ఓటమి ఒప్పేసుకోవడానికి వైసీపీకి అంత తొందరెందుకు?

వారం రోజులు.. సరిగ్గా వారం రోజులు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి రాష్ట్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏది అన్నది తేలిపోతుంది. అయితే అధికార వైసీపీకి మాత్రం అంత వరకూ ఆగో ఓర్పూ సహనం లేకుండా పోయింది. అందుకే ఇప్పటి నుంచే తమ ఓటమికి సాకులు వెతుక్కుంటూ తమ పార్టీ ఓటమికి పూర్తి కారణం చంద్రబాబునాయుడే అంటూ చెప్పుకుంటోంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు తమ తప్పిదాలన్నిటికీ తెలుగుదేశం పార్టీయే కారణమంటూ నిందలు మోపుతోంది.  పోలింగ్ జరిగిన నాటి నుంచీ వైసీపీ తన ఓటమిని తానే చాటుకుంటూ తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటోంది.  వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం అవ్వడానికి చంద్రబాబే కారణమని ఆక్రోషిస్తోంది. 

ఇంకా ఓట్ల లెక్కింపునకు వారం రోజులు గడువు ఉండగానే .. తాము ఎందుకు ఓడిపోయామో చెప్పుకోవడానికి వైసీపీ నేతలు పోటీలు పడుతున్నారు.  రాష్ట్రంలో రికార్డు స్థాయిలో దాదాపు 82 శాతం ఓటింగ్ పోలైనపుడు, వైసీపీ చంకలు గుద్దుకుంది. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల కారుణంగా పడినదంతా ప్రభుత్వ సానుకూల ఓటేనంటూ ఊరూ వాడా ఏకం చేసింది. అయితే ఆ ధీమా, ఆ విశ్వాసం రోజులు గడుస్తున్న కొద్దీ కనుమరుగౌతోంది.  

పోలింగ్ సరిగా జరగలేదని, రీ పోలింగ్ కావాలని డిమాండ్లు మొదలు పెట్టింది. విధ్వంసం జరిగిన చోట్ల తెలుగుదేశం రీపోలింగ్ కు ఎందుకు డిమాండ్ చేయడం లేదని దబాయించడం మొదలెట్టింది.   చంద్రబాబుపై పడి ఏడవడం మొదలెట్టింది. చంద్రబాబు ట్యాన్ కు మోడీ సైతం డ్యాన్స్ చేస్తున్నారంటూ సజ్జల మీడియా ముందు ఉక్రోషం వెళ్లగక్కారు. వైసీపీ నేతల మాటలు వింటుంటే,   వారి గాభరా చూస్తుంటే.. బహుశా పరాజయం ఎంత ఘోరంగా ఉండబోతోందో వారికి తెలిసిపోయిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.    

Teluguone gnews banner