ఉండవల్లి మొసలి కన్నీరు..!

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే నెటిజనులు మాత్రం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్  గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తరువాత జగన్ తరఫున రామోజీ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడమే ధ్యేయంగా మార్గదర్శి లక్ష్యంగా  పని చేశారని నెటిజనులు గుర్తు చేస్తున్నారు.  ఉండవల్లి కేసుల ప్రాతిపదికగా  జగన్ రామోజీ అరెస్టే లక్ష్యంగా పావులు కదిపారు. జగన్ హయాంలో ఆయన కనుసన్నల్లో, ఆయన ఆదేశాల మేరకు పని చేసిన ఏపీ సీఐడీ ఆయనను వేధించింది. మార్గదర్శి కార్యాలయాలలో శోదాలు చేసింది. రామోజీ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడమే లక్ష్యంగా జగన్ సర్కార్ వేధింపులు, వేటకు రామోజీ బెదిరిపోలేదు. తాను ఏదైనా నమ్మారో దాని కోసం గట్టిగా నిలబడి పోరాడారు. దీంతో సీఐడీ ఏకంగా రామోజీరావు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి విచారణ నెపంతో వెళ్లింది. ఆయన ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోలను లీక్ చేసింది. ఈ వేధింపులన్నీ ఉండవల్లి మార్గదర్శిపై పెట్టిన కేసులను ప్రాతిపదికగా తీసుకునే  జరిగాయి.  ఆఖరికి అప్పటి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒక సందర్భంగా జగన్ లక్ష్యం రామోజీ అరెస్టేననీ, అయితే అందుకు కేసీఆర్ అంగీకరించలేదనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దీంతోనే ఉండవల్లి మార్గదర్శిపై కేసుల వెనుక ఎవరున్నారో ఇట్టే అర్ధమైపోతుంది.  జగన్ కోసం రామోజీపై కేసులు పెట్టిన ఉండవల్లి ఇప్పుడు రామోజీ రావు మృతి పట్ల ప్రగాఢ సంతాపం అంటూ  మీడియా ముందుకు రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామోజీ మృతి పట్ల ఉండవల్లి సంతాపం వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు తెగ ట్రోల్ అవుతోంది. నెటిజన్లు మొసలి కన్నీరు ఆపు ఉండవల్లీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఉండవల్లిది ఓవరేక్షన్ అంటూ ఏకి పారేస్తున్నారు.  

ప్రత్యేక హోదా.. ఆసక్తీ లేదు.. అవగాహనా లేదు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచీ గట్టిగా సర్క్యులేట్ అవుతూ వస్తున్న మాట ఏపీకి ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా అంశం కారణంగానే గతంలో ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చేసింది. ఈ ప్రత్యేక హోదా అంశమే చంద్రబాబు, మోడీల మధ్య అప్పట్లో అగాధం సృష్టించింది. ఈ ప్రత్యేక హోదా అంశమే.. 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడానికి ఒక కారణం అయ్యింది. అప్పట్లో జగన్ పాతిక ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని ఊరూ వాడా ఏకం అయ్యేలా ప్రచారం చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చాకా ఆ మాటే ఎత్త లేదు అది వేరే సంగతి.  జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలోనూ ఎన్నడూ ప్రత్యేక హోదా మాటే ఎత్తలేదు. దీంతో అది గతించిన సంగతి అన్నట్లుగా మారిపోయింది. మళ్లీ ఇటీవల ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆ నినాదాన్ని ఎత్తుకుంది. అయితే ఆ పార్టీ ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా అధికారంలోకి రాలేదు. ఆ సంగతి అలా ఉంచితే ప్రత్యేక హోదా హామీతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ కు జనం రిక్త ‘హస్త’మే చూపారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కాదు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి దార్శనిక నాయకత్వం కావాలనే కోరుకున్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్రతిపత్తికి అంగీకరించిన చంద్రబాబును తమ నేతగా జనం గుర్తించారు. అంగీకరించారు.  తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్ కానీ, చంద్రబాబు కానీ ఎక్కడా ప్రత్యేక హోదా విషయం ప్రస్తావించలేదు. కాంగ్రెస్ ప్రస్తావించినా జనం వినలేదు.   ఇక ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు కీలకంగా మారారు. దీంతో కాంగ్రెస్ ఆయనను ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టే దమ్ముందా అని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ సవాల్ కు చంద్రబాబు స్పందించాల్సిన అవసరమే లేదన్నది పరిశీలకుల విశ్లేషణ.   రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కానుంది. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో రాజధాని, పోలవరం వంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేసిందనే భావించాలి. ప్రజలు కూడా చంద్రబాబు దార్శనికతను, అభివృద్ధి కాముకతను, ఆయన సంక్షేమ విధానాలను విశ్వసించారు. ప్రత్యేక హోదా అన్న అంశం జనం మదిలో అసలు లేనే లేదని తాజా ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా రుజువు చేసేశాయి.  సో ప్రత్యేక హోదా విషయంలో కొందరు, కొన్ని పార్టీలూ ఎంత గొంతు చించుకున్నా ప్రజల నుంచి స్పందన రాదు. కంఠశోష వినా అలా అరిచే వారికి మిగిలేది, ఒరిగేదీ ఏమీ ఉండదు. అసలు ప్రజలలో ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే లబ్ధిపై అవగాహనా లేదు. ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టాలన్న ఆసక్తీ లేదు. 

జగన్ ఘోర పరాజయ పరాభవానికి కారణాలివే?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఘోర పరాజయం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఆయితే తాజా ఎన్నికలలో  జగన్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, ఆ పార్టీకి వచ్చిన సీట్లు మాత్రం మహామహా రాజకీయ పండితులే అచ్చెరువొందేటట్లు చేశాయి. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్న విషయం ఎన్నికలకు చాలా ముందు నుంచే ప్రస్ఫుటంగా కనిపించింది. స్పష్టంగా వినిపించింది. ఇక రాష్ట్రంలో రాబోయే  ప్రభుత్వం ఎవరిదన్నది ప్రీపోల్ సర్వేలు, ఆ తరువాత ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీ పరాజయాన్ని ముందుగానే ఊహించాయి. అంతెందుకు వైసీపీకి అవును వైసీపీకి మాత్రమే  ఎన్నికల వ్యూహాలను అందించే ఐ ప్యాక్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పేసిందని ఎన్నికలకు ముందే వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపించింది.   అసలు ఈ స్థాయిలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరగడానికి కారణమేంటి? సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఎందుకు విఫలమయ్యారు?   ఏ రాష్ట్రంలో అయినా   ప్రభుత్వ సామర్థ్యం, పని తీరు చెప్పడానికి  ఎవరైనా సరే ప్రమాణికంగా తీసుకునే  ప్రధాన అంశాలలో జగన్ దారుణంగా విఫలమయ్యారు.    ఆ రాష్ట్ర ఆదాయం (జీడీపీ) పెరుగుదల. తలసరి ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయం  మానవాభివృద్ధి   (విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, సంక్షేమం వంటివి మానవాభివృద్ధి కిందకి వస్తాయి.) ఇక, పారిశ్రామిక రంగాల్లో, సర్వీస్ రంగాల్లో ఎదుగుదల ఐదో అంశంగా చెప్పుకోవచ్చు. ఈ అంశంలో  ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు ఇతర మౌలిక సౌకర్యాలు వస్తాయి. అలాగే ప్రజాస్వామ్య స్పూర్తి మరో కీలక అంశంగా పేర్కొనాలి. అంటే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రాజ్యాంగ సంస్థల బలోపేతం లాంటివి అన్నమాట.    జగన్ ఈ అంశాలన్నిటిలోనూ ఘోరంగా విఫలమయ్యారు.  జగన్ హయంలో రాష్ట్ర జీడీపీ ఘోరంగా దిగజారిపోయింది. తలసరి ఆదాయం ఏడాదికి ఏడాది దిగువకు పడిపోగా.. ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయడంతో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇక మానవాభివృద్ధిలో తమ సర్కార్ గొప్పగా చేస్తుందని వైసీపీ పెద్దలు ఘనంగా చెప్పుకున్నా వాస్తవం మాత్రం పూర్తి రివర్స్ గా ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, సంక్షేమం వంటివి వాటిని పూర్తిగా విస్మరించి కేవలం బటన్ నొక్కి డబ్బులు పంచి అదే మానవాభివృద్ధిగా జగన్ భావించారు.   విద్య, ఆరోగ్యం విషయంలో ప్రకటనలు తప్ప ఆచరణ కనిపించడం లేదు.  ఇక, పారిశ్రామిక రంగం, సర్వీస్ రంగాల్లో అభివృద్ధి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు రవాణా అంశాలలో జగన్ సర్కార్  సాధించింది శూన్యం. జగన్ హయాంలో ప్రజాస్వామ్య స్పూర్తి  ఇసుమంతైనా కనిపించలేదు.  ప్రభుత్వం ప్రజలతో   సంబంధాలను పూర్తిగా తెంచేసుకుకుంది. అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రాజ్యాంగ  ప్రకారం పాలనా వంటి వాటికి అర్ధమే తెలియదన్నట్లుగా జగన్ పాలన సాగింది. ఏపీలో అసలు రాజ్యాంగం అమలు కావడం లేదంటూ కోర్టులే పలు సందర్భాలలో చీవాట్లు పెట్టాయి.  గెలిచే వరకూ ప్రజల మధ్యలో ఉన్న జగన్.. గెలిచాక ప్రజలకి మొహం చూపించకుండా పరదాలు కప్పుకు తిరుగుతూ పాలన సాగించారంటేనే జగన్ హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్న మాటకు అర్ధమే లేకుండా పోయిందని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది.  పారిశ్రామిక రంగంలో రాష్ట్రంలో అభివృద్ధి రివర్స్ గేర్ లో సాగింది. కొత్త పరిశ్రమలు రావడం సంగతి అటుంచి ఉన్న పరిశ్రమలే రాష్ట్రం వదిలి పారిపోయాయి.  పెట్టుబడులు శూన్యం, అభివృద్ధి శూన్యం, ఉద్యోగ, ఉపాధి కల్పన శూన్యం, విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం శూన్యం అన్నట్లుగా రాష్ట్రం పరిస్థితి, రాష్ట్రంలో పాలన పరిస్థితి తయారైంది. ఇదేమిటని  ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, దాడులు. ప్రతిపక్ష నేతలు నుండి మొదలుకొని సామాన్య ప్రజల వరకు అందరినీ జగన్ సర్కార్ వేధించింది. వేపుకు తింది.  జగన్ గొప్పగా చెప్పుకున్న సంక్షేమ పథకాలు కూడా  పన్నుల ద్వారా ప్రజల నుండి  వేలల్లో వసూలు చేసి అందులోంచి వందల్లో తిరిగి ఇవ్వడంగానే సాగింది.   కళ్ల ముందు కనిపిస్తున్న ఈ వాస్తవాలే జగన్ కు గతంలో  ఎవరికీ, ఏ ప్రభుత్వానికీ దక్కనంత ఘోర పరాజయాన్ని అందించింది. అయితే ఇది గుర్తించడానికి సిద్ధంగా లేని జగన్ ఇప్పటికీ నేను ఇచ్చిన డబ్బులు తీసుకున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లేమయ్యాయి? ఏదో కుట్ర జరిగింది అంటూ ఆరోపణలు చేయడం చూస్తుంటే.. జగన్   ప్రజాభిమానాన్ని దక్కించుకుని పార్టీని బతికించుకునే దిశగా అస్సలు ఆలోచనే చేయడం లేదని అర్ధమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రామోజీ మృతి పట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి..అశ్రునివాళి

రామోజీరావు మరణం పట్ల  రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సంతాప సందేశంలో  మీడియా రంగం ఒక టైటాన్ ను కోల్పోయిందని పేర్కొన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోడీ తన సంతాప సందేశంలో  రామోజీ రావుగారి మరణం ఎంతో బాధాకరం.ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన  దార్శనికుడు. ఆయన సేవలు  సినీ, పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషి ద్వారా, ఆయన  మీడియా, వినోద ప్రపంచాలలో శ్రేష్టమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారు.  రామోజీ రావు  భారతదేశ అభివృద్ధి పట్ల చాలా ఉత్సాహం చూపేవారు. ఆయనతో సంభాషించడానికి, ఆయన అపారమైన జ్ఞానాన్నుంచి లబ్ధి  పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టం. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని పేర్కొన్నారు.  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, వైసీపీ అధినేత జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు రామోజీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  అలాగే సినీ రంగానికి చెందిన ప్రముఖులు చిరంజీవి, రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు అశ్రునివాళులర్పించారు. అలాగే రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ షూటింగ్ ను నిలిపివేసి రామోజీ మృతి పట్ల సంతాపం తెలిపింది. 

మహా కవి శ్రీ శ్రీ కుమారుడు శ్రీరంగం వెంకటరమణ ఇక లేరు

తెలుగు నాట శ్రీ శ్రీ పేరు తెలియనివారుండరు.   మ‌హాక‌వి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమారుడు శ్రీరంగం వెంక‌ట ర‌మ‌ణ (59) క‌న్నుమూశారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న అమెరికా క‌నెటిక‌ట్ రాష్ట్రంలోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. శుక్ర‌వారం సాయంత్రం కుటుంబ స‌భ్యులు, తెలుగు ప్ర‌వాసులు స్థానికంగానే ఆయ‌న అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న బంధువు అయిన డాక్టర్‌ రమణా యశస్వి తెలిపారు.  పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లిన వెంక‌ట ర‌మ‌ణ‌, ఫైజ‌ర్ కంపెనీ ప‌రిశోధ‌న విభాగంలో ప‌నిచేస్తున్నారు. శ్రీరంగం వెంకట రమణకి భార్య మాధవి, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె కవిత ఉన్నారు. ఆయన భార్యది పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గణపవరం గ్రామం. వెంక‌ట ర‌మ‌ణ మృతిప‌ట్ల సాహితీ వేత్త‌లు సంతాపం తెలిపారు. మహాకవి శ్రీశ్రీ భార్య సరోజా శ్రీశ్రీ 80 సంవత్సరాల వయస్సులో కుమారుడిని కోల్పోయారని, ఆమెకు, వెంకటరమణ కుటుంబ సభ్యులకు సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు. 

సింగపూర్ నుంచి ఈవీఎంల ట్యాంపరింగ్.. జగన్ మేనమామ ఆరోపణ భలేగా ఉందిగా!

జగన్ ఓటమి మహా గొప్పగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసిన అందరూ కూడా ఇలాంటి ఓటమి నభూతో నభవిష్యత్ అంటున్నారు. గత ఎన్నికలలో 151 స్థానాలు గెలిచిన వైసీపీ..  ఈ సారి ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పడిపోయింది. ఇంత కంటే ఘనమైన పతనం ఇప్పటి వరకూ ఎవరూ ఎక్కడా కనలేదు, వినలేదని  పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  జగన్ సహా వైసీపీలో ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలు, ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీ ఓటమికి చంద్రబాబు కుట్ర చేశారని అంటున్నారు. చంద్రబాబు మాయలో పడి సొంత చెల్లి తల్లీ కూడా తనకు దూరమైపోయారనీ, క్రమం తప్పకుండా తాను బటన్ నొక్కి అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు బోలెడంత సొమ్ములు పందేరం చేశానననీ వారంతా కూడా తనను అన్యాయం చేశారని జగన్ అయితే ఏడ్చినంత పని చేశారు. అసలు వాళ్ల ఓట్లన్నీ తనకు కాకుండా పోవడం వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు జగన్. అయితే తాజాగా ఆ కుట్ర ఏమిటో జగన్ కు స్వయానా మేనమామ అయిన రవీంద్రారెడ్డి తాను ఛేదించేశానంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇంతకూ ఆయన చెప్పినదేమిటంటే.. పోలింగ్ పూర్తయిన తరువాత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం అమెరికా పర్యటన అంటూ సాకు చెప్పి వెళ్లింది సింగపూర్ కు అని రవీంద్రారెడ్డి కనిపెట్టేశారు. చంద్రబాబు సింగపూర్ వెళ్లి టెక్నాలజీ సహాయంతో అక్కడ నుంచి సీల్ వేసి ఉన్న ఈవీఎంలను ట్యాంపర్ చేసి వైసీపీకి పడిన ఓట్లన్నిటినీ తెలుగుదేశం ఖాతాలో వేసేసుకున్నారట. రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపణ కనీసం ఆయన అయినా నమ్ముతున్నారో లేదో తెలియదు. అయితే రవీంద్రానాథ్ ఆరోపణలను నెటిజెన్ లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  అంతకు ముందు అవ్వా తాతల ఓట్లేమయ్యాయో తెలియడం లేదంటూ మీడియా ముందు దాదాపు ఏడ్చినంత పని చేసిన జగన్ కూడా దీని వెనుక కుట్ర ఉంది, కానీ నిరూపించడానికి ఆధారాలు మాత్రం లేవు అంటూ  చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన అనుమానమంతా ఈవీఎంలపైనే అని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. వాస్తవానికి ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయడం, సందేహాలున్నాయనడానికి జగన్ కు కానీ, ఆయన పార్టీ వారికి కానీ ఇసుమంతైనా అర్హత లేదు. ఎందుకంటే గత ఎన్నికలలో ఘన విజయం తరువాత   ఈవీఎంలు ఎంత పర్ఫెక్ట్ గా పని చేస్తాయో జగన్ చాలా వివరంగా చెప్పారు. అప్పట్లో ఈవీఎంలపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఎద్దేవా చేశారు.  ఈవీఎం బటన్ నొక్కినప్పుడు తాము ఏ పార్టీకి ఓటు వేశామో ఓచర్లలో  కనిపిస్తుందని ఇక ఈవీఎం మ్యానిప్యులేట్ ఎలా జరుగుతుందని ఆయన అప్పట్లో ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  నాడు గొప్పగా పొగిడిన ఈవీఎంలనే నేడు తాను ఓడిపోయే సరికి ట్యాంపర్ అయ్యాయంటూ ఆరోపించడాన్ని నెటిజనులు ఆక్షేపిస్తున్నారు.  సింగపూర్ నుంచి సంకేతికతను ఉపయోగించి చంద్రబాబు ట్యాంపర్ చేశారని ఏదో సైన్స్ ఫిక్షన్ కథ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇలంటి ఆరోపణలు, విమర్శలు వైసీపీనీ, ఆ పార్టీ నేతలనూ సర్కస్ లో బఫూన్ల స్థాయికి దిగజార్చడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడవు. 

ఎంఎల్సి ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న  ఘన విజయం

తీన్మార్ మల్లన్న.  గత బిఆర్ఎస్  ప్రభుత్వ హాయంలో  ఆ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు బయటపెట్టిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరి బోణి కొట్టారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చెల్ నియోజకవర్గం నుంచి, పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం  నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎంఎల్సి ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్ధిని మట్టి కరిపించి అత్యధిక మెజారిటీతో  తీన్మార్ మల్లన్న గెలుపొందారు.    నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిపై గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత‌ అధికారులు విజయాన్ని ధ్రువీకరించారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన సంగతి తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజార్టీ రాకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరగా బీఆర్ఎస్‌ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఎలిమినేషన్‌తో మల్లన్న విజయం ద‌క్కించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతికంగా ఓడిపోయాను, కానీ నైతికంగా గెలిచాను అని అన్నారు. నేను ప్రతీ రౌండ్‌లో గట్టి పోటీ ఇచ్చానని చెప్పారు. శాసనమండలిలో అడుగుపెట్టలేకున్నా బయట నుండి పట్టభధ్రుల కోసం పోరాడతానని రాకేశ్ రెడ్డి చెప్పారు. కాగా, తీన్మార్ మల్లన్న గతంలో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గతంలో మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు.  మొత్తంగా 3 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్నను ఈసారి విజ‌యం వ‌రించింది. ఇక ఈ స్థానానికి మే 27న పోలింగ్ జరిగింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 34 అసెంబ్లీ స్థానాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల‌ రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్‌ రెడ్డి పోటీ చేశారు.  అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఇక‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ కుమార్ నాలుగో స్థానంతో స‌రిపెట్టుకున్నారు.

చెత్త ప్రభుత్వం పోయింది.. చెత్త పన్నూ పోయింది!

ఆంధ్రప్రదేశ్ లో చెత్త పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. చెత్తపై పన్ను వసూలు చేసిన చెత్త ప్రభుత్వంగా జగన్ సర్కార్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  అధికారంలోకి రాగానే చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తామని చంద్రబాబు పలు సందర్భాలలో ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రాష్ట్రంలో చెత్త పన్ను వసూళ్లను నిలిపివేశారు. చెత్త పన్ను వసూలు చేయవద్దంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాలు, నగరపాలక సంస్థలు, స్థానిక సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.   జగన్ సర్కార్ చెత్త పన్ను పేరుతో పేదల నుంచి నెలకు 30 నుంచి 150 రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 2001 నుంచి చెత్తపై పన్ను విధానం అమలు అవుతోంది.  ఇప్పటి వరకూ ఏడాది రెండు వందల కోట్ల చొప్పున జగన్ సర్కార్   చెత్త పన్ను పేరిట వసూలు చేసింది.    

రామోజీరావు ఆ పేరే ఒక బ్రాండ్!

రామోజీరావు.. ఆ పేరే ఒక బ్రాండ్ రామోజీ రావు పరిచయం అక్కర్లేని పేరు.  ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్  రామోజీ మృతి పూడ్చలేని లోటు. జర్నలిజం విలువలను పాటించిన రామోజీరావు. ఈనాడు పత్రిక ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారు.   1936 నవంబర్ 16న కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీ అంచెంలంచెలుగా ఎదిగారు. సినీ నిర్మాతగా కూడా ఆయన సమాజానికి ఉపయుక్తమైన సినిమాలనే తీశారు. ఉషాకిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా దాదాపు 80కి పైగా సినిమాలను ఆయన నిర్మించారు.  ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీ ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పిల్మ్ సిటీ. అంతే కాదు ఇది గొప్ప పర్యాటక ప్రాంతంగా కూడా పరిగణించబడుతోంది. దేశం, ప్రపంచం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో పర్యటకులు రామోజీ ఫిల్మ్ సిటీ సొందర్శనకు వస్తున్నారంటేనే దాని గొప్పతనం అర్ధం చేసుకోవచ్చు.  ఇక డిజిటల్ యుగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. దేశంలోనే మొట్టమొదటి  రీజనల్ చానల్ ను ప్రారంభించినది రామోజీరావే. ప్రస్తుతం దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వార్తలను ప్రసారం చేస్తున్న ఏకైక చానెల్ ఈటీవీ.    మీడియా, జర్నలిజంలలో ఆయన అందించిన  విశేష సేవలకు గాను రామోజీరావుకు  2016లో   భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ వరించింది.  

అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఒక మీడియా అధిపతికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం బహుశా దేశంలో ఇదే ప్రథమం.  సీడ్ల్బూసీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాఏణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ ఇక లేరన్న వార్త తెలియగానే అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. రామోజీ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలనీ,న అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రేవంత్ ఆదేశించారు. ఏర్పాట్ల పర్యవేక్షణను రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు.   రామెజీ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్షర యోధుడు రామోజీరావు ఇక లేరన్న వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన సంతాప సందేశంలో రామోజీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబానిని తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

రామోజీరావు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌  రామోజీరావు(88)  కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ   శనివారం (జూన్ 8) తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని   నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. 1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో  జన్మించిన రామోజీరావు  1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ దినపత్రికను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఈనాడు తెలుగువారి గుండె చప్పుడుగా మారిపోయింది.   అద్భుతమైన రామోజీ ఫిల్మ్ సిటీ  సృష్టికర్త రామోజీరావు.  రామోజీరావు మృతి పట్ల తెలుగుదుశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రామోజీ మృతి తీరని లోటుగా పేర్కొన్న చంద్రబాబు సమాజహితం కోసం నిలబడిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు.   రామోజీరావు మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్న ఆయన రామోజీ అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతకు మారుపేరని పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

రామోజీరావు అస్తమయం!

ఈనాడు గ్రూస్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) అస్తమించారు. ఈనెల 5వ తేదీన ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుఝామున 4 గంటల 50 నిమిషాలకు కన్నుమూశారు. రామోజీ ఫిలింసిటీలోని ఆయన నివాసానికి రామోజీరావు పార్థివ దేహాన్ని తరలించారు. రామోజీరావు మృతికి ‘తెలుగువన్’ సంతాపం తెలియజేస్తోంది.  1936 నవంబర్ 16వ తేదీన కృష్ణాజిల్లాలోని పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. తెలుగునాట ఒక చరిత్రగా నిలిచారు. ఈనాడు లాంటి మహా మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించారు. అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. రామోజీ ఫిలింసిటీ లాంటి ప్రపంచ అద్భుతాన్ని నిర్మించారు. ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించారు.

ఈనెల 19 నుంచి జగన్ కేసుల విచారణ!

ఈనెల 19 నుంచి జగన్మోహన్ రెడ్డికి బ్యాండ్ బాజా బారాత్ మొదలు కానుంది. జగన్ మీద వున్న కేసుల విచారణ ఆరోజు నుంచి సీబీఐ కోర్టు ప్రారంభించనుంది. ఇంతకాలం ముఖ్యమంత్రి హోదాలో వున్నాకాబట్టి, ప్రజాసేవలో తలమునకలైపోయి వుంటా కాబట్టి సీబీఐ విచారణకు హాజరు కాలేనంటూ జగన్ తప్పించుకుని తిరిగారు. ఇప్పుడు జగన్ మామూలు ఎమ్మెల్యే కాబట్టి, ఆయను విచారణకు హాజరయ్యేలా ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం వుంది. మొత్తమ్మీద మేటర్ ఏంటంటే, జగన్ క్రమంగా చట్టం, న్యాయం చేతుల్లోకి ప్రవేశించబోతున్నారు. జగన్ జీవితంలో రాబోయే రోజులు ఎలా వుండబోతున్నాయో చెప్పడం కంటే, చూడడం బెటర్.

‘గెటౌట్’ అంటే గానీ బయటకి పోరా?

ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వం పాతాళంలోకి పడిపోయింది. తమను నామినేట్ చేసిన ప్రభుత్వం పడిపోగానే తమ పదవులకు రాజీనామా చేయాలని కూడా తెలియని తోలుమందం బ్యాచ్ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా, డైరెక్టర్లుగా, సభ్యులుగా వున్నారు. కొర్పొరేషన్లకు నామినేట్ అయిన వాళ్ళెవరూ జగన్ ప్రభుత్వం ఖతమ్ అయిపోయిన తర్వాత తమ పదవులకు రాజీనామాలు చేయకుండా సీట్లకి ఫెవీకాల్ రాసుకుని కూర్చునే వున్నారు. కొంతమంది అంతే, తన్ని తరిమితేగాని బయటకి వెళ్ళరు. అలాంటి వాళ్ళ కోసం చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గెటవుట్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు వున్న నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు వెంటనే రాజీనామాలు చేయాలని ఆదేశించారు. తమకు వచ్చిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

దయనీయంగా వల్లభనేని వంశీ పరిస్థితి!

గతంలో ఇష్టం వచ్చినట్టు వాగిన వల్లభనేని వంశీ ఇంటి దగ్గరకి శుక్రవారం నాడు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళారు. వంశీ బయటకి రావాలని, గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు సవాళ్ళు విసరాలని డిమాండ్ చేశారు. అయితే వల్లభనేని వంశీ కుటుంబం ఇంట్లో లేరు. తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఇంట్లోనే వున్నారనుకుని గొడవ చేశారు. పోలీసులు వచ్చి వాళ్ళని అక్కడ నుంచి పంపేశారు. నిజానికి కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే వల్లభనేని వంశీ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకి వచ్చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే ఆయన కుటుంబంతో కలసి గన్నవరాన్ని విడిచిపెట్టేసి హైదరాబాద్‌కి వెళ్ళిపోయారు.  అధికార మదంతో అప్పట్లో నోటికొచ్చినట్టు వాగారు కానీ, ప్రస్తుతం వల్లభనేని వంశీ పరిస్థితి చాలా దయనీయంగా వున్నట్టు తెలుస్తోంది. గన్నవరం వైసీపీ ఎమ్మెల్యేగా అవినీతి, అక్రమాలతో కోట్లు కోట్లు సంపాదించుకున్నారుగానీ, ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది. చేసిన తప్పు, వాగిన వాగుడు మానసికంగా వేధిస్తూ వుండటంతో అది ఆరోగ్యం మీద ప్రభావం చూపించి మనిషి పూర్తిగా నిస్సత్తువగా అయిపోయారు. ఎన్నికల ప్రచారంలోనే రొప్పుతూ కనిపించారు. నామినేషన్ వేసిన సమయంలో అయితే పూర్తి నిస్సత్తువగా మారిపోయి ఒక బెంచీ మీద కూర్చుండిపోయారు. ఇప్పుడు గన్నవరంలో ఓడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. వల్లభనేని వంశీ అయితే ఢక్కామొక్కీలు తిన్నవాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని కొంతవరకైనా తట్టుకోగలుగుతున్నారుగానీ, ఆయన కుటుంబం అయితే ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు గన్నవరంలో గౌరవంగా బతికి, ఇప్పుడు సొంత ఊరిని, ఇంటిని వదిలేసి హైదరాబాద్‌లో వుండాల్సి రావడం, వంశీ ఆరోగ్యం బాగాలేకపోవడం, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ వుండటం చూసి వాళ్ళు బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఏదైనా చేసి చంద్రబాబు, భువనేశ్వరి కాళ్ళ మీద పడి అయినా ఇప్పుడున్న పరిస్థితిని మార్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, తనకు ఆ అవకాశం లేదని వంశీ కుటుంబ సభ్యులకు చెబుతున్నట్టు సమాచారం. 

చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా పెద్దిరెడ్డి గెలుపు

ఉట్టికెగురలేనమ్మ స్వర్గానికి ఎగిరిట్లుగా ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి. తన సొంత నియోజకవర్గంలో విజయం కోసం చెమటోడ్చిన పెద్ది రెడ్డి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానంటూ చేసిన సవాళ్లను ప్రస్తావిస్తూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు, వాస్తవానికి వైసీపీలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కీలక నేత అనడంలో సందేహం లేదు. ఈ సారి ఎన్ఆనికలలో వైసీపీ నుంచి గెలిచిన 11 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ చిత్తూరు జిల్లాలో కుప్పం వినా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించడం వెనుక ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డే. ఆ ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజవర్గాలకు గానూ 13 స్థానాలలో వైసీపీ విజయం సాధించడంతో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో స్థాయికి మించిన సవాళ్లు చేశారు పెద్ది రెడ్డి. 2024 ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబును ఒడిస్తానని శపథం చేశారు.   సరే 2024 ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వెలువడ్డాయి. కుప్పం నుంచి నారా చంద్రబాబును ఓడిస్తానంటూ సవాళ్లు, శపథాలు చేసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన పుంగనూరు నుంచి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా విజయం సాధించారు. కుప్పంలో చంద్రబాబు గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే దాదాపు 18 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీ సాధించారు. ఆయనకు 48వేల ఆరు ఓట్ల మెజారిటీ వచ్చింది. అదు పుంగనూరులో పెద్దరెడ్డి విజయం సాధించినా ఆయన మెజారిటీ  కేవలం 6 వేల 619 ఓట్లు మాత్రమే.  ఇక పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 76071 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజంపేట నియోజకవర్గంలో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అదే  మిథున్ రెడ్డి విజయానికి కారణమైంది. రాజంపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థి నిలబడి ఉంటే మిథున్ రెడ్డి కచ్చితంగా పరాజయం పాలయ్యే వారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే రాజంపేటలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైతుంది. రాజంపేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో ప్రజలు తెలుగుదేశం కూటమికి ఓట్లు వేసి లోక్ సభ కు వచ్చే సరికి మిథున్ రెడ్డికి ఓటేశారు. మొత్తం మీద చంద్రబాబును ఓడిస్తానంటూ ఎగిరెగిరి పడిన పెద్దరెడ్డికి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా పుంగనూరు నుంచి గట్టెక్కారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.