తుఫాను ఆగిపోతుందా
మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్, బాలివుడ్ భామ ప్రియాంకా చోప్రా నటించిన తుఫాన్ సినిమా ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు సినీ నిర్మాతలు రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ వారు ప్రకటించారు. అనేక న్యాయపోరాటాలు, వివాదాల తరువాత, ఒక పక్క ఉద్యమాలు భయపెడుతున్నపటికీ దైర్యం చేసి సినిమాను విడుదల చేయబోతుంటే వారు భయపడినట్లే ఈ రోజు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సమైక్యవాదులు తుఫాన్ సినిమా పోస్టర్లను కాల్చివేసి, చిరంజీవి తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనంత వరకూ ఆ కుటుంబానికి చెందిన హీరోల సినిమాల విడుదలకు అంగీకరించబోమని, ఒకవేళ కాదని విడుదలచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.
ఆంధ్ర ప్రాంతంలో మిగిలిన చోట్ల ఇంతవరకు ఎటువంటి వ్యతిరేఖత కనబడలేదు. కానీ ఈ రోజే నిజామబాద్ జిల్లాలో కూడా అటువంటి ఘటనే జరిగింది. అక్కడ తెలంగాణా వాదులు తుఫాన్ సినిమా పోస్టర్లను చింపి తగులబెట్టారు. తెలంగాణా ప్రజల ఆదరణతో, సొమ్ముతో ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరంజీవి, అదే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడటం తాము సహించబోమని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని కుటుంబానికి చెందిన హీరోలెవరి సినిమాలను తెలంగాణాలో ఆడనీయబోమని వారు హెచ్చరించారు. ఈ సంఘటనలు జరిగిన వెంటనే నిర్మాతల తరపున హైకోర్టులో ఒక పిటిషను దాఖలయింది. తమ తుఫాన్, జంజీర్ సినిమాలకు రక్షణ కల్పించాలని వారు పిటిషనులో కోరారు.
అయితే, పోలీసులు మాత్రం ఎన్నిసినిమా హాళ్ళకు కాపలా కాయయగలరు? ఎన్ని రోజులు కాయగలరు? అది సాద్యమయ్యే పనేనా? అని రేపు కోర్టు కూడా వారిని అడగవచ్చును. పోలీసుల పహారాలో సినిమాలను నడపాలంటే అందుకు ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయలేమో కూడా?
చిరంజీవి వల్ల ముగ్గురు మెగా హీరోల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. చిరంజీవి సమైక్యవాదం చేస్తున్నందుకు తెలంగాణాలో, రాజినామా చేయనందుకు సీమంధ్రలో మెగా హీరోల సినిమాలు ప్రదర్శనకు నోచుకోకపోతే, ఇక వారితో సినిమాలు తీసేందుకు ఎవరు ముందుకు వస్తారు? రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేవరకు సినిమాలు విడుదల చేయలేకపోతే నిర్మాతల నష్టాన్ని ఎవరు పూడుస్తారు?
ఈ రోజు మెగా హీరోల వంతు. రేపుజూ.యన్టీఆర్ వంతు కూడా వస్తుంది. అతని తండ్రి హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా త్వరలో బస్సు యాత్ర చేపడతానని ప్రకటించడంతో తెలంగాణాలో యన్టీఆర్ సినిమాలు ఆడనీయబోమని తెలంగాణావాదులు అప్పుడే ప్రకటించారు కూడా.