చేజారిన ప్రపంచకప్
posted on Apr 1, 2016 @ 10:00AM
ఆట అన్నాక గెలుపోటములు సహజం! కానీ జాతీయస్థాయిలో ఆడేటప్పుడు చిన్నచిన్న తప్పులు చేసి కప్పుని చేజార్చుకుంటారని అభిమానులు ఆశించరు. కీలకమైన సమయాలలో నిక్కచ్చిగా ఆడటాన్నే మనం ప్రొఫెషనల్ అంటాము. కానీ నిన్న ఇండియా వెస్టిండీస్ మధ్య జరిగిన ఆటను చూసిన వారికి, మ్యాచ్‌ని చేజేతులారా కోల్పోయామన్న భావన బాధించక తప్పదు. మన జట్టు ఒత్తిడిలో గెలవడం నేర్చుకుందని సంబరపడిన వారికి... లేని ఒత్తిడిని మీద వేసుకుని ఓడిన రోజులు గుర్తుకురాక మానవు
విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడితే ఇండియా గెలుస్తుంది... రోహిత్ శర్మను అయిదు పరుగులకే ఔట్ చేస్తే విండీస్ గెలుస్తుంది... నిన్న మ్యాచ్ జరగక ముందు ఇలాంటి ఊహాగానాలు చాలానే చేశారు. కానీ మ్యాచ్ ఆరంభం నుంచి ఊహలకు అతీతంగానే సాగింది. ఇండియా టాస్ ఓడిపోవడంతో మొదటి దెబ్బ తగిలింది. ఫ్లాట్ పిచ్, చిన్నగా ఉండే వాంఖడే స్టేడియం, సమయం గడిచే కొద్దీ తేమ పెరిగిపోయే వాతావరణం... ఇలాంటి పరిస్థితుల్లో
సెమీఫైనల్ అనగానే వెస్టిండీస్ సారథి బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. ఒకరకంగా ఇది భారత బ్యాట్స్‌మెన్‌కు కలిసివచ్చే అంశమే. ఎందుకంటే మనం మొదటిసారి బ్యాటింగ్ చేసేటప్పుడే బలంగా ఉంటామని ప్రపంచం మొత్తానికీ తెలుసు. దానికి తగినట్లుగానే రోహిత్ శర్మ ఆరు బౌండరీలు బాది, 43 పరుగులు చేసి శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ దశలో ఇండియా తేలికగా 200కి పై చిలుకు స్కోర్ సాధిస్తుందని అందరూ ఊహించారు. కానీ అజింక్య రహానే ఆటతీరుతో అంచనాలు తారుమారయ్యాయి.
T-20 క్రికెట్‌కు అనుగుణంగా దూకుడుగా ఆడే శిఖర్ ధవన్‌ను కాదని, రహానేను తీసుకోవడంతో ధోనీ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లయ్యింది. అజింక్య నిదానంగా ఆడటంతో అతనికి తోడుగా వచ్చిన విరాట్ కోహ్లీ ఆటతీరు కూడా నెమ్మదించింది. అజింక్య దాదాపు ఆరు ఓవర్లకు సరిపడా బంతులు ఆడి కేవలం 40 పరుగులు చేశాడు. అజింక్య నిష్క్రమించిన తరువాత కానీ భారత రన్‌రేట్ పుంజుకోలేదు. దీంతో కనీసం 220 పరుగులు చేస్తుందనుకున్న ఇండియా 192 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ లక్ష్యాన్ని కాపాడేందుకు భారతీయ బౌలర్లు ఆదిలో బాగానే శ్రమించారు. బుమ్రా బౌలింగ్‌లో గేల్, నెహ్రా చేతిలో శామ్యూల్స్ ఔట్ కావడంతో... 19/2కి వెస్టిండీస్ పరిస్థితి దారుణంగా ఉంది.
గేల్ ఔట్ కావడంతోనే ఇండియా సగం మ్యాచ్‌ను గెలిచిందనుకున్నారు. కానీ విండీస్ ఆటగాడు సిమన్స్‌ను రెండు సార్లు నోబాల్స్‌తో ఔట్‌చేసి భారతీయ బౌలర్లు ఆదుకున్నారు. ఒక ఆటగాడు రెండుసార్లు నోబాల్స్ వల్ల బతికిపోవడం అదృష్టమైతే, అశ్విన్ నోబాల్ వేయడం ఆశ్చర్యం. స్పిన్ బౌలర్లు నోబాల్ వేయడాన్ని చాలా దారుణమైన తప్పిదంగా భావిస్తారు క్రికెట్ పండితులు. నో బాల్ మాత్రమే కాదు, భారీగా పరుగులు సమర్పించుకుంటున్న అశ్విన్ తన బౌలింగ్ కోటాను కూడా పూర్తిచేయలేకపోతున్నాడు. ఫలితం! భారత జట్టులో నెహ్రా, బుమ్రా అనే ఇద్దరు ప్రొఫెషనల్ బౌలర్లు మాత్రమే మిగిలారు. పార్ట్‌టైం బౌలింగ్ చేసే జడేజా, పాండ్యా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ఇంత జరుగుతున్నా, భారత జట్టు ఏదో ఒక అద్భుతం చేసి విజయాన్ని సాధిస్తుందనుకున్నారు అభిమానులు. ఆఖరికి, చివరి ఓవర్లో ఎనిమిది పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆశలు వదులుకోలేదు. 1993 హీరోకప్‌లో సచిన్ టెండుల్కర్ వేసిన ఆఖరి ఓవరు మొదలుకొని, ఈ టోర్నీలో బంగ్లా మీద హార్థిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవరు వరకూ అన్నీ మననం చేసుకున్నారు. కానీ అద్భుతాలు మాటిమాటికీ జరగవు. అద్భుతాలు జరుగుతాయన్న ఆశతో ఆటలు ఆడలేం! విరాట్ కోహ్లీ వేసిన ఆఖరి ఓవరు పేలవంగా ముగిసింది. వెస్టిండీస్ లక్ష్యాన్ని తాకింది.
టోర్నీలో ఇప్పటివరకు విజయాలను సాధించిన జట్టు ప్రదర్శన ఇలా ముగిసిపోయిందే అన్న బాధే కానీ, ఇందుకోసం జట్టు సభ్యుల సంకల్పాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. గెలిచినప్పుడు నెత్తికెక్కింకుచుని, ఓడిపోయాక నేలకి విసిరికొట్టే రోజులు ఎలాగూ మారాయి. ఈ టి-20 ప్రపంచ కప్ పుణ్యమా అని విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని చూశాము. హార్థిక్ పాండ్యా అనే ఆల్‌రౌండర్ మనకి దొరికాడు. కానీ నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలానే మిగిలిపోయాయి. కీలక మ్యాచ్‌లలో బౌలర్ల కూర్పు ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎలాంటి బ్యాట్స్‌మన్ అవసరం, చిన్నిచిన్న తప్పిదాల వల్ల మ్యాచ్ ఎలా చేజారిపోతుంది అన్న విషయాన్ని ఇకనైనా మన ఆటగాళ్లు గ్రహిస్తారని ఆశిద్దాం.