కేశినేని నాని.. అసమర్థుడి అస్త్రసన్యాసం!
posted on Jun 12, 2024 @ 9:43AM
రాజకీయాల్లో ఇతరుల చేతుల్లో మోసపోయిన వారు ఉంటారు. అయితే కేశినేని నాని లాంటి అతి తక్కువ మంది మాత్రం తమను తాము అతిగా ఊహించుకొని బొక్కబోర్లా పడుతుంటారు. ఒకరిద్దరు బడా రాజకీయ నేతలు పరిచయం కాగానే తనంత తోపులేడు అనే భ్రమల్లో గడిపేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రజలు తాను ఏది చెబితే అది నమ్మేస్తారని ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. ఎన్నికల సమరంలోకి దిగితే కానీ తెలియదు వారిసత్తా ఏ పాటిదో. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సరిగ్గా అలాగే బొక్కబోర్లా పడ్డారు. కేశినేని నాని టీడీపీని వీడకుండా ఉండి ఉంటే ఇప్పుడు మోదీ 3.0 క్యాబినెట్ లో మంత్రిగా ఉండాల్సిన వ్యక్తి. కానీ, అతివిశ్వాసం, తలకెక్కిన అహంభావం, కేంద్రంలో బడా రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్నాయన్న ధీమా, ప్రజలు తానేం చేసినా సమర్ధిస్తారన్న పిచ్చితనం.. వెరసి కేశినేని నాని రాజకీయ జీవితానికి చుక్క పెట్టేసింది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో నాని వేసిన ఒక్క తప్పటడుగు ఆయన రాజకీయ జీవితాన్నే సమాధి చేసేసింది.
విజయవాడ ఎంపీ కేశినేని నాని అంటే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులకు పరిచయమున్న పేరు. జాతీయ రాజకీయాల్లో ముఖ్యనేతలతో మంచి సంబంధాలున్నాయి. అందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. కేశినేని నాని 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తద్వారా పదేళ్లలో నితిన్ గడ్కరీలాంటి కేంద్ర మంత్రులతో పాటు పలు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలతో మంచి అనుబంధాన్ని ఏర్పర్చుకున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీతోనే , తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జాతీయ రాజకీయాల్లోనూ, జాతీయ మీడియాలో మంచి పలుకుబడి ఉంది. చంద్రబాబు మనిషిగా కేశినేని నానికి కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు ప్రాధాన్యతనిచ్చేవారు. కానీ, ఇదంతా తన గొప్పతనం అని కేశినేని నాని భావిస్తూ వచ్చారు. అది కాస్తా తలకెక్కడంతో చంద్రబాబు నాయుడునే ఎదిరించేందుకు వెనుకాడని పరిస్థితికి చేరారు. చంద్రబాబు నేను సమానమే అనే భ్రమల్లోకి నాని వెళ్లిపోయారు. దీంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరాడు. ఆ తప్పుడు నిర్ణయమే కేశినేని నాని రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.
కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకున్న తరువాత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని చెప్పుకొచ్చాడు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు తనపై ఎనలేని నమ్మకం ఉందని, వారు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కేశినేని నాని భ్రమల్లో మునిగిపోయారు. అయితే నానికి ప్రజలు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారు. రెండు సార్లు ఎంపీగా గెలిపించింది నిన్ను చూసికాదు.. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబును చూసి అని ఓటు ద్వారా ప్రజలు విస్పష్టంగా చెప్పేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కేశినేని నాని, ఆ పార్టీ నుంచి విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేశాడు. తన సోదరుడు, తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని (కేశినేని శివనాథ్) చేతిలో ఏకంగా 2 లక్షల 82 వేల ఓట్ల తేడాతో నాని ఓటమి పాలయ్యారు. ఘోర ఓటమి తరువాత.. రెండుసార్లు ఎంపీగా గెలిచింది తన బలంతో కాదు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆశీస్సులతో, తెలుగుదేశం పార్టీ బలంతో అని గుర్తించిన నాని, ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశంలో ఉన్నన్ని రోజులు కేశినేని నానికి అన్నివైపుల నుంచి ఎనలేని గౌరవం లభించేది. కానీ, ఒక్కసారి తెలుగుదేశం పార్టీని వీడిన తరువాత ఆయన రాజకీయజీవితమే సమాధి అయిపోయింది. కేశినేని నాని రాజకీయ జీవితం ప్రస్తుతం రాజకీయాల్లో ఎదుగుతున్నవారికి ఓ గుణపాఠం అని చెప్పొచ్చు.
మరోవైపు విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన నేతలు రాజకీయాలకు దూరమవుతుండటం ఆనవాయితీగా వస్తున్నది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌లపై కేశినేని నాని విజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కోనేరు రాజేంద్ర ప్రసాద్, పొట్లూరి వర ప్రసాద్ రాజకీయాలకు దూరమయ్యారు. 2024 ఎన్నికల్లో కేశినేని చిన్నిపై నాని ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన కూడా రాజకీయాలు గుడ్ బై చెప్పేశారు.