ప్రపంచంలో వారసత్వ దినోత్సవం... మరి మనం!
posted on Apr 18, 2016 @ 10:14AM
మనుషులకు వారసత్వాలుగా ఇళ్లూ, స్థలాలూ దొరుకుతాయి. ఇంకా కావాలంటే ఇంటిపేర్లూ, వంశ చరిత్రలూ లభిస్తాయి. కానీ అంతకంటే ఘనమైనది సమాజానికి దొరికే వారసత్వం. అది మన సంస్కృతిలో ఉంటుంది. ఆ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలలో ఉంటుంది. మరి ఆ కట్టడాల గురించి మనకి ఉన్న శ్రద్ధ ఎంత అంటేమాత్రం తెల్లమొగం వేయక తప్పదు.
భారతీయులకు తమ ఇతిహాసాల మీద ఉన్న శ్రద్ధ చరిత్ర మీద లేదనీ, వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడంలో చూపే ఆసక్తి వారసత్వ కట్టడాల మీద ఉండదనీ ఓ విమర్శ. ఇందుకు తెలుగువారు మినహాయింపు కాదు అని చెప్పేందుకు కావల్సినన్ని ఉదాహరణలే ఉన్నాయి. ఒకానొక సమయంలో ప్రపంచానికంతటికీ బౌద్ధ కేంద్రంగా నిలిచిన అమరావతి స్తూపాన్ని చితక్కొట్టిన చరిత్ర మనది. అలాగని దేవాలయాలనన్నా మనం కాపాడుకున్నామా అంటే అదీ లేదు. తెలుగునాట వందల ఏళ్లనాటి దేవాలయాలు కూడా పాడుబడిపోయి కనిపిస్తాయి. గుడికి ప్రశాంతత కోసమో, శిల్ప సంపదను చూడటం కోసమో, దైవభక్తితోనో కాకుండా... కేవలం ఫలితం కోసమే వెళ్లే రోజులు కదా ఇవి! ఒకప్పుడు పుణ్యక్షేత్రాల సందర్శనలో ఆరాధనతో పాటు అనుభూతి కూడా భాగంగా ఉండేది. ఇప్పుడు ఆరాధనతో పాటు ఆటవిడుపు మాత్రమే తోడవుతోంది.
దేవాలయాలు సహా వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడంలో తమిళతంబిలు, మహారాష్ట్ర వాసులు మనకంటే జాగ్రత్తగానే ఉన్నారు. ఆ జాగ్రత్తే కనుక లేకపోతే రెండువేల సంవత్సరాల పురాతనమైన అజంతా బొమ్మలు ఎప్పుడో చెరిగిపోయి ఉండేవి, మహాబలిపురంలోని రాతి కట్టడాలు ముక్కలై సముద్రంలో కలిసిపోయి ఉండేవి. వారసత్వ కట్టడాలను రక్షించుకోవడం ఒక ఎత్తైతే, వాటిని పర్యటక ప్రదేశాలుగా మలచుకోవడం మరో ఎత్తు. ఈ రెండింటిలోనూ తెలుగునాట ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టే యునెస్కో గుర్తించిన 1031 ప్రదేశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో లేదు. అమరావతి స్తూపం నుంచి అలంపురం ఆలయాల వరకూ ఘనంగా చెప్పుకునే కట్టడాలేవీ యునెస్కో జాబితాలో కనిపించవు. నిజాం నవాబుల కట్టడాలు, కాకతీయుల చిహ్నాలను ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉందని చెబుతున్నా, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన లాబీయింగ్ చేయల్సి ఉంటుంది. ఎందుకంటే తమిళనాట బృహదీశ్వరాలయం, పంజాబు గోల్డెన్ టెంపుల్ వంటి కట్టడాలెన్నో ఈ జాబితాలో చేరేందుకు పోటీపడుతున్నాయి మరి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ ప్రదేశాల మీద ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 1983 నుంచి యునెస్కో ‘ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. అయితే ఈ ఒక్క రోజు అవగాహన కల్పిస్తే సరిపోని నిర్లక్ష్యం మనది. తెలుగునాట ఏ గ్రామాన్ని చూసినా ఏదో ఒక చరిత్ర వినిపిస్తుంది, ఏదో ఒక కట్టడం శిథిలమై కనిపిస్తుంది. కానీ వాటిని నమోదు చేసే ప్రక్రియ కానీ, పరిరక్షించే క్రియ కానీ ఏదీ కనిపించదు. కొన్నాళ్లకి ఆ చరిత్ర నాశనం అయిపోతుందని తెలిసినా పట్టించుకోనంత నిర్లక్ష్యం మనది. మహా అయితే భారతీయ పురావస్తు శాఖ వారు సదరు కట్టడాల వద్ద ఓ బోర్డుని పెట్టి, ఓ కంచెని వేసి, ఓ ఉద్యోగిని నియమించి చేతులు దులుపుకుంటారు. మన ఊళ్లోనే ఉందికదా, చూసివద్దాం అని ఎవరన్నా సంప్రదాయం తప్పి సదరు స్థలానికి చేరుకుంటే అక్కడి చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. ఎవరో ఒకరు పూనుకుని పునరుద్ధరిస్తే తప్ప కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్న కట్టడాలు మరెన్నో. అలంపురం ఆలయాలు నదీగర్భంలో మునిగిపోకుండా ఉద్యమాన్ని సాగించిన గడియారం రామకృష్ణ శర్మ వంటి వారు ప్రతి ఊళ్లో ఉండరు కదా!
ఇప్పుడు ఎలాగూ తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. తమ అస్తిత్వం గురించీ, ఘనమైన వారసత్వం గురించీ గుర్తించడం మొదలుపెట్టారు. తెలంగాణలో కాకతీయులనీ, ఆంధ్రలో అమరావతినీ పదే పదే తల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అయినా తమ చరిత్రనీ, ఆ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లనీ రక్షించుకునేందుకు తగిన ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాము. లేకపోతే హైదరాబాదు సంస్కృతికి చార్మినారు కాదు, హైటెక్ సిటీ గుర్తుగా నిలుస్తుంది. బహుశా ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చేసిందేమో!
చివరగా మరో మాట! ఈసారి ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ప్రాచీన క్రీడలు కూడా మన ఘనవారసత్వంలో ఓ భాగమేనంటూ యునెస్కో పేర్కొంది. ఈసారి వారసత్వ దినోత్సవాన్ని క్రీడలకు అంకితం చేసింది. కానీ ప్రపంచీకరణ మోజులో పడిపోయిన మన జనం ప్రాచీన క్రీడల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తల్చుకోవాలంటే... మరో వ్యాసంలో వాపోవాల్సిందే!