మరో విధ్వంసానికి వైసీపీ రెడీ.. పేర్ని నాని వ్యాఖ్యల అర్ధం అదేనా?

వైసీపీ ఆవిర్భావం నుంచి ఒక ఒరవడిలో వెడుతోంది. తన తప్పులు, తప్పిదాలు, తన  దౌర్జన్యాలూ, దాష్టికాలూ అన్ని ప్రత్యర్థులపై నెట్టేసి చేతులు దులిపేసుకోవడమే ఆ ఒరవడి. విపక్షంలో ఉండగానూ అదే చేసింది. గత ఐదేళ్ల అధికారంలోనూ దానినే ఫాలో అయ్యింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తై, పార్టీ ఓటమి ఖరారైందన్న అంచనాల నేపథ్యంలో కూడా మరోసారి విధ్వంసానికి ప్రణాళికలు రచించి, ఆ జరగబోయే విధ్వంసానికి తెలుగుదేశం కూటమి కారణమని ముందస్తుగానే చెప్పేస్తోంది. ఇందుకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మాటలే తార్కాణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో  వైసీపీ విభేదిస్తున్న సంగతి తెలిసిందే.  అలా విబేదించడానికి, ఆ మార్గదర్శకాల పట్ల అభ్యంతరం చెప్పడానికీ వైసీపీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. అయితే తన అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఆగకుండా వైసీపీ విధ్వంసం, హంస చెలరేగే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నది. అందుకు కారణం తెలుగుదేశం కూటమేనని ఇప్పటి నుంచే గుండెలు బాదేసుకుంటోంది. అంటే హింసకు ముందే ప్రణాళికలు రచించి.. కౌంటింగ్ సందర్భంగా హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఆ జరగబోయే హింసకు కారణం తెలుగుదేశమేనని ఇప్పటి నుంచే గుండెలు బాదేసుకుంటోంది. మంగళవారం (మే28) మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని మాటలు వింటే ఈ విషయం విస్పష్టంగా అర్ధమైపోతుంది. 

సాధారణంగా పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే సమయంలోనూ కొన్ని చెదురుమదురు సంఘటనలు జరగడం కద్దు. అయితే పోలింగ్ ముగిసిన తరువాత రోజుల తరబడి అల్లర్లు, విధ్వంసం కొనసాగడం గతంలో ఎన్నడూ లేదు. పోలింగ్ ముగిసిన తరువాత ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. దానిని మార్చడం ఎవరి వల్లా కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 

కానీ అలా జరుగుతుంది అంటూ పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి మరీ చెబుతున్నారు.  పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో గందరగోళం జరగబోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ గందరగొళానికి ఎన్నికల సంఘం నిర్ణయం, ఎన్నికల సంఘం అలా నిర్ణయం తీసుకోవడానికి కారణమైన తెలుగుదేశమే కారణమని ముందస్తు ఆరోపణలు గుప్పించేస్తున్నారు.  కౌంటింగ్‌లో కేంద్రాలలో 10-15 మంది పార్టీల ఏజంట్లు ఉంటారు. ఆ సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ సంతకాలలో ఏ చిన్న తేడా కనిపించి ఏ ఒక్కరూ అభ్యంతరం చెప్పినా కౌంటింగ్‌ రసబాసగా మారుతుంది. కౌటింగ్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిపించాలని మేము కోరుతున్నాము. కానీ రసాభాసగా మార్చేందుకు కుట్ర జరుగుతోంది అని ఆరోపిస్తున్నారు.  పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ ప్రక్రియని నిర్వహించేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్‌ ప్రతీ బ్యాలెట్ పేపర్ వెనుక వైపు సంతకం చేసి ఇస్తారు. కానీ ఒక్కోసారి సంతకం చేయడం మరిచిపోయినా అది సరిపోలక పోయినా ఆ ఓట్లు పరిగణనలోకి తీసుకునేవారు కారు.   కానీ  ఈసారి రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.  రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా పర్వాలేదని ఈసీ చెప్పినప్పుడు, పోస్టల్ బ్యాలట్ పత్రాలపై వారి సంతకాలను సరిపోల్చాల్సిన అవసరమే ఉండదు.

కానీ సంతకంలో చిన్న తేడా వచ్చినా రసాభాస తప్పదని పేర్ని నాని హెచ్చరిస్తున్నారంటే.. ఈ వంకతో కౌంటింగ్‌ కేంద్రాలలో వైసీపి ఘర్షణలు జరిగేలా  జరిగేలా కుట్రలు చేస్తోందని అర్ధమౌతోంది. ఎందుకంటే తాను చేసిన దానికీ, చేయబోయిన దానికి కారణం తెలుగుదేశం అని ఆరోపించడం వైసీపీకి తొలి నుంచి అలవాటైన విద్య కనుక.  పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపి ఇంతగా ఆందోళన చెందడానికి కారణం ఆ ఓట్లన్నీ తమ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్న ప్రభుత్వోద్యోగులవి కావడం వల్లనే.  కనుక వాటి లెక్కింపు సవ్యంగా జరగకుండా ఉండేందుకు ఆ పార్టీ నానా తంటాలూ పడుతోంది. అసలు ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు ఉపయోగించుకోవడమంటేనే వారిలో ప్రభుత్వం పట్ల ఎంత ఆగ్రహం గూడుకట్టుకుని ఉందో అవగతమౌతుంది. అదే సమయంలో దాదాపు లక్షకు పైగా పోస్టల్ బ్యాలెట్ లపై ఆర్వో సంతకం, సీలు లేదంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చెల్లనివిగా  చేసేందుకు ప్రభుత్వ స్థాయిలో ఎంత కుట్ర జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ కారణంగానే తెలుగుదేశం కూటమి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సంతకం, సీలు లాంటి టెక్నికల్ ఇష్యూస్ కి ఎన్నికల సంఘానిదే బాధ్యత అని చెప్పింది.  ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో గొడవలు జరుగుతాయంటూ పేర్ని నాని గుండెలు బాదుకోవడం చూస్తుంటే.. కౌంటింగ్ కేంద్రాల వద్ద గలాభా సృష్టించేందుకు వైసీపీ భారీ ప్రణాళికలే రచించిందని అర్ధమౌతోంది.