గుర్రాలను కూడా బతకనివ్వరా!
posted on Apr 21, 2016 @ 10:48AM
ప్రజా ప్రతినిధులు అంటే ప్రజలకు సేవ చేసేవారు అన్న అభిప్రాయం ఏనాడో పోయింది. ప్రజల మీదా, ప్రజల జీవితాల మీదా, ఆఖరికి ప్రకృతి మీదా తమకి ఎనలేని అధికారం ఉందన్న అహంకారం నేటి నేతలది. ఆ అహంకారాన్ని పెంచి పోషించేలా అడుగులకు మడుగులెత్తే అధికారగణం, ఆకాశాన్నెత్తే అనుచరులు ఎలాగూ ఉన్నారు. ఇలాంటి వారు తప్పు చేసినా మన న్యాయవ్యవస్థలు పెద్దగా పట్టించుకోవన్న అపవాదులు ఉండనే ఉన్నాయి. ఇన్ని సానుకూల అంశాలు ప్రోత్సహించడంతో కొందరు నేతలకు పట్టపగ్గాలు లేకుండా పోతోంది. వారి చేతలకి ప్రజలే అడ్డుచెప్పడం లేదు, ఇంక నోరు లేని జీవాలు ఎందుకు ఎదురుతిరుగుతాయి! కానీ ఈసారి కథ వేరేలా ఉండేట్లుంది. ఓ ఎమ్మెల్యే చేతిలో బలైపోయిన శక్తిమాన్ అనే గుర్రం గురించి విన్న దేశప్రజలకి ఒళ్లుమండిపోతోంది!
మార్చి 14: ఉత్తరాఖండ్ రాజధాని అయిన డెహ్రాడూన్‌లో కొందరు ప్రతిపక్ష సభ్యులు ధర్నాకు దిగారు. ఆ సమయంలో వారిని నిలువరించేందుకు అక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. వాటిలో అశ్వికదళం కూడా ఉంది. ధర్నాను అదుపుచేయడానికి వచ్చిన పోలీసులను చూసేసరికి గణేష్ జోషి అనే బీజేపీ ఎమ్మెల్యేగారికి చెప్పలేనంత కోపం వచ్చింది. అందులోనూ సదరు పోలీసులు గుర్రాల మీద వచ్చేసరికి ఆయన అహం దెబ్బతిన్నట్లుంది. వెంటనే లాఠీ తీసుకుని శక్తిమాన్ అనే ఓ గుర్రం మీద తన ప్రతాపమంతా చూపారు. ఎమ్మెల్యే ఒకో దెబ్బా వేస్తున్నా గుర్రం వెనుకడుగు వేస్తూ వచ్చింది. దాంతో గణేష్ జోషి మరింత రెచ్చిపోయి లాఠీకి పని చెప్పాడు. గణేష్ ఉత్సాహానికి ఆ గుర్రం కాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
గుర్రం కాలు విరిగిన వార్త దేశమంతటా హల్‌చల్ చేయడంతో జోషిగారు నీళ్లు నమలడం మొదలుపెట్టారు. తాను ఊరికనే గుర్రాన్ని అలా అదిలించాననీ, బహుశా గుర్రం కాలుకి వేరే ఎక్కడో దెబ్బతినడంతో, పోలీసులు తన మీద అక్రమంగా కేసు బనాయించారనీ చెప్పుకొచ్చారు. కానీ జోషీగారి ప్రతాపాన్ని చూపే వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో, ఆయన మీద చర్యలు తీసుకునేందుకు కావల్సినన్ని ఆధారాలు దొరికినట్లైంది. పైగా బీజేపీ మంత్రి మేనకా గాంధి వంటి వారు కూడా జోషి తీరుని ఖండించడంతో, ఆయన మీద అభియోగం మోపక తప్పలేదు పోలీసులకి. ఎట్టకేలకు సంఘటన జరిగిన అయిదు రోజులకు పోలీసులు జోషిని అరెస్టు చేయగలిగారు. అప్పుడు కూడా ఆ రాష్ట్ర బీజేపీ ఆయనను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేసింది. పోలీసులు జోషిని కిడ్నాప్ చేశారంటూ మండిపడింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ అనిశ్చితి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని ఆరోపించింది. జోషి మీద సహా ఆ రోజు నిరసనకు సంబంధించి, పోలీసులు పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేసింది.
జోషి సంగతి అలా ఉంటే ఇటు శక్తిమాన్ పరిస్థితి నానాటికీ క్షీణించడం మొదలుపెట్టింది. గుర్రం కాలు బాగుపడటం అంటే మనిషి కాలు బాగుపడినంత తేలిక కాదు. ఎందుకంటే వాటి కాళ్ల నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అవి చురుగ్గా, తేలికగా పరుగులెత్తేందుకు అనుగుణంగా తీర్చిదిద్దబడి ఉంటాయి. వాటిలో ఏ ఒక్క ఎముక బీటవారినా గుర్రం తిరిగి కోలుకోవడం దాదాపు అసాధ్యమవుతుంది. ఆ గుర్రం కాలు తీసివేసి కృత్రిమ అవయవాన్ని అందించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా గుర్రం కోలుకుంటుందని చెప్పలేము. ఒకవేళ కోలుకున్నా అది తిరిగి పరుగులెత్తే స్థితిలో అసలే ఉండదు. పైగా ఇదంతా కూడా ఆ జీవి శరీరానికి చాలా అసౌకర్యాన్నీ, బాధనీ కలిగిస్తుంది. అందుకే చాలామంది తమ పెంపుడు గుర్రాల కాళ్లకు దెబ్బ తగిలితే వాటి జీవితాన్ని ముగించేస్తారు. ఒకరకంగా చెప్పాలంగే గుర్రానికి కాలు పోతే దాని ప్రాణం పోయినట్లే! అయినా కూడా శక్తిమాన్‌ను ఎలాగొలా కాపాడుకోవాలని తాపత్రయపడింది ఆ రాష్ట్ర పోలీసు శాఖ. జోషి దాడికి గాయపడిన శక్తిమాన్ వెనుక కాలుని తీసివేసినా, ఆ స్థానంలో కృత్రిమ కాలుని అమెరికా నుంచి తెప్పించింది. ఇంత జరుగుతున్నా శక్తిమాన్ ఎంతవరకూ కోలుకుంటుందా అని దేశ ప్రజలంతా ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ఎందుకంటే శక్తిమాన్ బరువు 400 కిలోలకు పైమాటే ఉంటుంది. అంత బరువుని కృత్రిమ అవయవం ఎంతవరకూ మోయగలదన్నది మొదటి సమస్య! ఇక దాని కాళ్లను సరిదిద్దేందుకు మరిన్ని శస్త్రచికిత్సలు అవసరం కావడంతో, వాటిని శక్తిమాన్ ఎంతవరకు తట్టుకుంటుందన్నది రెండో సమస్య! భయపడినట్లుగానే నిన్న శక్తిమాన్ ఓ శస్త్రచికిత్స సమయంలో మత్తుమందుని తట్టుకోలేక మరణించింది.
శక్తిమాన్ చనిపోయాక కూడా పాపం ఆ గుర్రాన్ని వదల్లేదు రాజకీయ నాయకులు. బీజేపీ ఎమ్మెల్యే చేతిలో దెబ్బతిన్నది కాబట్టి బీజేపీనే గుర్రం చావుకు కారణం అంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. మరోవైపు బీజేపీ నేతలేమో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఇరికించేందుకేందుకు శక్తిమాన్ ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ చూపలేదని అంటోంది. కేంద్ర మంత్రి మేనక గాంధి మాత్రం పార్టీలకు అతీతంగా ప్రతిస్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు శాఖలో గుర్రాల అవసరం లేదన్నారు మేనకగాంధి. వాటిని హింసిస్తూ, ఇబ్బందుల పాల్చేయడం మానుకోవాలని సూచించారు. అంతేకాదు! శక్తిమాన్ పోలీసు శాఖలో విధులను నిర్వహిస్తోంది కాబట్టి, ఒక పోలీసు ఆఫీసరుని చంపిన అభియోగం కింద సదరు ఎమ్మెల్యేను విచారించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ వినడానికి సబబుగానే ఉన్నా, అది ఎంతవరకు ఆచరణసాధ్యమో చెప్పలేం. ప్రస్తుతానికి మాత్రం IPC సెక్షన్ 429 కింద మాత్రమే జోషి కేసుని ఎదుర్కొంటున్నారు. ఈ చట్టం కింది ఆయనకు మహా అయితే ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. కానీ జంతువులకు సంబంధించిన చట్టాలు పరమ బలహీనంగా ఉన్న మన దేశంలో ఈ శిక్షే చాలా ఎక్కువని సంబరపడక తప్పదు. ఎందుకంటే సాధారణంగా జంతువుల మీద ఎవరన్నా అకృత్యాలకు పాల్పడినప్పుడు వారి మీద ‘జంతు హింస వ్యతిరేక చట్టం – 1960’ కింద కేవలం 10 నుంచి 50 రూపాయలు చెల్లించి దర్జాగా తప్పించుకోవచ్చు!
ఆపదలో ఆదుకునేవారికి సాయపడే సూపర్ హీరో పేరే శక్తిమాన్! ఆ పాత్ర పేరు మీదుగానే ఈ గుర్రానికి శక్తిమాన్ అని ముద్దుగా పిలుచుకోసాగారు ఉత్తరాఖండ్ పోలీసులు. పదేళ్లుగా ఉత్తరాఖండ్ ప్రజలను రక్షిస్తున్న ఈ శక్తిమాన్ తమను ఆపద నుంచి గట్టెక్కిస్తోందనుకుని మురిసిపోయారు. కానీ ఈ శక్తిమాన్ ఓడిపోయింది. మన ప్రజాప్రతినిధుల ముందు ఈ శక్తిమాన్ నిలబడలేకపోయింది. కుప్పకూలిపోయింది. నేతలా మజాకా!