8 నుంచి చేప ప్రసాదం పంపిణీ షురూ
హైదరాబాద్ చేపమందు పంపిణీ దేశ వ్యాప్తంగాా ప్రసిద్దిగాంచింది. దశాబ్దాలుగా పాతబస్తీ దూద్ బౌలిలో ప్రారంభమైన చేప మందు తయారీ అక్కడే పంపిణీ చేశారు. అస్త మా పేషెంట్లు ఎక్కువ కావడంతో పంపిణీ కార్యక్రమం కాస్తా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి షిప్ట్ అయ్యింది. గతంలో ఇదే చేపమందును కొందరు వ్యక్తులు వివాదాస్పదం చేశారు. చేపమందులో అస్తమా వ్యాధిని తగ్గించే అవశేషాలు లేవని కొందరు వ్యక్తులు హైకోర్టునాశ్రయించారు. హైకోర్టు కూడ చేపమందును కాస్తా చేప ప్రసాదంగా మారుస్తూ ఉత్తర్వులు జారి చేసింది. నేటితో మృగశిర కార్తె ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్దమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శని, ఆదివారాలు(జూన్ 8, 9తేదీల్లో ) చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలను సమకూరుస్తుండగా, దూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.మరోవైపు తెలంగాణ ఆర్టీసీ అదనంగా 130 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చే వారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు బస్సులు నడుపుతోంది.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఈసీఐఎల్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, దిల్‌సుఖ్‌నగర్, ఎన్జీవోస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రాంనగర్, రాజేంద్రనగర్, రిసాల బజార్, పటాన్‌చెరు, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.