నిర్మలమ్మ పద్దు... వీటి ధరలు తగ్గుతాయ్!

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధానంగా  పేదలు, మహిళలు, యువత, రైతులకు ప్రయోజనం కలిగే అంశాలపై దృష్టి పెట్టారు.  బడ్జెట్ సందర్భంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులు పలు వస్తువుల ధరలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్ని తగ్గుతాయి  ధరలు తగ్గేవి: క్యాన్సర్ మందులు ప్రాణాలను రక్షించే మందులు ఫ్రోజెన్ చేపలు చేపల పేస్ట్  ఖనిజాలు ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు స్వదేశంలో తయారైన దుస్తులు మొబైల్ ఫోన్లు లెదర్ గూడ్స్ మెడికల్ ఎక్విప్ మెంట్ 

వేతన జీవులకు ఒకింత ఊరట.. రూ.12 లక్షల వరకూ ఆదాయపన్ను మినహాయింపు

నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో వేతన జీవులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకున్నారు. వారు ఆశించినంత కాకపోయినా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో ఆదాయపనున్న పరిమితిని పెంచారు. రూ.12 లక్షల వరకూ ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారు.  అలాగే వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపును రూ. 50 వేల నుంచి లక్షకు, అద్దెల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపును రూ. 2.4లక్షల నుంచి 6 లక్షలకు పెంచారు.  - లిథీయం బ్యాటరీలపై పన్నులు తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయి. కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఈ నిర్ణయం ఊతం ఇస్తుందనడంలో సందేహం లేదు.     - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దేశంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో  కృత్రిమ మేధ అభివృద్ధికి రూ.500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు  కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మూడు ఎక్సలెన్స్ కేంద్రాలను స్థాపించనున్నట్లు మంత్రి ప్రకటించారు. - నిర్మలా సీతారామన్ బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.  అలాగే ఉడాన్ పథకం ద్వారా ప్రాంతాల మధ్య కనెక్టవవిటీకి వచ్చే పదేళ్లలో దేశంలో 120 విమానాశ్రయాలను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.   - దేశంలో 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యా కారులు, పాడి రైతులకు లబ్ధి చేకూరేలా  సస్వల్పకాలిక రుణాల మంజూరును సులభతరం చేయనున్నట్లు విత్త మంత్రి ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాలకు   వడ్డీ రాయితీ పథకం కింద రుణ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.  

నిర్మలమ్మ పద్దులో ముఖ్యాంశాలు

నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో అన్నివర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, రాష్ట్రాలకు రుణాలు, దేశ వ్యప్తాంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాలు వంటి కీలక అంశాలను ఆమె ప్రకటించారు. - పట్టణ పేదల కోసం రూ.30 వేల పరిమితితో కొత్త యూపిఐ లింక్ డ్ క్రెడిట్ కార్డులు - క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం -పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నేషనల్ మేనిఫ్యాక్చరింగ్ మిషన్ - విమనయానాన్ని ప్రోత్సహించేందుకు కొత్త ఉడాన్ పథకం మరో 120 రూట్లలో అమలు వచ్చే పదేళ్ల కాలంలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణ కల్పన లక్ష్యం - రాష్ట్రాలకు రూ.1.5లక్షల కోట్ల రుణాలు. ఐదు దశాబ్దాలకు వడ్డీ రహిత రుణాలు.. సంస్కరణలు  అమలు చేస్తే ప్రోత్సాహకాలు -గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన దీని వల్ల కోటి మవదవి గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుంది.   - బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు -ఇక దేశంలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోనికి తీసుకు రానున్నట్లు ప్రుకటించారు. దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లు జల్ జీవన్ మిషన్ కు మరిన్ని నిధులు. ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచి నీరు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వందశాతం తాగునీటి కుళాయిలు .

బడ్జెట్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన విపక్షాలు

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అనంతరం వాకౌట్ చేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించిన నిర్మలా సీతారామన్ వారు వాకౌట్ చేసినా పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.  - 7.7 కోట్ల మందికి ప్రయోజనం కలిగే విధంగా కిసాన్ కార్డుల పరిమితిని  3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.  - అలాగే ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేశారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలను రూ. 5 నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. - స్టార్టప్ లకు రుణాల పరిమితిని పది కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు.  - ఇది కాకుండా బొమ్మల తయారీకి ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు.

బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం

2025-26 ఆర్థిక సంవత్సరానికి విత్త మంత్రి నిర్మలాసీతారామన్ రూపొందించిన బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.  పార్లమెంట్ భవన్ లో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఇలా ఉండగా నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలతో పాటు సామాన్య జనం కూడా బడ్జెట్ ఎలా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ఉండాలని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. అయితే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలతో దేశం సతమతమౌతోందన్నారు. తన వరకూ తనకు నిర్మలా సీతారామర్ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై భారీ ఆశలూ, అంచనాలూ ఏవీ లేవన్నారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అయితే అందరి కోసం, దేశ ప్రగతి కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది అని వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా కేంద్ర విత్తమంత్రి లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 23 పాయింట్లు, నిఫ్టి 37 పాయింట్ల లాభంతో మొదలయ్యాయి. 

పార్లమెంటు భవన్ కు చేరుకున్న విత్తమంత్రి

కేంద్ర విత్తమంత్రి  నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈరోజు వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశట్టేందుకు పార్లమెంట్ భవన్ కు చేరుకున్నారు. చక్కగా ఎంబ్రాయిడరీ చేసిన బంగారు అంచు ఉన్న క్రీమ్ కలర్ హ్యాండ్లూమ్ సిల్క్ చీర ధరించారు.  ఆమె ఈ ఉదయం నుంచీ పలువురు అధికారులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆమె చేతిలో బంగారు వర్ణంలో ఉన్న జాతీయ చిహ్నంతో కూడిన ఎర్ర కవర్ ఉంది. ఆందులోనే బడ్జెట్ పొందుపరిచిన టాబ్ ఉంది. ఆ టాబ్ ద్వారానే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. అంతకు ముందు ఆమె రాష్ట్రపతి భవన్ లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కూడా ఉన్నారు. ముర్ముతో భేటీ అనంతరం ఆమె పార్లమెంటు భవన్ కు చేరుకున్నారు. అక్కడ కేబినెట్ బడ్జెట్ ను ఆమోదించిన అనంతరం నిర్మలా సీతారామన్ దానిని లోక్ సభలో ప్రవేశ పెడతారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విత్తమంత్రి భేటీ

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వరుసగా ఎనిమిదోసారి ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టడం విశేషం. అయితే ఈ సార గతంలోలా కాకుండా ఆమె బడ్జెట్ ను లెడ్జర్ ఖాతాల ద్వారా కాకుండా ట్యాబ్ ద్వారా ప్రవేశ పెడతారు. ఇప్పటికే బడ్జెట్ కాపీలు పార్లమెంటు భవనానికి చేరుకున్నాయి. ఇలా ఉండగా కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాష్ట్రపతి భవన్ కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి తీసుకున్నారు.  

ఆశల పల్లకిలో మధ్యతరగతి జీవులు.. నిర్మలమ్మ పద్దుపై సర్వత్రా ఆసక్తి!

కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ప్రవేశపెట్టనున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అన్ని వర్గాలలో ఈ బడ్జెట్ పై విపరీతమైన ఆశలు ఉన్నాయి. అన్ని వర్గాల ఆకాంక్షలనూ నెరవేర్చేలా బడ్జెట్ ఉండబోతోందన్న అంచనాలూ ఉన్నాయి. లోక్ సభలో బీజేపీకి స్వయంగా పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ప్రభుత్వ మనుగడ ప్రధానంగా తెలుగుదేశం, జేడీయూ వంటి పార్టీల మద్దతుపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ లకు కేటాయింపుల్లో సింహభాగం దక్కే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గతంలోలా మోడీ సర్కార్ పై ప్రజలలో సంపూర్ణ విశ్వాసం కొరవడటానికి కారణాలను అన్వేషించిన బీజేపీ అగ్రనాయకత్వం ఈ సారి బడుగు, బలహీన, మధ్య తరగతిపై వరాల జల్లు కురిపించేలా బడ్జెట్ ఉంటుందన్న అంచానాలూ ఉన్నాయి.   శనివారం (ఫిబ్రవరి 1) ఉదయం 11గంటలకు కేంద్ర విత్త మంత్రి  నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.  దేశవ్యాప్తంగా అన్ని వర్గాలూ అంటే బడుగు,బలహీన మధ్యతరగతి, పారిశ్రామికవర్గాల నుంచి వేతన జీవుల వరకూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో తమకు  ప్రయోజనం కలిగించే ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నారు.  విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మలమ్మ పద్దులో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు పలు అంశాల్లో ఊరట లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యవసాయదారులు, మహిళలు, పేదవర్గాలు, యువతపై ప్రత్యేక దృష్టి పెట్టి మరీ బడ్జెట్ ను రూపొందించిననట్లు తెలుస్తోంది. ఆర్థిక వృద్ధిరేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పతనమైన పరిస్థితుల్లో దానిని పెంచడం, అలాగే అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్.. ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో  నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి కనిపిస్తోంది.   ఇక బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు అలాగే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసగం బట్టి చూస్తే ఈ సారి బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ముఖ్యంగా ఆదాయపన్ను విధానంలో భారీ సంస్కరణలకు ఈ బడ్జెట్ తెరతీస్తుందని అంటున్నారు. అలాగే పన్ను శ్లాబుల విషయంలో కూడా వేతన జీవులకు మంచి వెసులుబాటు ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  ఇక విత్తమంత్రి నిర్మలాసీతారామన్ పద్దుపై తెలుగు రాష్ట్రాలూ ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలవరం, అమరావతిలకు మరిన్ని నిధులను కేంద్రం కేటాయిస్తోందని ఆశిస్తోంది.  

జగన్ కంటే నీరోయే నయం!

రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారన్నది నానుడి. ప్రస్తుతం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను చూస్తుంటే నీరో చాలా చాలా నయం అనిపిస్తుంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోరాతి  ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అధికారంలో ఉండగా తమంత వారు లేరన్నట్లుగా చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు నోరు మెదపడానికి భయంతో వణికి పోతున్నారు. చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు. ఇక ఎక్కడా అవకాశం లేని కొద్ది మంది మాత్రం త్వమేవ శరణం నాస్తి అన్నట్లు వైసీపీపి పట్టుకు వేళాడుతున్నారు. వారిలో కూడా అంబటి వంటి వారు తప్ప మరెవరూ పార్టీ కార్యక్రమాలలో  పాల్గొనడం లేదు. సాధ్యమైనంత వరకూ వార్తల్లో ఉండకుండా కౌపీన సంరక్షణార్థం అన్నట్లు మౌనాన్ని ఆశ్రయించి దాదాపు రహస్య జీవనం గడుపుతున్నారు.  ఇటువంటి పరిస్థితుల్లో జగన్ కుమార్తెల దగ్గరకు అంటూ లండన్ చెక్కేశారు. సంక్రాంతి తరువాత నుంచీ జిల్లాల పర్యటన అంటూ ఊదరగొట్టేసిన ఆయన ఆ తరువాత ఆ మాటే ఎత్తడం లేదు. సరే అది అలా ఉంచితే తాజాగా వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించి, జగన్ తన బలుపుగా ఇంత కాలం చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి జగన్ కు షాక్ ఇచ్చారు. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా చడీచప్పుడు లేకుండా విజయసాయి తన దారి తాను చూసుకున్నారు. ఇక రాజకీయాలు మాట్లాడనుంటూ ట్వీట్ చేసేసి పనిలో పనిగా ఇంత కాలం తాను ఎవరిపై అయితే అనుచిత వ్యాఖ్యలు, అసంబద్ధ విమర్శలతో రెచ్చిపోయారో వారి పట్ల తనకు ఎలాంటి విరోధం లేదని కూడా చెప్పేసి తాను గతంలో చేసిన విమర్శలు, వ్యాఖ్యలూ అన్ని జగన్ స్క్రిప్టేనని అన్యాపదేశంలో వెల్లడించేశారు. ఎదో  మొక్కిబడికి జగన్ కు తాను రుణపడి ఉంటానని, వైఎస్ కుటుంబంతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  ఇదంతా సరే విజయసాయి రాజీనామాతో వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. అసలు ఎవరూ ఊహించని పరిణామం కావడంతో విజయసాయి రాజీనామాపై ఎలా స్పందించాలో కూడా ఆ పార్టీ నేతలకు తెలియలేదు. అందుకే విజయసాయి పార్టీ నుంచి నిష్క్రమించడంపై వైసీపీ నుంచి అధికారిక స్పందనే కరవైంది. సజ్జల, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు పెదవి కదపలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. సాధారణంగా పార్టీ ఇంతటి సంక్షోభంలో ఉన్న తరుణంలో ఏ నాయకుడైనా పార్టీ నేతలు, క్యాడర్ లో ధైర్యం నింపడానికి వారితో భేటీ అవుతారు. భరోసా ఇస్తారు. నేను ముందుండి నడిపిస్తానన్న స్థైర్యాన్ని ఇస్తారు. కానీ జగన్ అవేమీ చేయలేదు. విదేశీ పర్యటన నుంచి ఆయన ఏపీకి  రాలేదు. బేంగళూరు వెళ్లి కూర్చున్నారు. పార్టీ పరిస్థితి గురించి కానీ, విజయసాయి రాజీనామా గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు. విదేశీ విహారం తరువాత బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు సైతం జగన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ మనుడగ కష్టమేనన్న అభిప్రాయం ఆ పార్టీ నుంచే వ్యక్తం అవుతోంది. ఇంకా జగన్ ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని బాహాటంగానే చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో ఆయన రాష్ట్రానికి వచ్చి జిల్లాల పర్యటనలు ప్రారంభించినా ఆయన వెంట నడిచేవారూ, నిలిచేవారు ఎవరూ ఉండకపోవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మరో మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత?!

కల్వకుంట్ల కుటుంబాన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా స్కాంలు చుట్టుముడుతున్నాయా? అవినీతి, అక్రమార్జన విషయంలో వారు ఆరోపణల ఊబిలో కూరుకుపోయారా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తుంటే ఔననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల  చంద్రశేఖరరావు కుమార్తె, కుమారుడూ కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఇప్పటికే అరెస్టై బెయిలుపై ఉన్నారు. ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిండా మునిగి ఉన్నారు. ఈ విషయంలో నిధుల మళ్లింపు జరిగిందనీ, దానిలో కేటీఆర్ ప్రమేయానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనీ కోర్టులు కూడా వ్యాఖ్యానించాయి. ఆయనకు ముందస్తు బెయిలు తిరస్కరించాయి. ప్రస్తుతం ఆయన ఏసీబీ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్నారు.  ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై బెయిలుపై విడుదలైన కవితపై అదే మద్యం విషయంలో మరోమారు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సారి ఆరోపణలు కేరళ మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి వచ్చిన తరువాత చాలా కాలం పాటు మౌనాన్ని ఆశ్రయించిన కవిత ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ.. రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. అంతలోనే కేరళ మద్యం విధానంలోనూ కుంభకోణం జరిగిందనీ, అందులో కూడా కవిత ప్రమేయం ఉందనీ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆరోపణలకు చేసింది కేరళ విపక్ష నేత వీడీ సతేషన్ చేశారు.   ఢిల్లీలో జరిగిన విధంగానే కేరళలోనే మద్యం విధానంలో పెద్ద కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రధాన పాత్ర పోషించారనీ ఆయన ఆరోపించారు. కవిత పలుమార్లు కేరళ వచ్చి ఓ కంపెనీకి మద్యం ప్లాంట్ల కోసం లాబీయింగ్ చేశారని సతేషన్ ఆరోపణలు గుప్పించారు. కేరళలో అధకారంలో ఉన్న వామపక్ష కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే ఇదంతా జరిగిందన్న నతేషన్ కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావించడం ప్రాధాన్యత  సంతరించుకుంది.  కేరళలో ఈ మద్యం కుంభకోణం 2023లో జరిగిందని చెప్పిన ఆయన  పాలక్కాడ్‌లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ లిమిటెడ్ పేరుతో భారీగా భూములు సేకరించారని , ఎక్సైజ్ చట్టంలో  మార్పులు చేసి మరీ ఆ సంస్థకు మద్యం తయారీ లైసెన్సు మంజూరు చేశారని సతేషన్ ఆరోపించారు. కేరళ ముఖ్యమంత్రి  పినరయి విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ లు ఏకపక్షంగా వ్యవహరించి మరీ లైసెన్సులు మంజూరు చేశారన్నారు.  ఇదంతా కల్వకుంట్ల కవిత కేరళ వచ్చి పెద్దలతో భేటీల తరువాతే జరిగిందని సతీష్ ఆరోపణ. ఈ ఆరోపణలను కవిత ఖండించారు. అయితే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టై బెయిలుపై ఉన్న నేపథ్యంలో తాజా ఆరోపణలపై ఆమె ఖండనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు సరికదా.. నిప్పు లేకుండా పొగరాదుగా అని వ్యాఖ్యానిస్తున్నారు. 

విజయసాయి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 10 నుంచి మార్చి పది మధ్యలో ఓ పది హేను రోజులు విదేశాలకు వెళ్లేందకు సీబీఐ కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది.  ఇటీవల వైసీపీ పార్టీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. ఇక నుంచి పూర్తిగా రాజకీయాలకు దూరమౌతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తన వ్యాపకం రాజకీయం కాదనీ, వ్యవసాయం మాత్రమేననీ విజయసాయి స్పష్టంగా చెప్పారు. రాజకీయ సన్యాసం తరువాత కొద్ది కాలం పాటు విదేశాలకు వెళ్లాలని భావించిన విజయసాయి రెడ్డి ఫ్రాన్స్ , నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 కావడంతో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వాలి. దీంతో ఆయన తన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టును  ఆశ్రయించారు. కోర్టు ఆయన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ విదేశాలలో ఉన్న సమయంలో పార్టీకి గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి, ఆయన స్వదేశానికి రాగానే విదేశాలకు చెక్కేస్తున్నారని సెటైర్లు పేలుతున్నాయి.    

సాక్షులు చనిపోతున్నారు – హైకోర్టులో వైఎస్ సునీత పిటిషన్

2019 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీత తాజాగా మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఇంకెంత మాత్రం జాప్యం కూడదని కోరుతూ ఆమె సత్వరమే విచారణ పూర్తి చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రిని అత్యంత ఘోరంగా చంపేసిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని,  ప్రస్తుతం ఆ కేసుపై విచారణ కూడా జరగడం లేదని  వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆ పిటిషన్ లో  పేర్కొన్నారు.  తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో  దాఖలు చేసిన పిటిషన్ లో ట్రయల్ ప్రారంభం కాకుండా చేస్తున్నారని.. ఆరు నెలల్లో ట్రయల్‌ మొత్తం పూర్తిచేసేలా నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని  కోరారు.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లు దాటినా ఇంకా కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని  పేర్కొన్నారు. . సీబీఐ సమర్పించిన డిస్కుల్లో 13 లక్షల ఫైల్స్‌ ఉండగా ఇప్పటివరకు 13,717 ఫైల్స్‌ మాత్రమే ఓపెన్‌ చేశారన్నారు. రోజుకు 500 ఫైల్స్‌ చొప్పున ఓపెన్‌ చేసుకుంటూ పోతే మరో ఏడేళ్లయినా ట్రయల్‌ ప్రారంభం కాదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా తన పిటిషన్ లో ఈ కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారని, వారి మరణాలు అనుమానాస్పద స్థితిలో సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  ఇప్పటికైనా ట్రయల్‌ ప్రారంభించాలని కోరారు. కాగా సునీత్ పిటిషన్ ను కోర్టు ఫిబ్రవరి 4న విచారించనుంది.   

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన సుప్రీం

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలనూ విన్న సుప్రీం కోర్టు తదుపరి విచారణకు వచ్చే సోమవారానికి వాయిదా వేచింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదిని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంత అని సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించింది. మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలంగాణ అసెంబ్లీ గడువు ముగిసే దాకా నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం రాదా అని నిలదీసింది. ఈ దశలో ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీ స్పీకర్ ను అడిగి చెబుతానని అన్నారు. దీంతో విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.  ఇలా ఉండగా పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులుఇప్పటి వరకూ  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదని సుప్రీం ద‌ృష్టికి తీసుకువచ్చారు. స్పీకర్ రీజనబుల్ టైం అన్నారనీ, దానికి నిర్దుష్ట టైమ్ ఫ్రేమ్ ఉండాలని వాదించారు.  

ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో    ఉమ్మ‌డి ఉభ‌య‌గోదావరి, కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ నియోజ‌కవ‌ర్గాల‌కు, శ్రీకాకుళం-విజ‌య‌న‌గ‌రం-విశాఖ‌ప‌ట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు జరగనున్నాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆ ఎన్నికల నోటిషికేషన్ ఫిబ్ర‌వ‌రి 3న విడుదలౌతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ కూటమి పార్టీల నేతలకు దిశానిర్దేశం చేశారు.  ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రాజ‌శేఖ‌ర్‌ను భారీ మెజారి టీతో గెలిపించాల‌ని కోరారు. ఎన్‌డీఏ ప‌క్షాల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాలు పెట్టుకుని ప‌నిచేయాల‌ని సూచించారు. సుస్థిర పాలన కోసం ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను విజయపథంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనీ, రాష్ట్రం బాగు కోసం, ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.  

రాష్ట్రపతి ప్రసంగంలో పోలవరం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 31) ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని నిర్దుష్ట సమయంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.  ఈ ప్రాజెక్టుకు కేంద్రం  ఇప్పటికే రూ.12,000 కోట్లు కేటాయించింద తెలిపారు.  పోలవరంతో పాటు ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను ఆమె తన ప్రసంగంలో వివరించారు. దేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్ గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.  అందుకు దోహదం చేసే ఇండియా ఏఐ మిషన్ అన్నారు. ఇ  కృత్రిమ మేధస్సు రంగంలో భారతదేశం పాత్రను పెంచడం లక్ష్యంగా ఆ మిషన్ పని చేస్తున్నదని ముర్ము అన్నారు.  సైన్స్, స్టార్టప్‌ల నుంచి అంతరిక్ష పరిశోధన వరకు వివిధ రంగాలలో భారతీయ యువత అపార నైపుణ్యం చూపుతోందన్నారు.   అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్‌తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు.  దేశంలోని విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పారు. మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అలాగే చిన్న వ్యాపారులకు సైతం రుణాలను రెట్టింపు చెసినట్లు చెప్పారు. మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం పట్ల ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. యువతకు విద్య, ఉపాధి కల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని,  మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ముర్ము అన్నారు. 

బాబోయ్ అమెరికాలో ఉద్యోగం వద్దు ... ఇంటి బాట పడుతున్న తెలుగు విద్యార్థులు

ఉన్నత చదువుల కోసం ఎఫ్ 1 విసాపై అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగులు చేస్తున్న  తెలుగు విద్యార్థులు, యువకులు భయాందోళనకు లోనవుతున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ నినాదం ఇపుడు ఇండియన్స్  గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగువారిపై తీవ్ర ప్రభావం చూపింది. చదువు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు దాదాపు 7 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడు వేల విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ చట్టాలను పునరుద్దరించారు. రానున్న రోజుల్లో వీసా చట్టాలను మరింత కఠినతరం చేస్తామని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ఒక వేళ ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తెలుగు విద్యార్థులు ఇంటి బాట పట్టాల్సిందే.  వీసాలు  సాధారణంగా మూడు రకాలు ఉంటాయి. ఒకటి ఎఫ్ 1, రెండోది జె 1, మూడోది ఎం 1   . ట్రంప్  అమెరికా అధ్యక్షుడుగా నియామకమైన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు పెట్టేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఆయన ఉక్కు పాదం మోపారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు ఉద్యోగం దేవుడెరుగు కనీసం ఇక్కడ ఉండనిస్తే చాలు అనే స్టేజికి వచ్చేశారు. తమను ఎక్కడ దేశబహిష్కరణకు గురి చేస్తారోనని వణికిపోతున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేయడం ప్రారంభించారు. రిస్క్ తీసుకుని స్టూడెంట్ వీసాలు తీసుకున్న వారంతా ఇంటి బాట పట్టే పరిస్థితి నెలకొంది. వీరంతా ఎఫ్ 1 వీసాపై ఉన్నవారే. వారానికి 20 గంటలు మించి పార్ట్ టైం ఉద్యోగం చేయకూడదు.  నిర్దేశిత స్థలంలోనే ఈ ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే దేశ బహిష్కారం తప్పదు. రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్ లు, రిటైల్ స్టోర్ ల్లో అక్రమంగా పని చేస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. వీరి పరిస్థితి దారుణంగా ఉంది. 

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.. స్థలం, సౌకర్యాలపై అధ్యయనం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ మాట తప్పను, మడమ తిప్పను అని చెబుతుంటారు. విశ్వసనీయత కోల్పోను అని కూడా చెబుతుంటారు. కానీ ఐదేళ్ల తన పాలనలో జగన్ రెడ్డి ఎన్నిసార్లు మాట తప్పారో.. మరెన్ని సార్లు మడమ తిప్పారో లేక్కలేదు. ఆయన మాట ఇవ్వడం తప్పడానికే అన్నట్లుగా నెటిజన్లు పలు సందర్భాలలో సెటైర్లు కూడా వేశారు. ఇక ఆయన విశ్వసనీయత ఏంత అన్నది 2024 ఎన్నికలలో జనం ఇచ్చిన తీర్పే చెప్పేసింది. అందుకు భిన్నంగా తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తన తరువాతే ఎవరైనా అని చాటుతున్నారు.  జగన్ మోహన్ రెడ్డి కర్నూలును న్యాయరాజధాని అని ప్రకటించి.. ఆ తరువాత ఆ విషయమే మర్చిపోతే.. చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ అని హామీ ఇచ్చి ఇప్పుడా హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కర్నూలులో హైకోర్టు బెంచ్ కు అనుమతులు రాగా, అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన స్థలం వసతులపై అధ్యయనం ప్రారంభమైంది. తాజాగా కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ ేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలం, వసతులపై అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు ఇచ్చిన ఆదేశాల సారాంశం.  కర్నూలులో ‘హైకోర్టు బెంచ్’ ఏర్పాటు చేస్తామని ‘ప్రజాగలం’ సభలో  హామీ ఇచ్చిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా కసరత్తు ప్రారంభించి కీలక పురోగతిని సాధించింది.  కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. కర్నూలులో ఏపీ హైకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి పంపాలన్న తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.   కర్నూలులో లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలను ఏర్పాటు చేసేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణను రెడీ చేసింది.