విలన్ ఆఫ్ ది మిలీనియం ఇకలేరు
posted on Jul 13, 2013 @ 10:32AM
బ్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇకలేరు.. ఎన్నో విలక్షణ పాత్రలతో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్న బాలీవుడ్ సీనియర్ యాక్టర్ ప్రాణ్ శుక్రవారం కన్నుమూశారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రాణ్.. మూడు వారాలగా లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉన్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్‌లో శనివారం మధ్యాహ్నం 12గంటలకు నిర్వహించనున్నారు. 93 సంవత్సరాల ప్రాణ్ తన ఆరు దశాబ్దాల కెరీర్‌లో 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇండియన్ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఈ ఏడాదే అందుకున్నారు.
ప్రాణ్ పూర్తి పేరు ప్రాణ్ కిషన్ సికంద్. 1920, ఫిబ్రవరి 12న పాతఢిల్లీలోని ఒక జన్మించిన ఆయన 1940లో యమలా జాట్ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. 1960, 70ల్లో విడుదలైన భారీ బడ్జెట్ హిందీ సినిమాలన్నిటిలోనూ ఆయన నటించారు. ఆయన కెరీర్‌లో మధుమతి, కశ్మీర్ కీ కలి, మిలాన్ వంటి క్లాసిక్స్ ఉన్నాయి. డాన్, అమర్ అక్బర్ ఆంటోనీ, జంజీర్ వంటి బాక్ల్‌బస్టర్ సినిమాల్లో ఆయన ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించారు. హిందీలోనే కాదు తాండ్రపాపరాయుడు కొదమసింహం లాంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే..
1990 నుంచి ఆరోగ్య కారణాలతో నటనకు దూరంగా ఉంటున్నారు ప్రాణ్. 2000 సంవత్సరంలో స్టార్ డస్ట్ పత్రిక ఆయన్ను 'విలన్ ఆఫ్ ద మిల్లీనియం'గా అభివర్ణించింది. సీఎన్ఎన్ ప్రకటించిన ఆసియాలో టాప్ 25 నటుల జాబితాలో ప్రాణ్ కూడా ఉన్నారు. 2001లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్‌తో గౌరవించింది.
మేటి నటునిగా ఇండియన్ సినిమాకు ఎన్నో అత్యున్నత పాత్రలను అందించిన ప్రాణ్ లేనిలోటు ఎప్పటికీ పూడ్చలేనిది..