దావోస్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

ప్రపంచ ఆర్థిక వేదిక  సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం అయ్యింది. సోమవారం (జనవరి 20) నుంచి గురువారం (జనవరి 24) వరకూ నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ మంత్రులూ, అధికారుల బృందంతో అక్కడకు చేరుకున్నారు.  తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా దావోస్ చేరుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ లో కలుసుకున్నారు. బ్రాండ్ ఏపీ నినాదంతో చంద్రబాబు, రైజింగ్ తెలంగాణ అంటూ రేవంత్ తమ తమ రాష్ట్రాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, తమ తమ ప్రభుత్వాలు కల్పించనున్న సౌకర్యాలు, రాయతీలను పెట్టుబడిదారలు, పారిశ్రామిక దిగ్గజాలకు వివరించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. రాజకీయాలలో గురు శిష్యులుగా ముద్ర పడిన చందరబాబు, రేవంత్ రెడ్డిల మధ్య పెట్టుబడుల కోసం జరిగే పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో జ్యూరిచ్ విమానాశ్రయంలో ఇరువురు ముఖ్యమంత్రులూ ఎదురుపడిన సందర్భంలో అప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

దావోస్ చేరుకున్న చంద్రబాబు బృందం.. పెట్టుబడుల వేటలో చంద్రబాబుకు తోడుగా లోకేష్!

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పెట్టుబడుల వేట ఆరంభమైంది. దావోస్ లో సోమవారం (జనవరి 20) నుంచి గురువారం (జనవరి 24) వరకూ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారులతో కూడిన బృందం అక్కడకు చేరుకుంది. కొద్ది సేపటి కిందట దావోస్ చేసిన చంద్రబాబు బృందానికి యూరోప్ టీటీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. దావోస్ చేరుకోగానే చంద్రబాబు పని ప్రారంభించేశారు. జ్యూరిచ్లో పెట్టుబడి దారులతో భేటీ అయ్యారు. దావోస్ లో ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు గతంలో కూడా చంద్రబాబు పలు మార్లు హాజరైన సంగతి విదితమే. చంద్రబాబు దార్శనికత, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాల పట్ల ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వేత్తలకు స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో ఆయన దావోస్ పర్యటనల సందర్బంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అదే జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ సారి చంద్రబాబుకు తోడుగా నారా లోకేష్ కూడా ఉన్నారు. ఉన్నత విద్యావంతుడు, అభివృద్ధిపై అవగాహన ఉన్న లోకేష్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ సదస్సులో కీలక భూమిక పోషించనున్నారు.  ఈ సదస్సులో రాష్ట్రం తరఫున ఐదు సెషన్ లలో ముఖ్యవక్తగా ప్రసంగించే అవకాశం ఉంది. అందులో మూడు సెషన్ లలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మిగిలిన రెండింటిలో నారా లోకేష్ ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. అంతే కాకుండా ఏపీ పెవిలియన్ లో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి భేటీలు, చర్చలలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు.   రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాల గురించి  వివరించనున్నారు. అలాగే సీఎన్‌బీసీ, టీవీ 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ లో నారా లోకేష్ పాల్గొననున్నారు. 

కేటీఆర్ కు నేడో రేపో ఏసీబీ నోటీసులు?

ఫార్ములా ఈ రేస్ కేసులో  ఏసీబీ, ఈడీలు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ కేసులో నిందితులను వరుసగా విచారణలకు పిలుస్తూ తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఏ1 బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఏసీబీ, ఈడీలు విచారించిన సంగతి తెలిసిందే. రెండు దర్యాప్తు సంస్థలూ కూడా ఆయన సుదీర్ఘంగా విచారించాయి. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాయి.   ఏ2గా  ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డిలను కూడా ఏసీబీ, ఈడీలు విచారించాయి.   ఇప్పుడు తాజాగా ఈ ముగ్గురినీ విచారించేందుకు మరో సారి నోటీసులు జారీ చేయడానికి ఏసీ సమాయత్తమౌతున్నట్లు సమాచారం. రేపో మాపో నోటీసులు జారీ చేసి వీరిని విచారణకు పిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ ఫార్ములా కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ తొలుత కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీం కు వెళ్లారు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టౌతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. సుప్రీం కోర్టు లో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ అనివార్యంగా ఉపసంహరించుకున్న తరువాత ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగానే ఆయన అరెస్ట్ అవుతారని భావించినా ఈడీ ఆయనను ప్రశ్నించి వదిలేసింది.  ఇప్పుడు తాజాగా ఏసీబీ మరోసారి విచారణకు నోటీసులు జారీ చేయనుండటంతో ఈ సారి కేటీఆర్ అరెస్టు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాల సంగతి ఎలా ఉన్నా.. ఈ కేసులో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టులు విశ్వసించినట్లే కనిపిస్తోంది. అందుకే ఆయన క్వాష్ పిటిషన్లను తిరస్కరించాయని న్యాయ నిపుణులు సైతం అంటున్నారు.   ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఒక నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది.   ఈ నేపథ్యంలోనే ఆయన దర్యాప్తు సంస్థలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని తేటతెల్లం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోట్ట పీసు కేసు, రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ, ఈడీలు అడుగుతున్నాయంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా నగదు బదలీ జరిగిందని అంగీకరిస్తూనే.. దానితో తనకేం సంబంధం లేదనీ, తాను ఆదేశాలు మాత్రమే ఇచ్చాననీ, నిబంధనల ప్రచారం వాటిని అమలు చేయాలా వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకోవలసింది అధికారులే అంటూ తాను తప్పించుకుందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ ఫార్ములా కార్ కేసులో కేసులో నిధుల బదలాయింపు జరిగిందనీ, అందుకు తానే ఆదేశాలిచ్చాననీ చెబుతూ కూడా కేటీఆర్ తప్పు జరగలేదని, తప్పు చేయలేదనీ దబాయించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆయనలో ప్రస్ట్రేషన్ పీక్స్ చేరిందనడానికి నిదర్శనంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  

ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. చివరి రోజైన ఆదివారం (జనవరి 19) శ్రీవారిని మొత్తం 70 వేల 826 మంది వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. వారిలో 22 వేల 625 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 68 లక్షలు వచ్చింది. కాగా వైకుంఠ ఏకాదశితో ఆరంభించి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అవకాశం కల్పించింది. ఆదివారం (జనవరి 19) అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు అర్చకులు వైకుంఠ ద్వారాలను   ఈ పది రోజుల వ్యవధిలో 6 లక్షల 83 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6  భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భారీగా హుండీ కానుకలు వచ్చాయి.

కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాలోని టెంట్ సిటీ 19వ సెక్టార్ లో ఆదివారం (జనవరి 19) సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  గ్యాస్ సిలిండర్ల పేలుడు కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలు దాదాపు 30 టెంట్లకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరగిన వెంటనే స్పందించిన పోలీసులు భక్తులను అక్కడ నుంచి తరలించారు.  దీంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. కాగా అగ్ని ప్రమాదం సంభవించిన స్థలానికి చేరుకున్న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించారు. తొలుత గీతా ప్రెస్ కు చెందిన సెక్టార్ 19లో మంటలు చెలరేగాయి.  ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రయాగ్ రాజ్ కలెక్టర్  తెలిపారు.

అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్

అయోధ్య బాలరామాలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ సందర్భంగా బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆయన అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇలా అయోధ్యరాముడికి టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ చరిత్రలో ఇదే ప్రథమం. అయోధ్యలో పర్యటించిన టీటీడీ చైర్మన్ శనివారం (జనవరి 18) రాత్రి  అయోధ్యలో సరయూ నది ఒడ్డున జరిగే హారతి కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్నారు. ఆదివారం (జనవరి 19)న తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  అంతకు ముందు అయోధ్య ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్వాగతం పలికారు.  మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్ళి బీఆర్ నాయుడు అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం అర్చకులు టీటీడీ బృందానికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు  భాను ప్రకాష్ రెడ్డి, హెచ్ డీపీపీ కార్యదర్శి   రామ్ రఘునాథ్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, ముఖ్య అర్చకుడు  గోపీనాథ్ దీక్షితులు, బొక్కసం ఇన్ ఛార్జ్ గురురాజ స్వామి తదితరులు పాల్గొన్నారు.

చంద్రకల్ లో విజయనగర కాలం నాటి ఆంజనేయ విగ్రహం

కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి  నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామం లోని చారిత్రక శిల్పాలను కాపాడుకోవాలని  ప్లీచ్  ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.  వెన్నెల అకాడమీ అధ్యక్షుడు ముచ్చర్ల దినకర్ ఇచ్చిన సమాచారం మేరకు  ఆయన  చంద్రకల్  ఆలయం బయట నిర్లక్ష్యంగా పడి ఉన్న  క్రి..శ. 16వ శతాబ్ది నాటి ఆంజనేయ విగ్రహాన్ని, ఆలయ ప్రాంగణంలో చిందరవందరగా పడి ఉన్న  క్రీ.శ13వ శతాబ్ది నాటి శివలింగాన్ని ఆయన ఆదివారం (జనవరి 19) పరిశీలించారు. నల్లశానపు రాతిలో యోని ఆకారపు పానవట్టం పైన స్వయంభు శివలింగం నునుపుగా కాకతీయ శిల్ప శైలిలో ఉందని, గ్రైనేట్ రాతిలో చెక్కిన నిలువెత్తు భక్తాంజనేయ విగ్రహం విజయనగర వాస్తు శైలిలో ఉందన్నారు.  చరిత్ర ప్రాధాన్యత గల ఈ రెండు కళాఖండాలను  ఆలయంలోపల పీటలపై నిలబెట్టి, వాటి చారిత్రక వివరాలతో పేరు పలకలను ఏర్పాటుచేసి భవిష్యత్ తరాలకు అందించాలని ప్రజలకు శివనాగిరెడ్డి ముత్యాల దినకర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బడే సాయి కిరణ్ రెడ్డి అద్దంకి రవికుమార్ పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎంగా లోకేశ్‌.. లైన్ క్లియ‌రైందా?

తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ కాబోతున్నారా? టీడీపీ శ్రేణుల నుంచి రోజురోజుకు తీవ్ర‌మ‌వుతున్న ఈ డిమాండ్ పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సానుకూలంగా స్పందించారా? కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామిగా కొన‌సాగుతున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం టీడీపీ కార్య‌క‌ర్త‌ల డిమాండ్ పై సానుకూలంగా ఉన్నారా? అంటే అవున‌నే స‌మాధానం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  తెలుగుదేశం పార్టీకి మూడో త‌రం వార‌సుడిగా.. రాబోయే కాలంలో పార్టీని న‌డిపించే నాయ‌కుడిగా లోకేశ్ ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో త‌న స‌మ‌ర్ధ‌త‌ను చాటుకున్నారు. లోకేశ్ సార‌థ్యంలో టీడీపీకి బంగారు భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ బ‌లంగా న‌మ్ముతోంది. దీనికి కార‌ణం  లోకేశ్ రాజ‌కీయంగా ఎంతో ప‌రిణితిని క‌న‌బ‌ర్చ‌డ‌మే. ప్ర‌తి ప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ఎదురెళ్లి లోకేశ్ స‌వాల్ చేశారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వైసీపీ అధిష్టానానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. లోకేశ్ దూకుడు కార‌ణంగానే జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌కు భ‌య‌ప‌డి మూడేళ్లు బ‌య‌ట‌కురాని తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు సైతం ఒక్క‌సారిగా రోడ్లెక్కి అప్ప‌టి ప్ర‌భుత్వంపై పోరు బాట‌ ప‌ట్టారు. దీంతో జ‌గ‌న్ ప‌త‌నానికి బీజం ప‌డిన‌ట్ల‌యింది.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ కూడా ప్ర‌భుత్వంలో నారా లోకేశ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న ప‌రిధిలోఉన్న శాఖ‌ల్లో కీల‌క మార్పులు తీసుకువ‌స్తూ అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. త‌న‌దైన మార్క్ ను చూపిస్తున్నారు. అన్నివిధాలా లోకేశ్ త‌న స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకోవ‌టంతో తెలుగుదేశం శ్రేణులు డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను ప్ర‌మోట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆ పార్టీలోని కీల‌క నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. తెలుగుదేశం అధికార ప్ర‌తినిధి మ‌హాసేన రాజేశ్, పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు శ్రీ‌నివాస్ రెడ్డితోపాటు డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న ర‌ఘురామ కృష్ణరాజు, ఫిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ,  సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా ప‌లువురు నేత‌లు ఒక్కొక్క‌రుగా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని కోరుతున్నారు. ఇటీవ‌ల మైదుకూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశీనులైన స‌భావేదిక‌పైనే శ్రీ‌నివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. ఇది నా ఒక్క‌డి అభిప్రాయం కాదు, తెలుగుదేశం క్యాడ‌ర్ అభిప్రాయం అని చెప్పారు. అయితే, చంద్ర‌బాబు శ్రీ‌నివాస్ రెడ్డి విజ్ఞ‌ప్తిపై స్పందించ‌లేదు. కానీ, తెలుగుదేశం ముఖ్య‌నేత‌లతో మాట్లాడుతున్న సంద‌ర్భంలో స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు కూట‌మి నేత‌ల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుందామ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు పార్టీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రులు ఉండేవారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌రే డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతున్నారు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు.. అదో రాజకీయ పదవి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే, దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల్లో డిప్యూటీ సీఎంలు ఒక‌రు, అంత‌కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఉప‌ముఖ్య‌మంత్రి అంటే రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌వికాక‌పోయిన ఆ స్థానంలో ఉన్న‌వారు ముఖ్య‌మంత్రి త‌రువాత ముఖ్య‌మంత్రిగా రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జ‌లు భావిస్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి త‌న శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేస్తూనే.. ఇత‌ర శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేసే అవ‌కాశం కూడా ఉంటుంది. మంత్రుల కంటే డిప్యూటీ సీఎంకు ప‌వ‌ర్స్ ఎక్కువ అనే చెప్పొచ్చు. దీంతో కూట‌మిలో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం నుంచి  నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ గట్టిగా వస్తోంది.  మంత్రిగా ఉండ‌టం వ‌ల్ల కేవ‌లం కొంత‌మేర మాత్ర‌మే లోకేశ్ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం కాగ‌లుగుతున్నారనీ, ఉప‌ముఖ్య‌మంత్రి హోదా ఉంటే పాల‌న‌పై పూర్తి స్థాయిలో ప‌ట్టు సాధించి, అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. అంతే కాకుండా లోకేష్ కు ప్రమోషన్ తెలుగుదేశం బలోపేతానికి సైతం దోహదపడుతుందని పార్టీ నేతలు సైతం చెబుతున్నారు.  మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని తెలుగుదేశం నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న డిమాండ్ ప‌ట్ల జ‌న‌సేన పార్టీ నేత‌లు మౌనంగానే ఉన్నారు. అయితే తెలుగుదేశం శ్రేణుల డిమాండ్ ను అవ‌కాశంగా తీసుకొని కూట‌మిలో విబేధాలు త‌లెత్తేలా చేయాల‌ని వైసీపీ సోష‌ల్ మీడియా గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నది. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లమంటూ టీడీపీకి వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతుండ‌టం విశేషం. అయితే, లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌న్న డిమాండ్ పై జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా స్పందించ‌లేదు. మ‌రో వైపు చంద్ర‌బాబు కూడా ఈ అంశంపై  స్పందించ‌లేదు. కానీ, లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాల‌న్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువ‌వుతుండ‌టంతో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెల‌కొంది.

16వ శతాబ్ది నాటి సూగురు దేవాలయాన్ని భద్రపరచాలి.. ఈమని శివనాగిరెడ్డి

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని సూగూరు గ్రామంలో దాదాపు 400 సంవత్సరాల కిందట సూగూరు సంస్థానా దీశులు నిర్మించిన వైష్ణవాలయాన్ని భద్రపరచి పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం అయన జిల్లాలోని పురాతన శిల్ప సంపదను గుర్తించి వాటి చారిత్రక ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆయన సుగూరు  ఆలయాన్ని సందర్శించారు. గర్భాలయం, అర్థ మండపం వరకూ, అధిష్టానం,పాదవర్గం ,ప్రస్తరం వరకూ ఉన్న ఈ ఆలయ గోడలపై అపురూప శిల్పాలు ఉన్నాయని కప్పు పైన  శిథిలమైన శిఖరాన్నీ బాగు చేసి ఆలయానికి పూనర్వవైభవం తీసుకురావడానికి కృషి చేయాలని గ్రామస్తులకు నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం దిగుడు బావిని, కోట ద్వారాన్ని  వీరభద్ర ఆలయం దగ్గర రోడ్డుపై న నిర్లక్ష్యంగా పడి ఉన్న చాళుక్యుల కాలపు మూడు నందులు, మూడు గణేష్ విగ్రహాలు, సప్తమాతృకలు శైవాచార్యులు, వీరభద్రుడు, భద్రకాళి శిల్పాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుడు సితార వెంకటేశ్వర్లతో పాటు నాగర్ కర్నూల్ వెన్నెల సాహిత్య అకాడమీ అధ్యక్షులు ముచ్చర్ల దినకర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు డాక్టర్ బై రోజు శ్యాంసుందర్ తోపాటు గ్రామస్తులు  పాల్గొన్నారని తెలిపారు.

అశిష్ గవాయ్ ఓవరేక్షన్!

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన, ... తిరుమలలో అగ్నిప్రమాదంపై విపత్తు నిర్వహణ విభాగం  డైరెక్టర్‌ ఆశిష్‌ గవాయ్‌ ఓవర్ యాక్షన్ చేశారు. తిరుమల ఘటనలపై తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొంటూ టీటీడీలో  క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ జిందాల్‌ సమీక్ష నిర్వహిస్తారనీ, ఆది సోమవారాల్లో (జనవరి 19, 20) ఆయన తిరుమలలో పర్యటించి సమీక్షించి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తారనీ పేర్కొంటూ అధికారిక లేఖ రాశారు. అందకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా టీటీడీని ఆదేశించారు.   సరిగ్గా అమిత్ షా ఏపీ పర్యటనలో ఉండగా వచ్చిన ఈ లేఖ  సంచలనం సృష్టించింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, రాష్ర పర్యటనలో ఉన్న అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన సైతం నిర్ఘాంత పోయారు.  టీటీడీ కేంద్రం పరిధిలోకి రాదు. అయినా రాష్ట్ర పరిధిలోని సంస్థలకు అలా నేరుగా లేఖ పంపే అధికారం కేంద్ర హోంశాఖకు లేదు. ఏదైనా సమాచారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే పంపించాల్సి ఉంటుంది. ఆ కనీస అవగాహన కూడా లేకుండా విపత్తు నిర్వహణ డైరెక్టర్ అశిష్ గవాయ్ అధికారిక లేఖ పంపడం, అదీ నేరుగా టీటీడీ చైర్మన్ కే పంపడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేంద్ర హోంశాఖ ముఖ్యులతో చర్చించారు. వారు తిరుమలలో సమీక్ష పై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ స్పష్టం చేశారు. అంతే కాకుండా శనివారం (జనవరి 18) రాత్రికి రాత్రే కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ జిందాల్‌ సమీక్షిస్తారంటూ వచ్చిన లేఖను ఉప సంహరించుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ టీటీడీ ఈవోకు అధికారిక సమాచారం పంపింది. 

400 ఏండ్ల నాటి రంగాపూర్ శివాలయాన్ని పదిలపరచాలి

పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి పెబ్బేరు మండలానికి నాలుగు  కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిడ్జి రంగాపూర్ లోని ఓటి గుడిని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.   గ్రామానికి చెందిన బైనగిరి రామచంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు  శనివారం (జనవరి18) ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి సంస్థానానికి చెందిన జనంపల్లి రంగారెడ్డి 400 సంవత్సరాల క్రితం విజయనగర వాస్తు శిల్ప శైలిలో  శివాలయాన్ని నిర్మించాడని, ఆలయ గోడలు ద్వారా శిల్పా ల పై అనేక పౌరాణిక శిల్పాలు   ఆకర్షణియంగా తీర్చిదిద్దబడి నాయని, ఆలయ శిఖరం పై కప్పల భాగం వరకు కూలిపోయిందని , చారిత్రక ప్రాధాన్యత గల ఈ ఆలయాన్ని  పునరుద్ధరించాలనీ గ్రామస్తులకు శివ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెన్నెల సాహిత్య అకాడమీఅధ్యక్షులు ముచ్చర్ల దినకర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు డాక్టర్ బై రోజు శ్యాంసుందర్  పడే సాయి, కరుణాకర్ రెడ్డి, అద్దంకి రవీంద్ర, గ్రామస్తులు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారని తెలిపారు.

తెలంగాణలో ఎఐ అధారిత డేటా సెంటర్.. 3500 కోట్లతో ఏర్పాటు చేయనున్న సింగపూర్ సంస్థ!

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ సంస్థ ముందుకు వచ్చింది. పెట్టుబడుల ఆకర్షణే ద్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన బృందంతో శనివారం ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి ఎస్టీటీ తెలంగాణలో 3500 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముచ్చర్ల సమీపంలోని మీర్ ఖాన్ పేటలో ఏఐ ఆధారిత  డెటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఎస్టీటీ డేటా సెంటర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో డెటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీటీ రేవంత్ సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంవోయూపై తెలంగాణ  పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ సంతకాలు చేశారు.  ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ డేటా సెంటర్ హబ్‌గా మారబోతోందన్నారు. ఎస్‌టీటీ డేటా సెంటర్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

తిరుమలపై కేంద్ర హోం శాఖ నజర్

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టిసారించింది. ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, అలాగే 13న లడ్డూ విక్రయ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటలపై టీటీడీని వివరణ కోరింది. అలాగే ఈ ఘటనల వివరాలు తెలుసుకోవడానికి కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సజీవ్ కుమార్ జిందాల్  ఆది, సోమ వారాల్లో (జనవరి 19, 20)  తిరుమలలో పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో భాగంగా ఆయన టీటీడీ అధికారులతో భేటీ అవుతారు. తరువాత కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తారు.   టీటీడీ పాలకమండలి పాలకమండలి వ్యవహారాల్లో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. చరిత్రలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి.  

ఎల్లూరులో కాకతీయ కాలపు అరుదైన వీరగల్లు శిల్పం

కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో మండల కేంద్రమైన కొల్లాపూర్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లూరులో కాకతీయుల కాలపు అరుదైన వీరగల్లును గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు,ప్లిచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివ నాగిరెడ్డి, వెన్నెల సాహిత్య అకాడమీ ముచ్చర్ల దినకర్, చరిత్ర పరిశోధకుడు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు డాక్టర్ భైరోజు శ్యామసుందర్ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని బాపూజీ భవన్ లో ఉన్న నల్ల శానపు రాతిపై నలువైపులా శిల్పాలతో చెక్కిన వీరగల్లును శనివారం (జనవరి 18) వారు సందర్శించారు. ఒక వైపు చెన్నకేశవుడు, రెండవ వైపు మూడవ వైపు యుద్ద దృశ్యాలు, నాలుగోవైపు ఒక స్త్రీ ఆత్మహసి దృశ్యంతో కాకతీయ కాలపు మన విధానానికి అద్దం  పడుతున్న శిల్పం అత్యంత అరుదైనదని శివనాగిరెడ్డి తెలిపారు.  చారిత్రక ప్రాధాన్యత గల ఈ వీరగల్లును ఎత్తయిన పీఠంపై నిలబెట్టి చారిత్రక వివరాల బోర్డును ఏర్పాటు చేసి కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానికుడు సొరగొని కృష్ణయ్య గౌడ్ ఇంకా బర్త్డే సాయి కిరణ్, అద్దంకి రవీంద్ర రవీంద్ర పాల్గొన్నారని ఆయన చెప్పారు.

ఇలా వైసీపీకి రాజీనామా.. అలా కమలం కండువా!

ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేదు. ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అన్న బేధం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పుట్టి మునిగిపోతోంది. ఆ పార్టీ నుంచి వలసల వరద వెల్లువెత్తుతోంది. ఆ వలసల వరద ధాటికి వైసీపీ గేట్లు పగిలిపోతున్నాయి. జగన్ తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి. ఒకరు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు జనసేన గూటికి  చేరిపోతున్నారు. దీంతో వైసీపీ బైసీపీగా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  పెద్ద సంఖ్యలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ మారిపోతుండగా ఇప్పుడు ఇక ఆ పార్టీ కీలక నేతలు, జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.  తాజాగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిథి కారుమూరి రవిచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. గత కొన్నేళ్లుగా వైసీపీ గొంతుకలా వ్యవహరిస్తున్న కారుమూరి ఇప్పుడు జగన్ కు జెల్ల కొట్టి పార్టీకి రాజీనామా చేసేశారు. అంతే కాదు ఇలా రాజీనామా చేసి అలా బీజేపీ కండువా కప్పేసుకున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించిన కారుమూరి... ఆ లేఖ పంపిన గంటలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు.  దీనిని బట్టి చూస్తూ కారుమూరి రవిచందరారెడ్డి చాలా కాలంగా వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారనీ, అన్నీ చూసుకుని శనివారం (జనవరి 18)న ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పంచన చేరారనీ అవగతమౌతుంది.  కారుమూరి రవిచంద్రారెడ్డి రాజీనామా ఎలా చూసినా వైసీపీకి కోలుకోలేని దెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ వైసీపీ తరఫున దూకుడుగా వ్యవహరించారు. ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ కూడా చాలా చురుకుగా ఉన్నారు. అసలే పార్టీ తరఫున గట్టిగా గళం వినిపించే నేతలు కరవై సతమతమౌతున్న వైసీపీకి కారుమూరి గుడ్ బై చెప్పడం గట్టి షాక్ అనే చెప్పవచ్చు.  

రంగారెడ్డి జిల్లా  అడిషనల్ కలెక్టర్ తో భేటీ అయిన మంచు మనోజ్ 

మంచు మోహన్ బాబు ఇంట్లో రోజుకో ట్విస్ట్ చేసుకుంటుంది.  తన కష్టార్జితమైన రంగా రెడ్డి జిల్లా జల్ పల్లి నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని గతంలో మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్ , కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇది ఫ్యామిలీ గొడవ అనుకున్నారు. అందరూ.  అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో మోహన్ బాబు జిల్లా మెజిస్టేట్ అయిన రంగారెడ్డి కలెక్టర్ కు మరో మారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ మంచు మనోజ్ కు   నోటీసులు  ఇవ్వడంతో శనివారం మంచు మనోజ్ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తో భేటీ అయ్యారు. తాను ఎక్కడికి పారిపోవడం లేదని ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నట్టు వివరణ ఇచ్చుకున్నారు. 

ప్రజా సేవ కోసమే ఎన్టీఆర్ ట్రస్ట్.. భువనేశ్వరి

ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని నారా భువనేశ్వరి చెప్పారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహా నటుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్ అని నారా భువనేశ్వరి అన్నారు. రాజకీయ రంగంలో ఆయన ముద్ర చెరగనిదని పేర్కొన్నారు.  ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో  ఘన నివాళులర్పించిన ఆమె మీడియాతో మాట్లాడారు.  ఎన్టీఆర్ సేవలను ముందుకు తీసుకెళ్లేందుకే ఎన్టీఆర్ ట్రస్టును ఏర్పాటు చేశామన్న భువనేశ్వరి ఈ ట్రస్టు ద్వారా నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.   ఎన్టీఆర్   వర్ధంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామన్నారు. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు, మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రస్టుకు 8.70 లక్షల మంది రక్తదానం చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందించామని చెప్పారు. హైదరాబాద్ చర్లపల్లిలోని ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్లో ఉచిత విద్య, వసతి, భోజనం కల్పిస్తున్నామని తెలిపారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నామని చెప్పారు. కరోనా, తుపాన్ల సమయంలో  ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందించామని వెల్లడించారు.