సంకీర్ణ ధర్మం మోడీకి సమజయ్యేనా?
posted on Jun 11, 2024 @ 4:56PM
మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. బీజేపీకి 240 స్థానాలు మాత్రమే రావడంతో మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 32 స్థానాలు అవసరమయ్యాయి. ఫలితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరమయ్యింది. ముఖ్యంగా తెలుగుదేశం,జేడీయు సహకారంతో పాటు 21పార్టీల మద్దతు తప్పని సరి అయింది.
మోడీ గత రెండు సార్లూ కూడా సంకీర్ణ ప్రభుత్వాన్నే నడిపారు. అయితే అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు. ఆయన గత 10ఏళ్ల పాలనలో సొంత మేజార్టీ వచ్చినా మిత్రులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. నిర్ణయాలు మాత్రం స్వతంత్రం గానే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏకపక్షంగానే తీసుకున్నారు. ఈ సారి మాత్రం ఆయనకు ఆ అవకాశం ఇసుమంతైనా ఉండదు. సమష్టి నిర్ణయాలు తప్పని సరి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భాగస్వామ్య పక్షాలను ఒప్పించాలి. వారి ఆమోదం పొందాలి. ఆయన గుజరాత్ సీఎంగా 13 సంవత్సరాలు, దేశ ప్రధానిగా 10ఏళ్లు నడిచిన తీరు వేరు. ఇప్పుడు రానున్న ఐదేళ్లు నడవాల్సిన దారి వేరు. అప్పట్లో ఆయన అనుకున్నది ఎవరి ఇష్టాయిష్టాలతో పని లేకుండా చేసేశారు. ఇప్పుడు మాత్రం ఇష్టం ఉన్నా లేకున్నా భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ముందుకు సాగాలి. వారి ఆమోదం పొందలేకపోతే రాజీ పడాలి. మోడీ అలా చేయగలరా? అన్దిన రానున్న రోజులలో తేలుతుంది.
అయితే గత పదేళ్లుగా ప్రధానిగా ఆయన పోకడ, తీరు గమనించిన వారికి మోడీ మొండితనం గురించి బాగానే తెలుసు. భాగస్వామ్య పక్షాలలో చీలకలను ప్రోత్సహించి అయినా తాననుకున్నది సాధించే తత్వమే ఆయనలో ఇప్పటి వరకూ కనిపించింది. అయితే ఇప్పుడు అలా చీలికలు తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలన్నీ గతంలో మోడీ కారణంగా ఇబ్బందులు పడినవే. అందుకే ఆ పార్టీలు కూడా అప్రమత్తంగానే ఉంటాయి. బీజేపీకి అనుకూలంగానే ఉంటూ అవసరమైతే దూరం జరగడానికి కూడా వెనుకాడని వైఖరినే ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అనుసరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకు తమ రాజకీయ మనుగడ కోసం రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. అవి నెరవేరడం లేదని భావిస్తే సంకీర్ణం నుంచి అంటే ఎన్డీయే నుంచి బయటకు రావడానికి పెద్దగా ఇలోచించవు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అయినా, అదే విధంగా ఎన్డీయే అయినా గతంలో అదే ధోరణి అవలంబించాయి. అయితే అప్పట్లో బీజేపీకి సొంతంగానే తిరుగులేని మెజారిటీ ఉంది కనుక అప్పట్లో తెలుగుదేశం, ఎన్డీయేలే బీజేపీతో విభేదించి నష్టపోయాయి. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. భాగస్వామ్య పక్షాలు కూటమి నుంచి బయటకు వస్తే నష్టపోయేది, అధికారం కోల్పోయేది బీజేపీయే అవుతుంది.
అన్నిటి కంటే ఎక్కువగా.. ఇప్పుడు బీజేపీలో నరేంద్ర మోడీగి గతంలోలా సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా అంతంత మాత్రమే. పార్టీని మించి ఎదిగిన మోడీకి ఆయన స్థాయి చూపడానికి పార్టీలోనే ఒక వర్గం ఎదురు చూస్తూ ఉందనడంలో సందేహం లేదు. 1989-2014 వరకూ సంకీర్ణ ప్రభుత్వాలే నడిచాయి. మంత్రివర్గంలో ఏదేని నిర్ణయం తీసుకునే ముందు ఎన్డీఏ,యూపీఏ సమావేశంలో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాత కేబినెట్ లో ప్రవేశ పెట్టేవారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత మేజార్టీ ఉండడంతో ఆ సమస్య రాలేదు.ఇకపై అలా ఉండదు. కేంద్రమంత్రివర్గం 72మందితో కొలువుతీరింది. మిత్రులకు 11 మంత్రి పదవులు కేటాయిం చారు.అత్యధికంగా సహాయ మంత్రుల పదవులే ఇచ్చారు. ఐదు స్థానాలు దాటిన వారికే కేబినెట్ పదవి ఇచ్చారు.సోమవారం శాఖలు కేటాయించారు. బీజేపీ సీనియర్లకు ముఖ్యమైన పాత శాఖలే కేటాయించారు. టీడీపీకి 2014లో ఇచ్చిన పౌరవిమానయాన శాఖ కేటాయించారు. ప్రధానమైన శాఖలు బీజేపీ ఆధీనంలోనే ఉన్నాయి. దీనిని బట్టే సీట్లు తగ్గినా మోడీ వైఖరి పెద్దగా మారలేదని స్పష్టమౌతోంది. అయితే మోడీ వైఖరి మారకుంటే ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉండేది అనుమానమే.