పులివెందులకు ఉప ఎన్నిక తప్పదా?

ఊరంతా ఒక దారయితే ఉలిపికట్టది ఒక దారి అన్నట్లుగా ఉంది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ తీరు. తన తీరుతో ఆయన రాష్ట్రంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి తీసుకువస్తున్నారు. జగన్ వ్యవహార శైలి కారణంగా సభలో వైసీపీ బలం మరింత తగ్గిపోయినా ఆశ్చర్యంలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ సారి మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ హాజరు, గైర్హాజరుతో సంబంధం లేకుండా పలు అంశాలను సభ ముందు ఉంచేందుకు ప్రభుత్వం సమాయత్తమౌతోంది. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు, అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా సభ ముందు ఉంచాలని  ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడం బాధ్యత అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మద్యం,ఇసుక కుంభకోణాలు, ఆ రెండింటిలో ఏ స్థాయిలో దోడిపీ జరిగింది? మనీల్యాండరింగ్ కు పాల్పడిన వారు ఎవరు? ఇత్యాది విషయాలన్నీ ఇప్పటికే దాదాపుగా ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి.  సభాముఖంగా ఆ వివరాలన్నిటినీ ప్రజల ముందు ఉంచేందుకు తెలుగుదేశం కూటమి సర్కార్ సమాయత్తమౌతోంది.   ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడతానని ప్రకటించేశారు. తాను అడగాల్సింది ఏమైనా ఉంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచే ప్రశ్నిస్తానంటున్నారు. నిజానికి ప్రభుత్వాన్ని నిలదీయాలంటే అందుకు సరైన వేదిక అసెంబ్లీ మాత్రమే. సూపర్ సిక్స్ హామీలు అంటూ అధికారంలోకి వచ్చి వాటిని అమలును విస్మరిస్తోందని విమర్శలు గుప్పిస్తున్న జగన్ అదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయొచ్చు కదా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.   ఆ విషయాన్ని పక్కన పెడితే అసెంబ్లీకి హాజరవ్వకూడదని జగన్ చెప్పిన కారణాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కూడా జగన్ మాటలను కొట్టిపారేశారు. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. తాను, తన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా మైకు ఇవ్వరనీ, ఇంతోటి దానికి అసెంబ్లీకి రావడమెందుకనీ ఆయన ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా, తనకు కూడా సభానాయకుడు చంద్రబాబునాయుడికి ఇచ్చినంత సమయం సభలో మాట్లాడేందుకు తనకు కూడా ఇవ్వాలనీ, అప్పుడే సభకు వస్తాననీ అన్నారు. అయితే జగన్ చేసిన ఈ డిమాండ్ ఏ విధంగా చూసినా అసంబద్ధంగా ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రజలు జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఆ హోదా లేకుండా సభలో సభానాయకుడితో సమానంగా సమయం ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. సభలో జగన్ పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టే మాట్లాడేందుకు సమయం ఇవ్వడం జరుగుతుంది. దేశ మంతటా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలోనే, చివరాఖరుకు లోక్ సభలోనూ ఇలాగే జరుగుతుంది. అయితే జగన్ మాత్రం తాను అన్నిటికీ అతీతుడనని భావిస్తున్నట్లుగా ఆయన డిమాండ్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు జగన్ పై అనర్హత వేటు అంశాన్ని ప్రస్తావించారు. వీరిరువురూ ఎమ్మెల్యేల పునశ్చరణ తరగతులను ప్రాంభించాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఆ మీడియా సమావేశంలో జగన్ డిమాండ్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అవసరమైనంత సంఖ్యాబలం లేకుండా అసెంబ్లీలో సభా నాయకుడితో సమానంగా సమయం ఇవ్వాలని జగన్ ఎలా డిమాండ్ చేస్తారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగన్ డిమాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కొట్టి పారేశారు. ఎవరైనా సరే నిబంధనల మేరకు నడుచుకోవలసిందేనని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేననీ, వైసీపీకి సభలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టే ఆ పార్టీకి సమయం కేటాయిస్తారని స్పష్టం చేశారు.  ఈ నేపథ్యంలోనే జగన్ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని స్పష్టమౌతోంది. అయితు జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొడితే ఏం జరుగుతుంది?  అన్న దానిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎవరైనా సరే వరుసగా 60 రోజులు సభకు గైర్హాజరైతే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందన్నారు. సభకు హాజరు కాలేకపోవడానికి సహేతుక కారణం చూపుతూ స్పీకర్ ను వ్యక్తిగతంగా కలిసి లీవ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుందనీ,  అలా ఇవ్వకుండా 60 రోజులు సభకు డుమ్మా కొడితే అనర్హత వేటు పడటం ఖాయమని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.  ఆయన మాటలను బట్టి జగన్ ఇదే తీరుగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజర్ అయితే ఆయనపై అనర్హత వేటు పడటానికి ఎంతో సమయం పట్టదు. ఆయనపైనే కాదు, ఆయన ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరౌతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు పడుతుంది. అప్పుడు రాష్ట్రంలో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రావడం ఖాయం. అదే జరిగితే అసెంబ్లీలో కూటమి సంఖ్యా బలం బాగా పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్లని రాజకీయ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడం అన్నది సాధ్యమయ్యే పరిస్థితి కాదని రాజకీయ నిపుణులు అంటున్నారు.  అదే జరిగి ఉప ఎన్నికలు వస్తే పులివెందుల కూడా కూటమి ఖాతాలో పడే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. 

వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం.. ఆకలి దప్పులతో భక్తుల అవస్థలు

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అన్ని రోడ్లూ ప్రయాగ్ రాజ్ వైపే అన్నట్లుగా భక్తుల రాక కొనసాగుతుండటంతో ప్రయాగ్ రాజ్ కు వెళ్లే మార్గాలన్నిటిలోనూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ కారణంగా వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జాం ఇదేనని అధికారులు అంటున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 9) నుంచి ట్రాఫిక్ జాం అయ్యింది. ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. ట్రాఫిక్ ఎప్పటికి క్లియర్ అవుతుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్న పరిస్థితి. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు పోటెత్తారు. అంచనాలకు మించి జనం రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు మూడు వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.   ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న వారు ఆకలి దప్పులతో నీరసించిపోతున్న పరిస్థితి.  మరోవైపు, భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు.  ఇలా ఉండగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే మహా కుంభమేళాకు వెడుతున్న భక్తులు అవస్థలు పడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లే దారిలో ట్రాఫిక్ జాం దృశ్యాల విడీయోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తక్షణమే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఇలా ఉండగా సోమవారం నాటికి మహాకుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన భక్తుల సంఖ్య 44 కోట్లకు చేరింది.   

వైసీపీ కార్యాలయానికి మరోమారు నోటీసులు

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోమారు నోటీసులు పంపారు. తాడేపల్లి ప్యాలెస్ బయట ఇటీవల స్వల్ప అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పించింది. జగన్ పై హత్యాయత్నం అంటూ వార్తలను వండి వార్చింది. ఈ అగ్నిప్రమాదం తాడేపల్లి ప్యాలెస్ బయట రోడ్డు పక్కన ఉన్న లాన్ లో జరిగింది. అయితే దీని వెనుక బారీ కుట్ర ఉందంటూ వైసీపీ ఆరోపణలు గుప్పించింది. ప్రతిగా.. ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన ఆధారాలు మాయం చేయడానికి వైసీపీయే స్వయంగా ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించిందంటూ తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. తాడేపల్లి ప్యాలెస్ లోని సీపీ ఫుటేజీ ఇవ్వాలంటూ తాడేపల్లి కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల నోటీసుల మేరకు సీసీ ఫుటేజీ ఇవ్వడానికి వైసీపీ నిరాకరించింది. దీంతో పోలీసులు మరోమారు నోటీసులు పంపించారు. తాడేపల్లి ప్యాలెస్ బయట అగ్ని ప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నాయకుల జాబితా ఇవ్వాలనీ, అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలను మంగళవారం (ఫిబ్రవరి 11) తాడేపల్లి పీఎస్ లో సమర్పించాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వైసీపీ కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.  గతంలో జగన్ పై కోడి కత్తి దాడి కేసులో కూడా పట్టుబట్టి ఎన్ఐఏ దర్యాప్తు కు ఆదేశాలు జారీ చేయించుకున్నప్పటికీ, ఆ కేసులో బాధితుడిగా జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వక పోవడంతో సంవత్సరాల తరబడి ఆ కేసు విచారణ సాగుతూనే ఉంది. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో కూడా సంఘటన జరగ్గానే ఇష్టారీతిగా ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పించిన వైసీపీ అధినేత ఆ తరువాత దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. తనపై గులకరాయి దాడి కేసులో కూడా జగన్ అదే విధంగా వ్యవహరించారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై కూడా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పించడమే తప్ప.. వివరాలను, ఆధారాలను సమర్పించడానికి మాత్రం ముందుకు రావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.    

ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు విడదల రజని

మాజీ మంత్రి విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఏపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనను వేధించారంటూ కోటి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో విడదల రజనీపై కేసు నమోదైన సంగతి తెలసిందే. ఈ కేసులోనే ముందస్తు బెయిలు కోసం విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. రజనీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం (ఫిబ్రవరి 11) విచారణ జరగనుంది.  సైబరాబాద్ మొక్క విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసు స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి పిటిషన్ పై హైకోర్టు ఆదేశాల మేరకు చిలకలూరి పేట పోలీసులు మాజీ మంత్రి విడదల రజినీపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియా పోస్టుల విషయంలో  విడదల రజినీ ఆదేశాల మేరకు తనను వేధించారని పేర్కొంటూ తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు. పిల్లి కోటి పిటిషన్ న పరిశీలించి కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చిలకలూరి పేట పోలీసులు విడదల రజినీపై కేసు నమోదు చేశారు.  విడదల రజినీతో పాటు  ఆమె పీఏలు దొడ్డా రామకృష్ణ, ఫణి సహా అప్పటి సీఐ సూర్యనారాయణపై కూడా కేసు నమోదు అయ్యింది.  2019లో చిలకలూరి పోలీస్ స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురి చేశారనీ,  అప్పట్లో దీని పై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పిల్లి  తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై   రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  కోర్టు ఆదేశాల మేరకు విడదల రజనీపై కేసు నమోదైంది. ఆ కేసులోనే ముందస్తు బెయిలు కోసం విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. 

అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో వీర రాఘవరెడ్డి అరెస్ట్ 

చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 22 మంది రామ రాజ్యం పేరిట  ప్రయివేటు సైన్యం తన ఇంట్లో దూరినట్టు రంగరాజన్ చెప్పారు. సీసీటీవీ రికార్డు ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. తాను  తన నివాసంలో క్రింద కూర్చున్న సమయంలో  దుండగులు బూట్లతో లోపలికి ప్రవేశించి దుర్బాషలాడటమే గాకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. ఘటన అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ రంగరాజన్ ను పరామర్శించారు. ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర ఎప్పటినుంచంటే..?

జనసేనాని పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న ఆయన ఇక ముందగా తాను నిర్ణయించుకున్నట్లు ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరడానికి రెడీ అయిపోయారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలను దర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఆయన ఈ నెల 12న తమిళనాడు, కేరళ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటారు. ఆయన దర్శించుకునే ఆలయాల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయం, మధుర మీనాక్షి, శ్రీ పరసురామస్వామి ఆలయాలు ఉన్నాయి. అలాగే అగస్త్య పజీవ సమాధి, కుంభఏశ్వర ఆలయం, స్వామి మలయి, తిరుత్తాయ్ సుబ్రహ్మణ్వేస్వరస్వామి ఆలయాలను కూడా ఆయన సందర్శిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణే తన అభిమతంగా చెప్పుకునే పవన్ కల్యాణ్ అందుకే ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరారు. తాను సనాతన ధర్మాన్ని మనసావాచాకర్మణా నమ్ముతానని పవన్ కల్యాణ్ పలు సందర్భాలలో చెప్పిన సంగతి తెలిసిందే.  సనాతన వ్యతిరేక మేధావుల మాటలు తనను ప్రభావితం చేయలేవని ఆయన అన్నారు.   

ఉండవల్లి కాదు ఊసరవెల్లి..!

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. స్వయం ప్రకటిత మేధావిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరపరిచితుడు. వైఎస్ కు నమ్మిన బంటుగా ఉండవల్లి రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఆయన ఆశీస్సులతో రాజమహేంద్రవరం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యుడిగా  ఆయన రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏం చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం ప్రకటించి.. తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రేయోభిలాషిగా మిగిలిపోయారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయినా, అవినీతి, అరాచకత్వం రాజ్యమేలినా.. ఉండవల్లి ఉలకలేదు, పలకలేదు. కానీ జగన్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ.. ఆయనకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి తనకు మాత్రమే సాధ్యమైన వితండ వాదంతో ఆయన తరఫున మాట్లాడే వారు. ఈ నేపథ్యంలో ఆయన తన వాదనను తానే ఖండించుకుంటూ గతంలో తాను ఔనన్న దానికి కాదంటూ, కాదన్న దానికి ఔనంటూ అపర ఊసరవెల్లిలా మారిపోయారు.  సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా జగన్ కు అనుకూలంగా ఆయన చేసిన విశ్లేషణలూ, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ అప్పట్లో నవ్వుల పాలయ్యాయి. ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారి జనంలో క్రెడిబులిటీ కోల్పోయారు.   తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, జగన్ కు మద్దతుగా నిలవడం కోసం వాస్తవాలను  ఆయన వక్రీకరించిన విధానంపై వైసీపీయులు కూడా ఒకింత అసహనానికి లోనైన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.  మరీ ముఖ్యంగా జగన్ అధికారంలో ఉండగా స్కిల్ కేసు అంటూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా రోడ్లపైకి వచ్చి నిరసన బాట పడితే.. ఒక్క ఉండవల్లి మాత్రం స్కిల్ కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.  స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని దేశం మొత్తం గుర్తించినా, అపర మేధావి ఉండవల్లికి మాత్రం అందులో న్యాయం కనిపించింది. తన రాజకీయ గురువు వైఎస్ జగన్ కు అండగా నిలవడమే తక్షణ కర్తవ్యంగా అనిపించింది.  వాస్తవానికి స్కిల్ కేసులో  చంద్రబాబుకు వ్యతిరేకంగా   ఒక్క ఆధారమూ చూపకుండా? ఆయనను జనంలో తిరగనీయకూడదన్న ఏకైక లక్ష్యంతో జగన్ సర్కార్ కుట్రపూరితంగా ముందు అరెస్టు చేసి ఆనక తీరిగ్గా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల కోసం ప్రయత్నాలు ప్రారం భించామని చెప్పుకుంది.   అటువంటి స్కిల్ కేసుపై సీబీఐ విచారణ కావాలంటూ ఉండవల్లి అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు.  ఇలా ఒక్కటనేమిటి.. జగన్ ఐదేళ్ల పాలనలో జగన్ కు వత్తాసు పలకడానికి మాత్రమే ఈ స్వయం ప్రకటిత మేధావి, రాజకీయ సన్యాసం పుచ్చుకున్న యోగి పుంగవుడు మీడియా ముందుకు వచ్చే వారు. అందు కోసం తటస్థుడనన్న ముద్ర వేసుకునే వారు. సరే జనం తీర్పుతో జగన్ అధికారం కోల్పోయారు. అత్యంత అవమానకరమైన ఓటమి వైసీపీకి జనం కట్టబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇక ఓటమి తరువాత వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. చివరాఖరికి  పార్టీలో నంబర్ 2, జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడు, ఏ2 అయిన విజయసాయి కూడా వైసీపీని వీడి పోయారు. దీంతో ఇక ఉండవల్లి రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయారు. ఇంక ముసుగులెందుకు అనుకున్నారో ఏమో, రాజకీయ సన్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వైసీపీలో చేరి యాక్టివ్ పాలిటిక్స్ లోకి దూకేస్తానం టున్నారు. గత రెండు రోజులుగా  ఉండవల్లి వైసీపీలో చేరికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే వాస్తవమైతే మేధావి ముసుగు తొలగించుకుని ఉండవల్లి తనలోని జగన్ భక్త హనుమాన్ ను జనానికి చూపించినట్లే. ఉండవల్లి ప్రజా నాయకుడేం కాదు. మీడయా సమావేశాలలో గంటల తరబడి ప్రసంగించగలరేమో కానీ, బహిరంగ సభ పెడితే ఆయన ప్రసంగం వినడానికి పట్టుమని పది మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. అటువంటి ఉండవల్లి వైసీపీ గూటికి చేరితే ఆయన మీడియా సమావేశాలకూ క్రెడిబులిటీ ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన వైసీపీ గూటికి చేరడమంటే.. తెలుగుదేశం కూటమి నెత్తిన పాలు పోసినట్లేనంటున్నారు. 

కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన  లక్ష్మి అరెస్ట్ 

జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేస్తున్న లక్ష్మి అనే మహిళను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో లక్ష్మి ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో జైపూర్ పోలీసులు తిరుపతి  ప్రెస్ క్లబ్ వద్ద అరెస్ట్ చేశారు కిరణ్ రాయల్ విషయంలో  తిరుపతి ప్రెస్ క్లబ్ లో  మాట్లాడి బయటకు వస్తున్న క్రమంలో  అరెస్ట్ చేశారు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో ఆన్ లైన్ మోసాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. జైపూర్ పోలీసులు గత కొంత కాలంగా లక్ష్మి కోసం వెతుకుతున్నారు.  ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ అయ్యింది.  ఆమెపై చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. 

అడవిదొంగ పెద్దిరెడ్డి.. విజిలెన్స్ నివేదిక వెల్లడి!

వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులందరూ అటవీ భూముల ఆక్రమణలో నిండా మునిగినట్లే. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు అందరూ దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక  తేటతెల్లం చేసింది. అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబీకులపై అటవీ సంరక్షణ చట్టాల మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది. ఆ నివేదికలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకుల మీద ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అన్న అంశంపై విజిలెన్స్ నివేదిక వివరంగా పేర్కొంది. పెద్దిరెడ్డి, యఆయన కుటుంబ సభ్యులపై విజిలెన్స్ నివేదిక సిఫారసుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమౌతోంది.  పుంగనూరు నియోజకవర్గంలోని మంగళం పడవల్లో పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. అటవీ భూమిని ఆక్రమించి విలాసవంతమైన భవనం నిర్మించిన విషయం తేటతెల్లమైంది. అయితే అడవి మధ్యలో తాను భవనం నిర్మించిన భూమిని తాను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశానని, అక్కడ నిర్మించిన భవనం పనివాళ్ల కోసమని పెద్దరెడ్డి చెప్పారు.  దీనిపై విచారణ జరిపిన అధికారులు ప్రజాధనంతో రోడ్డు వేసుకోవడం దగ్గర నుంచి మొత్తం ఎంత భూమి వారి అధీనంలో ఉంది.. ఎంత భూమి కబ్జా చేశారో లెక్కలు తేల్చారు. మొత్తం వివరాలతో నివేదిక సమర్పించారు. పెద్దిరెడ్డి .. ఆయన కుటుంబం చేసిన అరాచకాలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  జగన్ అడ్డగోలు విధానాలను అంతకంటే అడ్డగోలుగా అంగీకరించి ఆచరించి, ఆయన చెప్పినట్టలా చేసిన పెద్దరెడ్డి అందుకు ప్రతిఫలంగా దోపిడీకి లైసెన్స్ తీసున్నారా అన్నట్లుగా అన్ని రకాల నిబంధనలనూ తుంగలోకి తొక్కి యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగించారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం దోపిడీకి కాదే భూమి అనర్హం అన్నట్టుగా పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకులూ రెచ్చిపోయారు. పెద్దిరెడ్డి కబ్జాల పర్వంలో మునిగి తేలుతూ ఉంటే.. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిమద్యం స్కాం మొత్తాన్ని తన కనుసన్నలలో నిర్వహించారు.  ఇలా కబ్జాలతోనూ, కుంభకోణాలతోనూ అడ్డగోలుగా సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని చిత్తూరుల తెలుగుదేశం పార్టీని ఉనికి కూడా లేకుండా చేయాలన్న కుట్రలను అమలు చేశారు. ఇందులో భాగంగానే  చంద్రబాబుపై  రాళ్ల దాడులు, హత్యాయత్నాల వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తం మీద పెద్దరెడ్డి అటవీ భూముల ఆక్రమణ కేసుల్లోనూ, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో బయట పడే అవకాశలు పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు చుక్కపడుతుందా?

స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాలకు చెల్లు చీటీ పాడే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తున్నది. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ. లోకల్ బాడీ ఎన్నికలలో ఏకగ్రీవాలకు తావులేదని చెబుతూ ఎన్నికలు జరిగి తీరాల్సిందేనంటూ ఓ నివేదిక రూపొందించింది. పంచాయతీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక నామినేషన్ దాఖలైన స్థానానికి కూడా ఎన్నికలు జరగాలనీ, అలాంటి స్థానాల్లో నోటా పోటీదారుగా ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమౌతున్న వేళ  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదన సంచలనం సృష్టిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ మందబలంతో ప్రోత్సాహకాల పేరిట ఏకగ్రీవాలకు తెరతీయడంతో స్థానిక ప్రభుత్వం (లోకల్ గవర్నెన్స్) లక్ష్యానికి గండిపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే స్థానిక ఎన్నికలు అనగానే మెజారిటీ స్థానాలలో ఏకగ్రీవాలే ఉంటాయి. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలవైపే పార్టీలు మొగ్గు చూపుతాయి. సహజంగానే ఈ ఏకగ్రీవాలలో అత్యధికం అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. 2019 ఎన్నికల్లో 16 శాతం గ్రామాల్లో సర్పంచ్​ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయంటే పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. అ వాస్తవానికి పంచాయ‌‌తీ ఎన్నికల్లో  ఏకగ్రీవాలకు తావులేకుండా ఎన్నిక‌‌లు నిర్వహించాలని రాష్ట్ర ఎన్ని క‌‌ల సంఘం ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ చేసింది.  రైట్ నాట్​ టు ఓట్’ ప్రకారం అభ్యర్థి నచ్చకుంటే  నోటాను ఎంచుకునే హ‌‌క్కు ఓటరుకు ఉంటుంది. కానీ ఏకగ్రీవాల వల్ల నోటాను ఎంచుకునే హక్కును ఓటర్ కోల్పోతున్నాడు. దీనిపై  ఫోరం ఫర్​గుడ్​గవర్నెన్స్  ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.  ప్రతి పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని, అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఎంచుకునే హక్కు ప్రతి ఓటరుకు కల్పించాలని, ఆ హక్కును కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ లేఖలో కోరింది. అందుకే ఒక్క నామినేషన్​వచ్చినా, నామినేష‌‌న్ల ఉపసంహరణ తర్వాత ఒక్క నామినేషన్​మాత్రమే మిగిలినా.. ఏకగ్రీవానికి తావులేకుండా నోటాను  అభ్యర్థిగా ఉంచి,  ఓటింగ్ పెట్టాలన్నది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్.  దీనికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఒక నివేదిక తయారు చేసింది.  ఈ నివేదికపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న రాజకీయ పార్టీలతో చర్చించనుంది. ఒక వేళ రాజకీయ పార్టీలు ఇందుకు అనుమతి ఇచ్చినా, రాష్ట్రప్రభుత్వం కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వర్గాలకు పంచాయతీల ఏకగ్రీవానికి ప్రయత్నించాలంటూ స్పష్టమైన సూచనలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు.  

ప్రయాగ్ రాజ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముుర్ము పుణ్యస్నానం!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్య స్నానం ఆచరించారు.   అంతకముందు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో  లక్నో  చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. లక్నో నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడ పుణ్యస్థానం ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.   ఈ సందర్భంగా ఆమె బడే హనుమాన్ ఆలయం, అక్షయవత్ వృక్షాన్ని సందర్శించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇలా ఉండగా మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కోట్ల మంది ఇప్పటికే పుణ్య స్నానాలు ఆచరించారు. రానున్న రోజులలో పుణ్యస్నానాలు ఆచరించే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.  

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ ఏడాది శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో శ్రీ భమరాంబికా సమేత మల్లి కార్జున స్వామి వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు  ఈ నెల 19న మొదలై మార్చి 1న ముగుస్తాయి. అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. ఆ సందర్భంగా  స్వామి, వారికి, అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మామూలుగా అయితే శ్రీ భ్రమరాంబికా సమేత మళ్లికార్జున స్వామి వారికి బ్రహ్మెత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఎవరైనా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మాత్రం స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించనుండటం విశేషం.   కాగా మహా శివరాత్రి ఏర్పాట్ల పరిశీలనుకు రాష్ట్ర మంత్రుల బృందం సోమవారం(ఫిబ్రవరి 10) శ్రీశైలంలో పర్యటించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ లు ఈ మంత్రుల బృందంలో ఉన్నారు. శ్రీశైలం ను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు స్వయంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇక శ్రీశైలంలో అభివృద్ధి కార్యక్రమాలు, పర్యాటకులు, భక్తులకు వసతులు మెరుగుపరిచేందుకు దశలవారీగా చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  

ఢిల్లీ ఫలితాలతో జైలు సెంటిమెంట్ హుష్ కాకీ... కేటీఆర్ ఇప్పుడేం చేస్తారో?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా రాజకీయ పార్టీల భ్రమలను పటాపంచలు చేసేశాయి. పలువురు నేతల ఆశలను అడియాశలు చేసేశాయి. మరీ ముఖ్యంగా సెంటిమెంటు పండితే చాలు అధికారం గ్యారంటీ అంటూ రాజకీయాలు చేస్తున్న పార్టీలకూ, నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చాయి.  తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ మధ్య ఎన్నికలలో అధికారం కోల్పోయిన పార్టీలకు గట్టి ఝలక్ ఇచ్చాయి. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయి విపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ.. ఆ రోజు నుంచీ కూడా ఒక సెంటిమెంటును బలంగా నమ్ముకుని మళ్లీ అధికారంలోకి వచ్చేయడానికి విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయి కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని వైసీపీ కూడా సెంటిమెంటు పండిస్తే చాలు మళ్లీ అధికారపగ్గాలు మావే అన్న ఆశల పల్లకీలో ఊరేగుతోంది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రెండు పార్టీలకూ కూడా గట్టి ఝలక్ ఇచ్చాయి. జైలు కెళ్లొస్తేనే, సానుభూతి కోసం వెంపర్లాడితేనో జనం ఓట్లు వేయరని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఢంకా బజాయించి మరీ చెప్పాయి. ఇంతకీ తెలుగు రాష్ట్రాలలో  జైలుకి వెళ్లొస్తే ముఖ్యమంత్రి పదవి గ్యారంటీ అన్న సెంటిమెంట్ ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు.. వైసీపీ అధినేత జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఇలా వీరంతా అరెస్ట్‌ అయిన తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు. దీంతో అధికారానికి అరెస్టు ఒక అడ్డదారి అన్న భ్రమల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, పార్టీలూ పడిపోయాయి.  తెలంగాణ విషయానికి వస్తే.. ఎఫ్-1 రేసింగ్ కేసులో దమ్ముంటే తనని అరెస్ట్‌ చేసి జైలుకి పంపాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పదేపదే  చేసిన సవాలు వెనుక ఉన్న కారణం ఇదే.  అంతే కాకుండా ఈ కేసులో తన అరెస్టు ఖాయమనీ, జైలులో యోగా చేసి మరింత ఫిట్ గా తయరై వచ్చి పాదయాత్ర చేస్తాననీ స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. ఇక బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసి పుణ్యం కట్టుకోండని అధికార కాంగ్రెస్ పార్టీని బతిమలాడుకుంటున్నారా అన్నట్లుగా వ్యవహరించారు.  అయితే జైలు అధికారం సెంటిమెంటుకు రేవంత్ ఏమీ అతీతుడు కాదు కనుక.. కేటీఆర్ అరెస్టు విషయంలో దూకుడుగా వ్యవహరించలేదు. కేటీఆర్ ను అరెస్టు చేయాలన్న తొందర తనకేం లేదని కుండబద్దలు కొట్టేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూ వెనకడుగు వేశారు. కేటీఆర్‌ని అరెస్ట్‌ కోసం పకడ్బందీగా వ్యూహాలు పన్నారనీ ఇహనో ఇప్పుడో  అయన కటకటాల పాలవ్వడం ఖాయన్నట్లుగా  పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అరెస్టు సెంటిమెంట్ గుర్తుకు వచ్చిందో ఏమో కేటీఆర్ అరెస్టు విషయంలో తనకు ఎటువంటి తొందరా లేదని వెనకడుగు వేశారు.   అయితే కేటీఆర్ కూడా నిన్నమొన్నటి వరకూ కేటీఆర్ ఎలాగైనా సరే అరెస్టవ్వాలన్న ప్రయత్నాలూ చేశారు. ఇక ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిస్థితి మారిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక నుంచి కేటీఆర్ అరెస్టు కోసం అధికార కాంగ్రెస్ పార్టీ, ఆ అరెస్టును తప్పించుకోవడం కోసం కేటీఆర్, బీఆర్ఎస్ లు ప్రయత్నాలు ప్రారంభిస్తాయని సెటైర్లు వేస్తున్నారు. జైలుకి వెళ్లొచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రులు అయిపోరనీ, జైలు కెళ్లడం అన్నది అధికారానికి అడ్డదారి ఎంత మాత్రం కాదనీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేసేశాయని అంటున్నారు.  ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా మద్యం కుంభకోణం కేసులో  జైలుకు వెళ్లి వచ్చారు.  అయినా అధికారం కోల్పోయారు.  దీంతో నిన్న మొన్నటి వరకూ జైలుకెల్లాలని ఉబటాటపడిన కేటీఆర్ ఇప్పుడు జైలు మాటెత్తితేనే ఉలిక్కిపడుతున్నారని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

కిరణ్ రాయల్ పై వైసీపీ ఆరోపణలు.. అంబటి, గోరంట్ల మాధవ్ లు గుర్తు లేరా?

తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల నుంచి ఆయనను దూరంగా ఉండాలని జనసేన అధేశించింది. పార్టీ తరఫున కిరణ్ రాయల్ పై  విచారణకు ఆదేశించడమే కాకుండా విచారణ పూర్తయ్యే వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.  ఓ మహిళతో వివాహేతర బంధం ఆమెతో ఆర్థికపరమైన సంబంధాలు.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలతో  జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కిరణ్ రాయల్ కూడా ఘాటుగానే స్పందించారు.  తనకు సంబంధించిన వీడియోలు ఎవరు విడుదల చేస్తున్నారో కనుక్కోవాలని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.   విచారణను నిస్పక్షపాతంగా చేపట్టేందుకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకూ అని స్పష్టంగా పేర్కొనడంతో ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం చేయడం తాత్కాలిక నిర్ణయమేనని స్పష్టం చేసినట్లైంది. కాగా ఈ మొత్తం వ్యవహారంలో జనసేన చాలా పారదర్శకంగా వ్యవహరించిందనే చెప్పాలి. శనివారం సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ కు సంబంధించి వీడియోలు వైరల్ కాగానే.. జనసేన ఆయనపై విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకూ పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టింది.    అయితే ఈ వ్యవహారంలో వైసీపీ ఓవర్ యాక్షన్ వెగటు పుట్టిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కిరణ్ రాయల్ వ్యవహారంలో వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా ఇష్టారీతిగా రెచ్చిపోతోంది. అదే సమయంలో  ఆ పార్టీలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రమోషన్లు ఇస్తూ.. కిరణ్ రాయల్ విషయంలో మాత్రం జనసేనపై విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గతంలో వచ్చిన ఆరోపణలు, ఒక మహిళతో ఆయన అసభ్య సంభాషణ అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అంబటి రాంబాబుపై ఎటువంటి చర్యా తీసుకోలేదు సరికదా, ఈ ఆరోపణల తరువాతే జగన్ అంబటిని మంత్రిగా ప్రమోట్ చేశారు. అదే విధంగా  ఆ పార్టీ మాజీ ఎంపీ  గోరంట్ల మాధవ్ విషయం కూడా అంతే. ఎంపీగా ఉండి ఆయన చేసిన ఛండాలం వీడియో రూపంలో వైరల్ అయ్యింది. దీనిపై జగన్ ఎటువంటి చర్యా తీసుకోలేదు సరికదా.. ఇప్పడు అదే గోరంట్ల మాధవ్ ను వైసీపీ జాతీయ అధికార ప్రతినిథిని చేసి అందలం ఎక్కించారు.  ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో జనసేన విచారణకు ఆదేశించింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టింది. విచారణలో ఆయన తప్పు చేసినట్లుగా తేలితే చర్యలు తీసుకుంటుంది. కానీ అంత వరకూ ఆగకుండా వైసీపీ చేస్తున్న గగ్గోలు సిగ్గు చేటని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆర్జీవీ విచారణకు మళ్లీ డుమ్మా?

రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు మరో సారి డుమ్మా కొట్టనున్నారా? అమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ తెలుగుదేశం నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ ఆయనను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు రామ్ గోపాల్ వర్మ సోమవారం (ఫిబ్రవరి 10) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో రామ్ గోపాల్ వర్మ మూవీ ప్రమోషన్స్ కారణంగా విచారణకు హాజరు కాలేనంటూ సీఐడీకి సమాచారం ఇచ్చారు. మూవీ ప్రమోషన్స్ తో పాటు ’ నెల 28న సినీమా విడుదల కూడా ఉందనీ, అందుకు విచారణకు హాజరయ్యేందుకు తనకు ఎనిమిది వారాల గడువు ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. అయితే రామ్ గోపాల్ వర్మ వినతిపై సీఐడీ స్పందించలేదు. దీంతో ఆయన విచారణకు హాజరౌతారా? డుమ్మా కొడతారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒక వేళ ఆయన విచారణకు హాజరు కాకుంటే మరో సారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా సోషల్ మీడియాలో పోస్టులపై రామ్ గోపాల్ వర్మ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు యాంటిసిపేటరీ బెయిలు ఇచ్చిన కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు సహకరించడం లేదని కోర్టు భావిస్తే బెయిలు రద్దౌతుంది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ శనివారం (ఫిబ్రవరి 8) ఒంగోలులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా పోలీసులు ఆయనను 9  గంటల పాటు సుదీర్ఘంగా విచారించి, అవసరమైతే మళ్లీ పిలుస్తాం రావాలని పేర్కొని పంపించారు. ఆ విచారణ పూర్తి అవ్వగానే సీఐడీ పోలీసులు ఆయనను నోటీసులు ఇచ్చి సోమవారం (ఫిబ్రవరి 10) విచారణకు రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు  నోటీసులు జారీ   చేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వర్మ సీఐడీ విచారణకు హాజరు కాలేనంటూ సీఐడీకి సమాచారం ఇచ్చారు.  సీఐడీ ఆయన వినతిని అంగీకరిస్తుందా? లేక మరోసారి నోటీసులు జారీ చేస్తుందా? అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఒక వేళ సీఐడీ నోటీసులను బేఖాతరు చేసి రామ్ గోపాల్ వర్మ విచారణకు గైర్హాజరైతే బెయిలు రద్దయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. 

ప్రజారాజ్యమే జనసేన అయ్యింది.. చిరంజీవి భాష్యం

మెగా స్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనక దూరం కాలేదు.  ఈ విషయాన్ని చిరంజీవే గతంలో స్వయంగా ట్వీట్ చేశారు. ఆయన గతంలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కోసమే.. లేదా ఉభయతారకంగా కలిసి వస్తుందనో కానీ ఆయన ఆ సినిమా విడుదలకు ముందు ఆ సినీమా పోస్టర్ తో  కూడిన ఓ ఆడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.   నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ ఆయన చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అది ఆ సినిమాలో ఆయన డైలాగ్ అయితేనేం.. అక్కడ నుంచి ప్రతి సందర్భంలోనూ చిరంజీవి రాజకీయాలకు కేంద్ర బిందువుగానే ఉన్నారు. కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాల వరకూ ఆయన ఫేమ్ ను పాపులారిటీని రాజకీయాల కోసవ వాడుకునేందుకు అన్ని పార్టీలూ తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే చిరంజీవి మాత్రం తామరాకు మీద నీటి బొట్టు చందంగా అందరికీ సమదూరంలో ఉంటున్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత నుంచీ ఆయన ఒకింత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషించారు.  ఇక ఇప్పుడు తాజాగా ఆయన గతంలో తాను ప్రారంభించి కాంగ్రెస్ లో విలీనం చేసిన ప్రజారాజ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తాను ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీయే ఇప్పుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పారు.  దీంతో పవన్ కల్యాణ్ నోట జనసేన నినాదం రావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.  తాజాగా లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (ఫిబ్రవరి 9)జరిగింది. ఆ ఈవెంట్ కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన జై జనసేన అంటూ నినదించారు.  ఈ సందర్భంగా ఆయన తన ప్రజారాజ్యం ప్రస్తావన చేశారు. అందుకు కారణం లేకపోలేదు. ఆ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగం ప్రారంభించగానే ప్రేక్షకులు పెద్ద ఎత్తున జై జనసేన నినాదాలు చేశారు. దీంతో ఆయన కూడా వారితో గొంతు కలిపారు. జై జనసేన అని నినాదం చేయడమే కాకుండా.. తాను ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందిందని భాష్యం చెప్పారు. చిరు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల మెగాభిమాల్లో ఆనందం వ్యక్తం అవుతుంటే.. రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇక నుంచి చిరు ప్రత్యక్షంగా జనసేన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మరో వైపు ఆయన బీజేపీవైపు కూడా మొగ్గు చూపుతున్నారని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జనసేన ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా ఉంది. దీంతో ముందుముందు చిరంజీవి సెంట్రిక్ గా బీజేపీ, జనసేనల రాజకీయ కార్యకలాపాలు ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చిరంజీవి నోట జై జనసేన నినాదం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది.