ప్రతిపక్షాలను ఉచ్చులోకి లాగుతున్న కిరణ్
posted on Jan 9, 2014 7:15AM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నమీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర విభజన బిల్లుపై అన్ని పార్టీలు చర్చకు రావాలని కోరారు. మొదటి నుండి గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నఆయన ఇంతవరకు రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు తానేమి చేసారో, చేయబోతున్నారో చెప్పకుండా, “నా ప్రతాపం సభలో చూద్దురుగాని” అంటూ మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసి, వైకాపా, తెదేపాల వైఖరి ఏమిటో తెలియజేయాలని కాంగ్రెస్ మార్క్ తెలివితేటలు ప్రదర్శించారు. తమది జాతీయ పార్టీ గనుక అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందని, కానీ ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, వైకాపాలు ఎవరినీ సంప్రదించనవసరం లేదు గనుక ఏ నిర్ణయమయినా తీసుకోగలవని ఒక గొప్ప ‘లా పాయింటు’ కూడా చెప్పారు. అందువల్ల తాము రాష్ట్ర విభజనకు అనుకూలమో వ్యతిరేఖమో సభలో తేల్చి చెప్పాలని ఆయన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలను కోరారు.
బిల్లుపై చర్చలోపాల్గొంటే అది విభజనకు అంగీకరించినట్లేనన్నవాదనను ఆయన త్రోసిపుచ్చుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గొంతు చించుకొని అరిచేబదులు, బిల్లుపై చర్చలో పాల్గొని దానిని గట్టిగా వ్యతిరేఖిస్తే ప్రయోజనం ఉంటుందని వైకాపాను ఉద్దేశ్యించి ఆయన అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు తన ప్రతాపం చూపిస్తానని రచ్చబండపై నిలబడి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభకు బిల్లు వచ్చిఅప్పుడే నెలరోజులయిపోయినప్పటికీ ఇంతవరకు దానిపై ఒక్క ముక్క మాట్లాడింది లేదు. మరో పదిరోజుల్లో బిల్లు రాష్ట్రపతికి త్రిప్పి పంపబడుతుందని తెలిసి ఉన్నపటికీ కనీసం ఇంతవరకు దానిపై సభలో చర్చమొదలయ్యేలా కూడా చేయలేకపోయారు.
తను చేస్తానని చెప్పిన పని చేయకుండా, తాపీగా మీడియా సమావేశం పెట్టి ప్రతిపక్షాలను నిందిస్తున్నారు. కానీ, బిల్లుపై చర్చజరగకపోవడానికి ప్రతిపక్షాలనే కాదు ఆయననీ, కాంగ్రెస్ పార్టీనీ, కూడా తప్పుపట్టవలసి ఉంటుంది. ఇంతవరకు ప్రతిపక్షాలు ఏవిధంగా ఈ నిందను తమ ప్రత్యర్దులపైకి నెట్టి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయో, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అదే చేసారు. ఆయన ఇంతవరకు బిల్లుపై తన వాదనలు వినిపించకపోయినా, ప్రతిపక్షాలు చర్చలో పాల్గొని తమ వైఖరి స్పష్టం చేయాలని కోరడం కేవలం ఆ పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చును. బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండా రాష్ట్రపతికి తిరిగి వెళ్ళిపోతే, అప్పుడు ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ‘సభలో బిల్లును అడ్డుకొంటానని ప్రగల్భాలు పలికి కనీసం చర్చ కూడా మొదలవకుండా ఎందుకు త్రిప్పి పంపారని’ ప్రజలు, ప్రతిపక్షాలు కూడా తనని నిలదీయస్తారనే ఆలోచనతోనే ముందు జాగ్రతగా కిరణ్ కుమార్ రెడ్డి ఈవిధంగా మాట్లాడుతున్నారు.
నిజానికి ఆయన మొదటి నుండి కూడా రాష్ట్ర విభజన వ్యవహారంలో అధిష్టానానికి పరోక్షంగా సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా తన పార్టీ సభ్యులతో కలిసి బిల్లుపై చర్చ జరగనీయకుండా అదే విధంగా సహకరిస్తున్నారు. అందుకే సభలో వాదనలు చేసే బదులు, జనవరి23వ తేదీ తరువాత తదుపరి కార్యాచరణ గురించి కూడా మాట్లాడుతున్నారు.