పక్కదారి పట్టిన అమాద్మీ
posted on Jan 20, 2014 @ 6:38PM
దేశంలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను ఆవిష్కరిస్తామని, డిల్లీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిగద్దెనెక్కిన ఆమాద్మీపార్టీ ఇంకా నెల రోజులయినా పూర్తికాక మునుపే, స్వయంగా అనేక సమస్యలలో చిక్కుకోవడమే కాకుండా, అనేక కొత్త సమస్యలు సృష్టిస్తోంది కూడా.
ప్రభుత్వ పాలనపై దృష్టి కేంద్రీకరించవలసిన అరవింద్ కేజ్రీవాల్, విధినిర్వహణలో అలసత్వం చూపిన నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయమని ధర్నాకు సిద్దమయ్యారు. హోంశాఖ అధీనంలో ఉండే డిల్లీ పోలీసులపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నేరుగా ఎటువంటి చర్య తీసుకోలేదు గనుక, ఆయన వారిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ వ్రాసారు. ఆయన లేఖపై స్పందించిన హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడుతూ ఆ పోలీసులపై దర్యాప్తుకు ఆదేశించామని, దర్యాప్తులో వారు దోషులుగా తేలినట్లయితే వారిపై చర్యలు తీసుకొంటామని అన్నారు. కానీ, ఎటువంటి దర్యాప్తు జరపకుండా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం వలన చట్టపరమయిన సమస్యలు వస్తాయని, అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ తన పది రోజుల ధర్నాఆలోచనను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. కానీ, అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆయన సహచర మంత్రులు కూడా ధర్నాకే సిద్దపడుతున్నట్లు తాజా సమాచారం.
మంచి ప్రజాదారణ కలిగి ఉన్నఅరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఆకట్టుకోనేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేయడం అనవసరం. తాము ప్రజలకు తాము ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలుచేసేందుకు కృషి చేసినట్లయితే, అవే ఊహించనంత సత్ఫలితాలు ఇస్తాయి. వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని ప్రయత్నించడం మంచిదే. కానీ, అందుకు ఇదే సరయిన పద్ధతి కాదని ఆయన గ్రహించడం అవసరం. ఈ రోజు నలుగురు పోలీసు అధికారుల కోసం ఆయన, ఆయన సహచర మంత్రులు నడిరోడ్డు మీద పదిరోజులు ధర్నాకు దిగినంత మాత్రాన్నసమస్య సమూలంగా పరిష్కారమయిపోదు. డిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించేందుకు కృషి చేస్తామని ఆమాద్మీ పార్టీ చేసిన ఎన్నికల హామీని నిలబెట్టుకొనేందుకు ఆయన కృషి చేసి ఉంటే, పోలీసు వ్యవస్థ డిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తుంది. అప్పుడు ఇటువంటి సమస్యలు పునరావృతమవవు.
దాదాపు 50 లక్షల మంది జనాభా ఉన్నడిల్లీ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో అధికారులందరూ నిరంతరం పనిచేస్తూ ఉండాలి. కానీ, సాక్షాత్ ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు తమ పనులను పక్కనబెట్టి, ఈవిధంగా ధర్నాలు చేయడం వలన ప్రజలకు ఎటువంటి మేలు జరుగదు. అరవింద్ కేజ్రీవాల్ బృందానికి ప్రజలు ఒక అపూర్వమయిన అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఆమాద్మీ ప్రభుత్వానికి ఎన్నికలు సమీపించే వరకు, మహా అయితే మరో మూడు నెలల ఆయువు మిగిలి ఉంది. దేశ ప్రజలకి తమ ప్రభుత్వ పనితీరుని మచ్చు చూపించగల అపూర్వమయిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అమాద్మీ పార్టీ ఎన్నికలకు వెళ్ళినట్లయితే అందుకు తగిన ప్రతిఫలం ఆశించవచ్చును. కానీ, ప్రజలను ఆకర్షించడానికి ఇటువంటి చవకబారు పనులకు పూనుకొంటే, వచ్చే ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ నామ రూపాలు లేకుండా పోవచ్చును.
గుజరాత్ రాష్ట్రంలో సమర్ధమయిన పాలన అందించినందుకే నరేంద్ర మోడీ వైపు దేశ ప్రజలు మొగ్గుచూపుతున్నారనే సంగతిని అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆయన పార్టీ సభ్యులు గ్రహించినట్లయితే, వారు ఇటువంటి అంశాలను పట్టుకొని వృధా కాలక్షేపం చేయరు.డిల్లీ ప్రజలు ఆమాద్మీ నుండి చాలా ఆశించి అధికారం కట్టబెట్టారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పుడు విఫలమయినట్లయితే, దేశ ప్రజలు మళ్ళీ ఇక ఇటువంటి ప్రయోగానికి ఆసక్తి చూపరు. అప్పుడు దేశ ప్రజలకు మళ్ళీ అవే కాంగ్రెస్, బీజేపీలు గతవుతాయి.