అందెశ్రీకే లేని అభ్యంతరం బీఆర్ఎస్ కు ఎందుకు?
posted on May 29, 2024 @ 10:58AM
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి కంపోజ్ చేయడంపై బీఆర్ఎస్ చేస్తున్న అనవసర రాద్ధాంతం ఇప్పటికే దిగజారిన ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజారుస్తోంది. అసలు ఆ గీత రచయత అందెశ్రీకే లేని అభ్యంతరం బీఆర్ఎస్ కు ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది.
తెలంగాణ రాష్ట్ర గీతం ఆంధ్రా వ్యక్తి కంపోజ్ చేయడమా అంటూ గుండెలు బాదేసుకుంటూ బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారు కానీ గీత రచయత అందశ్రీ మాత్రం తన గీతానికి కీరవాణి బాణీ కట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయపబ్బం గడుపుకోవాలన్న తాపత్రేయం తప్ప బీఆర్ఎస్ అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి బాణీ సమకూర్చడంలో తప్పేమిటో అర్ధం కాదు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో కేసీఆర్ సర్కార్ తెలంగాణ క్రీడా ప్రతినిథిగా పుల్లెల గోపీచంద్ ను నియమించడం తప్పు కానప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీ కట్టే బాధ్యతను కీరవాణికి అప్పగించడంలో తప్పేమిటన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. అలాగే నటి సమంతను తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినప్పుడు కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ వాదం గుర్తుకు రాలేదా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు నిలదీశారు. ఏది ఏమైనా రాష్ట్రం ప్రాతిపదికన ప్రజల మధ్య చీలిక తీసుకురావడం ఎంత మాత్రం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. కీరవాణి తెలంగాణ వ్యక్తి కాదంటూ బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలు అసంబద్ధమైనవనడంలో సందేహం లేదు.