మన విద్యాలయాలకు ఏమైంది!
posted on Apr 9, 2016 @ 2:04PM
మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ..నిన్న జేఎన్‌యూ..నేడు శ్రీనగర్ నిట్ ఎందుకు మన విశ్వవిద్యాలయాలు రాజకీయ రణ క్షేత్రాలుగా మారుతున్నాయి. దేశ ఐక్యత, సమగ్రతలకు పెద్దపీట వేసే దిశగా పునాదులు ఏర్పర్చుకునేందుకు దోహదపడాల్సిన విద్యాలయాలలో రాజకీయాలు చోటు చేసుకోవడం, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా విశ్వమానవ సౌభ్రాతృత్వంతో విశాల దృక్పథాలను అలవర్చుకునేందుకు వాటిని పెంపొందించే దిశలో కీలక భూమిక పోషించాల్సిన విశ్వవిద్యాలయాలు కొందరు రాజకీయ నాయకుల స్వార్ధం కోసం వాటి లక్ష్యాన్ని కోల్పోతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రాజుకున్న నిప్పు దళిత రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ప్రాణం తీసింది. ఇక అక్కడి నుంచి ఇది రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని బడా రాజకీయ వేత్తలందరూ హెచ్‌సీయూకీ క్యూకట్టారు. నేరం మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ ఘటన కళ్ల ముందు కదులుతుండగానే ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మరోక వివాదం చెలరేగింది.
పార్లమెంట్‌పై దాడి చేసి భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసిన ఘటనలో ఉరితీయబడిన ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని జేఎన్‌యూలో నిర్వహించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిని విశ్వవిద్యాలయంలో అనుమతించింది ఎవరు? అనే చర్చ జరుగుతుండగానే అక్కడి విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేయడంతో ఇక్కడ మళ్లీ రాజకీయం రంగప్రవేశం చేసింది. కన్హయ్య కుమార్ అరెస్ట్ , విడుదల వివాదం సద్దుమణిగి వాతావరణం చల్లబడుతున్న సమయంలో మరోసారి కేంద్ర విశ్వవిద్యాలయంలో అగ్గిరేగింది. అందుకు వేదిక శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలవ్వడంతో స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దాంతో స్థానికేతర విద్యార్థులు భారత అనుకూల నినాదాలు చేశారు. వీరిద్దరూ పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగారు. అనంతరం రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఏకంగా స్థానిక విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాలని మేనేజ్‌మెంట్ ఆదేశించిందంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పై ఘటనలన్నీ గమనిస్తే అవన్నీ భారతదేశానికి వ్యతిరేకంగా జరిగినవే. దేశభక్తిని రగలించవలసిన విశ్వవిద్యాలయాలు, జాతి వ్యతిరేకతను రగిలిస్తున్నాయి. ఈ పనులన్నీ విద్యార్ధులే చేస్తున్నారా లేక విద్యార్థులతో బయటి వారేవరైనా చేయిస్తున్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదిలా కొనసాగుతూ పోతే అది యావత్ దేశానికే పెనుముప్పుగా మారి మనలో మనమే కొట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.