మూడు ముక్కలాటే కొంప ముంచింది.. గుడివాడ అమర్నాథ్ కి ఇప్పుడు అర్థమైంది!
posted on Jun 7, 2024 @ 12:12PM
నిన్న బొత్స సత్యనారాయణ, నేడు గుడివాడ అమర్నాథ్ ఇలా వైసీపీ ఓటమి తరువాత జగన్ సర్కార్ లో మంవత్రులుగా, మాజీ మంత్రులుగా పని చేసిన ఒక్కొక్కరూ జగన్ తప్పిదాలే తమ కొంప ముంచాయంటూ మీడియాకెక్కుతున్నారు. తాజాగా విశాఖ రాజధాని అంశమే వైసీపీ కొంప ముంచిందని తాజా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.
జగన్ తానా అంటే తందానా అంటూ ఐదేళ్ల పాటు భజన చేసిన గుడివాడ అమర్నాథ్ కి ఓటమి తరువాత తత్వం బోధపడింది. రాజును మించి రాజభక్తి అన్నట్లుగా జగన్ భజన చేసి తరించిన గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు పార్టీ ఓటమికి జగనే కారణమని పరోక్షంగానైనా నిందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పును ఆయన విశాఖ రాజధాని అంశంపై రిఫరెండంగా అభివర్ణిస్తున్నారు. జనం విశాఖ కాదు అమరావతే రాజధాని అని విస్పస్ట తీర్పు ఇవ్వడం ద్వారా తన ప్రభుత్వాన్ని కూలదోశారని అంగీరించారు.
గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన ఈ ఐటీ మాజీ మంత్రి రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని నిర్ణయం సహా జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం, అవలంబించిన ప్రతి విధానాలను ప్రజలు తిరస్కరించారని గుడివాడ అమర్నాథ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తద్వారా ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలూ అన్ని అసంబద్ధంగా ఉన్నాయని చెప్పకనే చెప్పేశారు. అంటే జగన్ చెప్పిన సంక్షేమం సహా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నీ, ప్రవేశ పెట్టిన ఏ పథకాన్నీ జనం ఆమోదించలేదని ఈ మాజీ ఐటీ మంత్రి అంగీకరించేశారు.