సీబీఎన్ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు అదుర్స్!
posted on Jun 12, 2024 @ 9:58AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమ వేదికపై 60 మంది ఆసీనులు కానున్నారు. వీరు కాకుండా ప్రత్యేక అతిథులు, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అలాగే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని సిద్ధం చేశారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవ వేదికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు మంగళవారం(జూన్ 11) నాటికే పలువురు ప్రముఖలు విజయవాడ చేరుకున్నారు. నారా, నందమూరి, మెగా ఫ్యామిలీల సభ్యులు కూడా మంగళవారం (జూన్ 11) రాత్రికే బెజవాడ చేరుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రత్యేక ఆహ్వానితులు, వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ, జాతీయస్థాయి అతిథులు తరలి వస్తున్నారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేదిక వెనుక భాగంలో గ్రీన్ రూములను సిద్ధం చేశారు. ఆ గదులను ప్రముఖులకు కేటాయించారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో ఒక గ్రీన్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌షా, నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్ రూమ్‌కు చేరుకుంటారు. ప్రధాని గ్రీన్ రూమ్‌కు వెనుకభాగంలో పీఎంవో సిబ్బంది కోసం మరొక రూమ్ ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కోసం ఒక గ్రీన్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రీన్ రూమ్ పక్కనే వీవీఐపీల కోసం ఇంకో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు.