కేరళలో పేలుడు... నిప్పుతో చెలగాటం!
posted on Apr 11, 2016 @ 10:11AM
నీరు, నిప్పు... ఈ రెండింటినీ మనిషి ఎప్పుడూ తక్కువగా అంచనా వేస్తూనే ఉంటాడు. అలా మనిషి తమపట్ల అజాగ్రత్తగా ఉన్న ప్రతిసారీ అవి తమ విశ్వరూపాన్ని చూపుతూనే వచ్చాయి. కేరళలోని పరవూర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదమే ఇందుకు మరో సాక్ష్యం!
కేరళలోని పరవూర్, ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న పుట్టంగళ్ అమ్మవారి ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకి గొప్ప పేరు. వారం పాటు జరిగే ఈ ఉత్సవాల ఆఖరి రోజున జరిగే బాణాసంచా ప్రదర్శనని చూసేందుకు వందలాదిమంది కాచుకు కూర్చుంటారు. కానీ ఈసారి వాళ్లంతా చావు కోసమే ఎదురుచూసినట్లైంది. అమ్మవారి జన్మనక్షత్రమైన భరణి రోజున ఈ ముగింపు ఉత్సవం జరుగుతుంది. అది ఈసారి 9వ తేదీన వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి మొదలైన బాణాసంచాను, జనమంతా అబ్బురంగా చూస్తూ ఉండిపోయారు. మూడుగంటలపాటు ఏకధాటిగా సాగిన ఈ ప్రదర్శన తుదిఘట్టానికి చేరుకునే సమయంలో అనుకోని ఆపద ఎదురైంది. దగ్గరలోనే బాణాసంచాను నిల్వచేసే గోదాము మీదకి నిప్పురవ్వలు పడటంతో ఆ ప్రాంతమంతా అగ్నిగోళంగా మారిపోయింది. ఆలయ ప్రాంగణమంతా స్మశానమైంది.
ఈ ప్రమాదంలో 107 మంది చనిపోయారనీ, 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారనీ చెబుతున్నారు. ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. బాణాసంచాను సరఫరా చేసిన కాంట్రాక్టరు 15 కిలోల బాణాసంచాను మాత్రమే నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏకంగా 150 కిలోలను నిల్వ చేయడమే ఈ ప్రమాద తీవ్రతకు కారణం అని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలోకి కాస్త లోతుగా వెళ్తే కేవలం కాంట్రాక్టరే కాదు... రాజకీయ నేతల నుంచి ఆలయ అధికారుల వరకూ ప్రతిఒక్కరూ ఈ తిలాపాపంలో తలాపిడికెడు పంచుకున్నట్లు అర్థమవుతుంది.
పుట్టంగళ్ అమ్మవారి ఆలయ నిర్వాహక కమిటీలో మొదటి నుంచీ కుల రాజకీయాలు నడుస్తున్నాయి. కమిటీ మీద ఆధిపత్యం కోసం వివిధ కులాలు కొట్లాడుకుంటూ ఉండేవి. ఈ కొట్లాట కొన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టు దాకా వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో కొన్నాళ్లపాటు ఉత్సవాలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతానికి పరిస్థితులు చక్కబడినట్లు కనిపించినా, ఉత్సవాల మీద తమ ప్రభావం స్పష్టంగా కనిపించాలని కమిటీలోని వేర్వేరు వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. దానికి తగినట్లుగా బాణాసంచా కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగనంత ఘనంగా నిర్వహించాలనుకున్నాయి. అయితే కేరళలో తరచూ జరుగుతున్న బాణాసంచా ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అటు జిల్లా కలెక్టరు కానీ, ఇటు జిల్లా అదనపు మెజిస్ట్రేటు కానీ బాణాసంచా ప్రదర్శనకు అనుమతిని ఇవ్వలేదు. పైగ ఈ బాణాసంచా ప్రదర్శన తీరుని చూస్తుంటే రెండు వర్గాల మధ్య పోటీలాగా సాగే ప్రమాదం ఉందనీ, ఈ నేపథ్యంలో తాను ప్రదర్శనకు అనుమతిని ఇవ్వడం లేదనీ అదనపు మెజిస్ట్రేట్ షానవాజ్ తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుని అతిక్రమించినవారి మీద చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. అయినా ప్రదర్శన ఆగలేదు!
ఉన్నతాధికారులు ఎప్పుడైతే అనుమతిని నిరాకరించారో, స్థానిక రాజకీయ నేతలు రంగంలోకి దిగారు. మంత్రులు సైతం ఉన్నతాధికారుల మీద విపరీతమైన ఒత్తిడిని తీసుకువచ్చారు. కానీ అధికారుల చిత్తశుద్ధి ముందు మంత్రాంగాలు ఫలించలేదు. గుడి చుట్టుపక్కల ఉండే జనం కూడా బాణాసంచా ప్రదర్శనకు వ్యతిరేకంగా నిలబడటంతో అధికారుల వాదనకు తగిన బలం చేకూరింది. పైగా ఇలాంటి విషయాలలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఫలితాలు దారుణంగా ఉంటాయని వారికి తెలుసు. 1952లో శబరిమలలో జరిగిన బాణాసంచాలో 68 మంది మృత్యవువాత పడటం మొదలు... ఆ రాష్ట్రంలో తరచూ జరిగే ఇలాంటి దుర్ఘటనలు వారికి పెను హెచ్చరికలుగా నిలిచాయి.
అధికారులు ససేమీరా అనడంతో అనుమతి ఉందంటూ అబద్ధాలు చెప్పి ఆలయ నిర్వాహకులు బాణాసంచా ప్రదర్శనను మొదలుపెట్టేశారు. కానీ అబద్ధాలు దాగవు. అవి విస్ఫోటనాలై బయటపడతాయి. పుట్టంగళ్ ఆలయంలో అదే జరిగింది. బాణాసంచాను నిల్వ చేసిన భవంతి మీద నిప్పు రవ్వలు పడటంతో, భవంతి కాస్తా ఒక్కసారిగా పేలిపోయింది. భవనం నుంచి ఎగిరిపడిన ఇనుపచువ్వలు, కాంక్రీటు గడ్డల వల్లే ఎక్కువమంది చనిపోయినట్లు తెలుస్తోంది. దీనికితోడు పేలుడు తరువాత కరెంటు కూడా పోవడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని తొక్కిసలాట చోటుచేసుకుంది. అనుమతికి మించిన పేలుడు పదార్థాలను నిల్వ చేయడం ఒక తప్పైతే, వాటిలో నిషేధిత పేలుడు పదార్థాలను ఉపయోగించారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ పేలుడు దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందంటే, ఆ ఆరోపణల్లో నిజం ఉందనే తోస్తుంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తమ గాయాలను సైతం మర్చిపోయి క్షతగాత్రలకు సాయపడేందుకు ముందుకువచ్చారు. సైనిక, నౌకాదళాలు ఒక్క ఉదుటున సహాయ కార్యక్రమాలకు చేరాయి. పరామర్శల కోసం నేతలు పరుగుపరుగున వచ్చారు. ఎక్స్‌గ్రేషియాలు, సంతాప ప్రకటనలూ సాగాయి. ఆలయ అధికారుల మీద ఎలాగూ చర్యలు తీసుకుంటారు. వీటి వల్ల పోయిన ప్రాణాలు తిరిగిరావని చెప్పేందుకు పెద్దగా తత్వం తెలియాల్సిన పని లేదు. కానీ మున్ముందు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదే మొదటి ప్రశ్న.
బాణాసంచాను నిల్వ చేయడం, ప్రదర్శించడాల గురించి సమాజం ఇప్పటివరకూ చూసీచూడనట్లుగా ఉండేది. దానిని ఒక వినోదంగా భావించేవారే కానీ విపత్తుగా అనుమానించేవారు తక్కువ. కానీ పుట్టంగళ్ పేలుడు ఇలాంటి ప్రమాదాల గురించి గట్టిగా హెచ్చరిస్తోంది. పెళ్లిళ్లు మొదలుకొని తిరునాళ్ల దాకా ఎంత బాణాసంచా కాలిస్తే అంత గొప్ప అనుకునే స్థితిలోకి జారుకుంటున్నాం. ఇలా నిప్పుతో చెలగాటమాడితే ఏం జరుగుతుందో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వమూ తెలుసుకోవాల్సిన రోజు వచ్చేసింది. అలా తెలుసుకుని మరో పుట్టంగళ్ ప్రమాదం జరగకుండా చూసుకోవడమే, ఈ ప్రమాదంలో మరణించినవారికి అసలైన నివాళి!