ప్రపంచాన్ని తలకిందులు చేసిన కుంభకోణం
posted on Apr 5, 2016 @ 10:18AM
పొలం అమ్మిన డబ్బులను బ్యాంకులో వేసుకుంటే ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపిస్తుంది. ఆటో ముందు చక్రం ట్రాఫిక్ గీత దాటితే అధికారులు చలాన్లను నింపుతారు. కానీ పనామా పేపర్స్ బయటపెడుతున్న వివరాలు చూస్తే, ప్రపంచంలోని నిబంధనలన్నీ పేదవాళ్ల కోసమే రూపొందించినట్లు తోస్తుంది. పనామా పేపర్స్.... పేదవాడి రక్తాన్ని ఉడికిస్తున్న పేరు ఇది. 40 ఏళ్లుగా బడాబాడులు కలిసి బడుగుల నుదుట రాసిన రాత ఇది. దాని కథ ఇది!
అమితాబ్, ఐశ్వర్య, జాకీచాన్, ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ, రష్యా అధ్యక్షుడు పుతిన్... ఇదంతా ఏదో ప్రతిభావంతుల జాబితా కాదు! పనామా పేపర్స్ ముసుగు చించిన పన్ను ఎగవేతదారుల చిట్టా. వీరంతా కలిసి తమ ప్రభుత్వాలని మోసం చేసి, విదేశాలలో కోట్లకు కోట్లు దాచుకున్నారన్నది ఈ కుంభకోణంలోని ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది ఎవరో నోరుజారిన రాజకీయవేత్త కాదు. దాదాపు 80 దశాలకు చెందిన 377 మంది జర్నలిస్టులు. ఈ పరిశోధనలో మన దేశానికి చెందిన ఇండియన్ ఎక్సప్రెస్‌కు కూడా భాగస్వామిగా ఉంది. ‘ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్‌వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్’ అనే అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో సాగిన శోధన ఇది.
తరాలు గడిచినా తరగనంత డబ్బున్నవారు, విదేశాలలో తమ నల్లధనాన్ని దాచుకోవడం కొత్తేమీ కాదు. ఇలాంటి నల్లధనాన్ని తమ వద్ద దాచుకోమంటూ కొన్ని చిన్నా చితకా దేశాలు సంపన్నులను ప్రోత్సహిస్తుంటాయి. డబ్బు మీద డబ్బు వచ్చిపడుతుంటే దాన్ని తమ దగ్గర దాచుకోమంటూ ఊరిస్తుంటాయి. సదరు దేశాల్లో డబ్బు దాచుకుంటే వాటి మీద పన్ను ఉండదు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న అనుమానం ఉండదు. అన్నింటికీ మించి ఈ డబ్బుకి సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించే ప్రశ్నే ఉండదు. ఈ దేశాల్లో నల్లధనాన్ని రెండు రకాలుగా దాచుకుంటారు. ఒకటి- అక్కడి బ్యాంకులలో ఏదో ఒక బినామీ పేరుతో డబ్బుని దాచుకుంటారు. ఈ మాటని వినగానే మనకు స్విస్ బ్యాంకులే గుర్తుకువస్తాయి. రోజురోజుకీ ఈ స్విస్ బ్యాంకుల మీద ఆరోపణలు పెరిగిపోవడంతో... ఇప్పుడు రెండో పద్ధతి ద్వారా డబ్బుని దాచుకోవడం మొదలైంది. అదే షెల్ కంపెనీల పద్ధతి.
షెల్ కంపెనీ పద్ధతిలో ఏదో ఒక కంపెనీని చట్టబద్ధంగా సృష్టిస్తారు. ఇక అక్కడి నుంచీ ఆ కంపెనీతో తమ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు. దానికి పెట్టుబడిని సమకూరుస్తున్నట్లుగా బినామీ పేర్లతో భారీ షేర్లను కొనుగోలు చేయించవచ్చు; సదరు కంపెనీ మీద విపరీతమైన లాభాలు వచ్చేసినట్లు చూపించవచ్చు; ఈ చిన్నపాటి కంపెనీ పనితీరు నచ్చేసి ఎవరో విపరీతమైన ధరకు దాన్ని కొనుగోలు చేసినట్లు చూపించవచ్చు... చివరికి డబ్బుని ఒక్కసారిగా మాయం చేయాలంటే, కంపెనీ విపరీతమైన నష్టాల్లో ఉందని చెప్పి మూసేయించవచ్చు. ఈ పద్ధతి ద్వారా కనిపించే లాభనష్టాలు అన్నీ చట్టప్రకారమే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో అన్ని లొసుగులనూ వాడుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.
ప్రస్తుతానికి ఇలాంటి చట్ట’వ్యతిరేక’ సంస్థలకు ప్రాణం పోసే ఓ పెద్ద కంపెనీ గుట్టు రట్టయ్యింది. డబ్బుకి సంబంధించి ఇలాంటి దివాళాకోరు పనులు జరుగుతాయని అందరికీ తెలిసినా, మరీ ఈ స్థాయిలో... ప్రపంచానికి సమాంతరంగా మరో ఆర్థిక ప్రపంచం నడుస్తోందన్న నిజం మాత్రం ఇప్పుడు భయం గొలుపుతోంది. ఒక్క భారతదేశం నుంచే దాదాపు 500 మంది ప్రముఖుల పేర్లు ఈ కుంభకోణంలో వినిపిస్తున్నాయంటే, మనం ఎందరు బుద్ధిజీవుల మద్య బతుకుతున్నామో తెలుస్తోంది. ఇక కమ్యూనిస్టులు అక్రమాలకు పాల్పడరు, ఆఫ్రికాలో పేదరికం తాండవిస్తుంది... వంటి వాక్యాలు కూడా ఈ కుంభకోణంతో వెలవెలబోయాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా కమ్యూనిస్టు నాయకుల పేర్లు ఈ పేపర్లో కనిపించాయి. ఘనా, కాంగో వంటి ఆఫ్రికా దేశాల అధినేతల పేర్లూ ఈ చిట్టాలో చోటు చేసుకున్నాయి.
ఈ కుంభకోణానికి కేంద్రబిందువుగా పనామా నిలిచింది. ఒకప్పుడు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ పనామా కెనాల్‌ను నిర్మించిన ఈ గడ్డ మీదే, ఇప్పుడు నల్లధనం మరో సముద్రమై ప్రవహిస్తూ కనిపించింది. ఈ దేశంలో ఉన్న మొస్సాక్ ఫోన్సెకా అనే ఓ సంస్థ, వాణిజ్య సేవల పేరుతో, నల్లధనాన్ని ఎలా చట్టబద్ధంగా మార్చుకోవాలో ఈ సంస్థ సూచిస్తున్నట్లు తేలింది. 1977లో ఈ సంస్థ ఏర్పాటైన దగ్గర్నుంచీ గడచిన నాలుగు దశాబ్దాలో ఈ కళలో మొస్సాక్ ఫోన్సెకా ఆరితేరిపోయింది. వ్యాపారస్తుల దగ్గర్నుంచీ దేశాధ్యక్షుల వరకూ నల్లధనానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా తన వైపు చూసే స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. కానీ పాపం పండక తప్పలేదు. ఒళ్లు మండిన మాజీ ఉద్యోగి ఎవరో మొస్సాక్ ఫోన్సెకాకు సంబంధించిన వ్యవహారాన్నంతా బట్టబయలు చేయడంతో నిష్టురమైన నిజాలన్నీ ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చాయి.
రాబోయే రోజులలో ఈ కుంభకోణంలో మరిన్ని పేర్లు బయటపడవచ్చు. ప్రభుత్వాలకు ప్రభుత్వాలే కూలిపోవచ్చు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న పనామా పేపర్స్ ద్వారా ఏదైనా జరగవచ్చు. కానీ ఒక్కటిమాత్రం వాస్తవం! ఒకవైపు ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే... కోట్ల కొద్దీ రూపాలయను దర్జాగా దాచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు ఎలా కల్పించగలుగుతున్నాయి? రూపాయి రూపాయికీ లెక్కలు అడిగి పన్నులు వసూలు చేసే వ్యవస్థలు, పెద్దవారిని చూసీ చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నాయి? ఈ ప్రశ్నలకి కనుక సరైన సమాధానం లభించకపోతే, రగులుతున్న పేదవాడి మనసు పగలక మానదు. అప్పుడు వచ్చే విప్లవం ముందు ఫ్రాన్స్, రష్యా విప్లవాలు సైతం చిన్నబోతాయి. అలాంటి పరిస్థితి రాకుండానే, ప్రభుత్వాలు కళ్లు తెరవాలని కోరుకుందాం.