పాకిస్తాన్‌ పాలు పోసి పెంచిన తాలిబన్‌

  27 మార్చి- లాహోర్‌లోని గుల్షన్‌-ఏ-ఇక్బాల్‌ పార్కు.  ఆదివారం, ఆపైన ఈస్టర్‌ పర్వదినం కావడంతో సమయాన్ని సరదాగా గడిపేందుకు వందలాది మంది క్రిస్టియన్లు పార్కులో గుమికూడారు. అకస్మాత్తుగా ఏదో పేలిన శబ్దం. ఏం జరిగిందో మెదడు గ్రహించేలోపే, కళ్ల ముందు మంటలు! పార్కులో అంతెత్తున ఉన్న చెట్లు కూడా భగభగ మండుతూ కనిపించాయి. మనుషుల శరీరాలు గాల్లోకి ఎగిరెగిరి పడ్డాయి. ఈ ఘోరాన్ని చూడలేక 70 మంది కళ్లు మూశారు. జీవితాంతం ఆ దారుణాన్ని గుర్తుంచుకునేలా 300 మంది కొన ప్రాణాలతో బయటపడ్డారు. ఇక్బాల్‌ అంటే అరబ్బీ భాషలో విజయం అన్న అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ మానవత్వం పరాజయం పాలైంది.   సంఘటన జరిగిన కొద్దిసేపటికే ఏదో ఘనకార్యం చేసినట్లు... తామే ఈ దారుణానికి పాల్పడ్డామంటూ తాలిబన్‌ అనుబంధ సంస్థ  జమాన్‌-ఉల్‌-అహ్రార్‌ నుంచి ప్రకటన వెలువడింది. నిజానికి ఇది తాలిబన్‌ కనుసన్నలలోనే జరిగిందనడంలో ఎవరికీ ఏ అనుమానాలూ లేవు. ప్రభుత్వాల దృష్టిని మళ్లించేందుకు, కఠినమైన ఆంక్షలను తప్పించుకునేందుకు తీవ్రవాద సంస్థలు.. ఇలా రకరకాల పేర్లతో విషాన్ని కక్కుతూ ఉంటాయి. విషమున్న పాము ఏ పేరుతో కాటు వేస్తేనేం!   తీవ్రవాదులు లాహోర్‌ను ఎంచుకోవడం పాకిస్తాన్‌ను సైతం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే పాకిస్తాన్‌లోకెల్లా అతి ప్రశాంతమైన నగరమని లాహోర్‌కు పేరు. స్వాతంత్ర్యం ముందు నుంచీ కూడా మేధావులకూ, ధనికవర్గాలకూ లాహోర్ పెట్టింది పేరు. ఇప్పటి ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ పుట్టింది కూడా లాహోర్‌లోనే! లాహోర్‌ జోలికి రానంతవరకూ, షరీఫ్‌ తీవ్రవాదాన్ని పెద్దగా పట్టించుకోరనే అపప్రథ కూడా ఉంది. అలాంటి చోట విధ్వంసాన్ని సృష్టించడమే కాదు ‘మేం ఈ దాడి ద్వారా నవాజ్‌ షరీఫ్‌కు ఓ సందేశాన్ని పంపిస్తున్నాం. మేం లాహోరులో అడుగుపెట్టాం! ఇక మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మా ఆత్మాహుతి దళాలు మరిన్ని దాడులకు పాల్పడుతూనే ఉంటాయి’ అంటూ జమాన్‌-ఉల్‌-అహ్రార్‌ ఓ హెచ్చరికను సైతం వినిపించింది. దీంతో తీవ్రవాదాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తే, వీలైతే ప్రోత్సహిస్తే... ఎలాంటి ఫలితం దక్కుతుందో షరీఫ్‌కు తెలిసొచ్చింది.   90వ దశకంలో వేళ్లూనుకుని, తరువాతి కాలంలో ఆఫ్ఘనాస్తాన్‌నే పాలించే స్థితికి తాలిబన్‌ చేరుకుందంటే అదంతా పాకిస్తాన్ చలవే! 1996-2001 సంవత్సరాల మధ్య ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ సాగించిన పాలన ప్రపంచానికే ఓ పీడకల. షరియా పేరు చెప్పుకుని తాలిబన్ విధించిన శిక్షలకు సమాజం నివ్వెరపోయింది. ఒకవైపు మత రాజ్యాన్ని నెలకొల్పామని చెబుతూనే, స్త్రీల మీద లెక్కలేనన్ని అరాచకాలని సాగించింది. అంతకంటే దారుణం ఏమిటంటే ప్రపంచమంతా ఈ విషయాన్ని చూసీచూడనట్లు ఉండటం. పైగా తాలిబన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు అధికారికంగా గుర్తించడం!   తాలిబన్ నేస్తమైన అల్‌ఖైదా కనుక అమెరికా ట్విన్‌టవర్స్ మీద దాడి చేసుండకపోతే అక్కడ వారి పాలన నిరవధికంగా సాగి ఉండేది. అల్‌ఖైదా నేత బిన్‌లాడెన్‌ను తమకి అప్పగించకపోవడంతో, తాలిబన్‌ అమెరికా ఆగ్రహానికి గురి కావల్సి వచ్చింది. అయినా పాకిస్తాన్‌ వెనుకడుగు వేయలేదు. ఒకపక్క ఉగ్రవాదం మీద పోరులో అమెరికాతో కలిసి నడుస్తున్నామని చెబుతూనే, తాలిబన్లకు తమ దేశంలో శరణు కల్పించింది. ఈ విషయమై పాకిస్తాన్ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానవు. పాకిస్తాన్‌ విదేశీవ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్ మాట్లాడుతూ తాలిబన్‌ తమ కనుసన్నలలోనే ఉన్నారని పేర్కొన్నారు. పైగా తమ దేశంలో వారికి కావల్సిన సదుపాయాలన్నీ అమర్చడం వల్లే వారు తమ చెప్పుచేతల్లో ఉంటున్నారనీ, తద్వారా తాము ప్రపంచశాంతికి దోహదపడుతున్నామనీ సర్తాజ్ పేర్కొన్నారు!   కానీ మొన్న జరిగిన దాడిని గమనిస్తే ఎవరి చెప్పుచేతల్లో ఎవరు ఉన్నారో అర్థమైపోతోంది. తాలిబన్‌ మళ్లీ పడగ విప్పుతోంది. పాకిస్తాన్‌ పశ్చిమభాగాన తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటోంది. అక్కడి పేషావర్‌ లోయలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటోంది. ఇప్పుడు ఏకంగా లాహోర్ మీదే దాడి చేసి తాము దేశం అంతటా విస్తరించామని ప్రకటించింది. పంజాబు (పాకిస్తాన్‌) రాష్ట్రానికి రాజధాని అయిన లాహోర్‌ను చేరుకుంటే, దానికి అనుకుని ఉన్న భారతదేశాన్ని చేరుకోవడం అంత కష్టం కాదు. కాబట్టి ప్రస్తుత పరిణామం మన రక్షణకు కూడా ఆందోళన కలిగించేదే!   ప్రస్తుత దాడిని పాకిస్తాన్‌ ఎంత తీవ్రంగా తీసుకుంటుందో చెప్పలేం! ఎందుకంటే ఇది అక్కడి మైనారటీలైన క్రైస్తవుల మీద జరిగిన దాడి. పాకిస్తాన్‌లోని అల్పసంఖ్యాకుల మీద ఇలాంటి దాడులు జరగుతూనే ఉన్నాయి. 2013లో పెషావర్‌లోని ఓ చర్చి మీద జరిగిన దాడిలో కూడా 80 మందికి పైగా మరణించారు. అల్పసంఖ్యాకులను భయభ్రాంతులను చేసేందుకు, వారిని దేశం నుంచి తరిమివేసేందుకు, అక్కడి తీవ్రవాద సంస్థలు ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఉంటాయి.   కానీ ఈ దాడికి మరిన్ని కారణాలను కూడా చెబుతున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్‌లో షరియా చట్టాన్ని (మతచట్టం) ఖచ్చితంగా అమలుచేయాలనీ, దైవదూషణ చట్టలను మరింత కఠినతరం చేయాలనీ ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. మరి అటు మతభావనలనీ, ఇటు తీవ్రవాదాన్నీ నవాజ్ షరీఫ్‌ ఎంతవరకూ వేరుచేయగలరో చూడాలి. అన్నింటికీ మించి తీవ్రవాదానికి తరతమ బేధాలు ఉండవనీ, ప్రోత్సహించినవారినే బలితీసుకునే చరిత్ర దానికి ఉందని షరీఫ్‌ గుర్తెరిగితే.... అది ప్రపంచానికే కాదు, పాకిస్తాన్‌ భవిష్యత్తుకు కూడా మంచిది. లేకపోతే ఇలాంటి నరమేధాల గురించి కలచివేసే వార్తలు మరిన్ని వినాల్సి ఉంటుంది!

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన... ఎందుకంటే!

  గత వారం పదిరోజులుగా ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలకి కేంద్రం ఓ అనూహ్యమైన ముగింపుని ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను విధిస్తూ ఉత్తర్వును జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అరుణాచల్‌ ప్రదేశ్‌లో విధించిన రాష్ట్రపతి పాలన గురించి ఇంకా మర్చిపోకుండానే, మరో రాష్ట్రంలోని ప్రభుత్వం నిద్రాణస్థితిలోకి వెళ్లిపోయింది.   ఉత్తరాఖండ్‌లోని హరీశ్‌రావత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయ్‌బహుగుణ వంటి నేతలు ఆది నుంచీ గళం ఎత్తుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పనితీరు పట్ల వీరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించసాగారు. విజయ్‌బహుగుణకు హరీష్‌రావత్‌ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కలగడానికి కారణం లేకపోలేదు. 2012లో అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ తరఫున విజయ్‌బహుగుణను ముఖ్యమంత్రిగా నియమించింది అధిష్టానం. కానీ రెండేళ్లు గడువకుండానే, ఆయన చేత రాజీనామా చేయించి... ప్రభుత్వ పగ్గాలను హరీశ్‌రావత్‌కు అప్పగించారు. ఇలా తరచూ ముఖ్యమంత్రులను మార్చే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించేందుకు ప్రయత్నించింది. కానీ రోజులు మారుతున్నాయన్న విషయం గ్రహించలేకపోయింది.   గద్దె దిగిన ముఖ్యమంత్రిగా విజయ్‌బహుగుణ సహజంగానే అసంతృప్తితో రగిలిపోవడం మొదలుపెట్టారు. తన అసంతృప్తిని పార్టీ అధినాయకత్వానికి చేరవేసినా, వారి నుంచి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం వినిపించలేదన్నది ప్రధాన ఆరోపణ. అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఇలాగే పట్టీపట్టనట్లు ఉందని ఆరోపణలు వినిపించాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిరసన గళమెత్తిన ఎమ్మెల్యేలు సోనియా, రాహుల్‌ గాంధిలను కలిసే ప్రయత్నం చేసినా వారు అంతగా ఆసక్తిని చూపలేదన్న విమర్శలు వినిపించాయి. ఇక్కాడా విజయ్‌బహుగుణ ప్రభుత్వం పట్ల అసమ్మతిని రాజేస్తూ, నిదానంగా తన శిబిరంలోని సంఖ్యను పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆ సంఖ్య ప్రభుత్వాన్ని దెబ్బతీసే స్థాయికి చేరుకుందని నిర్ధరణకు వచ్చాక, అదను కోసం వేచి చూడసాగారు. విజయ్‌బహుగుణని సాధారణ నేపథ్యమేమీ కాదు. ఆది నుంచీ వారి కుటుంబం రాజకీయాలతో ముడిపడి ఉంది. దానికి తోడు న్యాయవాదిగా ఎత్తుకుపైఎత్తు వేయగల చాతుర్యమూ ఉంది. ఆ అనుభవమూ, చతురతా ఇప్పుడు కలిసివచ్చాయి.   మార్చి 18న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితేనే అక్కడి ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం నిధులను వెచ్చించగలదు. అలాంటి కీలకమైన బిల్లుని ఆమోదించేందుకు అసమ్మతి ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. దాంతో స్పీకర్‌ బిల్లుని ఎలాగొలా పాసైందని అనిపించారు. ప్రభుత్వం కీలకమైన బిల్లుని కూడా ఆమోదింపచేయలేని పరిస్థితిలో ఉందంటూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రపతి పాలనను విధించింది. కేంద్ర ప్రభుత్వ చర్యని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ సోమవారం అక్కడి ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవలసి ఉండగా, హడావుడిగా కొద్ది గంటల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడం ఏంటని మండిపడుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ భయాలు వేరేలా ఉన్నాయి...   71మంది సభ్యులు ఉన్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ నుంచి 36 మంది ఎమ్మెల్యేలు, భాజపా నుంచి 28 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గట్టు దాటడంతో బలాబలాలు తారుమారైపోయాయి. పరిస్థితి తమకు అనుకూలంగా లేదని హరీశ్‌రావత్‌కు స్పష్టం కావడంతో, అసమ్మతివాదులైన 9 మంది ఎమ్మెల్యేల మీదా అనర్హత వేటు వేయించారు. దాంతో మిగతా చిన్నాచితకా పార్టీల మద్దతుతో బలపరీక్షను దాటేయవచ్చని ఆయన ఆలోచన. ఈ వ్యూహాన్ని పసిగట్టిన కేంద్రప్రభుత్వం ఆదరాబాదరాగా రాష్ట్రపతి పాలనను విధించింది. పైగా అసమ్మతితో ఉన్న నాయకులను కూడా హరీశ్‌ కొనే ప్రయత్నం చేశారన్న తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ లావాదేవీలకు సంబంధించిన ఓ సీడీని కూడా అసమ్మతి నేతలు విడుదల చేశారు. ఈ సీడీలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్‌ కొన్ని ‘లెక్కల’ గురించి మాట్లాడటం గమనించవచ్చు. ఈ సీడీ విడుదలతో కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలనను విధించేందుకు మరింత బలమైన కారణం దొరికినట్లైంది.   ఏదేమైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఇలా అర్ధంతరంగా ముగిసిపోవడం విషాదకరం. రాజకీయ నేతలలో దిగజారుతున్న నైతిక విలువలే దీనికి కారణం కావచ్చు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా వసుధైక కుటుంబంలా అన్ని పార్టీలూ లావాదేవీలతోనే రాజకీయాలను నడిపేందుకు సిద్ధపడిపోతున్నాయి. దీనికి ఫలితాన్ని అనుభవించేది మాత్రం సామాన్యులే! మరి ఆ సామాన్యుల ఆలోచన ఎలా ఉందో! ఎవరిని ఎన్నుకున్నా ఏమున్నది గర్వకారణం అంటూ నిస్తేజంతో మునిగిపోతారో లేకపోతే పరిస్థితులను అసహ్యించుకుని తామే ప్రత్యక్ష రాజకీయాలలోకి దూసుకువస్తారో చూడాలి!

కశ్మీర్‌ ప్రజల ప్రేమని చూరగొన్న మెహబూబా

  మెహబూబా కశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా ఎంపికకానున్న విషయం ఖరారైపోయింది. రాజకీయంగానూ, భౌగోళికంగానూ కీలకమైన కశ్మీరానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలను చేపట్టనున్నారు. గత జనవరి 7న మెహబూబా తండ్రి ఆకస్మిక మరణంతో ఆ పదవి ఖాళీగా ఉండిపోయింది. కానీ తండ్రి రాజకీయాలకు ఆది నుంచీ వారసురాలిగా వస్తున్న మెహబూబా, ఆ పదవిని అందుకునేందుకు తొందరపడలేదు. బీజేపీతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరిపిన తరువాత కానీ తన నిర్ణయాన్ని తెలియచేయలేదు. 56 ఏళ్ల మెహబూబాకి రాజకీయాలు కొత్తేమీ కాదు. మెహబూబా తండ్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ 1998లో జాతీయ కాంగ్రెస్‌ నుంచి వేరుపడి, పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీని (పీడీపీ) స్థాపించినప్పటి నుంచి తండ్రితోనే సాగారు మెహబూబా. కశ్మీర్‌లో పీపుల్స్ డెమోక్రడాటిక్‌ పయనం ఏమంత సాఫీగా సాగలేదు. అటు నేషనల్‌ కాన్ఫరెన్స్, ఇటు కాంగ్రెస్‌ రెండింటికీ కూడా కశ్మీర్‌ ఓటర్ల మీద బలమైన పట్టు ఉంది. వారిద్దరినీ కాదని స్వంతంగా అధికారాన్ని చేపట్టేందుకు పీడీపీకి పదిహేనేళ్లు పట్టింది. తీరా ముఖ్యమంత్రి పదవి చేపట్టాక, పదవీకాలం పూర్తవకుండానే ముఫ్తీ కన్నుమూశారు. మెహబూబాకు రాష్ట్ర రాజకీయాల మీదే కాదు, దేశ రాజకీయాల మీద కూడా మంచి పట్టు ఉంది. ఆది నుంచీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు పెట్టని కోటగా ఉన్న అనంత్‌నాగ్‌ నియోజకవర్గం నుంచి మెహబూబా 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. న్యాయవాదంలో పట్టా పొందిన మెహబూబాకు చట్టం మీదా, కశ్మీర్ పరిస్థితుల మీద కూడా కావల్సినంత అవగాహన ఉంది. స్వీయ పరిపాలనే లక్ష్యంగా స్థాపించిన పీడీపీ పార్టీతోనే అటు వేర్పాటువాదులకీ, ఇటు జాతీయవాదులకీ మధ్యేమార్గంగా పాలనను కొనసాగిస్తుందని ఆశించవచ్చు. పాలన విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పరిస్థితులు ఎలా ఉంటాయో ముఫ్తీకి తెలియనిది కాదు. తీవ్రవాదం తమ వ్యక్తిగత జీవితంలోకి ఏ స్థాయిలోకి చొచ్చుకుపోగలదో ఆమెకు 1989లోనే అనుభవమైపోయింది. అప్పట్లో మెహబూబా చెల్లెలు, రుబియా సయీద్‌ను కిడ్నాప్‌ చేసిన తీవ్రవాదులు, ఆమెను అడ్డం పెట్టుకుని అయిదుగురు ఉగ్రవాదులను హాయిగా విడిపించుకున్నారు. ఇప్పటికీ కశ్మీర్‌లోని పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా, మరింతగా దిగజారుతున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడి సైన్యం ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడల్లా, స్థానిక ప్రజలు నుంచి అనూహ్య స్థాయిలో ఉగ్రవాదులకు మద్దతు లభిస్తుండటమే తాజా తార్కాణం. మరోపక్క హిందూ పార్టీగా పేరొందిన బీజేపీతో మెహబూబా దోస్తీ పట్ల కూడా కశ్మీర్‌ సంప్రదాయవాదులు గుర్రుగా ఉన్నారు. వారి భావాలను, భయాలను కూడా గమనించుకోవలసి ఉంటుంది. బహుశా అందుకే మెహబూబా ముఖ్యమంత్రి పదవి తన చేతి దగ్గరకి రాగానే ఎగిరి గంతేయలేదు. కశ్మీర్‌ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న భరోసాను తనకి కల్పించాలంటూ పట్టుపట్టారు. అప్పుడే పదవిని చేపట్టేందుకు సిద్ధపడ్డారు. ఇంతకీ ఆమె ఆ పదవికి ఏ మేరకు వన్నె తెస్తారో రాబోయే కాలమే చెబుతుంది.  

పండుగల తీరు మారుతోందా!

హోలీని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకొని ఉండవచ్చు. కానీ ఈ రోజున ఏ ప్రమాదం జరుగుతుందా అని నిఘా వర్గాలు భయంభయంగా గడిపాయి. ఉగ్రదాడులకు సంబంధించి ఎక్కడి నుంచీ ఏ వార్తా వినిపించకపోయేసరికి ఊపిరి పీల్చుకున్నాయి. కేవలం ఉగ్రదాడులే కాదు... సంబరంలా జరుపుకోవాల్సిన పండుగను విషాదాంతం చేసేందుకు చాలానే ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి.   పర్యావరణం: ఒకప్పుడు పండుగలకి వాడే సరంజామా అంతా ప్రకృతిసిద్ధంగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా కృత్రిమమైపోయింది. దీపావళి బాణాసంచాలో వాడే మెర్క్యురీ, మెగ్నీషియం, బేరియం… వంటి రసాయనాలన్నీ కూడా పర్యావరణానికి హానికలిగించేవే! హోలీ రంగుల్లో వాడే క్రోమియం, లెడ్‌ ఆక్సైడ్‌ వంటి రసాయనాలూ ఏమంత అమాయకమైనవి కావు. ఈ రసాయనాలను ఉపయోగించి పండుగను జరుపుకోవడం వల్ల, ఆ ధూళి వాతావరణంలో కొద్ది రోజుల పాటు ఉండిపోతుంది. ఈ తరహా కాలుష్యాన్ని RSPM (Respirable Suspended Particulate Material) అంటారు. ఒకోసారి ఈ RSPM ఉండతగిన పరిమితి కంటే 20 రెట్లు అధికంగా ఉంటోంది! ఇక వినాయకచవితి రోజున అడుగుల కొద్దీ ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు.   వాణిజ్యం: మన దేశంలో పండుగ వస్తోందంటే ఇప్పుడు చైనా సంస్థలు సంబరపడుతున్నాయి. ఎందుకంటే, సదరు పండుగకు సంబంధించి ఇబ్బడిముబ్బడిగా సరుకులు ఇక్కడికి తరలించవచ్చని వారి ఆశ. కారు చవకగా దొరికే ఆ సరుకులు దళారుల దగ్గర్నుంచీ వినియోగదారుల వరకూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. చైనా పటాసులు మరింత బాగా వెలుగునిస్తాయి. చెవులు చిల్లులుపడేలా పేల్తాయి. హోలీకి వాడే చైనా గులాల్‌, వాటర్‌గన్స్... కారుచవకగా దొరుకుతాయి. ఈ సరుకులో నాణ్యత ఉందా? పర్యావరణానికి సురక్షితమేనా? ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయా? అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. తక్కువ ధరకు వస్తుందా లేదా అన్నదే ఇక్కడి ప్రాధాన్యత! ఒకప్పుడు పండుగ వస్తోందంటే సమాజంలోని అన్ని వర్గాల వారూ సంతోషంగా ఉండేవారు. అమ్మకం దారులకి కావల్సిన అవకాశం ఉండేది. కేవలం దీపావళి, హోలీ, వినాయకచవితి వంటి పండుగలను ఆసరాగా చేసుకుని నడిచే కుటీర పరిశ్రమలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ ఏడాది దేశీయంగా ఉత్పత్తి చేసిన హోలీ సరుకులో నాలుగో వంతు కూడా అమ్ముడుపోలేదనీ అసోచామ్‌ చెబుతోంది.   ఆరోగ్యం: పండుగలకి వాడుతున్న రసాయనాలు పర్యావరణాన్నే కాదు, ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తున్నయి. పరిస్థితి ఎంత చిత్రంగా ఉందంటే చైనా నుంచి దిగుమతి అయిన వాటర్‌గన్స్‌ని వాడినా కూడా చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బాణాసంచాకి వాడే పటాసుల వల్ల ఊపిరితిత్తులు (సల్ఫర్‌ డయాక్సైడ్‌) మొదల్కొని కిడ్నీల (కాడ్మియం) వరకూ దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక హోలీ రంగుల్లో వాడే కాపర్‌ సట్ఫేట్‌, అల్యూమినియం బ్రోమైడ్‌ వంటివి కంట్లో పడినప్పుడు కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. దిల్లీలోని ‘శ్రీగంగారామ్‌ ఆసుపత్రి’కి హోలీనాడు, వేయి మందికి పైగా రోగులు నేత్ర సమస్యలతో వస్తూ ఉంటారని చెబుతున్నారు. ఈ సంఖ్య ఒక్కటీ చాలు, మనం పండుగలను ఎంత జాగ్రత్తగా జరుపుకోవాలో హెచ్చరించడానికి!   తీరు మారుతున్న పండుగల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. సందిట్లో సడేమియాలా పండుగనాడు విధ్వంసం సృష్టించాలనుకునే ఉగ్రవాదులు, పండుగనాడు వినియోగదారులతో ఎలాగైనా కొనుగోలు చేయాలని చూస్తున్న ఆన్‌లైన్ అమ్మకందారులు, అప్పు చేసైనా పండుగ జరుపుకోవాలనుకుంటున్న మధ్య తరగతి మానవులు... ఇలా సామాజికంగా, సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగలను ఒక ప్రహసనంగా మార్చివేస్తున్నారు.   పండుగల మన భారతీయ సంప్రదాయంలో ఒక భాగమని గర్వంగా చెప్పుకునే మనకి, ఆ సంప్రదాయపు మూలాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. పర్యావరణానికి అనుకూలంగా, ఆడంబరాలకు పోకుండా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మన పెద్దలు ఆలోచనని మర్చిపోయి కేవలం ఆచరణ మీదే ధ్యాస ఉంచితే... మిగిలేది ఆర్భాటమే!  

ఒబామా క్యూబా పర్యటన విఫలం!

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుని క్యూబా పర్యటన ముగిసింది. కానీ ఈ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్యా సంబంధాలు మెరుగుపడ్డాయా అంటే మొహమొహాలు చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒబామా క్యూబాలో అడుగుపెట్టిన క్షణం నుంచీ ఈ పర్యటన ఏమంత అద్భుతాలు సాధించలేదని తేలిపోయింది... అమెరికా, క్యూబాల మధ్య వైరం ఈనాటిది కాదు. ఈ రెండు దేశాల మధ్యా నిండా 90 మైళ్ల దూరం కూడా లేకపోవచ్చు. కానీ ఒక అమెరికా అధ్యక్షుడు క్యూబాలో అడుగుపెట్టడానికి దాదాపు 90 ఏళ్లు పట్టింది. 1959లో ఫల్గెన్సియో బటిస్టా అనే నియంతని గద్దె దింపుతూ, క్యూబా నేతృత్వంలోని విప్లవకారులు ఆ దేశంలో తమ అధికారాన్ని నెలకొల్పారు. అప్పటి నుంచీ అమెరికా, క్యూబా దేశాల మధ్య సంబంధాలు నిదానంగా దెబ్బతింటూ వచ్చాయి. అమెరికన్లకి చెందిన వ్యాపారసంస్థలను క్యూబా జాతీయం చేయడం, క్యూబాకు రష్యా వంత పాడటం వంటి ఘట్టాలతో, ఇరుదేశాల మధ్య సంబంధాలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. అమెరికా అంటేనే మండిపడిపోయే ఫిడేల్‌ క్యాస్ట్రో అధికారం నుంచి తప్పుకోవడంతో, క్యూబాతో దౌత్యం నెరిపే అవకాశం ఉందని అమెరికా సంబరపడిపోయింది. పక్కలో బల్లెంలా ఉన్న క్యూబాను ఎప్పటికైనా మంచిచేసుకోవడం అవసరమని ఆ దేశానికి తెలుసు. దీనివల్ల సామరస్యమైన వాతావరణమే కాదు, వ్యాపార లావాదేవీలను కూడా నెలకొల్పవచ్చు. క్యూబాలో తాజాగా చమురు క్షేత్రాలు కూడా బయటపడటం కూడా అమెరికా ‘సదుద్దేశాలకు’ కారణం అయి ఉంటాయి. క్యూబాతో సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా, అమెరికా ఒకో చర్యా చేపట్టడం మొదలుపెట్టింది. సుదీర్ఘకాలంగా మూసుకున్న రాయబార కార్యాలయాలు తెరుచుకున్నాయి. క్యూబాను తీవ్రవాద దేశాల జాబితా నుంచి తొలగించింది. ఆఖరికి ఆ దేశ అధ్యక్షుడు క్యూబాలో పర్యటించేందుకు సిద్ధపడ్డారు. ‘నేను ఇప్పుడే ఈ నేల మీద అడుగుపెట్టాను, క్యూబా ప్రజలను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను’ అంటూ క్యూబా నేలను తాకిన ఒబామా ట్వీట్‌ చేశారు. కానీ ఆయనకు స్వాగతం చెప్పేందుకు అక్కడి అధ్యక్షులవారు సిద్ధంగా లేరు. తమ అధ్యక్షుడు ఒక దేశానికి వెళ్తే, అక్కడి దేశాధినేత ఆయనను స్వాగతించేందుకు లేకపోవడం, బహుశా అమెరికా చరిత్రలోనే చాలా అరుదుగా జరిగి ఉంటుంది. సాధారణంగా ఎవరన్నా అతిథులు తమ దేశానికి వస్తే, క్యూబా వాసులు వారికి ఘన స్వాగతం పలుకుతారు. కానీ క్యూబా వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఇక ఒబామా దురదృష్టమో ఏమీగానీ, ఆయన క్యూబాలో పాల్గొన్న బేస్‌బాల్‌ ఆట కూడా వివాదాస్పదం అయ్యింది. బెల్టియంలో ఉగ్రవాదుల దాడి జరుగుతున్న సమయంలో, ఒబామా ఓ బేస్‌బాల్‌ ఆటని ఆస్వాదిస్తూ గడపడంతో అమెరికన్‌ ప్రజలు విస్తుపోయారు. యూరప్‌ ఖండంలోనే అతి కీలకమైన బెల్జియం మీద ఉగ్రవాదులు దాడి చేయడం అంటే... ISIS మీద అమెరికా జరుపుతున్న పోరు విఫలం అయ్యిందని చెప్పడమే. ఇలాంటప్పుడు ఒబామా ఓ శత్రుదేశాన్ని మంచి చేసుకునేందుకు, బేస్‌బాల్ ఆటలో మునిగిపోవడం ఏంటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఇక ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్‌క్యాస్ట్రోలు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశం కూడా రసాభాసగా ముగిసింది. క్యూబాలో మానవహక్కులను మెరుగుపర్చాలంటూ ఒబామా సూచించగా, ప్రపంచంలో ఏ దేశమూ మానవహక్కులను అమలుచేయడం లేదంటూ రౌల్‌ ఘాటుగా స్పందించారు. క్యూబా ఆధీనంలో ఉన్న రాజకీయ ఖైదీల విషయంలో కూడా రౌల్‌ ఇంతే పదునుగా బదులిచ్చారు. రాజకీయ ఖైదీలు ఎవ్వరూ తమ ఆధీనంలో లేరని తేల్చిపారేశారు. ఇక ఒబామా వైపు నుంచి కూడా క్యూబాతో ఉన్న వివాదాల గురించి ఎలాంటి స్పష్టమైన సంకేతాలూ వెలువడలేదు. క్యూబాకి చెందిన గ్వాంటనామో ద్వీపాన్ని తిరిగి ఇచ్చే విషయమై ఆయన మాట దాటవేశారు. ఈ సమావేశం ఎంత నిస్సారంగా ముగిసిందంటే, రౌల్‌తో కలిసి విజయ సంకేతాన్ని చూపేందుకు కూడా ఒబామా సుముఖత వ్యక్తం చేయలేదు. ఇటు అమెరికా వాసులలో కూడా క్యూబా పట్ల అంత సదభిప్రాయం లేదు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను పాటిస్తూ, నియంతృత్వ వ్యవస్థలో ఉన్న క్యూబా నుంచి ఎప్పటికీ స్నేహాన్ని ఆశించలేమన్నది వారి భావన. క్యూబా మీద పై చేయి సాధించలేకపోయిన అమెరికా, చివరికి ఆ దేశ నియంతతో స్నేహానికి బయల్దేరడమేంటని వారు మండిపడుతున్నారు. అమెరికాకు కొరకరాని కొయ్యగా మిగిలిపోయిన ఫిడేల్‌ క్యాస్ట్రో వ్యక్తిత్వాన్నీ, ఆయన పాలననూ ఇప్పటికీ అమెరికన్ ప్రజలు మర్చిపోలేదు. మరి ఒబామా క్యూబా పర్యటన విజయవంతం అయ్యిందని భావించగలమా!

ఈ రంగుల పండుగ మన సొంతం!

  మార్చి 22, 23, 24.... వీటిలో హోళీ ఏ రోజు అన్న సందిగ్ధం తీరిపోయింది. దేశవ్యాప్తంగా నేడు హోళీని జరుపుకొనేందుకు సిద్ధపడిపోయారు. ఈపాటికే జనం పాత బట్టలు బయటకు తీసి, గులాల్ పాట్లాలతో రంగుల యుద్ధంలో మునిగిపోయి ఉంటారు. ఈ హడావుడిలో హోళీ భారతీయులకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ అన్న విషయం చాలామంది పట్టించుకోరు.   హోళీ అంటే ప్రపంచాన్ని రంగులకలగా మార్చివేసే ఓ పండుగ. కులాలుగా, మతాలుగా... ఆఖరికి వర్ణాలుగా చీలిపోయిన భారతీయ సమాజంలో, ఈ హోళీని మించిన సమైక్య గీతం మరేముంటుంది.  ఏ  బేధమూ లేకుండా... తమలోని ప్రాణం ఒక్కటే అనేంతగా సంబరాలు జరుపుకొనే ఉత్సవం మరేముంటుంది. హోళిక తగలబడిపోయిందనో, రాధాకృష్ణులు రంగులాడుకున్నారనో, కామదహనం జరిగిందనో... కారణాలు ఏవైనాగానీ... రంగుల ఉత్సవాన్ని చేసుకోవడానికి అవన్నీ ఓ ప్రేరణ కలిగించేవే! బహుశా అందుకే హోళీవంటి పండుగ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అందులోనూ ధార్మికమైన కారణం ఉన్న పండుగలు అసలు కనిపించవు! కావాలంటే మీరే చూడండి...   - స్పెయిన్‌లోని వలన్‌సియాన్ నగరంలో ఏటా టమోటాల పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం నాడు జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుని సంబరపడిపోతారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. - స్పెయిన్‌లోనే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’ పేరుతో, ఒకరి మీద ఒకరు, ద్రాక్షసారాయిని ఒంపుకునే ఉత్సవం జరుగుతుంది. ఏటా జూన్‌లో జరిగే ఈ పండుగ వెనుక 700 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. - ఇటలీలోని ఇవియా పట్టణంలో నారింజలను విసురుకునే పండుగ ఫిబ్రవరిలో జరుగుతుంది. 13వ శతాబ్దంలో జరిగిన ఓ ప్రజా విప్లవాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.   పైన పేర్కొన్నవన్నీ కూడా స్థానికంగా జరిగే ఉత్సవాలు. ఇలాంటి పండుగలు అక్కడక్కడా అడపాదడపా కనిపించేవే. కానీ ఇవన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో, సవాలక్ష నిబంధనలతో జరిగేవి. పర్యాటకులను ఆకర్షించడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ హోళీ పంథానే వేరు. అందుకే ఇప్పుడు హోళీని వేరే దేశాలవాళ్లు కూడా ఆచరించడం మొదలుపెట్టారు. ‘ఫెస్టివల్ ఆఫ్‌ కలర్స్‌’ పేరట ఒక బృందం దీన్ని ఖండాంతరాలుగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ బృందం ఆధ్వర్యంలో నాలుగు ఖండాల్లో హోళీని ఓ ఉత్సవంలా జరుపుకొంటున్నారు. అంటే హోళీలాంటి పండుగ ఏదుందా అని వెతకడం మానేసి, ప్రపంచమే ఇప్పడు హోళీని ఆచరిస్తోందన్నమాట. ఈ పండుగలో ఉన్న ఆకర్షణ గురించి ఇంతకంటే ఏం చెప్పగలం.   ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హోళీని అంత విస్తృతంగా జరుపుకొనేవారు కాదు. ఇదేదో ఉత్తరాది పండుగ అన్న భావం ఇక్కడి ప్రజలకు ఉండేది. అసలు హోళీని కాముడి పున్నమిగానే తెలుగునాట పిలుస్తారు. శివుడు, మన్మథుని భస్మం చేసిన రోజు ఇది అన్నది ప్రజల నమ్మకం. ఆ నమ్మకానికి అనుగుణంగానే భోగిమంటల్లాగా మంటల వేసే సంప్రదాయం ఒకటి ఉంది. కానీ ఇప్పుడు హోళీని తెలుగు పండుగలలో ముఖ్యమైన పండుగా భావించడం మొదలైపోయింది. బహుశా ఇదే మన దేశ విశిష్టత! ఒకే పండుగను దేశంలోని లక్షలాది కిలోమీటర్ల కొద్దీ ఎలాంటి అరమరికలూ లేకుండా చేసుకోగలం. ఈ సంప్రదాయం మనది అనుకున్నప్పుడు దాన్ని వేల సంవత్సరాలుగా ఆచరించగలం!

తప్పు విజయ్‌ మాల్యాదేనా?

విజయ్‌ మాల్యా పేరు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే వస్తోంది. ఆయన ఖరీదైన జీవితం, జల్సారాయుడి అలవాట్లు. ఆయన రూపొందించే కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్లు, ఆఖరికి విజయ్‌ మాల్యా జీవన శైలిని అనుసరించే ఆయన పుత్రరత్నం... ఇవన్నీ కూడా నిత్యం వార్తల్లోనే ఉండేవి. ఎప్పుడైతే విజయ్‌ మాల్యా అప్పులపాలవడం మొదలుపెట్టాడో, జనాల కడుపు రగిలిపోవడం మొదలైంది. తాము పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో విజయ్‌ మాల్యా జల్సా చేయడం ఏంటని మంది మండిపడ్డారు. ఇంతకీ ఈ కింగ్‌ఫిషర్‌ ఎపిసోడ్లో విలన్ విజయ్ మాల్యా ఒక్కడేనా!     వడ్డీలతో కలుపుకుని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల సొమ్ముని విజయ్‌ మాల్యా బ్యాంకులకు రుణపడ్డాడని మీడియాలో నెల రోజుల నుంచీ మారుమోగిపోతోంది. అతను ఏ నిమిషంలో అయినా దేశం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని అందరూ అనుమానిస్తున్నారు. విజయ్‌ మాల్యా తప్పించుకోలేకుండా అతని మీద ఒక లుక్‌ ఔట్‌ నోటీసు కూడా ఏడాది కాలంగా ఉంది. కానీ అతను విజయ్‌వంతంగా ఈ నెల రెండో తేదీన, ఎలాంటి అడ్డంకీ లేకుండా దేశం దాటి వెళ్లిపోయాడు. సాంకేతిక కారణాల వల్ల, తాము మాల్యాను అడ్డుకోలేకపోయామని సీబీఐ చెబుతున్న మాట హాస్యాస్పదంగా ఉంది. బ్యాంకులన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించనున్నాయన్న విషయం దేశం మొత్తానికీ తెలుసు. ఒక నిందితునిగా బోనులో నిలబడాల్సినవాడు చల్లగా జారుకునేందుకు సీబీఐ అలసత్వం ఉపయోగపడింది. ఫలితం! ఇప్పుడప్పుడే తాను ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం లేదని, లండన్‌లోని తన విలాసవంతమైన భవంతి నుంచి విజయ్‌ మాల్యా ట్వీట్‌ చేశాడు.     సీబీఐ పరిస్థితి ఇంకా నయం. న్యాయపరంగా విజయ్‌ మాల్యా మీద ఎలాంటి చర్యలూ తీసుకునే అవకాశం లేదని చెప్పి ఊరుకుంది. కానీ ఆ అవకాశం ఉన్న బ్యాంకుల ప్రవర్తన మరీ దారుణం. విజయ్ మాల్యా విషయంలో బ్యాంకులు ఉదారంగా ప్రవర్తించిన తీరు చూస్తే మధ్యతరగతి ప్రజల కడుపు రగలక మానదు. మాల్యా ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేశాడని తెలిసినప్పటికీ (wilfull defaulter), ఆయన మీద కేసుని నమోదు చేసేందుకు బ్యాంకులు మీనమేషలు లెక్కించాయి. సీబీఐ స్వయంగా పూనుకుని ఆయన రుణాలకు సంబంధించి కేసులు నమోదు చేయవలసి వచ్చింది. న్యాయస్థానం గడప తొక్కేందుకు కూడా ఇలాంటి అలసత్వాన్నే ప్రదర్శించాయి బ్యాంకులు. సీబీఐ డైరక్టరు తీవ్రంగా మందలించిన తరువాత కానీ విజయ్‌ మాల్యా దేశం దాటిపోకుండా చూడాలంటూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించాయి. అప్పుడు కూడా కోర్టు సెలవలు, ఉద్యోగుల సెలవలు, పని ఒత్తిడి... అంటూ బ్యాంకులు నిదానంగా బయల్దేరేనాటికి విజయ్ దేశం విడిచి ఎగిరిపోయాడు.     విజయ్‌ మాల్యా మీద చర్యలు తీసుకోవడం సంగతి అటుంచితే, అతనికి అంతంత రుణాలు ఎలా ఇచ్చారన్నది మొదటి ప్రశ్న. అదే ప్రశ్న న్యాయస్థానాలు అడిగినప్పుడు... కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ పేరు చూసి అప్పులిచ్చాం అని బిక్కమొగం వేశారు బ్యాంకు ప్రతినిధులు. కానీ మాల్యాకు రుణాలు అందించడం కేవలం మానవ తప్పిదం కాదనీ, ఇదో భారీ కుంభకోణం అనీ పరిశోధనా సంస్థల అంచనా. ఉదా॥ ఐడీబీఐ బ్యాంకు, మాల్యాకు అందించిన 900 కోట్ల రుణంలో బ్యాంకు అధికారుల పాత్ర అనుమానాస్పదంగా ఉందని సీబీఐ భావిస్తోంది. విజయ్‌ మాల్యా ఆస్తులు మన దేశంలో పెద్దగా లేవని బ్యాంకులకు తెలుసు. ఆయన కింగ్‌ఫిషర్‌ సంస్థ నష్టాలలో నడుస్తోందనీ తెలుసు... తెలిసి తెలిసీ ఆయనకు అప్పులిచ్చిన బ్యాంకులు, ఇప్పుడు తమకే పాపం తెలియదంటే నమ్మడం ఎలా! విజయ్‌ మాల్యా బ్యాంకులకు చెడ్డపేరు తీసుకువచ్చాడంటూ అరుణ్‌ జైట్లీ వాపోవచ్చుగాక. కానీ బ్యాంకుల తీరూ అందుకు తగినట్లుగానే ఉంది.     అసలు విషయం ఏమిటంటే విజయ్ మాల్యా ఆడిందే ఆట, పాడిందే పాటగా ఇన్నాళ్లూ సాగిపోయింది. కింగ్‌ఫిషర్‌ పేరుతో విమానాలని నడిపినప్పుడు టికెట్‌ రేట్లను అసాధారణంగా తగ్గిస్తే అడిగినవాడు లేడు. పదివేలు ఉండాల్సిన చోట వేయి రూపాయలకి టికెట్లని అందిస్తే... అది వ్యాపార నష్టాలకీ లేదా వ్యాపారంలో అవాంఛిత ధోరణులకీ దారితీస్తుందనీ ఎవరూ ఆయనను హెచ్చరించలేదు. విజయ్ మాల్యా దివాళీ తీసే స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా రాజకీయ పార్టీలన్నీ అతణ్ని వెనకేసుకునే వచ్చాయి. 2002లో కాంగ్రెస్, జనతాదళ్ మద్దతుతో రాజ్యసభ సభ్యునిగా, 2010లో బీజేపీ, జనతాదళ్‌ మద్దతుతో రెండో దఫా రాజ్యసభ సభ్యునిగా దర్జాగా పార్లమెంటులో కూర్చున్నాడు. ఇప్పటికీ జనతాదళ్ నేత దేవెగౌడ ఆయనను వెనకేసుకునే వస్తున్నారు. విజయ్‌మాల్యా కర్ణాటక ముద్దు బిడ్డ అనీ, ఆయన మీద తనకి నమ్మకముందని చెప్పుకొస్తున్నారు.    అయ్యిందేదో అయిపోయింది. తప్పెవరిదైనా, వేల కోట్ల ప్రజల సొమ్ము నేలపాలైపోయింది. అందులో సగం సొమ్మైనా తిరిగి వస్తే అది అదృష్టమేనని చెప్పుకోవాలి. విజయ్‌ మాల్యా మీద ఇప్పడు మీడియా హడావుడి వల్ల ఉపయోగం లేదనీ, ఆయనను కూర్చోపెట్టి వీలైనంత సొమ్ముని రాబట్టుకోవాలని పారిశ్రామికవేత్త కిరణ్‌మజుందార్ షా చెప్పిన మాటలలో విచక్షణ లేకపోలేదు. కిరణ్‌మజుందార్‌ షా మరోమాట కూడా అన్నారు. విజయ్ మాల్యా జీవనశైలిని వల్ల మీడియా దృష్టి అతని మీద ఉందనీ... నిజానికి అంతకంటే ఎక్కువ సొమ్ములను దిగమింగిన బడాబాబులు, ప్రభుత్వ సంస్థలు చాలానే ఉన్నాయని షా అభిప్రాయపడ్డారు. ఉదా॥ ఎయిర్‌ ఇండియా మీద 43 వేల కోట్ల రూపాయల రుణభారం ఉందని షా పేర్కొన్నారు. అదే నిజమైతే అంతకంటే దురదృష్టం మరోటి ఉండదు. మాల్యాకంటే ప్రబుద్ధులెందరో ప్రజల కంట పడకుండా జల్సా చేసుకుంటున్న విషయాన్ని ఇకనైనా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ పని ఎవరు చేస్తారు! ఎ) సీబీఐ బి) బ్యాంకులు సి) ప్రభుత్వం డి) ఎవ్వరూ కాదు! ఈ ప్రశ్నకు సమాధానం అంత కష్టం కాదేమో!

ఆ నది కోసం రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి!

హర్యానా మన దేశంలోనే అత్యంత ధనికమైన రాష్ట్రాల్లో ఒకటి. పారిశ్రామికపరంగానే కాదు, వ్యవసాయపరంగా కూడా మిగతా రాష్ట్రాలకు ఈర్ష్య పుట్టించగల ప్రగతి ఈ రాష్ట్రానికి సొంతం. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం చిక్కుల్లో ఉంది. ఒకవైపు జాట్‌ వర్గంవారు తమకు రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనకు ఉపక్రమిస్తుంటే, మరోవైపు పంజాబ్‌ తాను హర్యానాకు చుక్క నీరు కూడా వదిలేది లేదంటూ ఏకంగా ఒక తీర్మానాన్నే తన అసెంబ్లీలో ఆమోదించింది. హర్యానాకు నీరందించే సట్లెజ్‌-యమునా కాలువను నిర్మించేది లేదంటూ తేల్చిపారేసింది. ఎక్కడో హర్యానా, పంజాబ్‌ల మధ్య జరుగుతున్న గొడవకీ తెలుగు రాష్ట్రాలకీ సంబంధం ఏమిటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే నీటి తగాదాలు ఎక్కడైనా ఒకే తీరున నడుస్తాయి. ఒకప్పుడు కలిసి ఉన్న పంజాబ్‌, హర్యానాల మధ్య నడుస్తున్న నీటి పంచాయితీ.... రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కూడా మొదలవ్వచ్చు.   పంజాబ్‌ రాష్ట్రంలో అయిదు ముఖ్య నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఐదు నదులు ఉన్నాయి కాబట్టే, ఈ రాష్ట్రానికి పంజాబ్‌ అన్న పేరు వచ్చిందంటారు. ఈ నదులలో ఒకటి సట్లెజ్‌. పంజాబ్‌ రాష్ట్రం గుండా ప్రవహించే ఈ సట్లెజ్‌ నదిని, యమునా నదితో అనుసంధాంచాలని... తద్వారా పక్క రాష్ట్రాలకు కూడా సట్లెజ్‌ నీటిని అందించాలని పెద్దలు ఆశించారు. ఇందుకోసం 1981లో పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల మధ్య ఓ తీర్మానం జరిగింది. ఈ తీర్మానం ప్రకారం పంజాబ్‌ రాష్ట్రం సట్లెజ్‌- యమునా నదులను కలుపుతూ 214 కిలోమీటర్ల కాలువను నిర్మించాల్సి ఉంది. 1982లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి, ఈ కాలువకు శంకుస్థాపన కూడా చేశారు. దాదాపు 750 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలువలో చాలా భాగాన్ని పూర్తి చేశారు కూడా.   రోజులు మారుతున్న కొద్దీ, నిదానంగా రాజకీయ నాయకులు మాట మార్చడం మొదలుపెట్టారు. పంజాబ్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు చుక్కనీరు కూడా వదిలేది లేదని తేల్చి చెప్పేశారు! తాము కాలువను పూర్తిచేయబోమని పంజాబ్‌ రాష్ట్రం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది కూడా. కానీ ప్రాజెక్టుని పూర్తి చేయాలంటూ సుప్రీం, పంజాబు ప్రభుత్వానికి అక్షింతలు వేయడమే కాకుండా... నిర్మాణాన్ని పూర్తి చేయమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అదేశించింది. అందుకు తగిన భూమిని ఇవ్వమని 2004లో పంజాబు ప్రభుత్వానికి సూచనలందించింది. సుప్రీం తీర్పు వెలువడ్డాక పంజాబు ప్రభుత్వం ఓ అసాధారణ నిర్ణయాన్ని తీసుకుంది. ‘ఒప్పందాల రద్దు చట్టం’ (Punjab Termination of Agreements Act 2004) పేరిట ఒక అసాధారణ చట్టాన్ని అక్కడి అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, పంజాబ్‌ నీటి సంబంధించి ఇరుగుపొరుగు రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకుందన్నమాట. దాంతో విషయం మళ్లీ న్యాయస్థానాల చెంతకు చేరుకుంది.   ఒక పక్క ఈ వివాదం న్యాయస్థానాలలో ఉండగానే, పంజాబు అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడటం మొదలుపెట్టాయి. 2017లో జరగనున్న ఈ ఎన్నికలకి ముందు ఏదో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే, ప్రజలకు దగ్గర కాగలమని అటు ప్రభుత్వమూ, ఇటు ప్రతిపక్షాలూ ఆలోచిస్తుండగా వారికి మళ్లీ సట్లెజ్‌- యమునా నది కాలువ వివాదం గుర్తుకు వచ్చింది. వెంటనే, తాము ఒకప్పుడు సదరు కాలువ కోసం సేకరించిన వేలాది ఎకరాలను తిరిగి రైతులకు అందిస్తామంటూ ప్రకటించింది పంజాబు ప్రభుత్వం. అంటే సట్లెజ్‌-యమునా నది కాలువ ప్రతిపాదనను పంజాబ్‌ శాశ్వతంగా పక్కకి పెట్టేందుకు ప్రయత్నించిందన్నమాట. ఈ నిర్ణయంతో కంగారుపడిన హర్యానా, ఆదరాబాదరాగా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. హర్యానా పడుతున్న ఆందోళనను గమనించిన సుప్రీం కోర్టు, యథాతథ (స్టేటస్‌ కో) స్థితిని ఆదేశించింది.   ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. గురువారం నాడు సుప్రీంకోర్టు స్టేటస్‌కోను విధిస్తూ ఆజ్ఞలు జారీ చేస్తే, శుక్రవారం నాడు తాము సట్లెజ్-యమునా కాలువకు వ్యతిరేకమంటూ పంజాబు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ కాలువకు ప్రతిపాదన ఎప్పుడో దశాబ్దాలకు పూర్వం వచ్చిందనీ, ప్రస్తుతం సట్లెజ్‌ నదిలో ఉన్న నీరు తమ అవసరాలకే సరిపోవనీ పంజాబు వాదిస్తోంది. నీరు తమకే చాలనప్పుడు, పక్క రాష్ట్రాలకు ఎలా అందించగలమన్నది పంజాబు వాదన. మరోవైపు హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాలేమో... తమకి కనుక సట్లెజ్‌ నీరు అందకపోతే లక్షలాది ఎకరాలు బీడు పోతాయని వాపోతున్నాయి.   కేవలం హర్యానా, పంజాబ్‌ల మధ్యే కాదు... మన దేశంలోని ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఇలాంటి వివాదాలే కనిపిస్తున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్‌, న్యాయస్థానాలు ఎన్ని తీర్పులు ఇచ్చినా తగాదాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. నీటి వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో తాగు కోసం సాగు కోసం ప్రతి చుక్కా బంగారంకన్నా విలువైనదిగా మారిపోతోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలను ఎప్పటికప్పుడు కూర్చుని పరిష్కరించుకుంటే కానీ సమస్యలు తీరేవి కావు. ఇందుకోసం భవిష్యత్తు అవసరాలనీ, కరువు వంటి విపత్తులనీ, ప్రజల భావోద్వేగాలనీ కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే సట్లెజ్ కోసం పంజాబు, హర్యానాలు కొట్టుకుంటున్నట్లే గోదావరి కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు గొడవపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆ సూచనలు కనిపిస్తున్నాయి కూడా!

భారత్‌ మాతాకీ జై... ఈ నినాదం ఇప్పుడిక వివాదం!

  మార్చి 3: ఆరెస్సెస్‌ నేత మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ, ఇప్పటితరానికి ‘భారత్‌ మాతాకీ జై’ అనే నినాదాన్ని నేర్పాలని సూచించారు. జేఎన్‌యూలో తీవ్రవాది అఫ్జల్‌గురుకి అనుకూలంగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయన్న నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ ఈ మాటని అన్నారు. మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలకు మజ్లిస్ నేత అసదుద్దీన్‌ స్పందించారు! తన పీక మీద కత్తి పెట్టినా సరే, తాను మోహన్ భగవత్‌ సూచించిన నినాదాన్ని చేయననీ, అలా చేయమని రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదని పేర్కొన్నారు. ‘నేను నినాదాన్ని చేయకపోతే నన్నేం చేస్తారు’ అంటూ నేరుగా మోహన్‌ భగవత్‌కు సవాలు విసిరారు. దీంతో దేశం మరో వివాదంలోకి జారుకుంది.   ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వాటికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇతరులకు ఉంటుంది. కానీ కొన్ని వివాదాలని చూసీ చూడనట్ల ఊరుకునే అవకాశం దక్కకపోవచ్చు. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అని గట్టిగా అడిగితే ‘అవును’ లేదా ‘కాదు’ అని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. మంచో చెడో, ఇప్పడు దేశంలో తరచూ ఇలాంటి వివాదాలే తలెత్తుతున్నాయి. మొదట అసహనానికి సంబంధించిన చర్చ, ఆ తరువాత జేఎన్‌యూ ఘటన... ఈ రెండూ చల్లారేసరికి ఇదిగో ఇప్పుడు భారత్‌ మాతకి సంబంధించిన వివాదం!   అసదుద్దీన్‌ మాటలను ఖండిస్తూ కొన్ని బలమైన నిరసనలు వినిపించాయి. పార్లమెంటు సాక్షిగా సాహిత్యకారుడు జావేద్‌ అక్తర్‌, అసదుద్దీన్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన ఏకంగా అసదుద్దీన్‌ను, హైదరాబాదుకి చెందిన వీధి నాయకునిగా అభివర్ణించారు. ఇటు అసదుద్దీన్‌ అనుచరులేమో ఆయన వ్యాఖ్యలకు తాము కూడా కట్టుబడి ఉన్నామంటూ ముందుకు వస్తున్నారు. నిన్నటికి నిన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ‘వారిస్‌ పఠాన్‌’ అనే శాసనసభ్యుడు ఇలాంటి ప్రయత్నమే చేసి, సభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. రోజులు గడిచే కొద్దీ, ఇలాంటి వార్తలు ఇకమీదట వినిపిస్తూనే ఉండవచ్చు.   ఇంతకీ అసదుద్దీన్‌ ఆ నినాదం గురించి ఎందుకంతగా విరుచుకుపడినట్లు! ఒక దేశాన్ని దేవతగా భావించడం తన ధర్మం ప్రకారం సబబు కాదనో, ఒక నినాదం చేయనంత మాత్రాన ఎవరూ దేశద్రోహులు కారనో... తన మనసులో ఉన్న కారణాన్ని చెబితే సరిపోయేదేమో. కానీ ‘నేను నినదించను, ఏం చేస్తారో చేసుకోండి’ అనడంతో ఒక సవరణగా ఉండాల్సిన మాట కాస్తా సవాలుగా మారిపోయింది. హిందుత్వానికి ప్రతీక ఆరెస్సెస్‌ అయితే, ముస్లింల తరఫున ఆరెస్సెస్‌కు ప్రత్యామ్నాయం మజ్లిస్ అని అసదుద్దీన్ చెప్పినట్లైంది. అసదుద్దీన్‌గారు కోరుకున్నది ఇదేనా! దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న మజ్లిస్ పార్టీకి ఇలాంటి వివాదాలు లాభించబోతున్నాయా!   ఒకే నినాదాన్ని అటు దేశభక్తితోనూ, ఇటు మతంతోనూ ముడిపెట్టడం వల్ల... భావోద్వేగాలు తీవ్రస్థాయికి చేరుకునే ప్రమాదం లేకపోలేదు. కొందరు బహుశా ఇదే కోరుకుంటున్నారేమో! ఆ కొందరిని పట్టించుకోకుండా, వారు చేసే ఉద్రేకపూరిత వ్యాఖ్యలకు స్పందించకుండా ఉండటమే మేలు. ఒక నినాదాన్ని చేయాలా వద్దా అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు వదిలివేయడమే మంచిది. లేకపోతే దేశాన్ని కలిపి ఉంచేందుకు నినదించి ‘భారత్‌ మాతాకీ జై’.... ఇప్పడు వైషమ్యాలను పెంచే ఆయుధంగా కొందరికి ఉపయోగపడుతుంది.

ఆ మందులని ఎందుకు నిషేధించారు

  ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అన్నా అనకపోయినా, నిత్యం నిండు ఆరోగ్యంతో ఉండాలన్న కోరిక ఎవరికైనా ఉండేదే! అందుకే శరీరానికి ఏ చిన్నపాటి తేడా వచ్చినా కంగారుపడిపోతాం. కొన్ని దశాబ్దాల క్రితమైతే, రోజువారీ వచ్చే ఆరోగ్య సమస్యలకి మన వంటింట్లోనే కావల్సినన్ని మందులు దొరికేవి. కానీ ఇప్పుడు దగ్గు వస్తే కరక్కాయ చప్పరించమని, కడుపునొప్పికి వాము నమలమనీ... ఒకో రోగానికి, ఒకో చిట్కా చెప్పేవారు లేరు. చెప్పినా పట్టించుకునేవారూ లేరు! అంత సమయమూ, సహనమూ ఇప్పుడు ఎవరికీ లేవు. అందుకే ఒంట్లో ఏమాత్రం తేడా వచ్చినా సెంటర్లో ఉన్న పదీపదిహేను మందుల షాపులలో ఏదో ఒక షాపులోకి దర్జాగా వెళ్లిపోయి, ఫలానా మందు కావాలని అడిగి తీసుకుంటాం. ఈ విషయంలో మన వైద్య పరిజ్ఞానం చాలా అసాధారణం. ఏ రోగానికి ఏ మందు వేసుకుంటే సరిపోతుందా ఖచ్చితంగా చెప్పేయగలం! కానీ గతవారం ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఒకటీరెండూ కాదు.... ఏకంగా 344 మందులు నిషేధించేసరికి మన్ముందు మన మహత్తరమైన వైద్యపరిజ్ఞానాన్ని మరింత విస్తరించక తప్పని పరిస్థితి వచ్చింది.   ప్రభుత్వం విధించిన ఈ నిషేధం గురించి చదువుతున్నప్పుడు తరచూ కనిపిస్తున్న మాట... ‘fixed dose combination’ (FDC). అంటే ఓ రెండు మూడు రకాల ఔషధాలని ఎడాపెడా కలిపేసి, వాటికి ఓ కొత్త పేరుని తగిలించి మార్కెట్‌లోకి విడుదల చేయడమన్నమాట! ఇలా జ్వరం, దగ్గు, నొప్పి... లాంటి సమస్యలకే కాదు, మానసిక క్రుంగుబాటు వంటి తీవ్రమైన సమస్యలకి కూడా మన దేశంలో FDC మందులు విస్తృతంగా లభిస్తున్నాయి. వీటిలో చాలామందులకు Central Drugs Standard Control Organisation (CDSCO) అనుమతి లేనేలేదు. ఒక్క నొప్పిని నివారించే మాత్రలలోనే 73 శాతం మందులకు మన దేశంలో అనుమతి లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించవచ్చు. వీటిలో చాలా రకాల FDCలకు విదేశాలలో అనుమతే లేదు.   FDCలను నిషేధించేందుకు ఆరోగ్య శాఖ చూపిస్తున్న కారణాలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. రకరకాల మందులను రకరకాల మోతాదులలో ఎడాపెడా తీసుకోవడం వల్ల, అవి శరీరాన్ని విషమయం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. మున్ముందు రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, యాంటీబయాటిక్‌ మందులకు శరీరం స్పందించకపోవడం మొదల్కొని శరీర భాగాలు పనిచేయకపోవడం వరకూ నానా రకాల ప్రమాదాలూ పొంచి ఉన్నాయంటున్నారు. దురదృష్టం ఏమిటంటే... సదరు దుష్ప్రభావాలు ఏర్పడినప్పుడు కూడా అవి తాను తరచూ వాడే మందుల వల్లే అని రోగులు తెలుసుకోలేకపోవడం! రోగి తరచూ వాడుతున్న మందుల వల్లే ఈ దుస్థితి అని గ్రహించే స్థితిలో వైద్యులు కూడా లేకపోవడం. అందుకనే ఔషధి కంపెనీల ఆటలు నిరాటంకంగా చెల్లిపోతూ వచ్చాయి. తాము ఉత్పత్తి చేస్తున్న మందుని ఇన్నాళ్లూ ఎవరూ వేలెత్తి చూపలేకపోయారు కదా! అంటూ సదరు ఔషధి కంపెనీలు ఇప్పుడు కూడా వితండవాదం చేస్తున్నాయి.   నిజానికి FDCలకు ‘కేంద్ర ఔషధి నియంత్రణ సంస్థ’ (CDSCO) అనుమతి తప్పనిసరిగా ఉండాలన్న నియమం 1961 నుంచే ఉంది. కానీ ఈ నియమాన్ని తుంగలో తొక్కిన వందలాది మందులు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అసలు CDSCO అనుమతించిన మందులు కూడా కొన్ని పనికిరానివన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయినా ఇన్నాళ్లూ ఆరోగ్య శాఖ పట్టిపట్టనట్లు ఊరుకుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం నిద్రాణస్థితిలో ఉండటంతో మన దేశంలోని ఔషధివ్యాపారం లక్షకోట్లను దాటిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా జూలు విదిల్చాలనుకునే సమయానికి, ఔషధిరంగం అదుపుచేయజాలనంత బలాన్ని పుంజుకుంది. ఈ మందులను ఉత్పత్తి చేసే కంపెనీలు భారతీయులు సొమ్ముని దండుకుంటూనే, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఉదాహరణకు అమెరికాకు చెందిన అబాట్‌ అనే కంపెనీ Phensedyl, ఫైజర్ అనే కంపెనీ Corex అనే దగ్గుమందులను తయారుచేస్తున్నాయి. భారతదేశంలోని దగ్గుమందులలో మూడో వంతుకి పైగా ఆధిపత్యం ఈ రెండు మందులనే అంటే నమ్మశక్యం కాదు. Codeine అనే మత్తుమందు కలిపిన ఈ దగ్గుమందు వల్ల, దీన్ని తాగిన మనిషిలో ఉత్తేజం పెరుగుతుంది. కానీ నిజానికి దీని వల్ల దగ్గు తగ్గదనీ... కొన్నాళ్లకు దగ్గు సహజంగా తగ్గిపోవడంతో వీటి వల్లే గుణం కనిపించిందని రోగి అనుకుంటాడని కొందరి విమర్శ. కేవలం ఈ దగ్గుమందులో ఉన్న మత్తుమందు కోసం, దాన్ని సేవించే వ్యసనపరుల సంఖ్య కూడా అసాధారణంగానే ఉంది.   జరిగిందేదో జరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవడం ఒక శుభసూచకమే! కానీ తాము అమలు చేయాలనుకున్న నిషేధం విషయంలో ప్రభుత్వం ఎంతమేరకు విజయం సాధిస్తుందో చూడాలి. కోట్లాదిగా మూలుగుతున్న డబ్బు, న్యాయాన్ని ఏమార్చగల పలుకుబడి ఉన్న సదరు ఔషధి సంస్థలతో ఢీకొని, ప్రభుత్వం తన పంతాన్ని ఎంతవరకు నెగ్గించుకోగలదో చూడాలి. వైద్య వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న అపనమ్మకం కూడా ఈ స్థితికి ఓ కారణమే. చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కూడా దగ్గర్లో ఉన్న వైద్యుని సలహా తీసుకునేందుకు రోగులు భయపడుతున్నారు. ఎంత డబ్బు గుంజుకుంటారో, ఎలాంటి రోగనిర్ధరణ పరీక్షలు రాస్తారో అని వణికిపోతున్నారు. ఆర్‌.ఎం.పీ వైద్యులు, ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ నశించి... ఖరీదైన స్పెషాలటీ డాక్టర్లే ఇప్పడు మనకి దిక్కయ్యారు. వాళ్లు చెప్పిందే రోగం, వాళ్లు చేయించుకోవాలన్నదే పరీక్ష, వాళ్లు ఇచ్చిందే మందుగా ఆట సాగుతోంది. ఈ ఆటలను కట్టేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. అప్పటివరకూ సగటు భారతీయుడు, ఏదో ఒక అనారోగ్యం ఏర్పడితే... ఏదో ఓ మందుని తీసుకోక మానడు!

తృణమూల్‌ విజయాలను దెబ్బతీసే ఆయుధం

  మమతా బెనర్జీ.... అన్యాయం జరిగినచోట ఆవేశంగా ప్రసంగిస్తారు. అవినీతి గురించి నిప్పులు చెరుగుతారు. అందుకే ఆమె వ్యక్తిత్వం అంటే బెంగాలీయులకు మహా అభిమానం. మమతా దీదీ వేసుకునే చవకబారు చెప్పుల గురించీ, ఆమె ధరించే సాదా చీర గురించీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ అభిమానంతోనే దశాబ్దాల తరబడి తిరుగులేకుండా పోయిన సీపీఐ(ఎం)ని సైతం తోసిరాజని, మమతాను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. అవినీతి మీద మమత సాటిలేని పోరు సలుపుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, అవినీతికి కొమ్ముకాయడంలో తమ పార్టీ ఇతరులకంటే భిన్నమేమీ కాదని మమత నిరూపిస్తూనే ఉన్నారు.   పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే శారదాస్కాం అనే ఆర్థిక కుంభకోణం బయటపడింది. మమత మంత్రివర్గంలో క్రీడా, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న ‘మదన్‌మిత్రా’ అనే మంత్రికి ఈ కుంభకోణంలో ముఖ్యపాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అయినా మమతాదీదీ, మదన్‌మిత్రాను వెనుకేసుకుంటూనే వచ్చారు. మదన్‌మిత్రా అరెస్టైన తరువాత కూడా ఏడాదిపాటు మంత్రిగా కొనసాగారంటే, ఈ విషయంలో మమత ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో తెలుస్తూనే ఉంది. పైగా మదన్‌మిత్రా ఇంకా జైళ్లో ఉండగానే, ఈసారి ఎన్నికలలో ఆయన పోటీ చేయనున్నట్లు మమత ప్రకటించారు! ఏదో ఒకరిద్దరి విషయంలో మమతాదీదీ తన మమతానురాగాలను ప్రకటించారులే అని జనం ఊరుకున్నారు. కానీ ఇంతలో నారద అనే ఒక న్యూస్‌ వెబ్‌సైట్‌ మరో బాంబు పేల్చడంతో మమత తన నిష్కళంకతని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మమత ప్రతిస్పందన వేరేలా ఉంది!      మాథ్యూ శామ్యూల్‌, తెహల్కా అనే పరిశోధనాత్మక పత్రిక నుంచి విడివడి, నారద అనే వేరుకుంపటి పెట్టుకున్న పాత్రికేయుడు. ఆయన రెండేళ్లపాటు ఓపికగా తృణమూల్‌ ముఖ్య నేతలందరినీ తన స్టింగ్‌ ఆపరేషన్‌ ఉచ్చులోకి లాగాడు. చెన్నైలో తమకు ‘ఇంపెక్స్‌ కన్సల్టెన్సీ’ అనే సంస్థ ఉందనీ, ఆ సంస్థ పశ్చిమబెంగాల్లో అవకాశాలు చక్కించుకునేందుకు కాస్త ‘సాయం’ చేయాలంటూ ఒక్కో ప్రభుత్వ నేతనీ కదిపాడు. శామ్యూల్ ప్రయత్నం వృథా పోలేదు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు తృణమూల్‌ నేతలు ఏకంగా 11 మంది ఈ స్టింగ్‌ ఆపరేషన్లో చిక్కారు. లక్షలకు లక్షల సొమ్ము ఉచితంగా వస్తుంటే ఒక్క నేతాజీ కూడా వద్దనలేదు. అసలా సంస్థ ఉందా లేదా, ఉంటే దాని పనితీరు ఏంటి అని ఆలోచించేంత సమయాన్ని కూడా తమ మెదళ్లకు ఇవ్వలేదు.   ఈ స్టింగ్‌ ఆపరేషన్లో చిక్కినవారు సామాన్యలు కారు. కోల్‌కతా మేయర్ (సోవన్‌ ఛటర్జీ), ఎంపీ ప్రసూన్‌ బెనర్జీ సహా పలువులు ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు కట్టల కట్టలుగా నోట్ల కట్టలను తీసుకుంటూ కెమెరాల ముందు దొరికిపోయారు. ఇలా తన స్టింగ్‌ ఆపరేషన్‌ను ముందుకు సాగించేందుకు, నారద వార్తా సంస్థ కనీసం 65 లక్షలు ఖర్చుచేసినట్లు సమాచారం. ఈ సంస్థ ఇంత ఖర్చు చేసి తృణమూల్ నేతలనే లక్ష్యంగా పెట్టుకుని ఎందుకు పనిచేసిందన్నది ఓ సహేతుకమైన ప్రశ్నే! అందులోనూ తన స్టింగ్ ఆపరేషన్‌ వివరాలను సరిగ్గా ఎన్నికల సమయంలో విడుదల చేయడం కూడా సందేహాలకు తావిస్తోంది. మరో నెల రోజులు కూడా లేని పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలలో ఈ వీడియో ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలేజీ కుర్రవాడు కూడా ఊహించగలడు. కానీ వీడియో బయటకు రాగానే తృణమూల్ స్పందించిన తీరు అంతే అనుమానాస్పదంగా ఉంది.   స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడిన నేతల మీద తాము ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ఆ పార్టీ అధినేతలు తేల్చిపారేశారు. కనీసం వారి నుంచి వివరణను కూడా తాము ఆశించడం లేదని సెలవిచ్చారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. ‘లంచం తీసుకుంటూ పట్టుబడిన వారి మీద విచారణ జరుపుతామని’ ఒక్క మాట అన్నా మమతాదీదీ మీద ప్రజలకు ఉన్న ఆశలు సజీవంగా ఉండేవేమో! కానీ వరుస విజయాలతో పాటు ఒంటెద్దుపోకడను కూడా అలవాటు చేసుకున్న దీదీ అందుకు సిద్ధంగా లేరు. ఫలితం! తృణమూల్‌ విషయంలో చూసీ చూడనట్లు ఉండే బీజేపీ వంటి పార్టీలు కూడా ఇప్పడు ఆ పార్టీ వ్యక్తిత్వం గురించి విరుచుకుపడుతున్నాయి. తృణమూల్‌కు బద్ధ శత్రువు అయిన వామపక్షాలకు, ఈ అంశం ఒక పాశుపతాస్త్రంగా పరిణమించింది. ఇక అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా అవినీతిలో మార్పు ఉండదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి.   తృణమూల్ అర్భాటంగా పోటీ చేస్తున్న కేరళ మీద ఈ ఫలితం ఎలాగూ ఉంటుంది. కానీ ఆ పార్టీకి పెట్టని కోటగా మారిన పశ్చిమబెంగాల్లో ఈ మచ్చ పెనుమార్పునే తీసుకురావచ్చు. ఇప్పటికే పలు ప్రజాభిప్రాయ సేకరణలో ఈసారి ఎన్నికలలో ఇటు తృణమూల్‌, అటు వామపక్షాలకి సరిసమానమైన అవకాశాలు ఉన్నాయని తేల్చాయి. మరి ఆఖరి నిమిషంలోనైనా మమత మేల్కొని నష్టనివారణ చర్యలు చేపడతారా. లేకపోతే అవినీతి నేతలను వెనుకేసుకుని వారితో పాటు పరాజయాన్ని కూడా మూటగట్టుకుంటారా... అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.

బడ్జెట్‌తో నవ తెలంగాణ

నీరు, నిధులు, నియామకాలు అంటూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తెలంగాణ, ఇప్పుడు తనకంటూ ఓ ప్రభుత్వాన్ని సాధించగలిగింది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెరాస, ఇప్పటికీ తిరుగులేకుండా రాష్ట్రాన్ని ఏలుతోంది. ఆ ఏలికల మీద ప్రజలకు ఉండే నమ్మకాన్ని చూరగొనేలా మరోసారి మిగులు బడ్జెట్‌ను రూపొందించింది తెరాస సర్కారు. ఇది పురోగామి బడ్జెట్‌ అంటూ మిత్రపక్షాలు అభినందించినా, ఉత్త అంకెలగారడీ అంటూ ప్రతిపక్షాలు విమర్శించినా... సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, కేసీఆర్‌ ముద్రను జోడిస్తూ ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌ను చూసిన వారికి ఎవరికైనా ఇందులో సాగునీటి ప్రాజెక్టులకి వేలకి వేల కోట్లు కేటాయించిన అంకెలు కనిపించక మానవు. సాగు కోసం ఏకంగా 26 వేల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. గత ఏడాదితో (8,500 కోట్లు) పోలిస్తే ఇది అసాధారణం. ఈ కేటాయింపులలో ఎలాంటి అవకతవకలూ కనుక జరగకపోతే, ప్రభుత్వం ఆశించినట్లుగా లక్షల ఎకరాలు బీడు పోయే దుస్థితి నుంచి తప్పించుకుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలకు వందల కోట్ల రూపాయలను కేటాయించారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఇప్పటికే టెండర్ల దశకు చేరుకున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కనుక పూర్తయితే ఈ రెండు జిల్లాలోనే దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు అంచనా! వర్గాలవారీగా నిధులను కేటాయించడంలో తెలంగాణ బడ్జెట్, ఆంధ్రాను అనుసరించినట్లే కనిపిస్తోంది. మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ... ఇలా ఒకో వర్గానికీ వేల కోట్లను కేటాయించారు. అదనంగా ఈసారి బ్రాహ్మణులకు 100 కోట్లు కేటాయించడంతో వారి అభిమానాన్ని చూరగొన్నట్లు అయింది. దీంతో బ్రాహ్మణులను, వారిలోని సెటిటర్లను కూడా కేసీఆర్‌ తృప్తిపరిచారు. వెనుకబడిన తరగతులలోని ఆడపిల్లల వివాహాలు గుదిబండలు కాకుండా ఉండేందుకు రూపొందించిన ‘కల్యాణ లక్ష్మి’ పథకం కూడా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేట్లే కనిపిస్తోంది. సాగునీటికే కాదు సాగునీటి విద్యుత్తుకి, రుణమాఫీకి కూడా బడ్జెట్‌లోకావల్సిన ప్రాధాన్యత లభించింది. వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతులకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్తుని అందచేస్తామనీ, విద్యుత్తు రాయితీలకు 4,470 కోట్లు కేటాయిస్తామనీ చెబుతున్న మాటలు నిజమైతే కాలిన మోటర్ల సాక్షిగా, బతుకు బుగ్గవుతున్న రైతుల నెత్తిన పాలు పోసినట్లే! అటు వ్యవసాయానికే కాదు, ఇటు వైద్యానికి కూడా ఈసారి భారీ కేటాయింపులే లభించాయి. ఎన్నడూ లేని విధంగా ఒక్క వైద్య రంగానికే దాదాపు 6 వేల కోట్ల రూపాయలు దక్కాయి. డయాలసిస్‌ కేంద్రాల కోసం, వైద్య పరికరాల కొనుగోలు కోసం, రోగ నిర్ధరణ యంత్రాల కోసం... ఇలా వైద్యానికి సంబంధించి ప్రతి అంశానికీ వందల కోట్లు లభించాయి. ‘సర్కారు దవాఖానకు నేను రాను’ అన్న మాటని మారుస్తాం అని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇలా నిలబెట్టుకుంది. మహిళలకు, శిశుసంక్షేమానికీ, రహదార్ల అభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ.... ఇలా బడ్జెట్‌లో ప్రతి అంశానికీ తగిన కేటాయింపులు కనిపించాయి. కానీ ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన డబుల్‌బెడ్‌రూం పథకానికి మాత్రం ప్రత్యేకించిన కేటాయింపులు లేకపోవడం గమనార్హం. వీటి కోసం ఇతర నిధుల నుంచి కానీ, రుణాల ద్వారా కానీ సొమ్ములను ఖర్చుచేయాల్సిందే! ఇక ప్రభుత్వం దర్పంగా ఇది మిగులు బడ్జెట్‌ అని చెప్పుకోవడం మాత్రం ఉత్తమాటే అనిపిస్తోంది. రెవెన్యూ అంకెలను, రుణాలను ఎడాపెడా పెంచేసి అదే మిగులు అని చెప్పుకోవడం చూస్తే... అప్పు చేసి పప్పు కూడు అన్న సామెత గుర్తుకురాక మానదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నామన్న పేరు కోసం ఈ కాస్త గారడీని చేయకుండా ఉంటే బాగుండేది. మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవడంలో భేషజాలు ఎందుకు!

భారత్‌ మీదకి అమెరికా విమానాలు... పాకిస్తాన్‌ సాయంతో!

అమెరికా, పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందించడం గురించి భారత ప్రభుత్వం ఆగ్రహంతో ఉంటే ఉండవచ్చుగాక. కానీ అమెరికా మాత్రం ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే సిద్ధంగా ఉంది. గత వారం ఈ ఒప్పందానికి విరుద్ధంగా, అమెరికన్‌ సెనేట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానం దారుణంగా ఓడిపోయింది. సాక్షాత్తూ ఆ దేశ కార్యదర్శి జాన్‌ కెర్రీ ఈ తీర్మానాన్ని ముందుండి గెలిపించారు. ‘తీవ్రవాదం మీద జరుగుతున్న పోరులో పాకిస్తాన్‌ అంకితభావంతో పనిచేస్తోందంటూ’ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తన చేతికి దొరికే ప్రతి ఆయుధాన్నీ భారత్‌ వైపుకి ఎక్కుపెట్టేందుకే సిద్ధపడే పాకిస్తాన్‌కు, అమెరికా ఎందుకు సాయం చేస్తున్నట్లు! 20వ శతాబ్దం తనది అని చెప్పుకునే అమెరికాని, ఆ శతాబ్ది ఆరంభంలోనే గడగడ వణికించిన చరిత్ర తాలిబాన్‌ది. ఒకప్పుడు అమెరికా స్వయంగా పాలుపోసి పెంచిన తాలిబాన్‌, చివరికి అదే దేశం మీద కాటువేయడం ఒక చారిత్రక సత్యం. ప్రస్తుతం తాలిబాన్‌ నిస్తేజంగా ఉండి ఉండవచ్చు. కానీ నిర్వీర్యం మాత్రం కాలేదు! తాలిబాన్‌ ప్రముఖులంతా తమ దేశంలో హాయిగా ఉన్నారని, పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ నిస్సిగ్గుగా పేర్కొన్నారు. అంతేకాదు! వారు తలదాచుకునేందుకు సాయం చేయడం వల్ల, వారి మీద కావల్సిన ఒత్తిడిని తీసుకురాగలుగుతున్నామనీ, శాంతి ఒప్పందాలలో వారిని భాగస్వామ్యులను చేయగలుగుతున్నామనీ సర్తాజ్‌ ఉవాచ! తాలిబాన్‌ ఇప్పుడు పాకిస్తాన్‌ ఆధీనంలో ఉండటం వల్లే, అమెరికా ఆ దేశానికి లొంగుతోందన్నది ఓ విశ్లేషణ. తాలిబాన్‌ మళ్లీ బుసకొట్టకుండా ఉండేందుకు, మరీ ఎదురుతిరిగితే వారిని అణిచివేసేందుకు... అమెరికా, పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నది ప్రస్తుత విమర్శ. అంటే విషనాగులను చూపించి, వాటిని వదులుతామని బెదిరించి... పాకిస్తాన్‌ పనిజరుపుకుంటోందన్నమాట! అమెరికాలాంటి దేశానికి పాకిస్తాన్‌తో వ్యవహరించేటప్పుడు ఉండే ప్రమాదాలు తెలియకుండా ఉండవు. కేవలం తాలిబాన్ బూచిని చూసి అమెరికా, పాకిస్తాన్ సాయం చేస్తోందని స్పష్టంగా భావించలేం. ప్రపంచంలోని ఏ ప్రాంతాంలోలైనా ఒక దేశం నిదానంగా బలపడుతుంటే... ఆ దేశంతో అకారణంగా తలపడటమో లేక సదరు ప్రాంతంలో తన ప్రాభవాన్ని పెంచుకోవడమో అమెరికా చేస్తున్న పనే! తన ఆధిపత్యానికి భంగం కలిగించే ఏ దేశాన్నీ అమెరికా ఉపేక్షించదన్నది చరిత్రకారుల అభిప్రాయం. అందుకే చైనా ప్రాభవాన్ని తగ్గించేందుకు భారతదేశాన్నీ, భారతదేశం ప్రాభవం తగ్గించేందుకు పాకిస్తాన్నీ బలపరుస్తూ ఉంటుందని ఓ ఆరోపణ. భారతదేశం, ఫ్రాన్స్‌తో రాఫెల్‌ యుద్ధవిమానాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేసుకోగానే, అమెరికా తన ఎఫ్‌-16 ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడం గమనించాల్సిన అంశం. ఆర్థికంగానూ, ఆయుధపరంగానూ దూసుకుపోతున్న ఇండియాకు చెక్‌ పెట్టేందుకే అమెరికా ఈ పని చేస్తోందన్నది ఓ అభియోగం. తీవ్రవాదం మీద పోరు పేరుతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలను పాకిస్తాన్‌కు సాయంగా అందించిన అమెరికా, ఇప్పుడు యుద్ధవిమానాలను అందించడం ఓ పరాకాష్ట. ఈ విమానాలను ఊరికనే అందిస్తున్నారా, ఉచితంగా ఇస్తున్నారా అన్ని విషయం మీద స్పష్టత లేనప్పటికీ.... విమానాలు పాకిస్తాన్‌ అమ్ములపొదిలో చేరడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 40 సంవత్సరాలుగా అమెరికా సైన్యంలో ముఖ్య భూమికను పోషిస్తూ, మారుతున్న అవసరాలను అనుగుణంగా ఆధునికతను సంతరించుకుంటున్న ఈ ఎఫ్‌-16 విమానాలు నిజంగానే పాకిస్తాన్‌కు ఓ వరం. నేరుగా యుద్ధం చేయడంలోనూ, యుద్ధానికి వస్తున్న శత్రువులను ఎదుర్కోవడంలోనూ ఈ విమానాలకి సాటిలేదు. అలాంటి వాహకాలు ఇప్పుడు పాకిస్తాన్‌ రక్షణలో ఉంటే, వాటని ఆ దేశం దుర్వినియోగం చేస్తుందన్న భారత్‌ ఆందోళనలో నిజం లేకపోలేదు. అసలే పఠాన్‌కోట్‌ దాడులతో ఉడికిపోతున్న భారత ప్రభుత్వానికి ఈ ఒప్పందం నిజంగానే పుండు మీద కారంలా ఉంది. ఇప్పటికే మన రక్షణ శాఖా మంత్రి సహా అనేక మంది నేతలు ఈ ఒప్పందం మీద గట్టిగానే తమ నిరసనను తెలియచేస్తున్నారు. కానీ జిత్తులకు పెట్టింది పేరైనా అమెరికా మాత్రం, ఈ వ్యవహారాన్ని ముగించేదాకా ఊరుకునేట్లు లేదు. మరి ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కేవలం నిరసనల వరకే పరిమితం చేస్తుందా, లేకపోతే అమెరికాకు దీటైన జవాబునిస్తుందా అన్నది వేచిచూడాలి!

ఆధార్‌కి చట్టబద్ధత ఎందుకంటే!

  ఎట్టకేలకు ప్రభుత్వం తన పంతాన్ని నెరవేర్చుకుంది. Aadhaar (Targeted Delivery of Financial and Other Subsidies, Benefits and Services) బిల్లుకి ఎలాగొలా చట్టబద్ధతను కల్పించగలిగింది. రాజ్యసభలో పాలకపక్షానికి తగిన బలం లేకపోవడంతో ఈ బిల్లుని ‘ద్రవ్యబిల్లు’ రూపంలో ప్రవేశపెట్టడం మీద ఇప్పటికే కొంత నిరసన వ్యక్తమవుతోంది. ద్రవ్యబిల్లు రూపంలో ప్రవేశపెట్టే బిల్లులకి సవరణలు చేసే అధికారం రాజ్యసభకు ఉండదు. ఆధార్‌కు చట్టబద్ధత కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు తప్పుదారి పట్టకుండా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇది పౌరహక్కులకు భంగమనీ, ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తే దానిని దుర్వినియోగపరిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని విపక్షాలు మండిపడుతున్నాయి.   ప్రభుత్వ పథకాలను ఆధార్‌తో ముడిపెట్టేందుకే ఈ ఆధార్‌ బిల్లుని తీసుకుని వచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ సిలండర్ల మీద రాయితీని ఆధార్‌తో అనుసంధానించడం వల్ల వేల కోట్ల రూపాయలు ఆదా చేశామని చెబుతోంది. మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆరోగ్యశ్రీ.... ఇలా ప్రతి పథకాన్నీ ఆధార్‌తో జోడిస్తే, సంక్షేమ పథకాలు అర్హులైనవారికి చేరతాయన్నది ప్రభుత్వ వాదన. కానీ వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఆధార్ కార్డుని పథకాలకి అర్హతా పత్రంగా కాకుండా గుర్తింపు పత్రంగా చలామణీ చేసే సంప్రదాయం ఇప్పటికే మొదలైంది. ఇప్పుడు బడిలో చేరే పసిపిల్లలకు కూడా ఆధార్ కార్డును అడుగుతున్నారు. ఎంసెట్‌ పరీక్షలు రాయాలంటే ఆధార్ తప్పనిసరి చేసేశారు. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, భూమిని అమ్ముకోవాలన్నా ఆధార్ అడ్డుపడుతూనే ఉంది. ‘ఆధార్‌ కార్డు లేకపోవడం వల్ల ఏ వ్యక్తీ నష్టపోకూడదు’ అని సాక్షాత్తూ సుప్రీంకోర్టే స్పష్టం చేసినా, ఆధార్‌ లేకపోతే మనుగడ కష్టం అనే పరిస్థితికి మనం వచ్చేశాము.    దేశంలో అక్రమంగా నివాసం ఉండేవారిని గుర్తించేందుకు ఆధార్‌ను ప్రవేశపెట్టారని, అది ఎక్కడ విమర్శలకు దారితీస్తుందో అని దానికి సంక్షేమపథకాల రంగుని పులిమారనీ విమర్శలు ఉన్నాయి. ఇప్పడు ఆధార్‌కు చట్టబద్ధత కల్పించడం వల్ల ఆ విమర్శలు మరోసారి పదునెక్కనున్నాయి.   అక్రమంగా నివాసం ఉంటున్నవారినే కాదు, దేశంలోని ప్రతి ఒక్కరి గురించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఆధార్‌ కల్పిస్తుంది. అవసరమైతే తప్ప ఆధార్‌ వివరాలను వెల్లడించబోమని ప్రభుత్వం చెబుతున్నా, ఆ ‘అవసరం’ అన్న పేరుతో మన వ్యక్తిగత జీవితంలోకి ప్రభుత్వం ప్రవేశించే అవకాశం ఈ బిల్లు కల్పిస్తోంది. ఒక వ్యక్తి ఏ పని చేసినా ఆధార్‌నే వాడుతూ ఉండాల్సి వస్తోంది కాబట్టి అతని కదలికలు, ఆర్థిక లావాదేవీలు, ఫోన్‌ రికార్డులు... ఇలా ఆధార్‌తో అనుసంధానమైన అతని జీవితం మొత్తాన్నీ గ్రహించి, వేధించే అవకాశాన్ని ఆధార్‌ కల్పించనున్నదన్నది ప్రధాన ఆరోపణ. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి ప్రమాదాలను కొట్టిపారేస్తోంది. ‘అవసరం’ అయితే తప్ప ఆధార్‌ వివరాలను వెల్లడించబోమని చెబుతోంది.          ఎవరి వాదన ఎలా ఉన్నా ఆధార్‌ మన జీవితంలో భాగమైపోయిన మాట మాత్రం వాస్తవం. ఈ 12 అంకెల ఆధార్‌ ఇప్పుడు మన జీవితంతో ముడిపడిపోయి ఉంది. కాబట్టి అది దుర్వినియోగం కాకూడదనే ఆశిద్దాము. అన్నింటికీ మించి ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైనా ఆధార్‌ అనుసంధాన్ని చేపడుతోందో ఆ లక్ష్యం నెరవేరితేనే ఈ బిల్లుకి ఒక పరామార్థం. అలాకాకుండా.... డబ్బు, పలుకుబడితో ఏదైనా సాధించగలమని విర్రవీగే బడాబాబులు, తాము పేదలమంటూ ఓ ఆధార్‌ కార్డుని సంపాదించగలిగితే ఇక దాని ప్రయోజనం ఏముంటుంది!

ఆంధ్రాబడ్జట్- అంకెలు బాగున్నాయి కానీ...

  ఆంధ్రప్రదేశ్‌.... ఏర్పడి ఇంకా రెండేళ్లు కూడా కాలేదు! ఒకపక్క తనకంటూ ఓ రాజధాని కూడా పూర్తి కాలేదు. మరోపక్క కేంద్రం నుంచి వస్తుందన్న సాయం మీద స్పష్టమైన మాటలు వినిపించడం లేదు. ప్రతి ఒక్కరూ వచ్చి భుజం తట్టి వెళ్లిపోయేవారే కానీ, చేయి పట్టుకుని నడిపించేవారు కనిపించడం లేదు. ఎలాగొలా నిలదొక్కుకుందామని అనుకుంటే అదను చూసుకుని అజమాయిషీ చేసే ఉద్యమాలు మొదలయ్యాయి! ఒకరకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో రియల్ఎస్టేట్‌ వ్యాపారులు తప్ప మరెవ్వరూ అంత సంతృప్తిగా ఉండే పరిస్థితులు లేవు. ఇలాంటి గడ్డుకాలంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన 1,35,689 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సాదాగా సాగిపోయిన మాట వాస్తవమే! ఎందుకంటే అందులో ఆకాశాన్నంటే హామీలు ఏవీ లేవు. ఇప్పటివరకూ ఉన్న లక్ష్యలను పూర్తిచేసేందుకే యనమల ప్రాధాన్యతను ఇచ్చారు. కేంద్రం నుంచి సాయం రాలేదన్న ‘లోటునూ’ పూడ్చేందుకు ప్రయత్నించారు. మొన్నటికి మొన్న జరిగిన కేంద్ర బడ్జెట్లో పోలవరానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే! ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ తన నిరసనను వ్యక్తం చేసేసరికి కేంద్ర మంత్రి ఉమాభారతి హడావుడిగా ‘కాదు.... కాదు.... 1,600 కోట్లు ఇవ్వనున్నాం’ అని తడబడ్డారు. కేంద్రం చేసిన పనికి ఒళ్లు మండిందో ఏమోగానీ ఏకంగా పోలవరానికి ఏకంగా 3,500 కోట్లు కేటాయించారు యనమల. రాజధాని నిర్మాణానికి కూడా ఇదే తంతు. అమరావతి నిర్మాణానికి 1,500 కోట్లు కేటాయించి రాజధానికి ఓ ఊపుని తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. బడ్జెట్లో స్పష్టంగా కనిపించే మరో అంశం... సామాజికవర్గాల వారీగా కేటాయింపులు జరపడం. కాపులను బుజ్జగించేందుకు వేయికోట్లు కేటాయింపు ఎలాగూ తప్పనిసరి అని తేలిపోయింది. కానీ కాపులకు పెరుగుతున్న ప్రాధాన్యతతో కినుకు వహిస్తున్న బీసీలను ఊరడించేందుకు వారి సంక్షేమానికి ఏకంగా 8,832 కోట్లు కేటాయించారు. ఇక అందరికీ ఎంతో కొంత దక్కితే మాకేంటి అని బ్రాహ్మణులు అడుగుతారనుకున్నారో ఏమో వారికీ ఓ 65 కోట్లు కేటాయించారు. ఒకరకంగా చెప్పాలంటే కార్పొరేషన్‌ పేరునో, ఉపప్రణాళిక పేరునో దాదాపు బడ్జెట్లో 15 శాతానికి పైగా వివిధ సామాజికవర్గాలకే కేటాయించారు. ఈ తరహా కేటాయింపులు ఎక్కడికి దారితీస్తాయో విజ్ఞులకే ఎరుక. అయితే వివిధ కార్పొరేషన్లకు జరిగిన కేటాయింపులో కొంతశాతం యువకులకు అందించాలన్న నిబంధన ఒక్కటే కాస్త ఊరట కలిగించే అంశం. వేలకి వేలు కోట్లుగా జరిగిన ఈ కేటాయింపులు, అర్హులకు మాత్రమే అందేలా చూసే బాధ్యత ఏమంత తేలికైంది కాదు! బడ్జెట్‌ ప్రసంగంలో కొన్ని భాగాలను యువతకూ, మధ్యతరగతికీ కూడా కేటాయించారు యనమల. యువత కోసం 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనీ, సొంత ఇంటి కలలు నెరవేరేందుకు గృహనిర్మాణ రంగానికి వేయి కోట్ల సాయం అందిస్తామని చెప్పారు. కానీ ఇవి ఏ మేరకు అమలు జరుగుతాయో వచ్చే బడ్జట్‌ సమావేశాలనాటికి తేలిపోతుంది. ఇక వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ సంస్థలకీ కేటాయింపులు భారీగానే జరిగినట్లు కనిపించినా... రైతన్నలు ఆశలు పెట్టుకున్న రుణమాఫీకి కేవలం 3,512 కోట్లు మాత్రమే కేటాయించారు. పరిశ్రమలకీ, మౌలిక వసతుల కల్పనకీ కూడా బడ్జెట్‌ తగు ప్రాధాన్యతను ఇచ్చింది. బడ్జెట్లో పలుశాఖలకు కేటాయింపులు ఒక ఎత్తైతే వాటికి నిధులు ఎలా సమకూర్చునున్నారన్న ప్రశ్న మరో ఎత్తు! యనమల చెబుతున్న లెక్కల ప్రకారం 26,849 కోట్ల రూపాయలు కేంద్ర నుంచి గ్రాంట్‌గా వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రాంట్లు రావడంలో ఏమాత్రం తేడాపాడా జరిగినా ముఖ్యమైన ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇక రాష్ట్రంలోంచి వచ్చే రాబడుల లక్ష్యాన్ని 52 వేల కోట్లుగా నిర్ణయించారు. మరి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే జనాల ముక్కుపిండన్నా వసూలు చేసుకోవాలి, లేకపోతే పన్నులన్నా పెంచాలి. ఇదీ అంత తేలికైన విషయం కాదు. మరోవైపు ఆర్థికలోటుని పూడ్చేందుకు బహిరంగ మార్కెట్‌నుంచి 21 వేల కోట్ల రుణాలను తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పేరుకుపోయిన రుణాలకి ఇది కూడా తోడైతే మున్ముందు వాటికి పన్నులు కట్టేందుకు అవస్థలు పడక తప్పదు. మరి ఈ భారీ ‘బడ్జెట్‌’తో ఒక మంచి రాష్ట్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్న యనమల, అందుకోసం వనరులను ఎలా రాబట్టగలుగుతారన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం!

ప్రతిపక్షాల జాడ ఏది!

ఖమ్మం, వరంగల్, అచ్చంపేటల్లో స్థానిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలూ వచ్చేశాయి. అయినా తెలంగాణ ప్రజలు ఒక్కసారి అలా ఫలితాలను పైపైన చూసి ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ఎందుకంటే ఫలితం ఆశించిందే కనుక! మహా అయితే సంఖ్య కాస్త అటూఇటూగా ఉండవచ్చు... అంతే! ఈ మూడు ప్రాంతాల్లో ఎన్నికలు ఎంత ఏకపక్షంగా సాగాయంటే, దారిన పోయే దానయ్యని అడిగినా కూడా రాబోయే ఫలితాన్ని చెప్పగలిగేవాడు.   ఖమ్మం ఖిల్లా మొదటినుంచీ వామపక్షాల ఎర్రజెండాతో రెపరెపలాడేది. ఎన్నికలు స్థానికమైనా, అసెంబ్లీకైనా... ఆఖరికి పార్లమెంటుకైనా సరే! వరంగల్‌ నుంచి ఒక్క సీటన్నా రాకపోతుందా అని వామపక్షాలు ఎదురుచూసేవి. అలాంటిది ఖమ్మం నగరపాలక సంస్థలోని 50 స్థానాలలో...  నాలుగంటే నాలుగు స్థానాలతో వామపక్షాలు సరిపెట్టుకున్నాయి. సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు కోడలు సైతం కార్పొరేటర్‌గా గెలవలేని పరిస్థితి. తెరాస ముఖ్యనేత తన దృష్టినంతా ఖమ్మం మీదే కేంద్రీకరించడంతో గులాబీ గుబాళించిపోయింది. మొదటి నుంచీ ఇక్కడ అంతంతమాత్రంగానే ఉన్న బీజేపీ ఇప్పుడు కూడా సున్నా స్థానాలతో అంతంతమాత్రంగానే మిగిలిపోయింది. అయితే వరుస పరాజయాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌ ఖమ్మంలో 10 స్థానాలను కైవసం చేసుకోవడంతో ఈ పార్టీ నెత్తి మీద పాలు పోసినట్లైంది. తెరాస ధాటికి అల్లల్లాడుతున్న ప్రతిపక్షాలకి ఐదో వంతు స్థానాలు రావడం కూడా గొప్ప ఊరట అనడంలో సందేహం లేదు.   సెటిలర్లు ఎక్కువగా ఉండే ఖమ్మంలో ఒకప్పుడు తెదెపాకు కూడా మంచి పట్టు ఉండేది. ఖమ్మం తెదెపా అంటేనే తుమ్మల నాగేశ్వరరావు గుర్తుకువచ్చేవారు. అలాంటి తుమ్మల తెరాస తీర్థం పుచ్చుకోవడంతో సమీకరణాలు చిన్నాభిన్నం అయిపోయాయి. తుమ్మల చుట్టూనే అల్లుకున్న తెదెపా క్యాడర్‌ మొత్తం ఇప్పుడు తెరాస తరఫున ఉంది. కాబట్టి మున్ముందు ఖమ్మంలో తెదెపా తన ఉనికి నిలబెట్టుకోవాలంటే క్యాడర్‌ను మళ్లీ నిర్మించుకోవలసిన పరిస్థితి.  విజయవాడకి కూతవేటు దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా మీద చంద్రబాబు దృష్టి సారించడం అంత కష్టం కాకపోవచ్చు.   ఖమ్మంలో తెదెపాకి తుమ్మల నాగేశ్వరరావు వల్ల జరిగిన నష్టమే వరంగల్లో కూడా పునరావృతమైంది. తమలో తమకి ఎన్ని విభేదాలు ఉన్నా కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావులు... వరంగల్‌ జిల్లాలో తెదెపాకి బలమైన నాయకులుగా నిలిచేవారు. ఇప్పుడు వారిద్దరూ తెరాసలో కలిసిపోవడంతో వారితో పాటు క్యాడర్‌ కూడా గల్లంతైంది. ఒకప్పుడు మేయర్‌ పీఠాన్ని సైతం కైవసం చేసుకున్న తెదెపా ఖాతా ఇప్పుడు సున్నా దగ్గరే ఆగిపోయింది. దీనికితోడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న కడియం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలే జోరు మీదున్న తెరాసకి ఇక అడ్డేముంటుంది. వరంగల్‌ నగరపాలక సంస్థలోని మొత్తం 58 స్థానాలలో 44 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. మరో ఎనిమిది మంది విజేతలు కూడా తెరాస రెబల్స్‌ కావడమే విశేషం. వీరు కూడా తెరాసకి మద్దతిచ్చే అవకాశం ఉంది కనుక తెరాస మొత్తం బలం 52గా భావించవచ్చు. అంటే దాదాపు 90% స్థానాలను ఆ పార్టీ దక్కించుకుంది!   ఇక అచ్చంపేట నగరపంచాయతీ పరిస్థితి మరీ చిత్రం. ఎన్నడూ లేనిది కాంగ్రెస్‌, తెదెపా, భాజపా.... ఈ మూడు పార్టీలు ఏకతాటి మీదకు వచ్చినా కూడా 20 స్థానాలలో ఒక్క స్థానం కూడా ప్రతిపక్షాలకు దక్కలేదు. తెరాస కారుకి, అచ్చంపేటలో బ్రేకులు లేకుండా పోయాయి. 20కి 20 స్థానాలూ ఆ పార్టీకే దక్కాయి.   గ్రేటర్‌ ఎన్నికల పరాభవంతో విస్తుపోయిన ప్రతిపక్షాలు త్వరగా తేరుకుని ఉంటే ఫలితాలు ఇంత దారుణంగా ఉండేవి కావేమో! గ్రేటర్‌ ఓటమికి కారణం మీరంటే మీరు అంటూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉండగానే... ఈ ఎన్నికలు రావడం పోవడం కూడా జరిగిపోయింది. పైగా తెరాసను అడ్డుకునేందుకు కానీ, తమ బలాన్ని మెరుగుపరుచుకునేందుకు కానీ వారి వద్ద స్పష్టమైన ప్రణాళిక ఏదీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఎన్నికలలో పోటీ చేసే ముందే వారు ఓటమిని అంగీకరించినట్లుగా కనిపిస్తోంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న తెరాస ఈ ఎన్నికలను తేలికగా తీసుకోలేదు. గ్రేటర్ ఎన్నికలు జరుగుతుండగానే ఎర్రబెల్లిని తమవైపుకి తిప్పుకుని, ప్రత్యర్థులని ముందుగానే దెబ్బతీశారు.   ఇప్పటికైనా ప్రతిపక్షాలకు మించిపోయిందేమీ లేదు. మరో మూడేళ్లకి పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. తెలంగాణ తరఫున పార్లమెంటులో తమ ఉనికిని నిరూపించుకోవాలంటే, ఇప్పటి నుంచే ఒక ప్రణాళికను ఏర్పరుచుకుని, దాని ప్రకారం నడుచుకోవల్సి ఉంటుంది. క్యాడర్‌ దగ్గర్నుంచీ నాయకత్వం వరకూ పార్టీని నిర్మించుకోవాల్సిందే. ప్రజల్లో తమపట్ల విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పాల్సిందే! లేకపోతే మూడేళ్ల వ్యవధి తరువాత కూడా ఇప్పుడు వచ్చిన ఫలితాలే పునరావృతం అవుతాయి. ఏ రాష్ట్రంలోనైనాగానీ ప్రతిపక్షాలు నామమాత్రంగా మిగిలిపోవడం ఆ రాష్ట్రానికే కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు!

షరపోవా ఆట ముగిసినట్లేనా!

  టెన్నిస్‌ పట్ల ఆసక్తి ఉన్నా లేకున్నా, ప్రపంచంలో చాలామందికి షరపోవా అంటే ఎవరో తప్పకుండా తెలిసి తీరుతుంది. 17 ఏళ్ల  వయసులోనే వింబుల్డన్‌ను సాధించిననాటి నుంచి... ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో సెరీనా విలియమ్స్‌తో హోరాహోరీ పోరు సాగించిన రోజు వరకూ షరపోవా ఆటను ప్రతి టెన్నిస్‌ అభిమానీ ఆస్వాదిస్తూనే ఉన్నాడు. దశాబ్దకాలంపాటు టెన్నిస్‌లో అప్రతిహతంగా కొనసాగుతూ 35 గ్రాండ్ స్లామ్‌ టైటిల్స్ (సింగిల్స్)ను గెలుచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే షరపోవా అందం అన్నా, ఆ అందాన్ని మించిన ఆట అన్నా అభిమానులు పడిచస్తారు. అలాంటి వ్యక్తి నిషేధిత ఉత్ప్రేకరాన్ని వాడి పట్టుబడిందనీ, ఈ ఏడాది జరగబోయే ఒలంపిక్స్ నుంచి దూరం కానుందనీ తెలియడంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా గాయాలతో బాధపడుతూ ఊగిసలాడుతున్న షరపోవా కెరీర్‌ ఈ దెబ్బతో తిరిగి పుంజుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. షరపోవా ‘మెల్‌డోనియం’ అనే నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకుందన్నది అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఆరోపణ. ఇప్పటికే షరపోవా నుంచి సేకరించిన రక్తనమూనాలో ఈ మందు ఉంది కాబట్టి, ఇందులో నిర్దోషినని షరపోవా చెప్పుకునేందుకు ఏమీ మిగలదు. కాబట్టి ఆట నుంచి నిషేధం ఎలాగూ ఖాయం. ఇక తాను తెలియక ఈ ఉత్ప్రేకరాన్ని వాడానని షరపోవా చెబుతున్న వాదనలో కూడా పస కనిపించడం లేదని క్రీడాపండితులు అంటున్నారు. తన గుండె పనితీరు సరిగా లేకపోవడం, కుటుంబనేపథ్యంలో డయాబెటీస్ ఉండటంతో దానికి విరుగుడుగా మెల్డోనియంను తీసుకున్నట్లు షరపోవా చెబుతోంది. కానీ మెల్‌డోనియం రక్తప్రసరణను మెరుగుపరిచే మాట వాస్తవమే అయినా..... ఆటగాళ్లు మరింత చురుకుగా ఆడేందుకు ఈ మెల్‌డోనియంను తీసుకుంటారన్నది బహిరంగ రహస్యం.   పదేళ్లుగా తాను ఈ మందుని వాడుతున్నాననీ, ఈ ఏడాది మొదట్లోనే దీనిని ఉత్ప్రేరకాల జాబితాలో చేర్చారని షరపోవా అంటున్న మాట వాస్తవమే! కానీ టెన్నిస్‌ సమాఖ్య తాజా జాబితాను తన వెబ్‌సైట్లో ఉంచుతుంది. తనకి అనుబంధంగా ఉన్న దేశాల టెన్నిస్‌ సమాఖ్యలన్నింటికీ జాబితాకు సంబంధించిన సమాచారాన్ని అందచేస్తుంది. పైగా మెల్‌డోనియం అమాయకమైన మందేమీ కాదు. అమెరికాలో ఇప్పటికీ ఈ మందుని అమ్మడం చట్టవ్యతిరేకం. ఇక తూర్పు ఐరోపాలోని చాలా దేశాలలో ఈ మందుని ఒక ఉత్ప్రేరకంగానే ఎక్కువగా వాడుతుంటారు.నాలుగేళ్ల వయసులోనే టెన్నిస్‌ రాకెట్‌ను పట్టుకుని తనకిష్టమైన ఆటలో ఓ చరిత్ర సృష్టించిన షరపోవా, అదే ఆట నుంచి అవమానకరంగా దూరం కావడం బాధించే విషయమే. అందుకే ఎంతో పరిణతితో కనిపించే ఈ క్రీడాకారిణి, తన నిషేధం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కన్నీటి పర్యంతం అయింది. ఒక పక్క ఆట నుంచి ఆమె ఎలాగూ కొంత దూరం కానుంది.   ఇక ఆర్థికంగా కూడా షరపోవాకి ఇది కోలుకోలేది దెబ్బ. అత్యంత ధనికురాలైన క్రీడాకారిణిగా ఉన్న షరపోవా ఇప్పడు ఒక్కొక్కటిగా తన వ్యాపార ఒప్పందాలను కోల్పోయే పరిస్థితిలో ఉంది. షరపోవా గురించి క్రీడాలోకం కరకాలుగా స్పందించింది. నిషేధిత జాబితా గురించి తనకేమీ తెలియదని షరపోవా చెప్పడం అతితెలివి అని కొందరంటే, షరపోవా తెలియకుండా ఓ ఉచ్చులో బిగుసుకుపోయిందని మరికొందరు జాలిపడుతున్నారు. ఎవరు ఏమన్నా, ఎలా అనుకున్నా ఒకటి మాత్రం నిజం! టెన్నిస్‌ నుంచి షరపోవా కనీసం మరో ఏడాది కాలం దూరం కానుంది. మరి ఆ తరువాత తిరగి ప్రపంచస్థాయి ఆటతీరుని ప్రదర్శిస్తుందా! మరో సంచలనానికి దారి తీస్తుందా! అలా జరుగుతుందనే ఆశిద్దాము! మరోవైపు షరపోవా ఉదంతం ఇతర క్రీడాకారులకు ఓ గుణపాఠంగా నిలవాలని కోరుకుందాము!

జీవితం మీద యాసిడ్

  అదో సినిమా! అందులో అల్లరి చిల్లరిగా తిరిగే కథానాయకుడు. ఆయనగారు పొద్దున లేస్తూనే బూతులు, రాత్రవగానే మందు... ఈ రెండింటి మధ్య అల్లరి చిల్లరి తిరుగుళ్లతో జీవితాన్ని మగమహారాజులా గడిపేస్తూ ఉంటాడు. అలాంటి అద్భుతమైన జీవికి ఓ ఆడతోడు కావాల్సి వస్తుంది. తను అప్పుడప్పుడూ వెళ్లే కాలేజీలో, తనకి ప్రియురాలు కాగలిగిన ఉత్తమురాలు ఎవరా అని వెతుకుతుండగా, ఓ చదువుల తల్లి కనిపిస్తుంది. ఇక ఆమె వెంటపడటం మొదలుపెడతాడు మన హీరో! ఆ అమ్మాయి హీరో వంక చూడదు. అయినా ఇతగాడు వదలడు. వెంటపడుతూనే ఉంటాడు. తను ఛీ పొమ్మన్నా ద్వంద్వార్థాలతో వేధిస్తూనే ఉంటాడు. అదేం చిత్రమో కానీ ఆ అమ్మాయి ఇతగాడి ప్రేమలో పడిపోతుంది. ఎందుకంటే అది సినిమా కదా! కానీ నిజజీవితం ఇలా ఉండకపోవచ్చు. ఇలాంటి పోకిరీ కుర్రాడిని చూసిన అమ్మాయికి అతగాడితో ప్రేమన్నా, పెళ్లన్నా వెగటు పుట్టి ఉండవచ్చు. మరీ చిరాకేస్తే పోలీస్‌ కంప్లైంట్ కూడా ఇవ్వవచ్చు. దానికి నిజజీవితంలో కుర్రవాళ్లు ప్రవర్తించే తీరు కూడా భిన్నంగా ఉంటోంది. తన మనసుకి నచ్చిన అమ్మాయి నచ్చలేదన్న అక్కసుతో కొందరు తీసుకునే నిర్ణయం అవతలి మనిషి జీవితాన్నే చీకటిగా మార్చేస్తోంది. ఈ ఉపోద్ఘాతమంతా యాసిడ్‌ దాడుల గురించి అని వేరే చెప్పాలా! 2015లో మనదేశంలో 300కి పైగా యాసిడ్‌ దాడులు నమోదయ్యాయి. ఇక నమోదు కాని కేసులు వీటికి రెట్టింపు ఉండవచ్చని ఒక అంచనా! వీటిలో అధికశాతం దాడులు ఆడవారి మీదే జరిగాయి. అది కూడా 20 ఏళ్ల లోపువారి మీదే. వీటిలో అధికశాతం దాడులు జరగడానికి కారణం, సదరు అమ్మాయి తనకు లొంగలేదన్న అక్కసే కారణం. సామాన్యంగా ఏదన్నా ప్రమాదం సంభవిస్తే దాని మొదలు నుంచి తుది వరకూ ఏం చేస్తే బాగుంటుంది అన్న ఒక అవగాహన మన పెద్దలకు ఉంటుంది. కానీ యాసిడ్‌ దాడి తీరు వేరు! యాసిడ్‌ మీద పడటం అనేది ఒక హఠాత్పరిణామం! అది మన మీద పడిన వెంటనే ఎలాంటి ప్రథమచికిత్స తీసుకోవాలి. ఏ వైద్యుడిని సంప్రదించాలి అన్న అయోమయం ఒక పక్కన ఉంటే, శారీరిక నరకం కూడా యాసిడ్‌ చుక్క ఒంటి మీద పడిన క్షణం నుంచే మొదలవుతుంది. పువ్వు రెక్కల మీద పడిన నిప్పు దాన్ని కాల్చివేసినట్లు, యాసిడ్‌ శరీరాన్ని కరిగించివేసే ఒక నిప్పు కణిక. అది మన శరీరంలోపలికి చొచ్చుకుపోతుంది. యాసిడ్‌ పడ్డాక చూపు పోవచ్చు; కనురెప్పలు కరిగిపోవచ్చు; గొంతు మీద పడితే శ్వాసనాళం దెబ్బతినిపోవచ్చు; జుత్తు శాశ్వతంగా మండిపోవచ్చు; పెదాలు, నాలిక, ముక్కు... ఇలా యాసిడ్ చుక్క పడిన ప్రతి అవయవం తన జీవాన్ని కోల్పోతుంది. అవతలి మనిషి తనకు దక్కలేదన్న అక్కసు, ఒక బతుకుని చీకటిగా, బతికే చీకటిగా మార్చివేస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఒకపక్క శాశ్వతంగా ముఖకవళికలు దెబ్బతినిపోగా, అంతకంత మానసికమైన వేదనని కూడా అనుభవించాల్సి వస్తుంది. యాసిడ్‌ దాడికి గురైన వ్యక్తిని బాధితురాలిగా చూసి ఆదరించాల్సిన సమాజం, వెలివేసే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కుటుంబసభ్యులు ఆదరించి వెన్నంటి ఉన్నా, బయట అడుగుపెడితే ప్రతి ఒక్కరి చూపూ ఆమె గాయాలని వెంబడిస్తూనే ఉంటాయి. అలాంటివారిని ఉద్యోగంలోకి చేర్చుకునేందుకు కానీ, తమలో కలుపుకునేందుకు కానీ ప్రతిఒక్కరూ వెనుకడుగు వేస్తూనే ఉంటారు. ఒక పక్క శారీరికంగా, మానసికంగా వేదన పడుతూనే యాసిడ్‌ బాధితులు న్యాయం కోసం పోరాడవలసి ఉంటుంది. ‘ఇప్పటికే ఇలా చేశాడు. కేసు పెడితే ఇంకే చేస్తాడో!’ అన్న సలహాలు వీరిని వెంబడిస్తూనే ఉంటాయి. అసలే సమాజంలో మొహం చూపించుకోవాల్సిన పరిస్థితిలో లేని తాను, నిరంతరం కోర్టు గుమ్మాల చుట్టూ తిరిగే ధైర్యం చేయలేక చేయలేక, చాలామంది పోలీసు కేసు పెట్టేందుకు కూడా వెనుకంజ వేస్తుంటారు. పైగా నిరుద్యోగం, స్త్రీ పురుష వివక్ష ఎక్కువగా ఉన్న సమాజాలలోనే యాసిడ్‌ దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బంగ్లాదేశ్‌, ఇండియా, పాకిస్తాన్‌ వంటి దేశాలలో గత దశాబ్దంలో వేల కొద్దీ యాసిడ్‌ దాడులు జరగడమే దీనికి సాక్ష్యం. అలాంటి సమాజాలలో బాధితురాలికి ఎలాంటి అండ లభిస్తుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త మారుతూ ఉండటం కాస్త సంతోషించదగ్గ పరిణామం. ‘acid survivors trust international’, ‘acid survivors foundation’ వంటి సంస్థలు యాసిడ్‌ బాధితులకు అండగా నిలుస్తున్నాయి. యాసిడ్‌దాడిలో బాధితులైనవారు కూడా సమాజానికి ఎదురొడ్డి జీవించేందుకు సాహసిస్తున్నారు. తాము ఓడిపోలేదని రుజువు చేసుకుంటూనే, తమలాంటి బాధితులకి సైతం చేయందించేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజ్‌మహల్‌ సమీపంలో ఇలాంటి యాసిడ్‌ బాధితులు కొందరు కలిసి ఏకంగా ఒక కాఫీషాప్‌నే (Sheroes Hangout) పెట్టడం ఇందుకు ఓ మంచి ఉదాహరణ. యాసిడ్‌ దాడులలోని తీవ్రతను గ్రహించిన పార్లమెంటులు పదునైన చట్టాలను ప్రవేశపెట్టేందుకు శతథా ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో 2013లో మార్పుచేసిన 326A అధికరణాన్నే తీసుకుంటే, యాసిడ్ దాడికి పాల్పడేవారికి కనీసం పదేళ్ల కఠినకారాగారశిక్షను విధించాలని నిర్ణయించారు. నగల షాపుల్లోనో, వాహనాలను రిపేరు చేసే చోట్ల అతి సులువుగా దొరికే సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, నైట్రిక్‌ యాసిడ్లను ఇక మీదట ఏదన్నా గుర్తింపు పత్రం ఉంటే తప్ప అమ్మరాదని న్యాయమూర్తులు 2013లో ఇచ్చిన ఒక తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్‌లో అయితే, యాసిడ్‌ దాడులతో విసిగిపోయిన ప్రభుత్వం, ఈ దాడులకు పాల్పడే నేరస్తులకు ఏకంగా మరణశిక్షను విధించేలా చట్టానికి తగు సవరణలు చేసింది. కానీ ఎవరెన్ని చట్టాలు చేసినా, ఆ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.... అవన్నీ క్షణికావేశంలో ఉన్న యువతను తప్పు చేయకుండా ఆపగలవని ఆశించలేం! మగపిల్లవాడు పుట్టిన దగ్గర్నుంచీ అతని తల్లిదండ్రులు, చదువు, సమాజం, సినిమాలు.... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆడపిల్ల మగవాడికంటే తక్కువనీ; గొడవ వచ్చినప్పుడు ఆడది, మగవాడి మాట వినాలనీ; మగమహారాజులు ఏం చేసినా చెల్లిపోతుందనీ నూరిపోసినంత కాలం పిల్లవాడు అంతకంటే గొప్పగా ఆలోచిస్తాడని భావించలేం. కాబట్టి యాసిడ్‌ దాడిలో బాధితురాలు ఎవరో ఒక యువతి మాత్రమే కాదు! అది స్త్రీ జాతి మీద జరిగే దాడి. నేరస్తుడు కేవలం ఒక మగవాడు మాత్రమే కాదు! అతను అక్కసుతో, అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ఆధిపత్య ధోరణికి ప్రతిబింబం. ఈ పరిస్థితులో మార్పు రానంతవరకూ.... యాసిడ్‌ దాడులు జరుగుతూనే ఉంటాయి.

ఈ ఎన్నికలలో గెలిచేది ఎవరు!

  కొంతకాలంగా దేశమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్‌ 4 నుంచి మే 19 వరకూ సాగే ఈ ప్రక్రియలో మే 19 నాటికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు, పుదుచ్చేరిలలో జరిగే ఈ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాలలోని వివిధ పార్టీల విజయావకాశాల మీద ఒక విహంగ వీక్షణం! పశ్చిమబెంగాల్‌ ఎన్నికల సంఘం తన కార్యాచరణను ఇలా విడుదల చేసిందో లేదో, మమత అలా తన అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేశారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గాను ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సొంతంగానే ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయడం నిజంగానే మమతకు కలిసొచ్చే విషయం. కానీ ఈ జాబితాలో శారదా స్కాంలో పీకల్లోతు మునిగిపోయి ప్రస్తుతం జైల్లో ఉన్న మదన్‌ మిత్రాకు చోటు కల్పించడంతో, ప్రతిపక్షాలు విమర్శించేందుకు తగిన అవకాశం దక్కినట్లైంది. అయితే మమతను విమర్శించేందుకు శారదాస్కాం తప్ప మరేమీ పెద్దగా అంశాలు లేకపోవడం వారి దురదృష్టం! పశ్చిమ బెంగాల్లో మమత అద్భుతమైన పురోగతిని సాధించనప్పటికీ, 30 ఏళ్లకు పైగా ఆ రాష్ట్రాన్ని పాలించిన సీపీఐ(ఎం)తో పోల్చుకుంటే పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయన్నది జనాభిప్రాయమే! ఆ అభిప్రాయమే మమతను ఈసారి కూడా గెలిపించనున్నదన్నది విశ్లేషకుల అంచనా! తమిళనాడు ఒకసారి డిఎంకేకీ మరోసారి అన్నాడిఎంకేకి దఫాలవారీగా అధికారాన్ని కట్టబెట్టే తమిళతంబిలు, ఈసారి తమ సంప్రదాయాన్ని సడలించి పురుచ్చితలైవికి పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. జయ విరోధి కరుణానిధి కురువృద్ధునిగా మారిపోవడం, స్టాలిన్‌ తప్ప మరో జనాకర్షణ ఉన్న నేత వారసునిగా లేకపోవడం డీఎంకేకు లోటుగానే ఉంది. పైగా అన్నాడీఎంకే  పార్లమెంటులో 2G స్కాంను తిరిగి లేవనెత్తడంతో ఈసారి కూడా అదే ఆయుధంతో ఇటు డీఎంకేనీ, అటు కాంగ్రెస్‌నీ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయ వ్యూహాత్మకంగా తిరిగి రాజీవ్‌ హంతకుల క్షమాభిక్ష అంశాన్ని లేవనెత్తడంతో, అతివాద తమిళుర మనసు కూడా ముందస్తుగా గెల్చుకున్నట్లైంది. గత ఎన్నికలలో మిక్సీల మొదలుకొని ల్యాప్‌టాప్‌ల వరకూ ఉచితంగా ప్రకటించిన వరాలన్నీ జయ అందించడంతో, ఈసారి కూడా ఆమె అందించే వరాల కోసం కొందరు ఓటర్లు ఎలాగూ సిద్ధంగా ఉంటారు. మరి ‘జయ’కేతనం ఎగరక ఏమవుతుంది. కేరళ ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఊమెన్ చాందీ, సోలార్‌ స్కాంలో పీకల్లోతు మునిగిపోయి ఉన్నారు. ఈ కేసులో నిందితురాలైన సరిత, సోలార్ స్కాంకి సంబంధించి రోజుకో చెంబుడు బురదను చాందీ మీద కుమ్మరిస్తున్నారు. విదేశీయానాలు, వివాహేతర సంబంధాలు, అక్రమ సంపాదనలు, హత్యలు.... ఇలా సోలార్‌ స్కాం చుట్టూ అల్లుకుంటున్న కథలు సురేష్‌గోపీ నటించే అపరాధ పరిశోధక చిత్రాలకంటే చిత్రంగా సాగుతున్నాయి. దీంతో పోయిన ఎన్నికలలో అధికారాన్ని తృటిలో కోల్పోయిన వామపక్ష కూటమి, ఈసారి విజయతీరాలను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తోస్తోంది. అసోం చిన్న రాష్ట్రమైనా కూడా ఈశాన్య భారతంలో రాజకీయంగానూ, భౌగోళికంగానూ కీలకమైన రాష్ట్రం అసోం. ULFA, NDFB వంటి అతివాదుల ప్రాబల్యం ఎక్కువైనప్పటికీ, కాంగ్రెస్‌ నేత తరుణ్‌గొగోయ్‌ 15 సంవత్సరాలుగా ఎలాగొలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెగ్గుకొచ్చారు. అయితే బీజేపీ కూడా నిదానంగా అసోంలో బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌నుంచి వస్తున్న అక్రమశరణార్థుల సమస్య, హిందుత్వ ఎజెండాతో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఆ పార్టీ తరఫున సర్బానంద సోనోవాల్‌కు కాస్తో కూస్తో జనాకర్షణ కూడా ఉండటంతో ఈసారి బీజేపీ అక్కడ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా కాంగ్రెస్‌, బీజేపీలు నేరుగా తలపడే రాష్ట్రం మాత్రం అసోమే! ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం రెండు పార్టీలకీ ప్రతిష్టాత్మకంగా మారనుంది. అందుకే పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే రాహుల్‌ నేరుగా అసోంకి ప్రయాణమయ్యారు. ఎన్నికలు ముగిసే దాకా దిల్లీ పెద్దలు ఒకరి తరువాత ఒకరు రాహుల్‌ బాట పడతారనడంలో సందేహం లేదు! పుదుచ్చేరి పుదుచ్చేరికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌.రంగస్వామికి అక్కడ ఉన్న జనాదరణ అసామాన్యం. అందుకే తన పేరులోని పొడి అక్షరాలతోనే All India N R Congress అంటూ 2011లో ఒక పార్టీని పెట్టినా, పార్టీ పెట్టిన మూడు నెలల్లోనే ఎన్నికలలో జయభేరి మోగించారు. అప్పట్లో అన్నాడీఎంకే స్నేహహస్తం కూడా రంగస్వామికి కలిసివచ్చింది. కానీ ఈసారి పొత్తులు మారేట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీకి దగ్గరగా ఉన్నా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా... డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ఈ కలను భగ్నం చేసేందుకు శతథా ప్రయత్నిస్తున్నాయి. మరి ఈసారి అన్నాడీఎంకే రంగస్వామితో కలిసి పనిచేస్తుందా, లేక ఒంటరిగానే బరిలోకి దిగుతుందా చూడాల్సిందే! దేశంలోని అయిదు ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికలకి సంబంధించి ఇది ఒక ముఖచిత్రం మాత్రమే! మే 19నాటికి తుది ఫలితాలు వెల్లడయ్యే నాటికి ఈ ఘట్టం మరిన్ని మలుపులు తిరగడం ఖాయం. అనుకున్నదే జరుగుతుందో, అనుకోనిది ఎదురుపడుతుందో... వేచి చూడాల్సిందే!