ఇరోం షర్మిళ పోరాటం ఇది!
posted on Apr 2, 2016 @ 9:53AM
సువిశాలమైన భారతదేశం. దేశంలో పదుల కొద్దీ రాష్ట్రాలు, వందల కొద్దీ భాషలు, వేల కొద్దీ వర్గాలు... ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు ఎక్కడో ఒకచోట సమస్యలు చెలరేగుతూనే ఉంటాయి. ఆ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఒకోసారి వివాదాస్పదం అవుతుంటాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ జీవితాలకు హాని కలుగుతుందని చెప్పగలిగే గొంతుకలు కావాలి. ఆ గొంతుకను బలపరిచే ధైర్యం సామాన్యులలోనూ ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది. దానికి ఉదాహరణే ఇరోమ్ చాను షర్మిళ జీవితం!
ఇరోమ్ షర్మిళ మణిపూర్‌కి చెందిన ఒక సాధారణ మహిళ. ఆ రాష్ట్ర రాజధాని ఇంపాల్‌లో 19 మంది కుటుంబ సభ్యుల మధ్య పెరుగిన ఓ మధ్యతరగతి మనిషి. షర్మిళ మొదటి నుంచీ మానవ హక్కుల ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేది. అయితే పూర్తి స్థాయి పోరాటం చేయాలన్నా ఆలోచన ఆమెకు ఏమాత్రం లేదు. మణిపూర్ సహా ఈశాన్యంలో ఉన్న ఏడు రాష్ట్రాలలోని పరిస్థితులు భారతదేశంలోని మిగతా ప్రాంతాలకంటే కాస్త భిన్నంగా ఉంటాయి. అక్కడ భౌగోళిక వాతావరణం, ప్రజల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వైరుధ్యాల వల్లనైతేనేం, స్థానిక తెగల మధ్య ఉన్న గొడవల వల్లనైతేనేం... వేర్పాటువాద ఉద్యమాలు అక్కడ ఊపందుకున్నాయి. ఈ ఉద్యమాలను అణచివేసేందుకు 1958లో Armed Forces Special Powers Act (AFSPA) అనే చట్టాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం.
AFSPA వల్ల అక్కడ విధులను నిర్వహిస్తున్న సైనికులకు విస్తృతమైన అధికారాలను కల్పించింది కేంద్రం. ఈ చట్టం కింద జవానులు ఎవరి ఇంట్లోనైనా వారెంట్ లేకుండానే సోదా చేయవచ్చు. ఎవరినైనా నిర్బంధించవచ్చు. దేశవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అనుమానం వస్తే ఎవరి మీదైనా చర్యలు తీసుకోవచ్చు. సహజంగానే ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. అనుమానాస్పదం అన్న మాటకి అర్థం లేకుండా పోయింది. పౌరులు మాయం కావడం, శవాలుగా తేలడం సాధారణమైపోయింది. పనిలో పనిగా సైన్యం పేరుతో వేర్పాటువాదులు కూడా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడేవారన్న విమర్శలూ ఉన్నాయి. ఏదైతేనేం. AFSPA పట్ల ప్రజల్లో వ్యతిరేకత కలిగిన మాట మాత్రం వాస్తవం! అది తమ హక్కులను హరిస్తోందన్న వారి భయంలో నిజం లేకపోలేదు!
నవంబరు 2, 2000. ఆ రోజు గురువారం. ప్రతి గురువారంలాగానే ఆ రోజు కూడా షర్మిళ తన ఇష్టదేవత లక్ష్మీదేవి పేరిట ఉపవాసం ఉంది. కానీ ఆ రోజు జరిగిన ఓ ఘటనతో, ఆ రోజు మొదలుపెట్టిన ఉపవాసాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. మలోం అనే పట్నంలో జరిగిన ఒక ఘటనే ఇందుకు ప్రేరణ! ఆ రోజు మలోంలోని ఒక బస్టాపులో నిల్చొన్న పదిమంది పౌరులను నిర్దాక్షిణ్యంగా కాల్పి పారేశారు. సైన్యానికి చెందిన అసోం రైఫిల్సే ఈ ఘటనకు కారణం అన్నది ఆరోపణ. ఈ సంఘటనలో మృతి చెందిన వారి జాబితాను గమనిస్తే వారంతా అన్నెంపున్నెం ఎరుగని అమాయకులని స్పష్టం అయిపోతుంది. అలాంటి అమాయకులని పొట్టన పెట్టుకోవడంతో మణిపూర్ సమాజం విస్తుపోయింది. AFSPA చట్టం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని షర్మిళ అభిప్రాయపడింది. వెంటనే తన ఉపవాసాన్ని కొనసాగించింది. AFSPAని ఉపసంహరించేదాకా పచ్చి మంచినీరు కూడా ముట్టనని, జుట్టు కూడా దువ్వుకోనని, కనీసం అద్దంలో తన మొహం కూడా చూసుకోనని శపథం చేసింది.
షర్మిళ ఉపవాసాన్ని సాగించడం చూసి ఆమెకు పిచ్చి పట్టిందనుకున్నారు కొందరు. పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ప్రచారం కోసమే ఇదంతా చేస్తోందని మరికొందరు విమర్శించారు. ఆనాటి మృతులలో షర్మిళ ప్రియుడు కూడా ఉన్నాడనీ, అతనికోసమే ఇలా ప్రవర్తిస్తోందనీ మరికొందరు పేలారు. సమాజం కోసం ఒక మహిళ తన జీవితాన్ని బలి చేసుకునేందుకు సిద్ధపడటం ఏమిటన్నదే అందిరోనూ మెదిలిన సందేహం. కానీ రోజులు గడిచేకొద్దీ ఆమె పట్టుదల ప్రపంచానికి తెలియడం మొదలుపెట్టింది. షర్మిళ తన దీక్షను విరమించేందుకు నిరాకరించడంతో, ఆమెను అరెస్టు చేసి ముక్కు ద్వారానే పోషకాలను అందించడం మొదలుపెట్టారు.
గత పదహారు సంవత్సరాలుగా ఏదో ఒక కేసులో జైలులోనో, లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణలో ఆసుపత్రిలోనే షర్మిళ గడిపింది. రెండు రోజుల క్రితం ఆమెను ఆత్మహత్యాయత్నం కేసు కింద కోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, ఆమె ఇంకా ప్రభుత్వ పర్యవేక్షణలోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో, పోలీసుల కనుసన్నల మధ్య ఆమె దీక్ష సాగుతోంది. ఇంత సుదీర్ఘ కాలం నిరాహారదీక్షను చేసిన రికార్డు బహుశా షర్మిళదే అయి ఉండవచ్చు. ముక్కు ద్వారా ఇన్నేళ్లు ఆహారం తీసుకున్న రికార్డు కూడా ఆమెదేనేమో! కానీ ఇవేమీ మన దేశం గర్వించే రికార్డులు కావు. ప్రభుత్వాలు మారుతూ వస్తున్నా, మారుతున్న దేశాధినేతలకు షర్మిళ ఉత్తరాలు రాస్తున్నా... AFSPA చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. విడతలవారీగా ఈ చట్టాన్ని ఉపసంహరిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా, ఇంకా దాని ఆనవాళ్లు అక్కడ బలంగానే ఉన్నాయి.
షర్మిళ దీక్షకి సాయంగా తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ముందుకు వస్తున్నాయి. షర్మిళకు మద్దతుగా 2004లో అసోం రైఫిల్స్ కార్యాలయం ముందు కొందరు మహిళలు చేసిన నగ్న ప్రదర్శనతో ప్రపంచం విస్తుబోయింది. షర్మిళకు అంతర్జాతీయ సమాజం కూడా తోడుగా నిలవడం మొదలుపెట్టింది. దేశ విదేశాల నుంచి అవార్డులు రివార్డులు సరే. ఆమె పేరు మీద విశ్వవిద్యాలయాలలో ఉపకారవేతనాలు, షర్మిళ దీక్షను బలపరిచే ఉద్యమాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం కూడా ఒకో మెట్టూ దిగివస్తోంది. మరికొద్ది రోజులలోనే AFSPA చట్టాన్ని మణిపూర్ నుంచి పూర్తిగా తొలగించే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి ఒక్రాం సింగ్ ఇటీవలే పేర్కొన్నారు. అదే కనుక జరిగితే తన తల్లి చేత్తో తొలి ముద్దను తినేందుకు షర్మిళ సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం!