తీవ్రవాదానికి మరో పేరు- మౌలానా మసూద్ అజార్!
posted on Apr 4, 2016 @ 3:26PM
మౌలానా మసూద్ అజార్! ఒకప్పుడు చిన్నపాటి తీవ్రవాద సంస్థకి అధినాయకుడిగా ఉంటూ, ఆ సంస్థ కోసం విరాళాలు సేకరించుకునే వ్యక్తి, ఇప్పుడు భారతదేశానికి తొలి శత్రువుగా మారాడు. తాను ఉగ్రవాడిని కాదంటూ సాక్షాత్తూ చైనా చేతే ముద్ర వేయించుకుని, బోర విరుచుకుని తిరుగుతున్నాడు. మనిషిగా ఎదగడానికి చాలా శ్రమించాలి. కానీ ఒక తీవ్రవాదిగా పేరు సంపాదించుకోవడానికి, తనలోని మానవత్వాన్ని చంపుకోవాలి. అందులో అజార్ నిష్ణాతుడు. అందుకే ఈ రోజున తను మన నోళ్లలో నానుతున్నాడు. పాకిస్తానులోని పంజాబులో మొదలై ఐక్యరాజ్య సమితి దగ్గర ఆగిన అజార్ ప్రస్థానం తీరు ఇది...
1968లో అజార్ ఓ స్కూల్ హెడ్మాస్టరు ఇంట పుట్టాడు. ఆ ఇంట 11 మంది సంతానం. అసలు చదువుకోకుండా ఉంటే అజార్ తీరు ఎలా ఉండేదో కానీ, కరాచీలోని `జామియా ఉలూమ్ ఉల్ ఇస్లామియా` అనే మతబోధనాసంస్థలో చేరడంతో, అజార్ దృక్పథం అతివాదం వైపు మళ్లింది. కశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశం బలవంతంగా ఆక్రమించుకుందనీ, అక్కడ ఉండే సాటి ముసల్మానులను చిత్రహింసలు పెడుతోందనీ... ఆ బడిలోని పిల్లలందరూ వినే మాటలనే అజార్ కూడా విని ప్రభావితుడయ్యాడు. కశ్మీర్‌ను ఎలాగైతే భారతదేశం నుంచి విడదీయాలని కంకణం కట్టుకున్నాడు. `హర్కత్ ఉల్ అన్సార్` అనే తీవ్రవాద సంస్థలో చేరి, తనలోని అతివాదానికి పదునుపెట్టాడు. ఆ సంస్థ తరఫున అనేక తీవ్రవాద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టాడు అజార్. అలా ప్రపంచమంతా తిరుగుతూ, రకరకాల తీవ్రవాద సంస్థలతో పరిచయాలను ఏర్పరుచుకున్నాడు. సోమాలియా వంటి మారుమూల దేశాలలో సైతం సంచరిస్తూ, ప్రపంచమంతటా ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు ప్రయత్నించాడు.
అంచెలంచెలుగా ఎదుగుతున్న అజార్ ఉనికిని భారతదేశం మొదట్లోనే గ్రహించింది. అందుకే 1994లో అజార్ ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని పోషించేందుకు శ్రీనగర్లో అడుగుపెట్టాడో, అదనుచూసిన భారతీయ దళాలు అజార్‌ను పట్టుకున్నాయి. అజార్‌ను శిక్షించేందుకు మన న్యాయవ్యవస్థ ఎప్పటిలాగే నిదానంగా ప్రతిస్పందించింది. ఈలోగా అజార్‌ను విడిపించుకునేందుకు అజార్ తమ్ముడు ఇబ్రహీం పన్నిన వ్యూహంలో మన దేశం చిక్కుకోక తప్పలేదు. 1999 డిసెంబరులో ఇబ్రహీం మరి కొందరు తీవ్రవాదులతో కలిసి ఏకంగా ఓ భారతీయ విమానాన్నే హైజాక్ చేశాడు. బదులుగా అజార్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రవాదులను భారతీయ ప్రభుత్వం విడిపించాలంటూ షరతుని విధించాడు. విమానంలో వందమందికి పైగా ప్రయాణికులు. పైగా విమానాన్ని నిలిపింది తాలిబాన్లు పాలిస్తున్న కాందహార్ ప్రాంతంలో! దాంతో భారతీయ ప్రభుత్వం తల వంచక తప్పలేదు. క్లిష్ట పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోలేమన్న విమర్శలను స్వాగతిస్తూ, భారతీయ అధికారులు సదరు తీవ్రవాదులను సగౌరవంగా వారి దోస్తులకు అప్పగించారు.
అజార్‌ను అప్పగించకపోతే వంద ప్రాణాలు పోతాయన్న భయం సహేతుకమే! కానీ అలాంటి తీవ్రవాదికి మళ్లీ అవకాశం కల్పిస్తే ప్రపంచం ఏమైపోతుందో మనం ఊహించలేకపోయాం. ఫలితం! పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ISI అజార్‌ను సాదరంగా తోడ్కొని తమ దేశంలోకి తీసుకువెళ్లింది. పైగా అజార్ తమ దేశంలో ఎలాంటి నేరాలూ చేయలేదు కనుక అతడి మీద ఎలాంటి చర్యలూ తీసుకోమని తేల్చి చెప్పింది. అంతకంటే దారుణం ఏమిటంటే, ISI స్వయంగా స్థాపించిన జైష్ ఏ మహమ్మద్ అనే సంస్థకు నాయకుడిగా పట్టం కట్టింది. అలా పాముకి పాలు పోసి, కోరలు పెంచి ప్రపంచం మీదకి వదిలింది పాకిస్తాన్. ఇంత అవకాశం ఇచ్చాక అజార్ ఊరుకుంటాడా.. `భారత దేశాన్ని నాశనం చేసేదాకా నిద్రపోనని` కరాచీలో ఓ బహిరంగ సభను నిర్వహించి మరీ ప్రతిన పూనాడు. అన్నట్లుగానే 2001లో ఏకంగా భారత పార్లమెంటు మీదే దాడి చేయించాడు. ప్రాణనష్టం అటుంచితే, మన ప్రజాస్వామ్యమే ఈ చర్య ద్వారా అపహాస్యం అయిపోయింది. అప్పుడు కూడా పాకిస్తాన్ అజార్‌ను వెనకేసుకు వచ్చింది. ఓ ఏడాది పాటు గృహనిర్బంధంలో ఉంచుతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.
పాకిస్తాన్ అండగా అజార్ కశ్మీర్ ఉగ్రవాదాన్ని కొత్త లోతులకు తీసుకువెళ్లాడు. అదను చూసి పఠాన్‌కోట్‌లోని మన వైమానికస్థావరం మీదే దాడి చేయించాడు. మన రక్షణ వ్యవస్థ ఇంత బలహీనంగా ఉందంటూ సిగ్గుపడేలా చేశాడు. ఈ ఘటనలో రక్షణదళాలకు చెందిన ఏడుగురు అశువులు బాశారు. దాడికి కారణం అజారే అంటూ మన దేశం ఎన్ని ఆధారాలను చూపినా పాకిస్తాన్ ఒప్పుకునేందుకు సిద్ధపడలేదు సరికదా, అమెరికా వంటి దేశాల నుంచి ఒత్తిడి పెరిగిన తరువాత కూడా అజార్ జోలికి వెళ్లలేదు. తన ఒంటి మీద చేయి వేసి చూడండి అంటూ అజార్ సవాలు విసిరినా కిమ్మనకుండా ఉండిపోయింది. పాకిస్తాన్ తనంతట తానుగా అజార్ మీద చర్య తీసుకోదని భారత్‌కు అర్థమైపోయింది. దాంతో ఐక్యరాజ్యసమితి ద్వారా అతని మీద నిషేధం విధించేందుకు ప్రయత్నించింది. ఈ నిషేధం కనుక అమలైతే, అజార్ కదలడానికి వీలుండదు. అతని ఆస్తులని స్థానిక ప్రభుత్వం జప్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్రతిపాదనను పాకిస్తాన్ ఎందుకు ఆమోదిస్తుంది! అందుకని తన మిత్ర రాజ్యమైన చైనాని ఒప్పించి మరీ ఐరాసలో మన దేశం చేసిన ప్రతిపాదన వీగిపోయేట్లు చేసింది.
చైనా వంటి అగ్రదేశం ఒక తీవ్రవాదిని వెనకేసుకు రాడం కంటే దౌర్భాగ్యం మరేముంటుంది? కానీ ఈసారి మాత్రం అజార్‌ను చూస్తూ ఊరుకునేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ శాంతిని కాంక్షించే దేశమే కావచ్చు. కానీ సహనానికి కూడా హద్దులు ఉంటాయని పాకిస్తాన్ ఇంకా గ్రహించినట్లు లేదు. తన దేశం మీద దాడి చేశాడని బిన్‌లాడెన్‌ను పట్టుకునేందుకు అమెరికా ఏకంగా ఒక యుద్ధమే చేసింది. మరి భారత్ ఏం చేయబోతోంది అన్నదే ఇప్పటి ప్రశ్న. యుద్ధం అనేది చాలా పెద్ద మాటే కావచ్చు. కానీ అజార్‌ను నిలువరించేందుకు పాకిస్తాన్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావలసిన అవసరం మాత్రం ఉంది. లేకపోతే తీవ్రవాదులకు దేశభక్తి ఉండదని పాకిస్తాన్ గ్రహించే రోజులు వస్తాయి. తాను పెంచి పోషించినవారు తన పౌరుల మీదే దండెత్తే దారుణాలు కనిపిస్తాయి. మొన్న లాహోర్లో జరిగింది ఇదే!