మధుమేహం- ముందుచూపే అసలు మందు!
posted on Apr 7, 2016 @ 9:57AM
ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పేరుతో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహనను పెంచేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా ఈసారి మధుమేహం మీద తన యుద్ధాన్ని ప్రకటించింది ఆరోగ్య సంస్థ. ఒకప్పుడు మధుమేహాన్ని ఎవరో డబ్బున్నవారికి వచ్చే జబ్బనీ, ఎక్కడో ఒకరికి మాత్రమే కర్మ కొద్దీ ఏర్పడే అసౌకర్యం అనుకునేవారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఒక అధ్యయనం ప్రకారం 1980లో 1.19 కోట్ల మంది భారతీయులు ఈ వ్యాధిబారిన పడితే, ప్రస్తుతం ఈ సంఖ్య ఆరుకోట్లని దాటిపోయిందని అంచనా! మధుమేహం కనుక ఇదే ఊపుతో విస్తరిస్తూ వెళ్తే, భారతదేశం ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మారిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
మధుమేహం రావడానికి జన్యుపరమైన లోపాలే ముఖ్యకారణం అన్న విషయంలో సందేహం లేదు. అయితే అసంబద్ధమైన జీవనశైలి వల్లే ఈ లోపం బయపడుతోందన్నది నిపుణుల మాట. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ, తక్కువ పని చేయడంతో శరీరం త్వరగా మధుమేహానికి లోనవుతోందని తేలింది. బేక్ చేసిన ఆహారపదార్థాలు, శీతలపానీయాలు, మద్యం, వేపుళ్లు, పాలిష్‌డ్ బియ్యం.... ఇవన్నీ మన జీవితంలో భాగమైపోయాయి. తొలుత ఇవి ఊబకాయానికీ, తరువాత మధుమేహానికీ దారితీస్తున్నాయి. అదే స్థానంలో ఆకు కూరలు, పండ్లు, సంప్రదాయ వంటకాలు... మనకు దూరమైపోతున్నాయి. వీటికి తోడు ఏమాత్రం వ్యాయామం లేని జీవనశైలి కూడా కొంప ముంచుతోంది. సీట్లకు అతుక్కుపోయే ఉద్యోగాలు, ఒక్క నాలుగు అడుగులు కూడా వేయడానికి బద్ధకించే మనస్తత్వాలు మనల్ని మరీ సుకుమారంగా మార్చేసి... రోగగ్రస్తులుగా మార్చేస్తున్నాయి. పాఠశాలల్లో ఆటస్థలాలు ఉండవు. ఉద్యోగాలలో ప్రశాంతత కరువు. దీంతో అటు ఆహారమే కాదు మానసిక ఒత్తిడి, శారీరిక స్తబ్దత కూడా మధుమేహానికి కారణాలుగా మారుతున్నాయి.
మధుమేహం రావడం దురదృష్టమే! అయితే, వచ్చిన తరువాత రోగుల ప్రవర్తన కూడా అంతే నిరాశను కలిగిస్తోంది. మధుమేహాన్ని అదుపుచేసుకునేందుకు మందులు ఎంత అవసరమో, జీవనశైలిలో మార్పులు కూడా అంతే అవసరం అన్న నిజాన్ని చాలామంది గ్రహించరు. మధుమేహం వచ్చే లక్షణాలు కనిపించిన వెంటనే జీవనశైలిలో పెనుస్థాయి మార్పులను కనుక తీసుకురాగలిగితే, చాలా రోజులపాటు దాని దుష్ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు. వెల్లుల్లి, మెంతులు, వేప, కాకరకాయ వంటి పదార్థాలను తీసుకోవడం; ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులతో ఒత్తిడిని తగ్గించుకోవడం; రోజులో ఎంతో కొంత నడకను అలవాటు చేసుకోవడం; పాలిష్‌డ్, ప్రాసెస్‌డ్ తదితర ఆహారపదార్థాలకు దూరంగా ఉంటూ, మనం తీసుకుంటున్న కేలరీలను గమనించుకోవడం; ఎప్పటికప్పుడు షుగర్, బీపీలను పరీక్షి చేయించుకోవడం.... లాంటి చర్యలతో శుభ్రంగా మధుమేహంతో కలిసిమెలిసి జీవించవచ్చు.
అదుపులో ఉంటే మధుమేహం వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. అందుకే చాలామంది వైద్యులు దీనిని ఒక రోగంగా కాకుండా ఒక లోపంగా భావిస్తారు. ఆ లోపాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండమని చెబుతారు. కానీ రోగులే అలసత్వాన్ని చూపుతూ ఉంటారు. ఒకసారి మధుమేహం వచ్చిందని తేలాక వైద్యులు ఏ మందులనైతే అందించారో, అవే మందులను తమంతట తాము దశాబ్దాల తరబడి వాడేవారు ఉన్నారు. అసలు మందులనే వాడకుండా ఆయాస, నీరసాలతో నెట్టుకొచ్చేసేవారూ ఉన్నారు. ఇక మందులు ఎలాగూ వాడుతున్నాం కదా అని, ఆహారం నియమాలు పాటించని వారి సంగతి సరేసరి! మన దేశంలో రోగులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు కాబట్టే ఔషధి సంస్థలు కూడా అంతే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయి. ఇష్టం వచ్చిన పాళ్లలో రకరకాల మందులను ఒక చోటకి చేర్చి ఒక పేరుని పెట్టి కౌంటర్ మీదే అమ్మేస్తున్నాయి. అందుకే ఈ మధ్య ప్రభుత్వం నిషేధించిన మందులలో మధుమేహానికి సంబంధించినవి చాలా ఎక్కువమొత్తంలో ఉన్నాయి.
ఇక మధుమేహానికి సంబంధించిన మందులను సుదీర్ఘకాలం వాడితే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయన్న విషయం మీదా తగిన పరిశోధనలు జరగడం లేదు. ఉదాహరణకు పయోగ్లిటజోన్ అనే మందుని సుదీర్ఘకాలం వాడితే మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయినా అటు వైద్యులు కానీ ఇటు ఔషధి కంపెనీలు కానీ ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. మన ఆరోగ్యాన్నంతా ఇప్పుడు కార్పొరేట్ సంస్థలే నియంత్రిస్తున్నాయి కదా! మధుమేహం విషయంలో వచ్చిన మరో పెనుమార్పు వైద్య ఖర్చు. ఒకప్పుడు మధుమేహానికి కావల్సిన మందులను ఫ్యామిలీ డాక్టర్లే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మధుమేహానికి ప్రత్యేకమైన రంగం ఏర్పడింది. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వీరిని కలవాటంటే 500 రూపాయలు కన్సల్టేషన్ ఫీజుకీ, 500 రూపాయలు షుగర్ నిర్థరణకీ సమర్పించుకోవాలి. ఇక మందులు ఇతరత్రా ఖర్చుల సంగతి చెప్పనే అవసరం లేదు. అలా మధుమేహం కూడా ఖరీదైన జబ్బుల జాబితాలోకి చేరిపోయింది.
మధుమేహం అనేది ఇప్పుడేమీ తెలియని వ్యాధి కాదు. ఇది ఎందుకు వస్తుంది. వచ్చాక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి... లాంటి ప్రాథమిక సమాచారం అంతా ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటి తరానికి చిన్నప్పటి నుంచే సరైన జీవనశైలిని అలవాటు చేయాలి. సుదీర్ఘకాలం టీవీల ముందు కూర్చోవడం, వీడియోగేమ్స్‌తో సమయాన్ని గడపడం మాన్పించాలి. వారి తిండి విషయంలోనూ తగినంత జాగ్రత్త వహించాలి. బ్రెడ్డూ, బిస్కెట్, జామ్‌లే వారి అల్పాహారంగా మారకూడదు. పిజ్జాలతో వారి సరదా తీరకూడదు. ఇక అన్నింటికీ మించి వాళ్లు ఆటలాడుకునేందుకు తగినన్ని అవకాశాలు కల్పించాలి. మనమూ కొంత సమయాన్ని వారితో గడిపేందుకు ప్రయత్నించాలి. ఈ కాస్త జాగ్రత్తా తీసుకుంటే వారి కెరీర్ సంగతి తరువాత విషయం, కనీసం వారి ఆరోగ్యానన్నా కాపాడినవారమవుతాం. ఆరోగ్యం బాగుండి మనసు దృఢంగా ఉంటే... కెరీర్ దానంతట అదే దారికొస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ముందు ఉన్న సవాళ్లు రెండు. ఒకటి మనం మధుమేహం నుంచి బయటపడటం. రెండు- మన పిల్లల జోలికి అది రాకుండా చూసుకోవడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుకుంటోంది ఇదే!