రామ్ చరణ్ 'ఎవడు' ఆడియో హైలైట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ఎవడు' ఆడియో రిలీజ్ చిరంజీవి చేతులమీదుగా జరిగిన సందర్భంగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. మగధీరకి దీటుగా తయారైందంటూ ప్రశంసించారు. మగధీర లాంటి చిత్రం చరణ్ కి మరోసారి ఇంత త్వరగా లభించిందంటూ ఆయన అందుకు తన ఆనందాన్ని వ్యక్తపరచారు. మగధీరలో షేర్ ఖాన్ లా ఎవడు లో సాయికుమార్ నటించారని, కథానాయిక గా శ్రుతి హాసన్ అసమాన నటనా చాతుర్యాన్ని చూపించిందని, ఆమె తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటుందని చిరంజీవి అన్నారు.
చరణ్ పాత్ర గురించి మాట్లాడుతూ చరణ్ ఇందులో చాలా అందంగా కనిపించాడని, పాత్రలో చక్కగా ఇమిడిపోయాడని, ఈ సినిమాలో మాస్ హీరోగా అభిమానులకు బాగా నచ్చుతాడని అన్నారు చిరంజీవి. అల్లు అర్జున్ ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తాడని, ఆ చిన్న పాత్రలో అర్జున్ అలరించాడని అన్నారు.
ఇక పాటల గురించి మాట్లాడుతూ, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం తనలో ఉత్సాహాన్ని రేపి, ఇంట్లో తమ మనుమరాలితో కలిసి డ్యాన్స్ చేసేటట్టుగా చేసిందని చిరంజీవి శ్లాఘించారు.
అభిమానుల మధ్య సంతోషాన్ని పంచుకున్న చిరంజీవి అభిమానులకు చక్కని సూచన కూడా ఇచ్చారు. తన మీద, తన కుటుంబంలోని ఇతర హీరోల మీద ఉన్న అభిమానంతో వారు ఇతర సినిమాలను ఇతర నటీనటులను విమర్శించరని, తన అభిమానులు హుందాగా ప్రవర్తిస్తారని వారిమీద తనకున్న నమ్మకాన్ని చిరంజీవి వ్యక్తపరుస్తూ వారు ఆ స్థాయిని కొనసాగించవలసిందిగా కోరారు.
ఈ వేడుకలో పాల్గోన్న అల్లు అర్జున్ ప్రచార చిత్రాలను విడుదల చేసారు. ఇంకా వేడుకలో చిత్ర నాయికా నాయకులతో పాటు నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కోట శ్రీనివాసరావు, వేణమాధవ్, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.