తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం మాయం?
posted on May 29, 2024 @ 4:37PM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణ అవతరణ పదో వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సమాయత్తమౌతోంది. తెలంగాణ రాష్ట్ర గీతానికి కొత్త బాణీ సహా, కొత్త అధికారిక చిహ్నాన్ని కూడా రూపొందిస్తున్నారు. అవతరణ వేడుకలకు సంబంధించి ప్రతి విషయాన్నీ, ప్రతి అంశాన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర గీతానికి కీరవాణి బాణీ కట్టారు. దానిని వివాదాస్పదం చేయాలని ప్రయత్నించి బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీతానికి బానీ సమకూర్చడంపై విమర్శలు గుప్పించి జనంలో బీఆర్ఎస్ పలుచన అయ్యింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎంత మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులకు పెద్ద పీట వేసిందో, ఎంత మంది ఆంధ్రా ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింతో మర్చిపోయిందా అంటూ జనం బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర అధికార చిహ్నాన్ని కూడా కొత్తగా రూపొందించాలని రేవంత్ నిర్ణయించారు.
దీంతో రాష్ట్ర అధికారిక చిహ్నాం ఎలా ఉండబోతోందన్న దానిపై ప్రజలలో ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు కొత్త అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం మాయం కాబోతోంది. మధ్యలో పూర్ణకుంభం పై భాగంలో మూడు సింహాల రాజముద్ర, కింది భాగంలో చార్మినార్ బొమ్మ పూర్ణకుంభం ఇరువైపులా తంగేడు ఆకులు తెలంగాణ మ్యాప్, కింది భాగంలో హుస్సేస్ సాగర్‌లోని బుద్ధుడి బొమ్మ అంటాయి. రాచరిక హిహ్నాలు రాష్ట్ర అధికారిక ముద్రలో ఉండొద్దని రేవంత్ భావిస్తున్నారనీ, అందుకే కాకతీయ తోరణం ఉండే అవకాశం లేదని అంటున్నారు.