అంతకంతా అనుభవించాల్సిందే!
posted on Jun 7, 2024 @ 12:02PM
చింత చచ్చినా పులుపు చావలేదు అన్న సామెత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు అతికినట్టు సరిపోతుంది. అధికారంలో ఉన్నంత కాలం నియంతృత్వం, అహంకారంతో విర్రవీగిన ఆయన పార్టీ ఘోర పరాజయం పాలై, పదవీ చ్యుతుడైన తరువాత కూడా ఇసుమంతైనా తగ్గలేదు. ఐదేళ్లూ తన కోసం వారి రాజకీయ భవిష్యత్ ను కూడా వదులుకుని, ప్రజలతో సంబంధాలు తెంపేసుకుని, ప్రత్యర్థులపై బూతులు, అనుచిత భాషతో విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్న సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేల పట్ల జగన్ ఎంత అవమానకరంగా ప్రవర్తించారో ఆ పార్టీ నుంచే విడుదలైన ఒక వీడియో తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే జగన్ చేత అంతగా అవమానానికి గురైనా వైసీపీ నేతలపై ఎక్కడా, ఎవరికీ సానుభూతి కలగడం లేదు.
వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ తో పార్టీ నేతలు, అసెంబ్లీకి ఎన్నికైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరైన వారందరికీ కూడా పార్టీ ఘోర పరాజయానికి కారణమేమిటో తెలుసు. జగన్ విధానాలు, వైఖరీ, వ్యవహార శైలి, తలకెక్కిన అహంకారం, కక్షసాధింపే పాలనగా భావించిన తీరే వైసీపీ ఘోర పరాజయానికి కారణమని తెలుసు. అయినా జగన్ పార్టీ ఓటమికి ఎమ్మెల్యేల వైఫల్యాలే కారణమని తమ ముఖం మీదే చెప్పేస్తున్నా చేతులు కట్టుకుని నిలబడి మరీ విన్నారు. సీనియర్లు, వయస్సులో పెద్దవారు కూడా జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు.
ఆయన కళ్లల్లో ఆనందం కోసం తమ వ్యక్తిత్వాన్ని చంపుకుని మరీ అధికారంలో ఉండగా చేసిన దాష్టికాలు, దౌర్జన్యాలను కళ్ల ముందు కనిపిస్తున్నా, తాము ఎవరి కోసం ఇంత చేశామో ఆ వ్యక్తే కనీస మర్యాద లేకుండా నిలుచోబెట్టి దులిపేస్తుంటే నోళ్లు మూసుకుని భరించారు. అలా నిలబడిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు కూడా ఉన్నారు. వారికి అంత అవమానం జరిగిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయినా ఎవరికీ అలా బిక్కముఖం వేసుకుని చేతులు కట్టుకు నిలబడిన వారిపై సానుభూతి కలగడం లేదు. కనీసం అయ్యోపాపం అని కూడా అనిపించడం లేదు. చేసినదానికి ఫలితం అనుభవించాలి కదా? అనే అంటున్నారు. నెటిజన్లైతే.. వారి దౌన్యంపై ఓ రేంజ్ లో సెటైర్లు పేలుస్తున్నారు. జగన్ ఎటూ వారం వారం కోర్టుకు హాజరై చేతులు కట్టుకుంటారు. జగన్ తో అంటకాగి జనాలను వేధించిన ఆ పార్టీ నేతలూ అవమానాలు ఎదుర్కొంటూ అధినేత బాటలో పరదాల మాటున బతుకీడ్చాల్సిందేనని ట్రోల్ చేస్తున్నారు.