమాద్మీ పార్టీ కూడా రంగ ప్రవేశం చేస్తునట్లు ప్రకటించింది. ఇక కిరణ్ కుమార్ రెడ్డో మరొక కాంగ్రెస్ నాయకుడో సమైక్య పార్టీ స్థాపించడమే మిగిలి ఉంది.