రంగనాయకులగుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
మహిషాసుర మర్దని, భైరవ శిల్పాలు
రంగనాయకులగుట్ట కాకతీయ శిల్పాలపై రంగులు తొలగించాలి
పురావస్తు పరిశోధకుడు డాక్టర్ఈమని శివనాగిరెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా లో ప్రముఖ వర్తక కేంద్రమైన జడ్చర్ల రంగనాయక స్వామి గుట్టపై గల కాకతీయుల కాలుపు శిల్పాలపై రంగులు తొలగించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి అన్నారు. చారిత్రక శిల్పాలు, శాసనాలు, స్థలాలు, కట్టడాలను గుర్తించి గ్రామస్తులకు వాటిపై అవగాహన కల్పించే "ప్రిసర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ" కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం నాడు రంగనాయక గుట్టపై విస్తృతంగా అధ్యయనం చేశారు.
కోటగోడ ఆనవాళ్లు
ప్రధాన ఆలయమైన రంగనాయక స్వామి రాతి శిల్పం, దాని వెనక 100 అడుగుల దూరంలో గల మహిషాసుర మర్దిని, భైరవ శిల్పాలు క్రీ.శ. 13 వ శతాబ్ది నాటి కాకతీయ కాలానికి చెందినవి, అలాగే గుట్టపై విశాలమైన కోట గోడ ఆనవాళ్లు ఉన్నాయని, పునాది కోసం కొండపైన ఏడడుగుల విశాలంగా రాతిని మలిచారని, అనేక చోట్ల బండలపై ఆనాటి రాతిని చీల్చిన క్వారీ గుర్తులు ఉన్నాయని,
రాతిని చీల్చిన క్వారీ గుర్తులు
మరో బండపై ఉలితో చెక్కిన విజయనగర కాలపు ఆంజనేయుని రేఖా చిత్రం ఉందని, ఇంకా ఆదిమానవుడు నివసించిన కొండచరియ ఆవాసాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఆదిమానవుని ఆవాసాలు
ఇన్ని ఆకర్షణలు గల రంగనాయక స్వామి గుట్టపై పార్కింగ్ సౌకర్యం, టాయిలెట్స్, విశ్రాంతి, మందిరాలు, నడవలు, ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేసి సాహస క్రీడలు, పిల్లలు ఆడుకునే ఆహ్లాదకర ప్రదేశాలను, భద్రత కోసం ఇనుప రైలింగ్ ఏర్పాటు చేసి జిల్లాల్లోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలయ పాలకమండలి, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.