బెజవాడ వైపు వచ్చే అన్ని రహదారుల్లో ట్రాఫిక్ జాం
posted on Jun 12, 2024 9:05AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచీ జనం సునామీలా పోటెత్తారు. దీంతో బెజవాడలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. బెజవాడలోకి వచ్చే దారులన్నీ అష్టదిగ్బంధనం చేసేశారు. పోలీసులు చర్య కారణంగా బెజవాడకు వచ్చే అన్ని దారుల్లోనూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ప్రమాణ స్వీకారోత్సవ సభా స్థలికి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. మంగళగిరి సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంతే కాకుండా విజయవాడ వైపు వచ్చే అన్ని రహదారులపైనా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.