varma  big bet on pawan victory

పవన్ విజయం ఖాయం.. ఆస్తి మొత్తం బెట్టింగ్ ఎవరైనా రెడీయా.. ఎస్వీఎస్సెన్ వర్మ

ఆంధ్ర ప్రదేశ్ లో హాట్ సీట్లలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో కూటమి మద్దతుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటలో ఉన్నారు. గత ఎన్నికలలో ఆయన భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ సారి మాత్రం విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకవర్గ ఫలితంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  అదే సమయంలో పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా జగన్ పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఆయన సలహా సూచనల మేరకు పవన్ వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజే లక్ష్యంగా ముంద్రగడ పద్మనాభం వంటి నేతలు తమ శక్తికి మించి పని చేశారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తరువాత తెలుగుదేశం నాయకుడు, ఆ పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఆశించిన ఎస్వీఎస్సెన్ వర్మ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. రెబల్ గా బరిలోకి దిగడానికి సైతం సిద్ధ పడ్డారు. అదే సమయంలో ఆయనను తమ గూటికి చేర్చుకునేందుకు వైసీపీ శతథా ప్రయత్నాలు కూడా చేసింది. అయితే ఎస్వీఎస్సెన్ వర్మను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడిన తరువాత అంతా సర్దుకుంది. చంద్రబాబుతో భేటీ అయిన తరువాత నుంచి పవన్ కల్యాణ్ విజయం కోసం ఎస్వీఎస్సెన్ వర్మ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ప్రచార భారాన్నంతా భుజాన వేసుకుని మోశారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణే స్వయంగా అంగీకరించారు. మే 13న పోలింగ్ పూర్తయిన తరువాత పవన్ ప్రత్యేకంగా ఎస్వీఎస్సెన్ వర్మకు కృతజ్ణతలు తెలిపారు.  పోలింగ్ పూర్తయిన తరువాత పిఠాపురంలో పవన్ విజయంపై కాకుండా మెజారిటీపై పందేలు సాగుతున్నాయంటే.. ఆక్కడ ఫలితం ఎలా ఉండబోతోందన్నది ఇట్టే అర్ధమైపోతుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా తాజాగా పిఠాపురంలో 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పవన్ కల్యాణ్ గెలిచే అవకాశలు పుష్కలంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఇలా ఉండగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంపై పందెం కాయడానికి ఎస్వీఎస్సెన్ వర్మ ముందుకు వచ్చారు. పిఠాపురంలో పవన్ విజయంపై తన ఆస్తి మొత్తాన్ని పందెం ఒడ్డుతానని పందె కాయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అని సవాల్ చేశారు.   ఆ సవాలే పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ విజయంపై వర్మకు ఉన్న నమ్మకాన్ని చూపుతోంది. ఆ సవాలే పవన్ విజయం తథ్యమని చాటుతోంది.  

telangana state logo

తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం మాయం?

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది.  తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణ అవతరణ పదో వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సమాయత్తమౌతోంది.  తెలంగాణ రాష్ట్ర గీతానికి కొత్త బాణీ సహా, కొత్త అధికారిక చిహ్నాన్ని కూడా రూపొందిస్తున్నారు. అవతరణ వేడుకలకు సంబంధించి ప్రతి విషయాన్నీ, ప్రతి అంశాన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.   ఇప్పటికే రాష్ట్ర గీతానికి కీరవాణి బాణీ కట్టారు. దానిని వివాదాస్పదం చేయాలని ప్రయత్నించి బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీతానికి బానీ సమకూర్చడంపై విమర్శలు గుప్పించి జనంలో బీఆర్ఎస్ పలుచన అయ్యింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎంత మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులకు పెద్ద పీట వేసిందో, ఎంత మంది ఆంధ్రా ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింతో మర్చిపోయిందా అంటూ జనం బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర అధికార చిహ్నాన్ని కూడా కొత్తగా రూపొందించాలని రేవంత్ నిర్ణయించారు. దీంతో రాష్ట్ర అధికారిక చిహ్నాం ఎలా ఉండబోతోందన్న దానిపై ప్రజలలో ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు కొత్త అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం మాయం కాబోతోంది.  మధ్యలో పూర్ణకుంభం పై భాగంలో మూడు సింహాల రాజముద్ర, కింది భాగంలో చార్మినార్ బొమ్మ పూర్ణకుంభం ఇరువైపులా తంగేడు ఆకులు  తెలంగాణ మ్యాప్, కింది భాగంలో హుస్సేస్ సాగర్‌లోని బుద్ధుడి బొమ్మ అంటాయి. రాచరిక హిహ్నాలు రాష్ట్ర అధికారిక ముద్రలో ఉండొద్దని రేవంత్ భావిస్తున్నారనీ, అందుకే కాకతీయ తోరణం ఉండే అవకాశం లేదని అంటున్నారు. 

Case of JC Diwakar Reddy against literary production company

సాహితీ నిర్మాణ సంస్థపై జెసీ దివాకర్ రెడ్డి కేసు 

జెసీ దివాకర్ రెడ్డి అంటే పాపులారిటీ ఉన్న నేత. రాయలసీమలో జెసి పేరు చెబితే గజగజ వణికే పరిస్థితి ఉంది. అయితే జెసి సంతకాన్నే ఓ నిర్మాణ సంస్థ ఫోర్జరీ చేసింది. దీంతో జెసీ పోలీస్ స్టేషన్  గడప ఎక్కారు. హైదరాబాద్ కు చెందిన సాహితి నిర్మాణ సంస్థపై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో తన నివాసం లీజు విషయంలో ఒప్పంద పత్రాలను తారుమారు చేశారని, తన సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సాహితి నిర్మాణ సంస్థ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం..జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 62లో ఉన్న తన ఇంటిని జేసీ దివాకర్ రెడ్డి గతంలో సాహితి నిర్మాణ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఈమేరకు 2020లో సాహితీ నిర్మాణ సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణతో మూడేళ్ల కాల పరిమితితో ఒప్పందం కుదుర్చుకున్నారు.  2023 మే నెలతో ఒప్పంద గడువు ముగియడంతో ఇల్లు ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా లక్ష్మీనారాయణ స్పందించలేదు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తమకు లీజు గడువు ఇంకా ఉందంటూ లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సాత్విక్‌ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు జేసీకి సమన్లు పంపింది. సాహితి నిర్మాణ సంస్థ యాజమాన్యం కోర్టులో దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన జేసీ.. వాటిలో ఒప్పందం తేదీ 2021 మే నెలగా మార్చినట్లు గుర్తించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ పత్రాలను తయారుచేసినట్లు ఆరోపించారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

results delay in ap

ఏపీలో ఫలితాల వెల్లడిలో జాప్యం తప్పదా? పోస్టల్ బ్యాలెట్లే కారణమా?

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన బ్యాలెట్ ఓట్ల కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గతంలో ఎన్నడూ లేని విధంగాభారీగా  జరిగింది.  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్  పోలింగ్ జరిగింది. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్వోలు సంతకం చేయాల్సి ఉండగా, కొందరు చేయలేదు. దీంతో ఆర్వో సంతకం లేకపోయినా, ఆర్వో సీల్ లేకపోయినా వాటిని కూడా లెక్కించాలని కోరుతూ తెలుగుదేశం కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వారి వినతికి సానుకూలంగా స్పందించిన ఈసీ,  ఆర్వో సంతకం, సీల్ లేని వాటిని కూడా లెక్కించాలని ఆదేశాలిచ్చింది.   ఆర్వో సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయంపై అధికార వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఎన్డీఏ నేతల విజ్ఞప్తి తర్వాత ఈసీ నిబంధనలు మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్‌పై అభ్యంతరం తెలిపారు.  గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారని, ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని ఎలా చెబుతారని వైసీపీ అంటోంది. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తోంది. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందని, ఈ నిబంధనలపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని చెబుతోంది.  సాధారణంగా ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తరువాత ఈవీఎం కంట్రోల్ యూనిట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, కంట్రోల్ యూనిట్ లెక్కింపునకు 30 నిమిషాల సమయం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లను వేర్వేరుగా లెక్కించినా ఫలితాలు లెక్కింపు వేగంగా చేపట్టడం అంత సులువు కాదు. అధికారుల లెక్కల ప్రకారం ఈవీఎంలు ఒక్కో రౌండు లెక్కించడానికి సగటున 25 నిమషాల సమయం పట్టవచ్చు.  ఒక్కో నియోజకవర్గం ఈవీఎంల లెక్కింపునకు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్నం భోజన విరామం ఒక గంట సమయం తీసివేస్తే సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కంట్రోల్ యూనిట్ల లెక్కింపు జరుగుతుంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు మరో రెండు నుంచి మూడు గంటలు సమయం పడితే రాత్రి 11 గంటలకు కూడా లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు లేవు. కొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉండడంతో వాటిలో చివరి రౌండు ముగిసే వరకు ఫలితం తేలని పరిస్థితి ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తి చేసి తుది ఫలితాలు రావడానికి అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది.   

national holiday on june 4th

జూన్ 4 జాతీయ సెలవుదినం.. నటుడు నరేష్ డిమాండ్

సార్వత్రిక ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి వ్యక్తమౌతోంది. బాధ్యతగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆ ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం మేండటరీ అని చెబుతూ ప్రభుత్వం పోలింగ్ రోజున సెలవు ప్రకటిస్తోంది. కానీ బాధ్యతగా ఓటేసిన వారికి ఫలితాలు వెంటవెంటనే తెలుసుకునే హక్కును హరిస్తూ ఆ రోజు సెలవు ప్రకటించకుండా పని దినమేనని చెబుతున్నది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేష్ ఓ కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఎక్స్ వేదికగా ఆయన జూన్ 4 ఓట్ల లెక్కింపు రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన ట్వీట్ వెంటనే వైరల్ గా మారింది. లక్షల సంఖ్యలో లైక్ లు షేర్లు చేస్తున్నారు నెటిజనులు.  లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలలో ఓటు వినియోగంపై చైతన్యం తీసుకురావడానికి ఓట్ల లెక్కింపు రోజును సెలవుదినంగా ప్రకటించడం ఎంతగానో దోహదపడుతుందని నరేష్ పేర్కొన్నారు.  

ACP Umamaheswara Rao in ACB custody

ఎసిబి కస్టడీలో ఎసిపి ఉమమహేశ్వరరావు 

అవినీతిని కూకటి వేళ్లతో పీకి వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అవినీతి చేపలను ఏరివేసే పనిలో నిమగ్నమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును బుధవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని తమ కస్టడీకి అప్పగించాలంటూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, పది రోజుల కస్టడీ కోరగా.. మూడు రోజులు మాత్రమే కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.3.95 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఏసీపీని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా, జైలు నుంచి ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

ycp leaders should take health checkup

వైద్య పరీక్షలు చేయించుకోండి.. లేకపోతే పోతారు!

ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వడానికి ఇంకా వారం రోజుల సమయం వుంది. ఈలోపు వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు.. వీళ్ళందరూ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పని ఒకటి వుంది.. అదేంటంటే, అర్జెంటుగా హెల్త్ పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా బీపీకి సంబంధించిన సమస్యలు గానీ, గుండెలో ఏదైనా ప్రాబ్లం గానీ వుంటే, అర్జెంటుగా ట్రీట్‌మెంట్ మొదలుపెట్టేసుకోవాలి. ఎందుకంటే, జూన్ 4న వెల్లడయ్యే ఫలితాలు వాళ్ళకి బీపీ భారీగా పెంచే అవకాశం వుంది. హార్ట్ ఎటాక్‌లు ఎటాక్ అయ్యే ఛాన్సుంది. అధికారం, పదవులు పోతే పోయాయి.. కనీసం ప్రాణాలన్నా మిగలాలి కదా..  బతికుండే బలుసాకు తిని బతకొచ్చు.  నిజానికి ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకుని, ఎలాంటి షాక్ తగిలినా భరించడానికి మానసికంగా సిద్ధంగా వున్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళయితే అటు శారీరకంగా సిద్ధంగా లేరు.. మానసికంగానూ సిద్ధంగా లేరు. ఆయన త్వరగా కోలుకుని మంచం దిగాలని ఆశిద్దాం. కాబట్టి, ఇలా తెలివైన నాయకుల మాదిరిగా కాకుండా, ఇప్పటి వరకు వైద్య పరీక్షలు చేయించుకోనివాళ్ళు ఎవరైనా వుంటే అర్జెంటుగా ఆ పనేదో పూర్తి చేసుకుంటే ప్రాణాలు దక్కి, ఫ్యామిలీకి మిగులుతారు.

jagan pulivendula not easy this time

జగన్ ‘పులి’ వెందుల గట్టెక్కేనా?

సరిగ్గా వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలిపోతుంది. వైసీపీ మరో సారి అధికారపగ్గాలు అందుకుంటుందా? లేక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న ఉత్కంఠకు వచ్చే నెల 4న తెరపడుతుంది. ఈ లోగా ఎవరి అంచాలు వారివి. ఎవరి గెలుపు ధీమా వారిది. అయితే పరిశీలకులు, సెఫాలజిస్టులు మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ అన్నదానిపై ఎవరి అంచనాలు వారు వెల్లడించారు.  వాటన్నిటిలోనూ పులివెందుల నియోజకవర్గం విషయంలో సెఫాలజిస్టుల అంచనాలు అందరిలోనూ తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నాయి. పులివెందుల అంటే జగన్ అడ్డా. ఆయన సొంత నియోజకవర్గం. అటువంటి పులివెందులలో జగన్ కు ఈ సారి అంత వీజీగా విజయం లభించే అవకాశాలు లేవని అంటున్నారు. ఆయన పులివెందుల గట్టెక్కినా నామమాత్రం మెజారిటీయే వస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సారి పులివెందుల నియోజకవర్గంలో పోలింగ్ భారీగా జరిగింది. కడప లోక్ సభ నియోజకవర్గ పరిథిలోకి వచ్చే ఈ నియోజకవర్గంపై షర్మిల ప్రచారం ప్రభావం తీవ్రంగా పడిందని అంటున్నారు. ఆ కారణంగా వైసీపీ ఓట్లలో భారీ చీలిక వచ్చిందనీ, దీంతో తెలుగుదేశం లబ్ధి పొందిందనీ విశ్లేషణలు చేస్తున్నారు. పులివెందుల నుంచి ఇంత వరకూ జగన్ భారీ మెజారిటీలతో గెలిచారు. రాష్ట్రంలోనే జగన్ మెజారిటీ టాప్ గా ఉండేది. అయితే ఈ సారి మాత్రం ఆ పరిస్థితి లేదంటున్నారు. విజయం సాధిస్తే మెజారిటీ చాలా స్వల్పంగా ఉంటుందని చెబుతున్నారు. అంటే జగన్ పులివెందుల నుంచి గట్టెక్కినా అత్తెసరు మార్కులతోనే అని చెబుతున్నారు. మరో వైపు ఈ సారి పులివెందుల కోటను బద్దలు కొట్టేశామని తెలుగుదేశం వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. పోలింగ్ రోజు సాయంత్రమే పులివెందుల పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసేసుకున్నాయి. ఈ నేపథ్యంలో  పులివెందుల ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. 

high temparatures in telangana

వచ్చే మూడు రోజులూ తెలంగాణ అగ్నిగుండమే!

తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజులూ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాలులు వీస్తాయని పేర్కొంది. అయితే నైరుతి రుతుపవనాలు మాత్రం సరైన సమయానికే రాష్ట్రంలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. 

book on pinnelli

ఇది పుస్తకం కాదు.. పాపాల పుట్ట!

మనం చాలాసార్లు ఒక ప్రకటన చూసి వుంటాం.. అందులో నటుడు రంగనాథ్ అంటూ వుంటారు... ‘ఇది పంపు కాదు.. పాతాళ గంగ’ అని.. మాచర్ల ఎమ్మెల్యే హోదాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాల మీద ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో ఒక పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకం చదివినవాళ్ళు ఎవరైనా ఆందోళనతో నోరు తెరుస్తారు.. ‘ఇది పుస్తకం కాదు.. పాపాల పుట్ట’ అని పెద్దగా అరుస్తారు.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన దగ్గర్నుంచి ఆయన చేసిన హత్యలు, అన్ని వర్గాల వారి మీద చేసిన దాడులు, కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు... వీటన్నిటినీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. పిన్నెల్లి బాహాటంగా చేసిన ఘోరాలలో కొన్నిటిని మాత్రమే ఈ పుస్తకంలో పబ్లిష్ చేశారు. లెక్కలకి అందని ఎన్నో ఘోరాలు ఈ పుస్తకంలో చోటు సంపాదించుకోలేకపోయాయి. ఆర్థిక విషయానికి వస్తే, ఎమ్మెల్యేగా ఆయన చేసిన అవినీతి విలువ రెండు వేల కోట్లకు పైగా అనే విషయం బుర్ర పేలిపోయేలా చేస్తుంది. పిన్నెల్లి చేసిన నేరాలను చాప్టర్లవారీగా విభజించారు. వాటిలో 1. గ్రానైట్ అండ్ గ్రావెల్ దోపిడీ - రూ. 1,433 కోట్లు, పిఆర్కే టాక్స్, మద్యం దోపిడీ - రూ. 4 వందల కోట్లు, భూ కబ్జాలు - 376 ఎకరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల భూముల కబ్జా, ఇతరుల ఆస్తుల కబ్జాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై పిన్నెల్లి దాడులు, అక్రమ కేసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ముఠా చేసిన హత్యలు, పిన్నెల్లి పైశాచికం, పిన్నెల్లి నేర వారసత్వం.. ఇలాంటి సబ్ హెడ్డింగ్స్ కింద పిన్నెల్లి చేసిన దారుణాలన్నీ వివరంగా ఇచ్చారు. వీటికి సంబంధించిన ఆధారాలు, పేపర్ కటింగ్స్ కూడా ఇచ్చారు.  ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, మంచి పరిపాలన వుండాలని కోరుకునేవాళ్ళందరూ ఈ పుస్తకం తప్పక చదవాలి. అయితే పిల్లలు, వృద్ధులు, సున్నిత హృదయులు, హార్ట్ పేషెంట్లు ఈ పుస్తకానికి దూరంగా వుంటే మంచింది. ఎందుకంటే, ఈ పుస్తకంలో వున్న ఘోరాలు చదివి వాళ్ళకు ఏమైనా అయ్యే ప్రమాదం వుంది మరి!

modi completely depend on sympathy

మోడీ ఈ సారి సానుభూతినే నమ్ముకున్నారా?

రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు, శాపనార్ధాలు సహజం. అయితే ఓటమి భయం తలకెక్కిన పార్టీ నేతలు మాత్రం ఆ విమర్శలు, తిట్లను సానుభూతిగా మార్చుకునేందుకు ప్రయత్నించడం కద్దు. అయితే ఆ ప్రయత్నంలో తాము ప్రత్యర్థులపై చేసిన విమర్శలను కన్వీనియెంట్ గా మరిచి పోతారు. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. విపక్షాల విమర్శల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు నన్న ఇన్ని సార్లు విమర్శించారు. ఇన్ని తిట్లు తిట్టారు అంటూ ఎన్నికల సభలలో, ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటి వరకూ ఆరు విడతల పోలింగ్ ముగిసింది. చివరి విడత వచ్చే నెల 1న జరగనుంది. అంటే ఇప్పటికే పార్టీలన్నీ ఫలితాల విషయంలో ఒక అంచనాకు వచ్చేసి ఉంటాయి. ఆరు విడతల్లో జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ కూటమికి ఆ కూటమి తమతమ విజయావకాశాలపై ఒక అంచానకు వచ్చేసి ఉంటాయి. పరిశీలకులు, పోల్ స్ట్రాటజిస్టులు మాత్రం ఈ సారి ఎటువంటి ట్రెండ్ కనిపించలేదని స్పష్టంగా చెబుతున్నాయి. అంటే ప్రధాని మోడీ సహా కమలనాథులంతా ప్రచారంలో ఊదరగొట్టినట్లు ఎన్డీయే కూటమి 400కు పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు లేవని చెబుతున్నారు. పదేళ్ల మోడీ పాలనపై ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపించిందంటున్నారు. అంతే కాకుండా 2014, 2019 ఎన్నికలలో సాధించిన విధంగా బీజేపీ సొంతంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధించడం కూడా కష్టమేనంటూ విశ్లేషణలకు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్రయాదవ్ అయితే స్పష్టంగా బీజేపీ అధికారం కోసం కూటమి భాగస్వామ్య పార్టీలు గెలుచుకునే స్థానాలపై ఆధారపడక తప్పదని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే చివరి దశలోనైనా పుంజుకోవాలన్న ఉద్దేశంతో మోడీ పూర్తిగా సానుభూతిపై ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. సాధారణంగా రాజకీయాలలో విమర్శకు ప్రతి విమర్శ సహజం. అలాగే ఆరోపణలను ఖండిస్తూ ప్రత్యారోపణలు చేయడమూ కద్దు. కానీ ప్రత్యర్థులు చేసిన విమర్శలను లెక్కపెట్టుకుని మరీ ఇన్ని విమర్శలు చేశారు. అన్ని విమర్శలు చేశారంటూ ప్రజా సానుభూతి పొందాలని చూడరు. కానీ ప్రధాని మోడీ ఇప్పుడా పనే చేస్తున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విపక్షాలు ఇప్పటి వరకూ తనపై 101 విమర్శలు చేశారంటూ లెక్కలు చెప్పారు. ఆ విమర్శలు తిట్ల స్థాయిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆయన వ్యాఖ్యలు ఓటమి భయాన్నే సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి విపక్ష కాంగ్రెస్ పై మోడీ చేసినన్ని విమర్శలు.. ఏ రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకుడు కానీ ప్రత్యర్థి పార్టీలపై చేసి ఉండరు. కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి జరిగిన ప్రతి అంశాన్ని గుర్తు చేసుకుని మరీ మోడీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. అటువంటి మోడీ హఠాత్తుగా అనూహ్యంగా విపక్షాలు తనను తిట్టిపోస్తున్నాయంటూ బేల కబుర్లు చెప్పడం పరిశీలకులను సైతం విస్మయపరిచింది.  అసలు తొలి విడత పోలింగ్ ముగిసిన మరుక్షణం నుంచీ మోడీ వాణి బారింది. ప్రసంగాల బాణి మారింది. దేశంలో విద్వేషాలు రగిల్చేలా ఆయన ప్రసంగాలు ఉన్నాయి.  మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల కారణంగా ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కొన్ని ఇబ్బందులకు గురౌతాయని తెలిసినా వెనుకాడలేదు.  దీనితో సెఫాలజిస్టులు చెబుతున్నట్లు మోడీ హవా ఈ ఎన్నికలలో కనిపించడం లేదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 

CV Anand Mudra in Telangana ACB

తెలంగాణ ఎసిబిలో  సివి ఆనంద్ ముద్ర

బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి ఆకాశాన్నంటితే పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే అవినీతిని పాతాళంలో తొక్కేయడానికి పావులు కదుపుతోంది. కెసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణాల్లో అవినీతి ఒకటి. ఎంఎల్ సి కొనుగోళ్ల కేసులో  రేవంత్ రెడ్డిని ఇరికించి  చుక్కలు చూపించిన కెసీఆర్ ప్రభుత్వం హాయంలో అధికారులు అవినీతికి పాల్పడి కెసీఆర్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి నివారణ కోసం ఫోకస్ పెట్టింది. బిల్ కలెక్టర్ నుంచి ఏసీపీ వరకూ ఎవరైనా లంచం తీసుకున్నారని ఫిర్యాదు వచ్చినా… తీసుకుంటున్నారని సమాచారం వచ్చినా ఏసీబీ అధికారులు వదిలి పెట్టడం లేదు. ట్రాప్ చేసి పట్టేసుకుంటున్నారు. హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ బాలకృష్ణ , ఏసీపీ ఉమామహేశ్వర్ రావు లాంటి పెద్ద చేపల్ని పట్టుకుని జైలుకు పంపిన ఏసీబీ … చిన్న చిన్న లంచాలే కదా అని కింది స్థాయి వారిని ఉపేక్షించడం లేదు. అవినీతి అనే క్యాన్సర్ ను మొదలకంటా తుడిచేయాల్సిందేనన్న ఉద్దేశంతో అందర్నీ ప ట్టేసుకుంటున్నారు. ఆదిలాబాద్ నుంచి ఎల్బీనగర్ వరకు ఏ మున్సిపాలిటీలో అయినా లంచం తీసుకుంటున్నారని సమాచారం వస్తే ప ట్టేసుకుంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కనీసం అరవై కేసుల్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఎంత మొత్తం అవినీతి అని కాదు.. లంచం అనే మాట వినిపిస్తే దూకుడుగా వెళ్లి అవినీతి పరుల్ని పట్టుకుంటున్నారు. గత ఐదేళ్లుగా ఏసీబీ నిద్రావస్థలోనే ఉంది. అడపాదడపా దాడులు చేయడం తప్ప.. సంచలనాత్మకంగా ఎవర్నీ పట్టుకోలేకపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ ను నియమించారు. ఆయన సిన్సియారిటీ గురించి … పోలీసు వ్యవస్థలో అందరికీ తెలుసు. సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఏసీబీ ఇమేజ్ మారిపోయింది . ముందు ముందు ఇంకెన్ని సంచలన కేసులు వెలుగులోకి తెస్తుందో కానీ.. ఇప్పటికి మాత్రం ఏసీబీ అంటే.. ఉద్యోగులు హడలి పోతున్నారు. లంచాల ప్లాన్లు ఉంటే.. ఇప్పుడే వద్దనుకుంటున్నారు.

cm cbn slogans in shamshabad airport

శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం బుధవారం (మే 29) ఉదయం సీఎం చంద్రబాబు అన్న నినాదాలతో మారుమోగిపోయింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. భార్య భువనేశ్వరితో కలిసి ఈ నెల 19న అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం (మే29) స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ సందర్భంగా ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.    పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా వారు సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.   కాగా చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ నేతలు పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎవరికీ చెప్పకుండా ఆయన విదేశాలకు వెళ్లడమేంటంటూ పలువురు వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలు గుప్పించారు. అదే సమయంలో కోర్టు అనుమతి తీసుకుని మరీ సకుటుంబంగా విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ విషయం మాత్రం వారు ప్రస్తావించలేదు. జగన్ విదేశీ పర్యటనకు  అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే కోర్టు ఆయనకు పలు షరతులు విధించి ఆ తరువాత విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 

keeravani compose telangana state

అందెశ్రీకే లేని అభ్యంతరం బీఆర్ఎస్ కు ఎందుకు?

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి కంపోజ్ చేయడంపై బీఆర్ఎస్ చేస్తున్న అనవసర రాద్ధాంతం ఇప్పటికే  దిగజారిన ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజారుస్తోంది. అసలు ఆ గీత రచయత అందెశ్రీకే లేని అభ్యంతరం బీఆర్ఎస్ కు ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది.  తెలంగాణ రాష్ట్ర గీతం ఆంధ్రా వ్యక్తి కంపోజ్ చేయడమా అంటూ గుండెలు బాదేసుకుంటూ బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారు కానీ గీత రచయత అందశ్రీ మాత్రం తన గీతానికి కీరవాణి బాణీ కట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయపబ్బం గడుపుకోవాలన్న తాపత్రేయం తప్ప బీఆర్ఎస్ అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి బాణీ సమకూర్చడంలో తప్పేమిటో అర్ధం కాదు.  బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో  కేసీఆర్ సర్కార్ తెలంగాణ క్రీడా ప్రతినిథిగా పుల్లెల గోపీచంద్ ను నియమించడం తప్పు కానప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీ కట్టే బాధ్యతను కీరవాణికి అప్పగించడంలో తప్పేమిటన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. అలాగే నటి సమంతను తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినప్పుడు కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ వాదం గుర్తుకు రాలేదా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు నిలదీశారు. ఏది ఏమైనా రాష్ట్రం ప్రాతిపదికన ప్రజల మధ్య చీలిక తీసుకురావడం ఎంత మాత్రం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. కీరవాణి తెలంగాణ వ్యక్తి కాదంటూ బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలు అసంబద్ధమైనవనడంలో సందేహం లేదు.  

ఓటమి ఒప్పేసుకోవడానికి వైసీపీకి అంత తొందరెందుకు?

వారం రోజులు.. సరిగ్గా వారం రోజులు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి రాష్ట్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏది అన్నది తేలిపోతుంది. అయితే అధికార వైసీపీకి మాత్రం అంత వరకూ ఆగో ఓర్పూ సహనం లేకుండా పోయింది. అందుకే ఇప్పటి నుంచే తమ ఓటమికి సాకులు వెతుక్కుంటూ తమ పార్టీ ఓటమికి పూర్తి కారణం చంద్రబాబునాయుడే అంటూ చెప్పుకుంటోంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు తమ తప్పిదాలన్నిటికీ తెలుగుదేశం పార్టీయే కారణమంటూ నిందలు మోపుతోంది.  పోలింగ్ జరిగిన నాటి నుంచీ వైసీపీ తన ఓటమిని తానే చాటుకుంటూ తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటోంది.  వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం అవ్వడానికి చంద్రబాబే కారణమని ఆక్రోషిస్తోంది.  ఇంకా ఓట్ల లెక్కింపునకు వారం రోజులు గడువు ఉండగానే .. తాము ఎందుకు ఓడిపోయామో చెప్పుకోవడానికి వైసీపీ నేతలు పోటీలు పడుతున్నారు.  రాష్ట్రంలో రికార్డు స్థాయిలో దాదాపు 82 శాతం ఓటింగ్ పోలైనపుడు, వైసీపీ చంకలు గుద్దుకుంది. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల కారుణంగా పడినదంతా ప్రభుత్వ సానుకూల ఓటేనంటూ ఊరూ వాడా ఏకం చేసింది. అయితే ఆ ధీమా, ఆ విశ్వాసం రోజులు గడుస్తున్న కొద్దీ కనుమరుగౌతోంది.   పోలింగ్ సరిగా జరగలేదని, రీ పోలింగ్ కావాలని డిమాండ్లు మొదలు పెట్టింది. విధ్వంసం జరిగిన చోట్ల తెలుగుదేశం రీపోలింగ్ కు ఎందుకు డిమాండ్ చేయడం లేదని దబాయించడం మొదలెట్టింది.   చంద్రబాబుపై పడి ఏడవడం మొదలెట్టింది. చంద్రబాబు ట్యాన్ కు మోడీ సైతం డ్యాన్స్ చేస్తున్నారంటూ సజ్జల మీడియా ముందు ఉక్రోషం వెళ్లగక్కారు. వైసీపీ నేతల మాటలు వింటుంటే,   వారి గాభరా చూస్తుంటే.. బహుశా పరాజయం ఎంత ఘోరంగా ఉండబోతోందో వారికి తెలిసిపోయిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.    

మరో విధ్వంసానికి వైసీపీ రెడీ.. పేర్ని నాని వ్యాఖ్యల అర్ధం అదేనా?

వైసీపీ ఆవిర్భావం నుంచి ఒక ఒరవడిలో వెడుతోంది. తన తప్పులు, తప్పిదాలు, తన  దౌర్జన్యాలూ, దాష్టికాలూ అన్ని ప్రత్యర్థులపై నెట్టేసి చేతులు దులిపేసుకోవడమే ఆ ఒరవడి. విపక్షంలో ఉండగానూ అదే చేసింది. గత ఐదేళ్ల అధికారంలోనూ దానినే ఫాలో అయ్యింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తై, పార్టీ ఓటమి ఖరారైందన్న అంచనాల నేపథ్యంలో కూడా మరోసారి విధ్వంసానికి ప్రణాళికలు రచించి, ఆ జరగబోయే విధ్వంసానికి తెలుగుదేశం కూటమి కారణమని ముందస్తుగానే చెప్పేస్తోంది. ఇందుకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మాటలే తార్కాణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో  వైసీపీ విభేదిస్తున్న సంగతి తెలిసిందే.  అలా విబేదించడానికి, ఆ మార్గదర్శకాల పట్ల అభ్యంతరం చెప్పడానికీ వైసీపీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. అయితే తన అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఆగకుండా వైసీపీ విధ్వంసం, హంస చెలరేగే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నది. అందుకు కారణం తెలుగుదేశం కూటమేనని ఇప్పటి నుంచే గుండెలు బాదేసుకుంటోంది. అంటే హింసకు ముందే ప్రణాళికలు రచించి.. కౌంటింగ్ సందర్భంగా హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఆ జరగబోయే హింసకు కారణం తెలుగుదేశమేనని ఇప్పటి నుంచే గుండెలు బాదేసుకుంటోంది. మంగళవారం (మే28) మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని మాటలు వింటే ఈ విషయం విస్పష్టంగా అర్ధమైపోతుంది.  సాధారణంగా పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే సమయంలోనూ కొన్ని చెదురుమదురు సంఘటనలు జరగడం కద్దు. అయితే పోలింగ్ ముగిసిన తరువాత రోజుల తరబడి అల్లర్లు, విధ్వంసం కొనసాగడం గతంలో ఎన్నడూ లేదు. పోలింగ్ ముగిసిన తరువాత ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. దానిని మార్చడం ఎవరి వల్లా కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.  కానీ అలా జరుగుతుంది అంటూ పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి మరీ చెబుతున్నారు.  పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో గందరగోళం జరగబోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ గందరగొళానికి ఎన్నికల సంఘం నిర్ణయం, ఎన్నికల సంఘం అలా నిర్ణయం తీసుకోవడానికి కారణమైన తెలుగుదేశమే కారణమని ముందస్తు ఆరోపణలు గుప్పించేస్తున్నారు.  కౌంటింగ్‌లో కేంద్రాలలో 10-15 మంది పార్టీల ఏజంట్లు ఉంటారు. ఆ సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ సంతకాలలో ఏ చిన్న తేడా కనిపించి ఏ ఒక్కరూ అభ్యంతరం చెప్పినా కౌంటింగ్‌ రసబాసగా మారుతుంది. కౌటింగ్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిపించాలని మేము కోరుతున్నాము. కానీ రసాభాసగా మార్చేందుకు కుట్ర జరుగుతోంది అని ఆరోపిస్తున్నారు.  పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ ప్రక్రియని నిర్వహించేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్‌ ప్రతీ బ్యాలెట్ పేపర్ వెనుక వైపు సంతకం చేసి ఇస్తారు. కానీ ఒక్కోసారి సంతకం చేయడం మరిచిపోయినా అది సరిపోలక పోయినా ఆ ఓట్లు పరిగణనలోకి తీసుకునేవారు కారు.   కానీ  ఈసారి రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.  రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా పర్వాలేదని ఈసీ చెప్పినప్పుడు, పోస్టల్ బ్యాలట్ పత్రాలపై వారి సంతకాలను సరిపోల్చాల్సిన అవసరమే ఉండదు. కానీ సంతకంలో చిన్న తేడా వచ్చినా రసాభాస తప్పదని పేర్ని నాని హెచ్చరిస్తున్నారంటే.. ఈ వంకతో కౌంటింగ్‌ కేంద్రాలలో వైసీపి ఘర్షణలు జరిగేలా  జరిగేలా కుట్రలు చేస్తోందని అర్ధమౌతోంది. ఎందుకంటే తాను చేసిన దానికీ, చేయబోయిన దానికి కారణం తెలుగుదేశం అని ఆరోపించడం వైసీపీకి తొలి నుంచి అలవాటైన విద్య కనుక.  పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపి ఇంతగా ఆందోళన చెందడానికి కారణం ఆ ఓట్లన్నీ తమ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్న ప్రభుత్వోద్యోగులవి కావడం వల్లనే.  కనుక వాటి లెక్కింపు సవ్యంగా జరగకుండా ఉండేందుకు ఆ పార్టీ నానా తంటాలూ పడుతోంది. అసలు ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు ఉపయోగించుకోవడమంటేనే వారిలో ప్రభుత్వం పట్ల ఎంత ఆగ్రహం గూడుకట్టుకుని ఉందో అవగతమౌతుంది. అదే సమయంలో దాదాపు లక్షకు పైగా పోస్టల్ బ్యాలెట్ లపై ఆర్వో సంతకం, సీలు లేదంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చెల్లనివిగా  చేసేందుకు ప్రభుత్వ స్థాయిలో ఎంత కుట్ర జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ కారణంగానే తెలుగుదేశం కూటమి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సంతకం, సీలు లాంటి టెక్నికల్ ఇష్యూస్ కి ఎన్నికల సంఘానిదే బాధ్యత అని చెప్పింది.  ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో గొడవలు జరుగుతాయంటూ పేర్ని నాని గుండెలు బాదుకోవడం చూస్తుంటే.. కౌంటింగ్ కేంద్రాల వద్ద గలాభా సృష్టించేందుకు వైసీపీ భారీ ప్రణాళికలే రచించిందని అర్ధమౌతోంది.  

30వేల పైచిలుకు మెజారిటీతో పవన్ విజయం.. జేడీ లక్ష్మీనారాయణ జోస్యం

పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయంపై ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో పవన్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత కూడా ఎన్నికల తరువాత ప్లేటు ఫిరాయించేసి తానెప్పుడూ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించలేదనీ, వైసీపీ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా తాను విమర్శల విషయంలో సంయమనం పాటించాననీ చెప్పుకున్నారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి అన్నా, ఆయన కుటుంబం అన్నా తనకు ఎంతో గౌరవాభిమానాలున్నాయని చెప్పారు. ప్రజారాజ్యం అభ్యర్థిగా తాను గతంలో ఎన్నికలలో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక వైసీపీ శ్రేణులు కూడా విజయంపై ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. దీంతో పిఠాపురంలో గెలిచేది ఎవరన్న దానిపై కాకుండా అక్కడ పవన్ కల్యాణ్ మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది.  ఈ తరుణంగా జేడీ లక్ష్మీనారాయణగా గుర్తింపు పొందిన సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధినేత వీవీ లక్ష్మీనారాయణ కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ దే విజయం అని చెప్పడమే కాకుండా ఆయనకు 30 వేల పైచిలుకు మెజారిటీ వస్తుందని జోస్యం చెప్పారు.  తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పిఠాపురంలో పవన్ కల్యాణ్ పెర్ఫార్మెన్స్ పై తన పరిశీలనను, అభిప్రాయాలను పంచుకున్నారు.  పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ముఫ్ఫై వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారనీ చెప్పారు. వాస్తవానికి పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ రికార్డు స్థాయి మెజారిటీతో అంటే దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం 30 వేల మెజారిటీ అని భావిస్తున్నారు.  మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా పని చేసిన లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న సమయంలో  కేసులను దర్యాప్తు చేశారు.   వీటిలో సత్యం కంప్యూటర్స్ కార్పొరేట్ కుంభకోణం, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసు, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. 2018లో ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన  ఆయన 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.   ఆ తరువాత ఆయన జనసేన నుంచి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచీ  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతులు, యువతలో చైతన్యం కలిగిస్తూ వచ్చారు.  ఇటీవలే ఆయన జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంపై లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.