అత్యుత్సాహంతో వైసీపీ బొక్కబోర్లా.. పాయె..పరువు మొత్తం పాయే!
దొరక్క దొరక్క కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ప్రవర్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే తరహాలో గత నాలుగు రోజులుగా వైసీపీ నేతలు నానా హడావుడి చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వైసీపీ నేతలు పెద్దగా బయటకు రావడం లేదు.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏడు నెలల కాలంలో కూటమి పార్టీల మధ్య ఎక్కడా విబేధాలు పొడ చూపలేదు. ఐకమత్యంగా కలిసి రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కూడా ఎలాంటి అంశం, అవకాశం దొరకడం లేదు. అయితే, గత నాలుగు రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను నియమించాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. పలువురు తెలుగుదేశం నేతలు బహిరంగంగానే లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కూటమి నేతల మధ్య ఎలా అగ్గిరాజేయాలా అని గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగం అత్యుత్సాహం ప్రదర్శించింది. కూటమి ప్రభుత్వంలో చీలిక రాబోతోంది.. ప్రభుత్వం కూలబోతోంది అంటూ తెగ హడావుడి చేశారు. అంతే కాదు.. కూటమి నేతలు మాట్లాడని మాటలను జోడించి తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య గొడవ పెట్టేలా వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా తీవ్రంగా శ్రమించింది. కానీ, చివరకు బొక్కబోర్లా పడింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నారు. దీంతో కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఒకే పార్టీ నేతల తరహాలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కలిసి మెలిసి పని చేస్తున్నారు. అయితే, కూటమి అధికారంలోకి వచ్చిన నాటినుంచి టీడీపీ నేతలు, ఆ పార్టీ శ్రేణుల్లో ఓ ఆశ ఉంది. పవన్ కల్యాణ్ ను కొనసాగిస్తూనే మంత్రి నారా లోకేశ్ కు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతల నుంచి లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలన్న డిమాండ్ తీవ్రమైంది. ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు తెలుగుదేశం వాదనను సమర్ధించగా.. మరికొందరు ఖండించారు. ఇదే అదునుగా తీసుకొని వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. కూటమి ప్రభుత్వంలో చీలిక వచ్చిందంటూ అసత్య ప్రచారం చేస్తూనే.. మరోపక్క లోకేశ్ ను తిట్టినట్లు జనసేన పేరుతో పోస్టులు పెట్టడం, పవన్ ను విమర్శిస్తూ తెలుగుదేశం నేతల పేరుతో పోస్టులు పెట్టడం వంటి చర్యలకు వైసీపీ సోషల్ మీడియా పాల్పడింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలని తెలుగుదేశం నేతల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం విషయంపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అధిష్టానం పార్టీ క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లోకేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వంలోనూ, పార్టీ బలోపేతంలోనూ లోకేశ్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఇటీవలే టీడీపీ సభ్యత్వాలు తొలిసారి కోటి దాటాయి. భారీ సంఖ్యలో ప్రజలు పార్టీ సభ్యత్వాలు తీసుకోవడానికి ప్రధాన కారణం లోకేశ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటూనే మరో పక్క రాష్ట్రం అభివృద్ధిలో లోకేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తెలుగుదేశం నేతలు కోరడంలో తప్పులేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల్లోకి మరింత చొచ్చుకొని వెళ్లొచ్చు.. అదే సమయంలో తెలుగుదేశం బలోపేతానికి మరింతగా కృషిచేసే అవకాశం ఉంటుంది. అయితే, లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండటంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జనసేన పార్టీ అధిష్టానం సైతం ఆ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేసింది. ఎవరూ ఈ అంశంపై మాట్లాడొద్దని సూచించింది. దీంతో గత నాలుగు రోజులుగా కూటమిప్రభుత్వంలో చీలక తేవాలని ప్రయత్నించిన వైసీపీ సోషల్ మీడియా ఆశలు అడియాశలయ్యాయి.
గత నాలుగు రోజులుగా వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ఓవరాక్షన్ పట్ల ప్రజలతో పాటు వైసీపీ శ్రేణులుసైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీల మధ్య చిన్నపాటి విబేధాలు రావడం సహజమే. అవి టీ కప్పులో తుఫాను లాంటివి. ఈ విషయాన్ని గ్రహించకుండా వైసీపీ నేతలు లోకేశ్ డిప్యూటీ సీఎం విషయంపై తెగ హడావుడి చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాల్సిన వైసీపీ.. కేవలం కూటమి పార్టీల మధ్య విబేధాలు సృష్టించేందుకు, లేనిపోని అసత్యాలతో జనసేన, టీడీపీ నేతల మధ్య గొడవ పెట్టేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లోకేశ్ డిప్యూటీ సీఎం ఎపిషోడ్‌లో చివరికి వైసీపీ పెద్ద ఫూల్ అయిందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. ఇప్పటికైనా వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా ఏపీలో ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తారా.. కూటమి పార్టీల నేతల మధ్య ఎప్పుడు విబేధాలు తలెత్తుతాయా అని గోతికాడ గుంటనక్కలా ఎదురు చూస్తుందా అనేది వేచి చూడాల్సిందే.