మోడీ ఈ సారి సానుభూతినే నమ్ముకున్నారా?

రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు, శాపనార్ధాలు సహజం. అయితే ఓటమి భయం తలకెక్కిన పార్టీ నేతలు మాత్రం ఆ విమర్శలు, తిట్లను సానుభూతిగా మార్చుకునేందుకు ప్రయత్నించడం కద్దు. అయితే ఆ ప్రయత్నంలో తాము ప్రత్యర్థులపై చేసిన విమర్శలను కన్వీనియెంట్ గా మరిచి పోతారు. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. విపక్షాల విమర్శల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు నన్న ఇన్ని సార్లు విమర్శించారు. ఇన్ని తిట్లు తిట్టారు అంటూ ఎన్నికల సభలలో, ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటి వరకూ ఆరు విడతల పోలింగ్ ముగిసింది. చివరి విడత వచ్చే నెల 1న జరగనుంది. అంటే ఇప్పటికే పార్టీలన్నీ ఫలితాల విషయంలో ఒక అంచనాకు వచ్చేసి ఉంటాయి. ఆరు విడతల్లో జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ కూటమికి ఆ కూటమి తమతమ విజయావకాశాలపై ఒక అంచానకు వచ్చేసి ఉంటాయి.

పరిశీలకులు, పోల్ స్ట్రాటజిస్టులు మాత్రం ఈ సారి ఎటువంటి ట్రెండ్ కనిపించలేదని స్పష్టంగా చెబుతున్నాయి. అంటే ప్రధాని మోడీ సహా కమలనాథులంతా ప్రచారంలో ఊదరగొట్టినట్లు ఎన్డీయే కూటమి 400కు పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు లేవని చెబుతున్నారు. పదేళ్ల మోడీ పాలనపై ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపించిందంటున్నారు. అంతే కాకుండా 2014, 2019 ఎన్నికలలో సాధించిన విధంగా బీజేపీ సొంతంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధించడం కూడా కష్టమేనంటూ విశ్లేషణలకు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్రయాదవ్ అయితే స్పష్టంగా బీజేపీ అధికారం కోసం కూటమి భాగస్వామ్య పార్టీలు గెలుచుకునే స్థానాలపై ఆధారపడక తప్పదని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే చివరి దశలోనైనా పుంజుకోవాలన్న ఉద్దేశంతో మోడీ పూర్తిగా సానుభూతిపై ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. సాధారణంగా రాజకీయాలలో విమర్శకు ప్రతి విమర్శ సహజం. అలాగే ఆరోపణలను ఖండిస్తూ ప్రత్యారోపణలు చేయడమూ కద్దు.

కానీ ప్రత్యర్థులు చేసిన విమర్శలను లెక్కపెట్టుకుని మరీ ఇన్ని విమర్శలు చేశారు. అన్ని విమర్శలు చేశారంటూ ప్రజా సానుభూతి పొందాలని చూడరు. కానీ ప్రధాని మోడీ ఇప్పుడా పనే చేస్తున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విపక్షాలు ఇప్పటి వరకూ తనపై 101 విమర్శలు చేశారంటూ లెక్కలు చెప్పారు. ఆ విమర్శలు తిట్ల స్థాయిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆయన వ్యాఖ్యలు ఓటమి భయాన్నే సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి విపక్ష కాంగ్రెస్ పై మోడీ చేసినన్ని విమర్శలు.. ఏ రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకుడు కానీ ప్రత్యర్థి పార్టీలపై చేసి ఉండరు. కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి జరిగిన ప్రతి అంశాన్ని గుర్తు చేసుకుని మరీ మోడీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. అటువంటి మోడీ హఠాత్తుగా అనూహ్యంగా విపక్షాలు తనను తిట్టిపోస్తున్నాయంటూ బేల కబుర్లు చెప్పడం పరిశీలకులను సైతం విస్మయపరిచింది. 

అసలు తొలి విడత పోలింగ్ ముగిసిన మరుక్షణం నుంచీ మోడీ వాణి బారింది. ప్రసంగాల బాణి మారింది. దేశంలో విద్వేషాలు రగిల్చేలా ఆయన ప్రసంగాలు ఉన్నాయి.  మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల కారణంగా ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కొన్ని ఇబ్బందులకు గురౌతాయని తెలిసినా వెనుకాడలేదు.  దీనితో సెఫాలజిస్టులు చెబుతున్నట్లు మోడీ హవా ఈ ఎన్నికలలో కనిపించడం లేదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 

Teluguone gnews banner