లక్ష్మీపార్వతికి అస్వస్థత... బాగా పెరిగిన బీపీ!
posted on Jun 12, 2024 @ 11:09AM
వైసీపీ నాయకురాలు, జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితురాలు లక్ష్మీపార్వతి అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటు బాగా పెరిగిపోవడం వల్ల ఆమె అస్వస్థతకు గురైనప్పటికీ, సకాలంలో వైద్య సహాయం అందడం వల్ల ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఆమె బీపీ మరీ పూర్తిగా తగ్గకపోయినప్పటికీ, కొంత అదుపులోకి వచ్చినట్టు సమాచారం. బీపీ పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు బీపీ మందులు క్రమం తప్పకుండా వాడుతూ వుండాలని, ఆవేశంతో, ఆక్రోశంతో రగిలిపోయే విషయాలేవీ ఆలోచించకుండా వుండాలని, అంతే కాకుండా ఆధ్యాత్మిక చింతనలో గడిపితే బాగుంటుందని ఆమెకు వైద్యులు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
లక్ష్మీపార్వతి గత కొన్నేళ్ళుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలిలా వున్నారు. తల్లి తర్వాత తల్లి స్థానంలో ఆమె జగన్మోహన్ రెడ్డితో కలసి ప్రయాణం చేస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో ఆస్థాన ‘విధ్వంసురాలిగా’ ఆమె ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఏ నిమిషమైనా కెమెరా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టిపోయడానికి అందుబాటులో వుంటున్నారు. గత ఐదేళ్ళుగా చంద్రబాబు నాయుడిని, ఎన్టీఆర్ కుటుంబాన్ని తిట్టిపోయడంలో, శాపనార్థాలు పెట్టడంలో ఆమె నిమగ్నమై వున్నారు. దీని ద్వారా ఆమెకు నెలనెలా లభించే గౌరవ వేతనాన్ని గౌరవంగా అందుకుంటున్నారు.
మొన్నీమధ్య వరకూ ఆమె ఆరోగ్యం బాగానే వుందని, జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి అయినప్పటి నుంచి ఆమె బీపీ అదుపు తప్పిందని తెలుస్తోంది. ఎన్ని మందులు వాడినా ఆమె బీపీ పూర్తిగా అదుపులోకి రావడం లేదని సమాచారం. ఈ ఎలక్షన్లలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని, జగన్ ఛానెల్ ద్వారా తనకు మరో ఐదేళ్ళపాటు గౌరవం, దానితోపాటే గౌరవ వేతనం కూడాలభించే అవకాశం వుంటుందని ఆమె భావించారు. అయితే చంద్రబాబు గెలవటంతో ఆమె ప్లానింగ్ మొత్తం తలకిందులు అయింది. అందుకే అప్పటి నుంచి ఆమెలో బీపీ భరతనాట్యం చేస్తోందని తెలుస్తోంది. చంద్రబాబు గురించి, ఎన్టీఆర్ కుటుంబం గురించి ఆలోచించడం మానుకోవాలని ఆమె సన్నిహితులు సూచించినప్పటికీ ఆమె వినడం లేదని, అందుకే ఆమెలో బీపీ టాప్‌గేర్‌కి వెళ్ళినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఓడిపోవాలని తాను ఎంత తపస్సు చేసినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా తాను అనుకున్నది జరగకపోవడం కూడా ఆమె బీపీ బౌండరీ దాటడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఆమెకి ఏమీ కాదని, ఆమె వందేళ్ళు బతికే ‘చిరాయువు’ అని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.