జగన్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రివోల్ట్
posted on Jun 7, 2024 @ 1:13PM
అధికారాంతమున చూడవలే అయ్యగారి సౌభాగ్యముల్ అన్నట్లుగా తయారైంది ప్రస్తుతం జగన్ పరిస్థితి. పార్టీ ఘోరపరాజయం తరువాత ఒక్కరొక్కరుగా వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జగన్ నిర్వాకమే ఓటమి కారణం అంటూ నోరు విప్పుతున్నారు. ముందుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి వైసీపీ ఈ స్థాయిలో అత్యంత ఘోరంగా ఓటమి చెందడానికి పూర్తి కారణం జగనేనని మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు. ఆ తరువాత గుడ్డు మంత్రి కూడా జగన్ మూడు రాజధానుల సర్కస్ కారణంగానే ఓటమి పాలయ్యామని కుండబద్దలు కొట్టారు. తాజాగా రాజానగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన జక్కంపూడి రాజా జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
గత ఐదేళ్లుగా కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా జగన్ నిరంకుశంగా వ్యవహరించారనీ, ఎన్నికలకు రెండు నెలల ముందు ఒక్క సంతకం కోసం కాగితాలు పట్టుకుని గేటు బయట ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. ఇప్పుడిక పార్టీలో కూడా పూర్తిగా పట్టు కోల్పోయిన జగన్ అప్పాయింట్ మెంట్ ఇస్తాను రండి మహప్రభో అన్నా ఆయనను కలిసేందుకు సొంత పార్టీ నేతలే ముందుకురాని పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు.
ఇంత కాలం అంతర్గత సంభాషణల్లో మాత్రమే జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ఇప్పుడు బాహాటంగా జగన్ తీరును ఎండగడుతున్నారు. అహంకారంతో, నియంతృత్వ పోకడలతో ఆయన మునిగిపోవడమే కాకుండా తమ రాజకీయ జీవితాన్ని కూడా ముంచేశారని విమర్శిస్తున్నారు.