తెలుగు వారి లోగిళ్లలో పూసిన పున్నాగ పరిమళం
posted on Jul 4, 2013 @ 10:30AM
తెలుగు సినీ సంగీత ఆకాశంలో మెరిసిన స్వరతార ఆయన
తెలుగు సంస్కృతి సాగరంలో వెలసిన సంగీత దీవి ఆయన
తెలుగు వారి లోగిళ్లలో పూసిన పున్నాగ పరిమళం
జామురాతిరి అలసిన మనసులకు జాబిలమ్మ కిరణం
మౌనంగానే ఎదగమని చెప్పిన మొగ్గలోని లాలిత్యం
గాలిని సైతం గాంథర్వం చేయగల హృదయ మేళనం
ఆయనే తెలుగు స్వరాల సుస్వరవాణి కీరవాణి
కోట్లాది ప్రజలను ఊరించి, ఊగించి, ఉత్తేజపరిచి, ఉల్లాస డోలికల ఆడిస్తున్న ఓ సంగీత సరస్వతి ఆయన.. శాస్త్రీయ సంగీతంలో స్వరరాగమే ఆయన పేరుగా ఉండటం కాకతాళీయమే అయినా దాన్ని సార్ధకం చేసుకున్న కారణ జన్ముడాయన.. సంగీత ధ్వనిని తన అణువనువునా నింపున్న కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి..
ప్రస్థుతం స్వర తరంగమై ఎగసి పడుతున్న కీరవాణి 1961 జూలై 4న జన్మించారు.. చిన్ననాటి నుంచే సంగీతంపై ఉన్న మక్కువతో ఎలాగైన ఆ రంగంలో పరిణతి సాదించాలనుకున్నారు.. అందుకే 1987లో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా చేరి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు..
తొలిసారిగా ఉషాకిరణ్ మూవీస్ వారు తెరకెక్కించిన మనసు మమత సినిమాతో 1989లో సంగీత దర్శకునిగా మారారు కీరవాణి.. ఆ తరువాత వరుసగా సంగీత దర్శకునిగా అవకాశాలు వస్తున్న కీరవాణి అనుకున్న స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు.. రామ్‌గోపాల్ వర్మ, నాగార్జున లాంటి వారితో భారీ సక్సెస్‌లు అందించినా అవేవి ఆయనకు స్టార్‌డమ్‌ను సాధించి పెట్టలేదు..
కీరవాణి కీర్తిని జాతీయస్థాయిలో ఉన్నత శిఖరాలకు చేర్చిన సినిమా అన్నమయ్య..నాగార్జున రాఘవేంద్రరావుల కాంభినేషన్‌లో వచ్చిన ఈ సినిమా విజయంలో కీరవాణి పాత్ర ఎంతో ఉంది.. అన్నమయ్య పదాలకు మరింత అందాన్ని చేకూర్చేలా తన బాణీలతో రంగులద్దిన కీరవాణి ఆ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు..
అంతేకాదు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు.. ఎనిమిది నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్న అరుదైన రికార్డ్ కీరవాణి సొంతం..
కేవలం తెలుగులోనేకాదు తమిళ, మళయాల భాషల్లోనూ కీరవాణి ఎన్నో అద్భుత విజయాలను అందుకున్నారు.. అంతేకాదు తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకునేలా ఉత్తరాదిలో కూడా తన సంగీతం జయ కేతనం ఎగురవేశారు కీరవాణి..
దాదాపు 200 లకు పైగా సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి ఇప్పటికీ తన పాటల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.. తనతో పాటు తన వారసులుగా ఎమ్ ఎమ్ శ్రీలేఖ, కళ్యాణిమాళిక్ లాంటి సంగీత దర్శకులను తెలుగు తెరకు అందించారు..
ఇప్పటికీ తెలుగు సినిమాకు తన స్వరాలతో పాటల పట్టం కడుతున్న కీరవాణిగారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తెలుగువన్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తూ ఆయన సంగీత ప్రయాణం మరింత కాలం ఇలాగే కొనసాగాలని మనల్ని అలరించాలని ఆశిద్దాం..