ఆరుద్ర వర్ధంతి
ఆయన కలం నుండి జాలువారే ప్రతీ అక్షరం ఓ ఆణిముత్యం.. తన అద్భుతమైన ప్రతిభతో యావత్ సినీరంగాన్నే అబ్బురపరచారాయన.. మనసుకు హత్తుకునే భావాల్ని అతిసాదారణ పదాల్లో నిల్పిన పదశిల్పి ఆయన.. కమర్షియల్ పాటకు సైతం ధిక్కార స్వరం నేర్పిన ఆయనే సినీకవి ఆరుద్ర. ఈరోజు ఆరుద్ర వర్ధంతి సందర్బంగా ఆ మహా రచయితను ఓ సారి గుర్తు చేసుకుందాం..
సామాన్యంగా నటులను, దర్శకులను బట్టి ప్రేక్షకులు, సినిమాలను చూస్తారు. కాని రచయితనుబట్టి సినిమా చూసే స్థాయిని కల్పించింది ఆరుద్ర... మామూలు పదాలతో బరువైన భావాల్ని పలికించి శ్రోతలను రంజిప చేసిన నేర్పరి ఆరుద్ర.
ఆరుద్రగా సినీరంగ ప్రవేశం చేసిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రీ 1925వ సంవత్సరం ఆగస్టు 31న జన్మించారు. చిన్నప్పటి నుండి సాహిత్యం మీద ఉన్న ఇష్టంతో ఆ దిశగా అడుగులు వేశారు..
1949లో విడుదలైన బీదల పాట్లు సినిమాతో పాటలరచయితగా పరిచయమయ్యాడు ఆరుద్ర. ఆరుద్ర రచించిన పాటలలో ఎక్కువగా ఆభ్యుదయ భావజాలం ఉండటం వలన శ్రీ శ్రీ తరువాత యువత ఎక్కువగా ఆయనే కీర్తిని సంపాదించారు..
చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆరుద్ర ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించి.. అందరి మనసులను దోచుకున్న ఈ కవి ఎన్ని అవార్డులను ఇచ్చి సత్కరించినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన సినీ పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి.
విశాఖ పట్నంలో జన్మించిన ఆరుధ్ర విజయనగరం జిల్లాలో ఉన్నత విధ్యను పూర్తి చేశారు.. రచనల పట్ల ఆసక్తి ఉన్న ఆయన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో ఉద్యోగం వదులుకొని ఆనందవాణి అనే పత్రికకు సంపాదకునిగా జాయిన్ అయ్యారు..
ఆ పత్రికలో శ్రీశ్రీతో పాటు ఆరుద్ర రాసిన కవితలు సంచలనం సృష్టించాయి.. తరువాత అభ్యుదయ రచయితల సంఘం స్థాపించిన ప్రముఖుల్లో ఒకరు ఆరుద్ర..
తెలుగు పదాలకు ఎనలేని సేవ చేసిన ఆరుద్ర తొలి దశలో ఎన్నో కష్టాలను అనుభవించారు.. కొద్ది రోజులు తినడానికి తిండి కూడా లేక పానగల్ పార్క్ లో నీళ్లు తాగి కడుపు నింపుకున్నారు.. ఈ కష్టాలేవి ఆయన సాహితీ ప్రస్థానానికి అడ్డు రాలేదు..
త్వమేవాహంతో మొదలు పెట్టి.. వందలాదిగా గేయాలు, గేయనాటికలు,కథలు, నవలలు, సాహిత్య పరిశోదక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలపై విమర్శలు ఇలా ఆయన చేయని రచనా ప్రకియే లేదు.
కేవలం సాహితీ రంగానికే కాదు తెలుగు సినీ రంగానికి కూడా ఆయన చేసిన సేవలు ఎనలేనివి.. 1949లో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో నాలుగు వేలకు పైగా పాటలు రాశాలు.. వీటిలో ఆయన మార్క్ అభ్యదయ గీతాలతో పాటు భక్తి గీతాలు, విరహ గీతాలు, ప్రేమ పాటలు కూడా ఉన్నాయి..
తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను 1985లో ఆంద్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో పాటు గైరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
ఇలా తెలుగు సాహిత్యాన్ని తన వంతు బాధ్యతగా అభ్యుదయం వైపు అడుగులు వేయించిన ఆరుధ్ర 1998 జూన్ 4న తుది శ్వాస విడిచారు.. ఆయన ఈ లోకాన్ని విడిచినా ఆయన రచనలు, కవితలు, పాటల ద్వారా ఎప్పటికీ మన మధ్యే ఉంటారు.. ఈ సంధర్భంగా ఆ మహారచయితకు మరోసారి నివాళులర్పిద్దాం..