మంత్రికంటే స్పీకర్ ఉత్తమం!

ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతోంది. ఇప్పుడు అంతటా కొత్త మంత్రివర్గ కూర్చు గురించిన చర్చలే జరుగుతున్నాయి. ఏ పోర్టుఫోలియోకి ఎవరు మంత్రి అయ్యే అవకాశం వుంది.. కూటమిలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయి.. పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకుంటారా తీసుకోరా... ఇలాంటి డిస్కషన్లు ఒకవైపు నడుస్తుంటే, కూటమిలో వున్న మూడు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు దక్కించుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మంత్రి పదవులకు డిమాండ్ ఎలాగూ వుంటుంది. గతంలో అయితే  స్పీకర్ పదవికి పెద్దగా డిమాండ్ వుండేది కాదు.. మంత్రి పదవి కావాలా స్పీకర్ పదవి కావాలా అని ప్రశ్నిస్తే, స్పీకర్ పదవి వద్దు బాబోయ్ అనేవారు. ఎందుకంటే, స్పీకర్ పదవిలో వుంటే భావోద్వేగాలను భారీ స్థాయిలో అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది.  బీపీ లేనివాళ్ళకి కూడా బీపీ వచ్చే అవకాశం వుంది. మంత్రుల మాదిరిగా యాక్టివ్‌గా కాకుండా సంప్రదాయబద్ధంగా వుండాల్సి వస్తుంది. ఇలాంటి కొన్ని డిజడ్వాంటేజెస్ స్పీకర్ పదవిలో వున్నాయి. అలాగే అపారమైన గౌరవం కూడా స్పీకర్ పదవిలో వున్న వారికి వుంటుంది. అయినప్పటికీ స్పీకర్ పదవి కోసం పోటీపడే వారి సంఖ్య అంతగా వుండదు.

స్పీకర్ పదవి అంటే గుర్తొచ్చింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రమే కాదు.. దేశ చరిత్రలోనే తమ్మినేని సీతారాం లాంటి ఘోరమైన స్పీకర్‌ని ఎవరూ చూసి వుండరు. కూర్చుంది స్పీకర్ కుర్చీమీద అయినా, లారీ క్లీనర్ కంటే దారుణంగా బిహేవ్ చేశారాయన. ప్రతిపక్ష పార్టీల సభ్యులను పురుగుల కంటే హీనంగా చూశారు.. 

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా ఎంతో హుందాగా పనిచేశారు. సభలో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టడంలో విజయం సాధించారు. ఆ పగతోనే ఆయన్ని మానసికంగా క్రుంగిపోయేలా చేసి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు. సర్లే, ఈ మంచి రోజుల్లో గాయాలుగా మిగిలిన ఆ రోజులను ప్రస్తావించినందుకు సారీ...

ఇప్పుడు మంచి రోజులు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్ పదవికి మాంఛి డిమాండ్ ఏర్పడింది. మంత్రి పదవుల కోసం ఎలా పోటీ పడుతున్నారో, స్పీకర్ పదవి కోసం కూడా చాలామంది పోటీ పడుతున్నారు. ఈమధ్యే తెలుగుదేశంలో చేరి, గెలిచిన రఘురామకృష్ణంరాజుకు జగన్‌తో రాజీపడని పోరాటం చేసిన చరిత్ర వుంది. అలాగే బొత్స మీద చీపురుపల్లిలో గెలిచిన కిమిడి కళా వెంకట్రావు కూడా స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి... ఇంకా ముగ్గురు నలుగురు స్పీకర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో రఘురామకృష్ణంరాజు వైపే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది. సభలో జగన్ పార్టీ సభ్యులు వున్నది 11 మందే కాబట్టి ఈసారి స్పీకర్ పదవి నిర్వహించేవారికి బీపీ పెరిగే అవకాశం వుండకపోవచ్చు.

Teluguone gnews banner